సాక్షి, వరంగల్: కాంగ్రెస్ గెలుపులో యువత కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కొత్త ఓటర్లు, నిరుద్యోగ యువకులు దాదాపు హస్తానికి అండగా నిలిచినట్లు అవగతమవుతోంది. వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల ఓటర్లలో సగం మంది వరకు యువకులు ఉండడం విశేషం. మూడు నియోజకవర్గాల్లో మొత్తం 7,33,454 ఓటర్లుండగా.. వారిలో 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల ఓటర్లు 3,56,964 మంది ఉండడం గమనార్హం.
నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం 2,26,617 ఓటర్లుండగా.. వారిలో 1,11,446 మంది యువ ఓటర్లు, వరంగల్ తూర్పులో 2,46,282 ఓటర్లుండగా వారిలో 1,17,870 మంది యువ ఓటర్లు, వర్ధన్నపేట నియోజకవర్గంలో 2,60,55 ఓటర్లుండగా వారిలో 1,27,648 యువ ఓటర్లు ఉన్నారు. ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్‌కు చెందిన దొంతి మాధవరెడ్డి, కొండా సురేఖ, కేఆర్.నాగరాజు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
వెంటాడిన నిరుద్యోగ సమస్య..
అధికార బీఆర్‌ఎస్ పార్టీని నిరుద్యోగ సమస్య వెంటాడినట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించడం, పేపర్ లీకులు, తర్వాత రద్దు చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఓటర్లు, నిరుద్యోగ యువకులు ఈ సారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో యువత ఓట్లు కీలకంగా మారాయనే భావన వ్యక్తమవుతోంది.
ఇవి చదవండి: పోస్టల్ బ్యాలెట్‌లోనూ వీడని 'నోటా' ఓట్లు!
Comments
Please login to add a commentAdd a comment