సాక్షి ప్రతినిధి, మెదక్: కాంగ్రెస్ అభ్యర్థిత్వాల ప్రకటనతో అసంతృప్తి రాజుకుంటోంది. జిల్లాలో ఆయా నియోజకవర్గాల టికెట్లు ఆశించి భంగపడిన నాయకులు అంతర్గతంగా రగిలిపోతున్నారు. ఆదివారం కాంగ్రెస్ అధినాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా 55 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ తొలి జాబితా ప్రకటించింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి గజ్వేల్, మెదక్ టికెట్లను వరుసగా తూంకుంట నర్సారెడ్డికి, మైనంపల్లి రోహిత్‌కు కేటాయించింది.
అందోల్‌కు సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ, సంగారెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జహీరాబాద్‌కు మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్‌ను ప్రకటించింది. తొలివిడతలో ఉమ్మడి జిల్లాలో ఐదు చోట్ల అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. వీటి ప్రకటనతో టికెట్ ఆశించిన భంగపడిన నేతలు తీవ్రంగా రగిలిపోతున్నారు. ఈ అసంతృప్తి బహిర్గతం కాకపోయినప్పుటికీ లోలోపల రాజుకుంటున్నది.
గజ్వేల్.. జశ్వంత్‌రెడ్డి వర్గం!
గజ్వేల్ టికెట్‌ను తూంకుంట నర్సారెడ్డి, పీసీసీ డెలిగేట్ సభ్యుడు జశ్వంత్‌రెడ్డి ఆశించారు. ఆయనకు దక్కడంతో జశ్వంత్ వర్గం లోలోపల రగిలిపోతున్నారు. నర్సారెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ గతంలో గాంధీభవన్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించింది. అంతకు ముందు ఇక్కడ కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు ఏకంగా బాహాబాహీకి దిగాయి. ఇప్పుడు టికెట్ల ప్రకటనతో అసంతృప్తులు బయట పడకపోయినప్పటికీ అంతర్గతంగా రగిలిపోతున్నారు.
కాంగ్రెస్‌కు దూరంగా మ్యాడం బాలకృష్ణ..
మెదక్ టికెట్ మైనంపల్లి రోహిత్‌కు ఖరారవుతుందనే సంకేతాలుండగా కాంగ్రెస్ నియోజకవర్గ ముఖ్యనేతలు డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. మిగతా ముఖ్యుల్లో ఒకరైన పీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ ప్రస్తుతానికి స్తబ్ధతగా ఉన్నారు. రోహిత్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
మరో సీనియర్ నేత సుప్రభాతరావుకు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సముచిత స్థానం ఉంటుందని సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ భరోసా ఇవ్వడంతో రోహిత్‌కు మద్దతు పలుకుతున్నారు. జహీరాబాద్ అభ్యర్థిత్వం చంద్రశేఖర్‌కు ఖరారు చేయగా ఇదే స్థానం కోసం దరఖాస్తు చేసుకున్న స్థానిక నాయకులు అసంతృప్తితో ఉన్నారు. అధిష్ఠానం దశాబ్దాలుగా నియోజకవర్గాన్ని స్థానికేతరులకే కేటాయిస్తే, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న తమకు ఎప్పుడు అవకాశం వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.
ఆరు చోట్ల..
నారాయణఖేడ్‌లో మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, సంజీవరెడ్డి ఆశిస్తున్నారు. నర్సాపూర్‌లో గాలిఅనీల్‌కుమార్, ఆవుల రాజిరెడ్డి, పటాన్‌చెరులో కాటా శ్రీనివాస్‌గౌడ్, గాలిఅనీల్ ఇద్దరూ కోరుతున్నారు. దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, కత్తి కార్తీక పోటీ పడుతున్నారు. సిద్దిపేట్‌లోనూ ఇద్దరు నాయకులు టికెట్ రేసులో ఉన్నారు. అవి ప్రకటిస్తే ఎట్టి పరిస్థితుల్లో అసంతృప్తులు భగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
రెండో జాబితాతో భగ్గుమనే అవకాశాలు!
ఉమ్మడి జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు టికెట్‌లు ఖరారయ్యాయి. మిగిలిన ఆరు చోట్ల అభ్యర్థిత్వం ఎంపిక కొంత క్లిష్టంగా మారగా కాంగ్రెస్ అధినాయకత్వం ఈ ఆరింటినీ రెండో, మూడో జాబితాల్లో ప్రకటించాలని యోచిస్తోంది. పెద్దగా ఇబ్బందులు లేని టికెట్‌ల విషయంలోనే అసంతృప్తులు అంతర్గతంగా రగిలిపోతున్నారు. ఇంకా ఆరు టికెట్‌ల విషయంలో అసమ్మతి భగ్గుమనే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఈ స్థానాలను ఇద్దరు, ముగ్గురు నాయకులు కూడా ఆశిస్తున్నారు. ఒకరి అభ్యర్థిత్వం ఖరారు చేస్తే వ్యతిరేకవర్గం నుంచి తీవ్రస్థాయిలో అసంతృప్తి రగిలే అవకాశాలే కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment