Young voters
-
ఆ ఓటర్లే కీలకం..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు రాబట్టడంపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఓ వైపు ఉధృతంగా ప్రచారం చేస్తూనే.. ఏయే వర్గాల నుంచి ఓట్లు వచ్చే అవకాశముందనే అంశంపై లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లు, అందులో పార్టీల వారీగా పోలైనవి, ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. అయితే, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్న నేపథ్యాన అతివలే కేంద్రంగా ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నా యి. అలాగే, కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతను ఆకట్టుకునేలా నేతలు ప్రసంగిస్తు న్నారు. ఇక పోస్టల్, హోం ఓటింగ్ వేసే వారిపైనా దృష్టి సారించి.. సాధారణ పోలింగ్ కన్నా ముందుగానే ఎక్కువగా ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో పార్టీలు పనిచేశాయి.పోస్టల్, హోం ఓటింగ్ కీలకం..రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, హోం ఓటింగ్ ఈనెల 3న ప్రారంభమై బుధవారం ముగు స్తుందని తొలుత ప్రకటించినా 10వతేదీ వరకు పొడి గించారు. ఇప్పటికే తమ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వేయించాలనే లక్ష్యంతో నేతలు పనిచేయగా మిగిలిన సమయంలోనూ ఎక్కువ ఓట్లు రాబట్టేలా ఉద్యోగు లను కోరేందుకు సిద్ధమవుతున్నారు.కాగా, బుధవా రం నాటికి ఉద్యోగులు 7,203మంది, వయోవృద్ధులు 2,713 మంది ఓటు వేశారు. ఇక ప్రచారానికి మరో మూడు రోజుల సమయమే ఉండడం.. అగ్రనేతల ప్రచారం ముగియడంతో ఓటర్లను నేరుగా కలి సేందుకు అభ్యర్థులు, నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని ఉధృతం చేస్తూ తమ పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు.పోలింగ్ శాతం పెరగాల్సిందే..ప్రచారం చేస్తూనే పోలింగ్ శాతం పెంపుపైనా పార్టీ లు దృష్టి సారించాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 82.13 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019లో 75.30 శాతం పోలింగ్ జరిగింది. కానీ ఈసారి అది పెరిగేలా.. తద్వారా ఎక్కువ మంది ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేలా నేతలు పనిచేస్తున్నారు. మరోపక్క ఎన్నికల సంఘం కూడా పోలింగ్ పెంపునకు ప్రచా రం చేస్తోంది. వివిధ మాధ్యమాల ద్వారా ఓటు ప్రాముఖ్యతను వివరి స్తూనే షాపింగ్ మాల్స్ వద్ద సెల్ఫీ పాయింట్లు సైతం ఏర్పాటుచేశారు.యువ ఓటర్లకు గాలం!ఈసారి నూతనంగా ఓటు హక్కు సాధించిన 18 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు యువ ఓటర్లకు గాలం వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వీరు మొదటిసారి ఓటు వేయనుండడంతో ఆకట్టుకునేలా ప్రచారం చేయడమే కాక యువతకు చేస్తున్న మేలును కూడా ప్రచారంలో నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రత్యేకంగా యువ ఓటర్లను కలుసుకునేందుకు సమ్మేళనాలు సైతం నిర్వహిస్తున్నారు.ఈ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాల అంశాలను వివరిస్తూ ఓట్లు రాబట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని మొత్తం 16,31,039 మంది ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు ఓటర్లు 50,747 మంది ఉన్నారు. వీరిలో 26,775 మంది యువకులు, 23,967 మంది యువతులు ఉండగా.. మొదటిసారిగా ఓటు వేసే వీరిని ప్రసన్నం చేసుకోవడంలో పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు.ఆమే.. అధికం!ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. గత ఎన్నికల్లోనూ వీరే ఎక్కువ మంది ఓటు వేసినా పూర్తిస్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా పోలింగ్ బూత్‌లకు రప్పించేలా పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 7,73,428 మంది మహిళా ఓటర్లు ఉండగా.. చాలా తక్కువ మంది ఓటు వేశారు.ఈసారి మొత్తం ఓటర్లు 16,31,039 మందికి పురుషులు 7,87,160 మంది, మహిళలు 8,43,749 మంది ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళలు 56,589 మంది ఎక్కువగా ఉన్న నేపథ్యాన గత ఎన్నికల మాదిరి కాకుండా అందరినీ పోలింగ్ బూత్‌ల వద్దకు రప్పించేందుకు పార్టీల నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంటింటి ప్రచారంలో మహిళలపైనే దృష్టి సారిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు తమ హయాంలో కరెంట్ కోతలు లేవని, నీటి కొరత ఎదురుకాలేదని చెబుతుండగా.. కాంగ్రెస్ నేతలు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక బీజేపీ సైతం మహిళా ఓటర్లే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తోంది. -
Lok Sabha Election 2024: ఓట్ల ‘బ్యాండ్’ బాజా!
ఎన్నికల ప్రచారంలో ఎవరి గోల వారిదే! అభ్యర్థులు ఎడాపెడా హామీలతో ఓటర్లకు గాలం వేస్తుంటే, ఎన్నికల అధికారులేమో పోలింగ్ శాతం పెంచేందుకు ‘బ్యాండ్’ బాజా మోగిస్తున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు, ముఖ్యంగా యువ ఓటర్లను బూత్‌లకు రప్పించేందుకు హర్యానా ఎన్నికల అధికారులు వినూత్నంగా మ్యూజికల్ బ్యాండ్లను రంగంలోకి దించుతున్నారు. ఎన్నికల థీమ్ సాంగ్స్‌తో మాంచి సంగీత విభావరుల ద్వారా వారిలో చైతన్యం పెంచే పనిలో పడ్డారు. ఈ బ్యాండ్లు ఓటర్లను, ముఖ్యంగా యువత ఓటేసేలా జోష్ నింపడంతో పాటు ఎన్నికలకు సంబంధించి ఓటర్లలో అవగాహన కూడా పెంచుతాయని హర్యానా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనురాగ్ అగర్వాల్ చెబుతున్నారు. పంచ్కులలో తొలి ఎలక్షన్ థీమ్ మ్యూజిక్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. తర్వాత యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రతి జిల్లాలో ఇలాంటి మ్యూజిక్ బ్యాండ్స్ అలరిస్తాయని పేర్కొన్నారు. హర్యానాలో మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కనున్నారు. ఇక్కడ 18–19 ఏళ్ల ఓటర్లు 3.65 లక్షల మంది ఉండగా 20–29 వయస్సున్న ఓటర్ల సంఖ్య 39 లక్షలు. మ్యూజిక్ అంటే ఫిదా అయిపోయే యువతను లక్ష్యంగా చేసుకునే ఈసీ బ్యాండ్ మోగిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం ’చునావ్ కా పర్వ్ – దేశ్ కా గర్వ్‘ (ఓట్ల సంబరం – దేశానికి గర్వకారణం) నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని అగర్వాల్ చెప్పారు. ప్రజాస్వామ్యానికున్న పవర్‌ను, ఓటు ప్రాధాన్యాన్ని తెలుసుకోవడానికి యువత, ముఖ్యంగా తొలిసారి ఓటేసే యువతరం పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో హర్యానాలో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కనీసం 75 శాతాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్ గెలుపుకి యువతే 'కీ'లకం..!
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ గెలుపులో యువత కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కొత్త ఓటర్లు, నిరుద్యోగ యువకులు దాదాపు హస్తానికి అండగా నిలిచినట్లు అవగతమవుతోంది. వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల ఓటర్లలో సగం మంది వరకు యువకులు ఉండడం విశేషం. మూడు నియోజకవర్గాల్లో మొత్తం 7,33,454 ఓటర్లుండగా.. వారిలో 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల ఓటర్లు 3,56,964 మంది ఉండడం గమనార్హం. నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం 2,26,617 ఓటర్లుండగా.. వారిలో 1,11,446 మంది యువ ఓటర్లు, వరంగల్ తూర్పులో 2,46,282 ఓటర్లుండగా వారిలో 1,17,870 మంది యువ ఓటర్లు, వర్ధన్నపేట నియోజకవర్గంలో 2,60,55 ఓటర్లుండగా వారిలో 1,27,648 యువ ఓటర్లు ఉన్నారు. ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్‌కు చెందిన దొంతి మాధవరెడ్డి, కొండా సురేఖ, కేఆర్.నాగరాజు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వెంటాడిన నిరుద్యోగ సమస్య.. అధికార బీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగ సమస్య వెంటాడినట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించడం, పేపర్ లీకులు, తర్వాత రద్దు చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఓటర్లు, నిరుద్యోగ యువకులు ఈ సారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో యువత ఓట్లు కీలకంగా మారాయనే భావన వ్యక్తమవుతోంది. ఇవి చదవండి: పోస్టల్ బ్యాలెట్‌లోనూ వీడని 'నోటా' ఓట్లు! -
కొత్తా ఓటరండీ! ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం.. మాట వినే ప్రసక్తే లేదు
బెంగళూరులోని మహారాణి క్లస్టర్ యూనివర్సటీలో విద్యార్థిని ఎంజే గుణ. కొద్ది రోజుల క్రితమే ఆమెకు 18 ఏళ్లు నిండాయి. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే చాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు తమ నాయకుడ్ని ఎన్నుకునే రోజు వస్తుందాని ఆమె ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఆమె ఉద్దేశంలో నాయకుడంటే బాగా చదువుకుని, దార్శినికుడై ఉండాలి. ‘‘నేను ఓటు వేసే ముందు ఏ పార్టీ అని కూడా చూడను. మా నియోజకవర్గానికి అభ్యర్థి ఏం చేస్తాడన్నదే ముఖ్యం. ఆ తర్వాత అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్, విద్యార్హతలు, గతంలో చేసిన పని, భవిష్యత్‌లో ఏం చేయగలడు వంటివన్నీ చూశాకే ఓటేస్తా’’అని ఆమె కచ్చితంగా చెప్పింది. సునీత అనే మరొక ఫస్ట్ టైమ్ ఓటరు సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే సామర్థ్యం మనకున్నప్పుడే రాష్ట్రం, దేశం సరైన మార్గంలో వెళతాయని చెప్పుకొచ్చింది. వీరి మాటలు వింటే సంప్రదాయంగా రాజకీయ వ్యూహాలు రచిస్తూ, తాయిలాల ఆశ చూపిస్తూ వెళ్లే పార్టీల వైపు వీరు చూసే చాన్సే లేదు. కొత్తగా ఓటు హక్కు పొందడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం. తల్లిదండ్రులు చెప్పారనో, స్నేహితులు సిఫారసు చేశారనో ఎవరికి పడితే వారికి నేటి తరం ఓటు వెయ్యరు. సొంతంగా ఆలోచించి తమకు నచ్చిన అభ్యర్థికి తొలిసారి ఓటు వేస్తే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు. ఓటు వెయ్యడంలో ఉదాసీనత మచ్చుకైనా లేదు. ఉరిమే ఉత్సాహంతో చూపుడు వేలి మీద సిరా గుర్తు చూపిస్తూ ఫొటోలు దిగి ఓట్ల పండుగను సంబరంగా చేసుకుంటున్నారు. కర్ణాటకలో మెజార్టీ మార్కు దాటడానికి అత్యంత కీలకమైన కొత్త ఓటర్ల మదిలో ఏముంది ? గత ఎన్నికల్లో... మొదటి సారి ఓటు వేసే వారిలో కొత్త ఉత్సాహం, ఓటు వెయ్యాలన్న తపన ఎక్కువ ఉంటుంది. వారు తప్పనిసరిగా ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రాలకు కదిలి వెళతారు. గత 3 ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు ఓటు వేసే విధానాన్ని విశ్లేషిస్తే వారి నాడి పట్టుకోవడం కష్టమనే అభిప్రాయం కలుగుతుంది. సీఎస్డీఎస్–లోక్‌నీతి పోస్ట్ పోల్ సర్వే కొత్త ఓటరు అండదండ లేనిదే ఏ పార్టీ కూడా మెజార్టీ మార్క్ సాధించలేదు. కొత్త ఓటరు ఎటుంటే.. కర్ణాటకలో ఈ సారి 11 లక్షల మంది కొత్త ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 7.7 లక్షలుంటే ఈ సారి వారి సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. ప్రతీ సారి ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. కొత్త ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. మనీ, మద్యం కంటే అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మంచి, చెడులను తామే విశ్లేషించుకునే శక్తి సామర్థ్యాలున్నవారు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. పార్టీలు వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలైతే చేస్తున్నాయి. కర్ణాటకలో ఏదైనా పార్టీ మెజార్టీ మార్కు దాటాలంటే కొత్త ఓటర్లు అత్యత కీలకమని రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. పార్టీల కొత్త పంథా..! మేము ఏం చేస్తాం అన్నది కాదు.. మీకేం కావాలన్నదే ముఖ్యం అని కొత్త ఓటర్ల మనసులో ఏముందో పార్టీలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ‘‘సెలబ్రేట్ యువర్ ఓటు’’అనే ప్రచారాన్ని ప్రారంభించింది. 18–23 మధ్య వయసున్న వారే లక్ష్యంగా చేసుకొని వారికి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలను అరికట్టడం, అందరికీ ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్నివ్వడం ప్రస్తుతం యువత ఆశిస్తుందని తెలుసుకొని ఆ దిశగా వ్యూహాలు పన్నుతోంది. దాంతో పాటు నిరుద్యోగులు తల్లిదండ్రులకి భారంగా మారకుండా రెండేళ్ల పాటు నెలకి రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ యువ సంవాద్ కార్యక్రమం ద్వారా కొత్త ఓటర్ల ఆశలు, ఆకాంక్షల్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది.కొత్త ఓటర్లను దృష్టిలో ఉంచుకునే బీజేపీ సిట్టింగ్‌లను కాదని అత్యధికంగా 60 మంది కొత్త ముఖాలకు టికెట్లిచ్చింది. జేడీ(ఎస్) పంచరత్న రథయాత్రలో యువతకే అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కుమారస్వామి ప్రచారంలో యువతతోనే మాట్లాడుతూ వారి నాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఓటర్లు తమ వైపేనని ధీమాతో ఉంది. ఢిల్లీ, పంజాబ్‌లో యువ ఓటర్లను అధికంగా ఆకర్షించిన ఆప్ ఈసారి ఉన్నత విద్య అభ్యసించిన వారికే ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చింది. 2008: ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్కుకి కేవలం మూడు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన సగటు ఓటు షేరు కంటే కొత్త ఓటరు వేసిన ఓట్ల వాటా (మొత్తం పోలయిన కొత్త ఓటర్ల ఓట్లలో) ఎక్కువగా ఉంది. కొత్త ఓటర్ల ఓటు షేర్ మూడు శాతం ఎక్కువగా ఉంది. 2013: అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్లు కాంగ్రెస్ వైపు స్వల్పంగా మొగ్గు చూపించారు. ఆ పార్టీకి వచ్చిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్లు కాంగ్రెస్‌కు వేసిన ఓటు షేరు ఒక్క శాతం అధికంగా ఉంది. హస్తం పార్టీ గద్దెనెక్కింది. 2018: బీజేపీ మెజార్టీ మార్కుకి 9 సీట్ల దూరంలో ఉండిపోయింది. దీనికి కారణం కొత్త ఓటర్లేనని సీఎస్డీఎస్–లోక్‌నీతి గణాంకాల్లో తేలింది. బీజేపీకి పోలయిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్ల షేరు ఆరు శాతం తక్కువగా ఉంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. 2013, 2018 ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీకి సగటు ఓటు షేర్ కంటే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఓటు షేర్ నాలుగు శాతం అధికంగా ఉంది. దీంతో పట్టణ యువత జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారని తేలుతోంది. -సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Assembly Elections 2022: యువతరం.. ఎవరి పక్షం...!
ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా అందరి దృష్టి యువతపైనే. ప్రధాని మోదీకి యువతలో క్రేజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో యువ ఓటర్ల తీర్పులో కాస్త మార్పు కనిపించింది. ఈ సారి యువ ఓటర్ల మదిలో ఏముందో తెలుసుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు. గుజరాత్లో యువ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. యువతలో ప్రధాని మోదీకున్న క్రేజ్‌ను ఓట్లరూపంలో మలుచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తూ ఉంటే కాంగ్రెస్, ఆప్ నిరుద్యోగ అంశాన్ని లేవనెత్తుతున్నాయి. మోదీ ఏ సభకి వెళ్లినా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లను ఆకట్టుకునే రీతిలో ప్రసంగాలు చేస్తున్నారు. గుజరాత్ మనమే నిర్మించామన్న నినాదంతో మిలీనియల్స్ని ఆకర్షించే వ్యూహాలు బీజేపీ రచించింది. డిజిటల్ మీడియా ప్రచారంలో బీజేపీ ముందుంది. యూత్ కోసమే ప్రత్యేకంగా 15 యాప్‌లు రూపొందించింది. 20 వేల మందికిపైగా వర్కర్లు, 60 వేల మందికి పైగా వాలంటీర్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కేంద్ర పథకాలపై యువతలో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, ఆప్ పోటాపోటీ హామీలు యువతపై ప్రభావం చూపించే కీలక అంశాలైన ఉద్యోగాలు, విద్య అంశాల్లో కాంగ్రెస్, ఆప్ పోటాపోటీ హామీలు గుప్పించాయి. కోవిడ్–19 ప్రభావంతో లక్షలాది మంది యువత రోడ్డునపడిన కొత్తగా ఉపాధి దొరక్క అసహనంతో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి రూ. 3వేలు ఇస్తామని హామీ ఇస్తే, కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని , అందులో 50% మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువతకి నెలకి రూ.3 వేలు భృతి ఇస్తామంటూ ఆప్ బాటలోనే కాంగ్రెస్ నడిచింది. రాష్ట్రంలో విద్య నిరుపేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల భారం మోయడం కష్టంగా ఉంటోంది. ఆప్ ఢిల్లీలో మాదిరిగా విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తామని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని హామీ ఇస్తే, కాంగ్రెస్ కూడా యధాతథంగా అవే హామీలు ఇచ్చింది. ఎన్నికలకి ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉండగా బీజేపీ ఇంకా మేనిఫెస్టో కసరత్తులో నిమగ్నమైంది. పార్టీలు కాదు పాలసీలు ముఖ్యం ఈ సారి యువ ఓటర్లు పార్టీలు తమకు ముఖ్యం కాదంటున్నారు. ఎవరు మంచి పాలసీలు తీసుకువస్తారో వారికే ఓటు వేస్తామని నినదిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం దాదాపుగా 3 శాతం వరకు ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల పేపర్లు లీకేజీ నిరుద్యోగ యువతలో తీవ్ర అసహనాన్ని నింపుతోంది. గత ఏడేళ్లలో ఎనిమిది సార్లు పేపర్లు లీకేజీ కావడం, బాధ్యులపై ప్రభుత్వ చర్యలు తీసుకోకపోవడం పట్ల యువత ఆగ్రహంతో ఉంది. నిరుద్యోగం కంటే విద్యారంగంలో సమస్యలపైనే యువత ఎక్కువ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘మాకు పార్టీలతో సంబంధం లేదు. ఆయా పార్టీల విధానాలే ముఖ్యం. ఈ సారి ఎన్నికల్లో విద్యా రంగం గురించి ఎవరైతే ఆలోచిస్తారో వారికే మా ఓటు. బీజేపీ ప్రభుత్వం నాణ్యమైన విద్యపై అసలు దృష్టి పెట్టడం లేదు. ఫీజుల భారం కూడా ఎక్కువే’’ అని షేట్ దామోదర్ దాస్ స్కూలు ఆఫ్ కామర్స్‌కు చెందిన విద్యార్థులు చెప్పారు. ఇన్నాళ్లూ రాష్ట్ర యువత ప్రధాని మోదీ వెంట ఉన్నారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని ఎన్నికల విశ్లేషకుడు శిరీష్ కాశీకర్ అభిప్రాయపడ్డారు. యువ ఓటర్లు ఇలా..! రాష్ట్రంలో మొత్తం 4.9 కోట్ల మంది ఓటర్లు ఉంటే వారిలో 40 ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్నవారు 2.35 కోట్ల మంది ఉన్నారు. అంటే దాదాపుగా సగం ఓట్లు వీరివే. అందుకే ఈ ఓటర్లు గేమ్ ఛేంజర్‌గా మారుతారన్న అభిప్రాయం ఉంది. ఆ ఓటర్లలో 30–39 ఏళ్ల మధ్య వయసున్న వారు 1.21 కోట్ల మంది ఉంటే, 20–29 వయసు మధ్య ఉన్నవారు 1.03 కోట్లు ఉన్నారు. ఇక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి నమోదు చేసుకున్న వారి సంఖ్య 11.74 లక్షలని కేంద్ర ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
25% ఓటర్లు 30 ఏళ్లలోపు వారే
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లలో 18 నుంచి 29 ఏళ్ల వయస్సు వారు నాలుగో వంతు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆవిష్కరించిన అట్లాస్ వెల్లడించింది. 2019 లోక్‌సభ సాధారణ ఎన్నికల విశేషాలతో రూపొందించిన ఈ అట్లాస్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే ఈనెల 15న విడుదల చేశారు. 17వ లోక్‌సభ కోసం జరిగిన 2019 సాధారణ ఎన్నికలు ప్రపంచ చరిత్రలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామిక ప్రక్రియ. అట్లాస్‌లో పొందుపరిచిన ముఖ్యాంశాలు ► మొత్తం 543 నియోజకవర్గాల్లో 8,054 మంది పోటీ చేయగా, అందులో 726 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు. 78 మంది మహిళా అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ► అత్యధికంగా 185మంది అభ్యర్థులు పోటీపడిన నియోజకవర్గం నిజామాబాద్. అత్యల్పంగా ముగ్గురు మాత్రమే పోటీ చేసిన నియోజకవర్గం తుర(మేఘాలయ). ► వయస్సు పరంగా చూస్తే 18–29 ఏళ్ల మధ్య 25.37 శాతం ఓటర్లు ఉన్నారు. ఈ విభాగంలో అత్యధికంగా మిజోరాంలో 39.77 శాతం, అత్యల్పంగా కేరళలో 20.16 శాతం, తెలంగాణలో 26.08% ఉన్నారు. ► 30–59 మధ్య వయస్సు వారు దేశవ్యాప్త ఓటర్లలో 59.77% ఉన్నారు. రాష్ట్రాల పరంగా చూస్తే ఏపీలో అత్యధికంగా ఈ కేటగిరీలో 62.14% కాగా, తెలంగాణలో 61.37% మంది ఉన్నారు. ► 60–79 ఏళ్ల మధ్య వారు మొత్తం ఓటర్లలో 13.15 శాతం ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన వారు మొత్తం ఓటర్లలో 1.71 శాతం ఉన్నారు. ► అత్యధిక ఓటర్లు కలిగిన టాప్–5 నియోజకవర్గాల్లో మొదటిస్థానంలో మల్కాజిగిరి ఉండగా, ఐదో స్థానంలో చేవెళ్ల నిలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లోనే సుమారు 56 లక్షల ఓటర్లు ఉన్నారు. ► అత్యల్పంగా పోలైన ఓట్ల శాతం నమోదైన 10 నియోజకవర్గాల్లో తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. ► లింగ నిష్పత్తి క్రమంగా మెరుగుపడుతోంది. అత్యధికంగా పుదుచ్చేరిలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,118 మంది మహిళా ఓటర్లు ఉండగా, ఏపీలో 1,018మంది, తెలంగాణలో 990 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. -
టార్గెట్ యువ..
సాక్షి, అమరావతి బ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో యువతరం ఓట్లు కీలకంగా మారాయి. జిల్లాలో గెలుపోటములను శాసించే స్థితిలో ఉన్న యువత ఓటు హక్కును వినియోగించుకోనుంది. దీంతో ఆయా రాజకీయ పార్టీలు వీరిని ప్రసన్నం చేసుకోవటంపై దృష్టిసారించాయి. ఇందు కోసం ప్రత్యేక తాయిలాలను కూడా సిద్ధం చేస్తున్నాయి. క్రికెట్ కిట్లు ఇప్పించడం, టోర్నమెంట్లు పేరుతో ఆటలు నిర్వహించి నగదు బహుమతులు ప్రకటించటం, యువజన సంఘాలను అన్ని విధాలా ప్రోత్సహిస్తామంటూ హామీలు ఇవ్వనున్నారు. అదే విధంగా తమ పార్టీలు అధికారంలోకి వస్తే యువకుల కోసం చేపట్టే కార్యక్రమాలను ఆయా పార్టీలు ఏకరువు పెడుతున్నాయి. అంతేకాకుండా యువజన సంఘాలకు సైతం పెద్ద మొత్తం ఇస్తామంటూ కూడా రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో కొత్త ఓటర్లు... జిల్లాలోని 34,28,217 మొత్తం ఓటర్లలో సుమారు 20 శాతానికి పైనే యువ ఓటర్లు ఉన్నారు. శనివారం నాటి లెక్కల ప్రకారం ఓటరు జాబితాలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు 8,03,394 మంది ఉన్నారు. మైలవరం నియోజకవర్గంలో 7,267 మంది కొత్త ఓటర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 6,746 మంది కొత్త ఓట్లు నమోదయ్యాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలో సరాసరి 6 వేల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. అత్యల్పంగా పెడనలో 3,909 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. కొత్తగా ఓటు హక్కును పొందినవారు తమ తొలి ఓటు ఎవరికి వేస్తారోననే సంశయం అన్ని పార్టీల్లోను నెలకొంది. ఓటరు మూసాయిదా ప్రకారం 18–19సంవత్సరం లోపు వారు జిల్లాలో 82,409 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే 20–29 సంవత్సరం లోపు 7,20,985 మంది ఓటర్లు ఉన్నారు. మేనిఫెస్టోలో ‘యువ’గానం.. కొత్త ఓటర్లను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు యువత ప్రాధాన్యత అంశాలను పార్టీలు మేనిఫేస్టోలో చేర్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న హామీ యువతను ప్రభావితం చేసింది. అలాగే అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పింది. కానీ హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను, యువతను ప్రభుత్వం మోసం చేసింది. ఈసారి మోసపోకూడదని, యువతకు మంచి చేస్తుందన్న నమ్మకం ఉన్న పార్టీనే గెలిపించాలని నిర్ణయించుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సరిగా అమలు కాలేదన్న అసంతృప్తి యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. తాత్కాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలే మేలని యువత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఉద్యోగాల భర్తీ చేయాలని, స్వయం ఉపాధి మార్గాలు చూపాలని, యువతకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 34,28,217 మంది యువ ఓటర్లు 8,03,394 మంది కొత్త ఓటర్లు 82,409 మంది -
ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేది వాళ్లే..
సాక్షి, న్యూఢిల్లీ : 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రధానంగా ప్రభావితం చేసింది కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతే. భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసిన విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాభివద్ధి, మేకిన్ ఇండియా లాంటి హామీలను నమ్మడం వల్ల యువతలో మెజారిటీ ఆ పార్టీకే ఓటువేసి గెలిపించారు. 2018లో కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2014 నాటి ఎన్నికలకు 2.40 కోట్ల మందికి కొత్తగా ఓటు హక్కు రాగా. ఈసారి ఇప్పటికీ 3.40 కోట్ల మందికి కొత్తగా ఓటు హక్కు వచ్చింది. 2020 నాటికి దేశంలో 45 లక్షల మందికి ఓటు హక్కు వస్తుందని, అప్పటికీ దేశం మొత్తం జనాభాలో 34 శాతం మంది యువతే ఉంటారన్నది నిపుణుల అంచనా. కొత్తగా ఓటు హక్కు వచ్చినవాళ్లు 18 ఏళ్ల నుంచి 23 ఏళ వరకు ఉండవచ్చు. ఓ పార్లమెంట్ ఎన్నికల నాటికి ఓ యువకుడు లేదా యువతికి 17 ఏళ్లు ఉంటే మరో ఐదేళ్లకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి వారికి 23 ఏళ్లు వస్తాయి. కనక మనం వీరందరిని యువతగానే పరిగణిస్తాం. అధికారిక లెక్కల ప్రకారం యువత అంటే ఎవరు? ఎన్నేళ్ల నుంచి ఎన్నేళ్ల ప్రాయం మధ్యనున్న వారిని యువత అని వ్యవహరిస్తారు ? ఓటు హక్కుతో ప్రమేయం లేకుండా ఐక్యరాజ్య సమితి పరిశోధనా సంస్థలు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ప్రాయం వారిని యవత కింద పరిగణిస్తున్నాయి. 2003లో ఖరారు చేసిన జాతీయ యువజన విధానం ప్రకారం 13 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ప్రాయం కలిగిన వాళ్లను యువతగా పరిగణిస్తే, 2014లో సవరించిన జాతీయ యువజన విధానం ప్రకారం 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య ప్రాయంగల వారిని యువతగా వ్యవహరిస్తున్నారు. స్టాటస్టిక్స్ మంత్రిత్వశాఖ పరిధిలోని నేషనల్ శాంపిల్ సర్వే ఆపీస్ (ఎన్ఎస్ఎస్ఓ) 2017లో విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం 15 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులను యువతగా పరిగణిస్తారు. 18 ఏళ్ల వరకు ఎలాగు ఓటు హక్కు ఉండదు కనుక 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్యనున్న యువతనే గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ప్రధానంగా ప్రభావితం చేసిందని ‘ఇండియాస్పెండ్’ పరిశోధన సంస్థ విశ్లేషించింది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే కీలకమయ్యాయి. అవి వరుసగా బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు. మొత్తం లోక్‌సభ సీట్లు 543 కాగా, ఈ ఐదు రాష్ట్రాల నుంచే 43 శాతం అంటే, 235 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. గత లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో యువత ఎక్కువగా ఉన్న ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్క పశ్బిమ బెంగాల్ మిగతా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ బాగా రాణించింది. 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోను బీజేపీ విజయం సాధించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ యూ, రాష్ట్రీయ జనతాదళ్‌లు కూటమిగా విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జనతాదళ్ యూ, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు కలిసి మహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో 43 శాతం ఓట్లను సాధించిన బీజేపీ ఏకంగా 71 సీట్లను దక్కించుకుంది. 2017లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ–ఎస్పీ పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. 2014 నాటి లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ 17 శాతం ఓట్లను సాధించినప్పటికీ కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది. కొన్ని సార్లు కొంత శాతం ఓట్లు ఇటు నుంచి అటు తరలి పోయినా ఫలితాలు తలకిందులవుతాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్రలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా ఉండడం, యువతకు ఉద్యోగాల కల్పనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమవడం (గత 45 ఏళ్లలో ఎన్నడు లేనంతగా దేశంలో నిరుద్యోగ సమస్య 6.1 శాతానికి చేరుకుందని ఎన్ఎస్ఎస్ఓ నివేదిక వెల్లడించిన విషయం తెల్సిందే) తదితర కారణాల వల్ల యువత ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక బెంగాల్లో బీజేపీ పరిస్థితి గతం కన్నా మెరుగుపడిన గొప్పగా రాణించే పరిస్థితి ఇంకా అక్కడ లేదు. ప్రధానంగా ఈ ఐదు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొనే పలు సర్వేలు ఈసారి పార్లమెంట్లో హంగ్ తప్పదని తేల్చాయి. -
అధికారాన్ని నిర్ణయించనున్న యువ ఓటర్లు..!
సాక్షి, అచ్చంపేట: టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో విభాగాల వారీగా ఓటర్ల సంఖ్యను బట్టి హామీలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. జిల్లాలో నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నవంబరు 9తో ముగిసింది. దీంతో అధికారులు తుది జాబితాను ప్రకటించారు. ఇందులో వయస్సుల వారీగా ఓటర్ల వివరాలను సైతం పొందుపరిచారు. అధికారులు ప్రకటించిన జాబితాలో యువ ఓటర్ల సంఖ్య ఉండడంతో అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళిలు మూడు నియోజకవర్గాల్లో యువకులు గణనీయంగా తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. 18–29 మధ్య వయ స్సు వారు 1,66,496మంది ఉన్నారు. నాగ ర్‌కర్నూల్ నియోజకవర్గంలో 54,361, అచ్చంపేటలో 57,572, కొల్లాపూర్‌లో 54,563మంది యువ ఓటర్లు ఈసారి ప్రభావం చూపనున్నా రు. వీరితో పాటు 30నుంచి 39ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఎన్నికల్లో వీరందరూ కీలకంగా మారనున్నారు. అభివృద్ధి, పరిపాలన తీరు, అభ్యర్థి పనితీరును బట్టి సమగ్రంగా ఆలోచించి ఓటువేసే ఓటర్లు కావడంతో పార్టీల అభ్యర్థులు వీరిని ఆకట్టుకునేందుకు పకడ్బందీ ప్రణాళికలు చేసుకుంటున్నారు. మూడు నియోజకవర్గాల్లో మధ్య వయస్సు ఓటర్లు తీసుకునే నిర్ణయంపైనే అభ్యర్థుల విజయం ఆధారపడి ఉంటుందనేది పలు సర్వేలో తేలింది. యువ ఓటర్లతో పోటీగా వీరి ఓట్లను కొల్లగొట్టేవారిని విజయం వరిస్తుంది. మొదటిసారి ఓటు వేసేవారు 26,039 గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొత్త ఓటర్ల సంఖ్య నమోదు శాతం పెరిగింది. ఈ ఎన్నికల్లో కొత్తగా 26,039 మంది 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న యువకులకు అధికారులు ఓటు హక్కును కల్పించారు. వీరిలో అమ్మాయిలు 12,022మంది, అబ్బాయిలు 14,022మంది ఉన్నారు. వీరంతా మొదటిసారిగా ఓటు వినియోగించుకోనున్నారు. కొత్త ఓటర్ల నమోదు మూడు నియోజకవర్గాల్లో ఆశాజనకంగానే సాగింది. ఈ జాబితాలో నాగర్‌కర్నూల్ 12,782 మందితో మొదటి స్థానంలో, అచ్చంపేట 9,328 మందితో రెండవ స్థానంలో, కొల్లాపూర్ 3,923మందితో మూడో స్థానంలో ఉంది. పార్టీల యువమంత్రం జిల్లాలో అధికశాతం గ్రామీణ ప్రాంతాలు కావడంతో పోలింగ్ శాతం 70శాతానికి పైగానే ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో కొంత ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతా ల్లో ఈ సమస్య లేదు. ఓటు హక్కును వినియో గించుకునే వారిలో యువకులు అధికంగా ఉండటం మరో విశేషం. దీంతో అన్ని పార్టీలు యుక ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. యువతను ఆకట్టుకునేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగిస్తున్నారు. -
యువతరం కదిలింది
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో యువ ఓటర్లు అనూహ్యంగా పెరిగారు. అతి తక్కువగా ఉన్న యువ ఓటర్ల నమోదు కోసం జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రత్యేక కార్యాచరణతో తక్కువ సమయంలోనేవారి సంఖ్య 0.59 శాతం నుంచి 1.44 శాతానికి పెరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చిన ఉత్తర‡ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి, జాయింట్ సీఈఓలకు ఇక్కడి ఎన్నికల ఏర్పాట్లను దానకిషోర్ వివరించారు. ఓటర్లలో 18–19 ఏళ్ల వయసు గలవారు 3.74 శాతం ఉండాల్సి ఉండగా ఇంకా 2.30 శాతం తక్కువగా ఉన్నారన్నారు. దీనికి కారణం యువ ఓటర్లుగా నమోదు చేసుకోవడంలో నిరాశతతో ఉండడమేనని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా నగరంలోని వివిధ కళాశాలలు, విద్యాసంస్థల్లో తాము చేసిన ఓటరు నమోదు చైతన్య కార్యక్రమాలతో 0.59 శాతం ఉన్న యువ ఓటర్ల సంఖ్య 1.44 శాతానికి పెరిగిందని వివరించారు. ఓటరు జాబితా ప్రక్షాళన.. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎన్నికల జాబితాను వడపోయడం సవాలే అయినా రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో పాటు బీఎల్ఓలతో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు దానకిషోర్ తెలిపారు. జాబితాలో అక్షర దోషాలు, ఇంటి నంబర్లను తప్పుగా పేర్కొనడం, ఫొటోల మార్పిడి, ఒకే ఇంటి నంబర్‌పై అనేక మంది ఓటర్లు ఉండడం వంటి సమస్యలను సరిచేశామన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఒకే ఇంట్లో లేదా కంపౌండ్‌లో ఉమ్మడి కుటుంబాలు ఉండడం తద్వారా ఒకే ఇంటి నంబర్‌పై 40 నుంచి 50 మంది ఓటర్లు ఉన్న సంఘటనలు కూడా ఉన్నాయని వివరించారు. ఈసారి ఎన్నికల్లో మొదటిసారి కొత్తగా ప్రవేశపెట్టిన ‘వీవీప్యాట్’లపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించామన్నారు. ఎన్నికల నిర్వహణకు వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల చెకింగ్, తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేయడంతో పాటు ఈవీఎంలను సంబందిత నియోజకవర్గాల డీఆర్సీ కేంద్రాలకు కూడా పంపించామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన కమిటీలను సైతం నియమించామన్నారు. రూ.18.80 కోట్ల స్వాధీనం ఎన్నికల వేళ జిల్లాలో రూ.18.80 కోట్ల నగదు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని దానకిషోర్ తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో 1290 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ గుర్తించి విస్తత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులో ఉందన్నారు. ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు కూడా త్వరలో నగరానికి చేరుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ అడిషనల్ కమిషనర్ డి.ఎస్.చౌహాన్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు హరిచందన, కెనడి, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తదితరులు పాల్గొన్నారు. -
యువ ఓటర్లపైనే గురి
సాక్షి, జనగామ:శాసనసభ ఎన్నికల్లో జనగామ జిల్లాలో యువ ఓటర్ల తీర్పు కీలకంగా మారనుంది. అభ్యర్థుల గెలుపు ఓటములపై యువ ఓటర్లు ప్రభావితం చూపనున్నారని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. యువ ఓటర్ల ను తమవైపు తిప్పుకోవడం కోసం ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. యువతకు దగ్గరయ్యేందుకు.వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాయి. యువతను కలుసుకుని ఓట్లరూపంలో వారి మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో యువ ఓటర్లు వేల సంఖ్యలో ఉండడంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. విద్యార్థి సంఘాల రూపంలో ప్రధాన పార్టీలు.. ఎన్నికల బరిలో తలపడుతున్న ప్రధాన పార్టీలు యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయా పార్టీలకు ఉన్న విద్యార్థి విభాగాలను సమాయత్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలతో పాటు యువజన విభాగాలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొత్త ఓటర్లు, యువ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం విద్యార్థి విభాగాలు, యువజన విభాగాల నాయకులు ప్రత్యేక బృందాలుగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. కొత్త, యువ ఓటర్ల సెల్‌నంబర్లు సేకరిస్తున్నారు. యువసేనల జోరు.. యువ ఓటర్లను దగ్గర చేసుకోవడం కోసం ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో యువసేన సంఘాలు జోరందుకున్నాయి. ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థులకు మద్దతుగా యువకులు యువసేన సంఘాలను ప్రారంభించారు. పాలకుర్తిలో దయన్న యువసేన, జనగామలో ముత్తిరెడ్డి యువసేన, స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజన్న యువసేన, కేసీఆర్ యువసేన, కేటీఆర్ యువసేన, హరీషన్న యువసేన, పొన్నాల యువసేన, జంగా యువసేన, వంశన్న యువసేన, ముక్కెర యువసేన, రమణన్న యువసేన వంటి సంఘాలు ఆయా పార్టీలకు, అభ్యర్థులకు మద్దతుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ భృతితో యువతకు గాలం... విద్యార్థి సంఘాలు, యువజన విభజన విభాగాలు, యువసేన సంఘాలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మరోవైపు ప్రధాన పార్టీలు నిరుద్యోగ భృతి పథకంతో ఓట్లకు గాలం వేసేందుకు యత్నిస్తున్నాయి. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇస్తున్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్లు, ఉపాధి అవకాశాలపై దృష్టిపెడతామని యువ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఏదేమైనా మూడు నియోజకవర్గాల్లో యువ ఓటర్ల తీర్పు కీలకం కాబోనున్నది. -
మేఘాలయలో ఓటేయనున్న ఇటలీ, స్వీడన్, అర్జెంటీనా!
ఉమ్నియా: మేఘాలయ ఎన్నికల్లో ఓ వింత చోటుచేసుకోబోతోంది. ఇటలీ, స్వీడన్, అర్జెంటీనా, ఇండోనేసియాతోపాటు ప్రామిస్లాండ్, హోలీలాండ్, జెరూసలేం...తదితరాలన్నీ అక్కడి ఎన్నికల్లో ఓటేయబోతున్నాయి. అదేంటీ..ఈ దేశాలకు మేఘాలయ ఎన్నికలతో ఏంటీ సంబంధం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఇవన్నీ ఇక్కడ ఈ నెల 27న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న యువ ఓటర్ల పేర్లు..! ఇవే కాదు, వారాలు.. సండే, థర్స్డే, రాష్ట్రాలు గోవా, త్రిపుర లాంటి పేర్లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని ఖాసీ తెగ ప్రజల్లో ఇలాంటి విచిత్రమైన పేర్లుండటం సహజం. ఎన్నికల జాబితాలో ఈ పేర్లను చూసిన అధికారులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారట..! -
ఈసీతో ఫేస్బుక్ తొలిసారి జట్టు
డెహ్రాడూన్: వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల సాధారణ ఎన్నికల్లో యువతను ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు తొలిసారి సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ఎన్నికల సంఘం(ఈసీ)తో కలిసి పనిచేయనుంది. ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 18 ఏళ్లకు పైబడిన ఫేస్బుక్ వినియోగదారులందరికీ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తూ అక్టోబర్ 6 నుంచి 9 మధ్య అలర్ట్ వస్తుంది. తరువాత ఫేస్బుక్ రూపొందించిన ‘రిజిస్టర్ టు వోట్’ అనే బటన్ నొక్కితే జాతీయ ఓటరు సేవల పోర్టల్‌లోకి అనుమతి లభిస్తుంది. అలా వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. భారత్‌లో సుమారు 16 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారులున్నారు. -
యువతకు కమలదళం గాలం
ఎన్నికల సమయంలో పైజామా, కుర్తా ధరించనున్న ఆ పార్టీ నేతలు న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల సమయం ఆసన్నమవుతుండడంతో యువ ఓటర్లను తమవైపు తిప్పుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. ఇందులోభాగంగా ఎన్నికల ప్రచార సమయంలో పైజామా, కుర్తాలతో ఆ పార్టీ నాయకులు కనిపించనున్నారు. ఏ ఎన్నికలలోనైనా అత్యధిక ప్రభావం చూపేది యువతరమేనని, అందువల్ల వారిని ఆకట్టుకునేరీతిలో దుస్తులు ధరించాలని బీజేపీ అధిష్టానం... నాయకులు, కార్యకర్తలకు ఇప్పటికే సూచించింది. ఈ విషయమై పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ ‘యువకుల మాదిరిగా కనిపించడం కోసం ఎన్నికల ప్రచార సమయంలో మేమంతా పైజామా, కుర్తాలను ధరిస్తాం. ఆవిధంగా వారి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తాం’అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వార్డ్రోబ్ను గమనించి ఆ తరహా దుస్తులను ధరించాలని అధిష్టానం తమకు సూచించిందన్నారు. ‘ఈ దుస్తులను ధరించి మేమంతా ఢిల్లీ పరిధిలోని వివిధ కళాశాలలు, కేఫ్‌లు, మాల్స్‌కు కచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. ఆవిధంగా యువతరాన్ని మేము ఆకట్టుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు పార్టీలో చేరాలంటూ యువతరాన్ని కోరతాం’ అని అన్నారు. ఇదిలాఉండగా ఈ నెల 15వ తేదీవరకూ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
ఓటేయని బద్ధకస్తులు 4,88,693
పెరిగిన పోలింగ్ శాతం - జిల్లాలో 80శాతానికి పైగా పోలింగ్ -అన్ని నియోజకవర్గాల్లో యువ ఓటర్ల జోరు జిల్లాలో సాధారణ ఎన్నికల పోలింగ్ శాతం పెరిగింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 80.66శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 25,41,607మంది ఓటర్లు ఉండగా.. 20,37,613 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 4,88,693 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. తక్కువ ఓటుహక్కు వినియోగించిన వారిలో నల్లగొండ నియోజకవర్గం ముందుంది. ఈ నియోజకవర్గంలో 2,21,836మంది ఓటర్లుండగా.. 1,63,913మందే ఓటేశారు. ఇంకా 57,923మంది ఓటును వినియోగించుకోలేదు. అదేవిధంగా ఎక్కువ మంది ఓటుహక్కు వినియోగించుకున్న వారిలో భువనగిరి నియోజకవర్గం ముందుంది. ఈ నియోజకవర్గంలో 1,86,607మంది ఓటర్లుండగా.. 1,58,595మంది ఓటేశారు.కేవలం 28,012మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకోలేదు సాక్షి, నల్లగొండ, జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, భువనగిరి, సూర్యాపేట మున్సిపాలిటీలు.. దేవరకొండ, హుజూర్నగర్ నగర పంచాయతీ లున్నాయి. ఈ ప్రాంతాల్లోనే ఓటర్లు ఎక్కువగా ఉంటారు. విద్యావంతులు, మేధావుల సంఖ్య కూడా ఎక్కువే. అయినా సాధారణ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లోనే తక్కువగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అన్ని నియోజకవర్గాల్లో 80శాతానికి పైగా పోలైతే.. నల్లగొండలో 73.89శాతం, సూర్యాపేటలో 78.89, మిర్యాలగూడలో 79.15శాతం పోలింగ్ జరగడం ఉదాహరణగా చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంత ఓటర్లలో మాత్రం చైతన్యం వెల్లివిరి సింది. ఓటర్లు ప్రతి పోలింగ్ కేంద్రం ముందు బారులు దీరారు. ఓటుపై జిల్లా యంత్రాంగం, స్వచ్ఛందసంస్థలు ఎంత ప్రచారం చేసినా నగరాలు, పట్టణాల్లో ఫలితమివ్వలేదు. -
జిల్లా ఓటర్లు 25,41,607
నాలుగు మాసాల్లో 52వేలు పెరుగుదల అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం నకిరేకల్ అత్యల్ప ఓటర్లు ఉన్నది భువనగిరి సార్వత్రిక ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధమైంది. ఏప్రిల్ 9వ తేదీ వరకు నమోదు చేసుకున్న వారికి కూడా ఓటుహక్కు కల్పించారు. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో 52వేల మంది కొత్తగా ఓటరుగా నమోదయ్యారు. నల్లగొండ, న్యూస్‌లైన్,సార్వత్రిక ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధమైంది. ఈ నెల 30 తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కొత్త ఓటర్ల జాబితాను జిల్లా యంత్రాంగం రూపొందించింది. ఈ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీంతో ఈ నెల 9 తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకున్న వారందరికీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవ కాశం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 9 తేదీ వరకు కొత్తగా 52,379 మంది ఓటర్లు నమోదయ్యారు. జనవరి 1వ తేదీ నాటికి జిల్లాలో 24,89,228 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ప్రస్తుతం కొత్తగా నమోదైన ఓటర్లతో కలుపుకుని మొత్తం వారి సంఖ్య 25,41 ,607కు పెరిగింది. వీరిలో పురుషులు 12,75,268, మహిళలు 12,66,253, ఇతరులు 86 మంది ఉన్నారు. ఈ మొత్తం ఓటర్లలో అత్యధికంగా నకిరేకల్ నియోజకవర్గంలో 2,25,427 మంది ఉండగా, ఆ తర్వాతి స్థానంలో తుంగతుర్తి నియోజకవర్గంలో 2,23,507 మంది ఉన్నారు. అత్యల్పంగా భువనగిరి నియోజకవర్గంలో 1,86,607 మంది ఓటర్లు ఉన్నారు. అనూహ్య స్పందన కొత్తగా ఐదు నియోజకవర్గాల్లో ఓటర్లు పెరి గారు. నల్లగొండలో 6,414 మంది ఓటర్లు, మిర్యాలగూడలో 6,156 ,సూర్యాపేటలో 5,376, నాగార్జునసాగర్‌లో 2,712 మంది ఓటర్లు కొత్తగా చేరారు. పెరిగిన ఓటర్లలో పురుషులతో పోలిస్తే మహిళలు ఐదు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్నారు. కోదాడలో 2,022, సూర్యాపేటలో 1146, హుజూర్‌నగర్‌లో 1291, నాగార్జునసాగర్‌లో 448, మిర్యాలగూడలో 25 మంది పెరిగారు. పెరిగిన యువ ఓటర్లు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి ప్రకటించిన ఓట ర్ల జాబితా ప్రకారం జిల్లాలో యువ ఓటర్లు 51,441 మంది ఉన్నారు. కాగా తాజాగా నమోదైన ఓటర్ల జాబి తా ప్రకారం యువ ఓటర్ల సంఖ్య 64,308కి పెరిగింది. ఈ నాలుగు మాసాల్లో 18-19 ఏళ్ల వయస్సు కలిగిన యువతీ, యువకులు ఓటు నమోదు చేసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. దీంతో గతంతో పోలి స్తే 12,867 మంది యువకులు కొత్తగా ఓటరు జాబితాలో నమోదయ్యారు. దీంట్లో అత్యధికంగా యువకులు ఆలేరు నియోజకవర్గంలో, యువతులు నల్లగొండలో నమోదయ్యారు. ఇక అత్యల్పంగా యువతీయువకుల ఓటర్లు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు. -
చదువుల కల చెదురుతోంది..
‘ఉన్నత చదువులు ‘ఉన్న’వారికే పరిమితం కాకూడదు.. చదువుకునే పేద విద్యార్థికి ఫీజులు భారం కావద్దు.. డాక్టర్, ఇంజినీర్ వంటి చదువులు అన్ని వర్గాలకు దక్కాలి!’ - డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ హయాంలో.. 2008-09లో మారిన దశ * ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యార్థుల సమస్యలపై దృష్టిపెట్టారు. * పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్పులు, మెస్ చార్జీల కోసం భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తూ విడుదల చేయించారు. * బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించి 2004-05 ఆర్థిక సంవత్సరంలోనే రూ.386.37 కోట్ల బడ్జెట్ కేటాయించి, రూ.409.34 కోట్ల మేర విడుదల చేశారు. * 2005-06లో రూ.409.07 కోట్లు, 2006-07లో రూ.609.91 కోట్లు, 2007-08లో రూ.883.74 కోట్లు విద్యార్థుల కోసం విడుదల చేశారు. * విద్యార్థులకు స్కాలర్షిప్పులు, మెస్ చార్జీలు ఏయేటికాయేడు పెంచుతూ విడుదల చేస్తున్నప్పటికీ సంతృప్త (శాచ్యురేషన్) పద్ధతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు వికలాంగులైన విద్యార్థులందరికీ లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్సమెంట్ పథకాన్ని ప్రారంభించారు. * ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థీ ఎలాంటి ఫీజుల భారమూ లేకుండా విద్యను అభ్యసించడమే ఈ పథకం లక్ష్యం. ఇది విజయవంతం కావడంతో ఈబీసీ విద్యార్థులకు సైతం 2009-10 నుంచి అమలు చేశారు. * 2008-09 బడ్జెట్లో ఫీజు రీయింబర్స్‌మెంటుకు రూ.1373 కోట్లు కేటాయించిన ఆయన, ఏకంగా రూ.1565.37 కోట్లు విడుద ల చేశారు. * 2009-10 బడ్జెట్లో రూ.2,333.04కోట్లు కేటాయించారు. అయితే 2009 సెప్టెంబరు 2న ఆయన హఠాన్మరణం అనంతరం పథకంపై నీలినీడలు అలుముకున్నాయి. (పోలంపెల్లి ఆంజనేయులు) వైఎస్ సీఎం కాకముందు: ఉన్నతవిద్య మార్కెట్ వస్తువు. కొనుక్కుంటేనే దొరికేది. పేద విద్యార్థులకు అందని ద్రాక్ష. ఆశ, ఆసక్తి, అర్హత ఉన్నా.. ఆర్థిక భారంతో ఆ దిశగా ఆలోచించలేని అశక్తత వారిది. వైఎస్ సీఎం అయ్యాక: పేద విద్యార్థులందరికీ, వారిపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండానే, వారు కోరుకున్న ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఫీజు రీయింబర్సమెంట్ పథకాన్ని ప్రారంభం. లక్షలాది విద్యార్థుల భవితకు బంగారు బాటలు. వైఎస్ మరణానంతరం: పాలకులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథాశక్తి నీరుగార్చారు. అడ్డగోలు నిబంధనలతో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకే విద్యార్థులు భయపడేలా చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ చిన్నచూపే. వైఎస్‌ను మర్చిపోలేను.. మాది నిరుపేద నేత కుటుంబం. నాన్న లక్ష్మీనారాయణ చిన్న కిరాణకొట్టు నడుపుతూ నన్ను చదివించారు. అమ్మ బీడీలు చుడుతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆపేద్దామనుకుంటున్న సమయంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ నాలో చదువుకోవాలన్న ఆశను బతికించింది. దాంతో కరీంనగర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశా. సిరి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి ప్రస్తుతం ట్రెనింగ్‌లో ఉన్నా. ఎంటెక్ చేసి లెక్చరర్‌గా స్థిరపడాలనేది నా కోరిక. రీయింబర్సమెంట్ పథకం లేకుంటే నా భవిష్యత్ ఏమై పోయేదో తలచుకుంటేనే భయమేస్తుంది. వైఎస్‌ను ఎన్నటికీ మర్చిపోలేను. - గోనె లావణ్య, పద్మనగర్, సిరిసిల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి ప్రస్తుతమున్న ఆంక్షలను, పరిమితులను తొలగించడం చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ వర్గాలకు చెందిన ప్రతి పేద విద్యార్థికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే లక్ష్యం. * వైఎస్ఆర్ ప్రారంభించిన శాచ్యురేషన్(ప్రతి విద్యార్థికీ అందించే) పద్ధతి అమలు * బడ్జెట్ పరిమితులు ఉండబోవు. భారమెంతైనా పథకాన్ని అమలు చేసి తీరడం. * ఈ విషయాన్ని ఇటీవల జరిగిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రోశయ్య, కిరణ్‌ల పాలనలో.. భారం తగ్గించుకునే లక్ష్యంతో ఆధార్ కార్డు, బయోమెట్రిక్ విధానం.. తదితర కొత్త నిబంధనలతో పథకానికి తూట్లు పొడిచారు. * 2009-10 బడ్జెట్లో వైఎస్ ప్రభుత్వం రూ.2,333.04 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంటుకు కేటాయిస్తే, వైఎస్ మరణం తరువాత ముఖ్యమంత్రి పదవి చేబట్టిన రోశయ్య కేవలం రూ.1686.19 కోట్లు మాత్రమే విడుదల చేసి, లక్షలాది మంది విద్యార్థులకు మొండిచేయి చూపారు. అప్పటినుంచి కొత్త బడ్జెట్లో కేటాయించిన నిధులను పాత సంవత్సరం తాలూకు బకాయిల చెల్లింపులకు ఖర్చు చేస్తూ వస్తున్నారు. * 2010-11లో రూ.2726 .04 కోట్లు బడ్జెట్లో కేయించినా, విడుదలైన మొత్తం రూ.997 కోట్లు మాత్రమే. ఇవి కూడా పాత బకాయిలకే సరిపోయాయి. * 2011 వచ్చే సరికి విద్యార్థుల సంఖ్య మరింత పెరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పెంచాల్సి వచ్చింది. అయితే 2011లో అధికారంలోకి వచ్చిన కిరణ్‌కుమార్ రెడ్డి 2011-12 బడ్జెట్లో రూ.2,913 కోట్లు కేటాయించి రూ. 2,600 కోట్లు విడుదల చేశారు. ఈ మొత్తం పాత బకాయిలకే పోగా, 2012-13 విద్యా సంవత్సరంలో కేటాయించిన రూ.3,621 కోట్ల బడ్జెట్ నుంచి దాదాపు రూ.3,000 కోట్లు అంతకు ముందు విద్యా సంవత్సరం విద్యార్థులకు చెల్లించాల్సి వచ్చింది. * 2013-14 (ప్రస్తుత) సంవత్సరానికి కేటాయించిన రూ.4,282 కోట్ల నుంచి పాత బకాయిలు సర్దారు. గత ఏడాదితో పోలిస్తే దరఖాస్తుల నమోదు సంఖ్య తగ్గింది. * ఈ సంవత్సరం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న 26.58 లక్షల మందికి రూ. 4,500 కోట్లు అవసరమవుతాయి. మార్చి 31లోగా బడ్జెట్ విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలనే పూర్తి కాలేదు. * మొత్తం 26.58 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటి వరకు కేవలం 15.81 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. అదీ లోపభూయిష్టంగా ఉంది. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం వద్ద ఉన్న నిధులు రూ.1,800 కోట్లు మాత్రమే. వాటిలో రూ.1,350 కోట్లకు బిల్లులు తయారైనట్టు అధికారులు చెపుతున్నారు. -
యువహో.. యంగ్ ఏపీ
బి.గణేశ్‌బాబు: ఇప్పటిదాకా మత రాజకీయాలు విన్నాం. ధన రాజకీయాలు చూశాం. కుల, వర్గ, ప్రాంతీయ రాజకీయాలనూ పరికించాం. కానీ ఇకపై యువ రాజకీయాలు చూడబోతున్నాం. ఎందుకంటే దేశంలోని మొత్తం ఓటర్లలో 47 శాతం మంది 18-35 ఏళ్ల లోపు యువ ఓటర్లే. ఈసారి దాదాపు 15 కోట్ల మంది యువతీ యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదైనట్టు ఒక అంచనా. 2014లో వారు ఎవరి వైపు మొగ్గితే వారిదే విజయం. ప్రస్తుతం దేశంలో ప్రతి మూడో ఓటరూ 30 ఏళ్ల లోపు వ్యక్తే. మరో ఏడేళ్లలో దేశంలో జనాభా సగటు వయసు 29 ఏళ్లకు చేరుకోనుంది. 2020 నాటికి ప్రపంచంలోనే ‘అతి పిన్నవయసు’ దేశంగా భారత్ అవతరించనుంది. ఈ లెక్కన రానున్న దశాబ్దాల్లో యువతే దేశ రాజకీయాలను శాసించనుంది. దాంతో యువ ఓటును ఆకర్షించేందుకు పార్టీలన్నీ మేనిఫెస్టోలను సవరించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా వెల్లువలా యువ ఓటర్ల నమోదు భారత ఎన్నికల చరిత్రలో తొలిసారి బలమైన ముద్ర కొత్త ఓటర్లు భారీ సంఖ్యలో నమోదవడం వెనక ఎన్నికల సంఘం పాత్ర అంతా ఇంతా కాదు. 18 ఏళ్లునిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈసీ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయడం, నమోదైన వారంతా పోలింగ్‌లో పాల్గొనేలా చేయడమే లక్ష్యంగా ‘సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్’ (స్వీప్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు, వ్యాస రచన పోటీలు, వక్తృత్వ పోటీలు, మానవహారాలు, దృశ్య శ్రవణ ప్రకటనలు... ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలను నిర్వహించింది. ఓటర్ల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు కాలేజీలకు వెళ్లి అక్కడే ఓటర్ల నమోదు చేయడం, పోస్టాఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో ‘డ్రాప్ బాక్సు’లు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించడం, ఆన్లైన్లో నమోదు వంటి వినూత్న చర్యలు చేపట్టింది. నవ భారత్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో 18-19 ఏళ్ల వయసు గల దాదాపు 2.31కోట్ల మంది యువతీ యువకులు తొలిసారిగా ఓటు వేయనున్నారు పెరుగుతున్న రాజకీయాసక్తి దేశవ్యాప్తంగా యువతలో రాజకీయాసక్తి బాగా పెరుగుతోందని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఢిల్లీలో నిర్భయ హత్య సందర్భంగా వెల్లువెత్తిన నిరసనలో, అన్నాహజారే, కేజ్రీవాల్ ఉద్యమాల్లో, సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో యువత క్రియాశీలకంగా పాల్గొంది. దేశ వ్యాప్తంగా పట్టణ యువతలో రాజకీయ ఆసక్తి పెరిగినట్లు అమెరికాకు చెందిన ‘గ్లోబల్ అర్బన్ యూత్ రీసర్చ్ నెట్వర్క్’ నివేదిక తేల్చింది. 1996లో 43 శాతం యువత రాజకీయాల పట్ల ఆసక్తి చూపితే అది ప్రస్తుతం 71 శాతానికి పెరిగిందని వివరించింది. అంకెల్లో యువ భారతం * దేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 82 కోట్ల పై చిలుకు (మార్చి 9, 16 తేదీల్లో కూడా నమోదు చేసుకున్న వారిని కలుపుకుంటే) * వారిలో యువ ఓటర్ల సంఖ్య 47 శాతం * యువ ఓటర్లలో 51.4 శాతం పురుషులు, 48.6 శాతం మహిళలు * ఇటీవలి నాలుగు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం బాగా పెరిగింది. ప్రధానంగా కొత్త ఓటర్లే ఇందుకు కారణం. * ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ 58 నుంచి 67 శాతానికి పెరిగింది. రాజస్థాన్‌లో 67 శాతంనుంచి 74 శాతానికి, ఛత్తీస్‌గఢ్‌లో 71 శాతం నుంచి 74 శాతానికి, మధ్యప్రదేశ్‌లో 70 శాతం నుంచి 71 శాతానికి పెరిగింది. * దేశవ్యాప్తంగా కళాశాలల్లో ప్రస్తుతం 3 కోట్ల మంది విద్యార్థులున్నారు * ఏటా 90 లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నారు * మళ్లీ వారిలో 40 శాతం మంది యవతులున్నారు * భారత్‌లో అత్యంత పిన్న వయస్కులైన ప్రజాప్రతినిధులు 38 మంది ఉన్నారు (అయితే వారిలో 33 మంది తల్లిదండ్రులు కూడా రాజకీయాల్లో ఉన్నారు!) ఇకపై రికార్డు పోలింగే! ఈ సార్వత్రిక ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర గతంలో ఎన్నడూ లేనంతగా పెరగనుందని ఇటీవలి ‘గూగుల్’ సర్వేలో వెల్లడయ్యింది. దేశంలోని 86 నగరాల్లో విస్తరించి ఉన్న 108 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 18-35 ఏళ్ల మధ్య వయసున్న 41,000 మందిని సర్వే చేయగా, కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిలో ఏకంగా 94 శాతం మంది ఈసారి తప్పకుండా ఓటేస్తామని చెప్పారు. పార్టీకే కాకుండా అభ్యర్థికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తామని పట్టణ యువ ఓటర్లు తెలిపారు. 35 శాతం మంది పార్టీని బట్టి ఓటేస్తామని తెలిపితే, 36 శాతం మంది అభ్యర్థికే ప్రాధాన్యత ఇస్తామనడం విశేషం. ప్రధాని అభ్యర్థిని బట్టి ఓటేస్తామన్నవారు 11 శాతమే. అభ్యర్థి సమర్థుడు కావాలని, ఆ సమర్థుడు యువకుడు కూడా అయితే తమ ఓటు వారికేనని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు సంబంధించిన వెబ్సైట్లు చూసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిందని ‘గూగుల్ ఇండియా’ ఎండీ రజన్ ఆనందన్ పేర్కొన్నారు. యంగ్ ఏపీ: 18-19 మధ్య వయసు గలవారు.. -
యువత చేతుల్లోనే..
నవ తెలంగాణ నిర్మాణంలో వారిదే కీలక పాత్ర కొత్త రాష్ట్రంలో సామాజిక అనుబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఆర్థికాభివృద్ధి, రాజకీయ సుస్థిరతలను నెలకొల్పే నిర్మాణాత్మక ప్రక్రియలో తెలంగాణ ప్రజలందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత తెలంగాణ యువతపై ఉంది. తమ ఆశయాలు ప్రభుత్వ అజెండాలో, విధాన ప్రక్రియలో భాగమ య్యేలా.. వేగంగా మార్పు చెందుతున్న రాజకీయ వ్యవస్థలో తమ వాణి కూడా వినిపించేలా.. సమ్మిళిత, ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ యువత కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంది. మరో విధంగా చెప్పాలంటే, తమపై ప్రభావం చూపే వ్యవస్థాపరమైన నిర్మాణాల సమగ్ర సంస్కరణల కోసం వారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ‘ప్రెజర్ గ్రూప్’ బాధ్యతను కొనసాగించాల్సి ఉంది. ముఖ్యంగా నూతన ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడే ఆర్థికాభివృద్ధి కోసం.. తమ వాణిని వినిపించే విషయంలో, భాగస్వామ్యాన్ని కోరే విషయంలో తమ డిమాండ్లను పట్టించుకునే వ్యవస్థ కోసం పని చేయాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగావకాశాల్లో తగ్గుదల ఉన్నప్పటికీ.. ఆ ఉద్యోగాల వల్ల లభించే ఉద్యోగ భద్రత, అధిక వేతనాల వల్ల యువత ఆ ఉద్యోగాలు సంపాదించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది. అదీకాక, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న కోరిక తామేం చదవాలన్న విషయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతగా ఉండే డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారే కానీ ప్రైవేటు రంగ ఉద్యోగాలకు, స్వయం ఉపాధికి ఉపయోగ పడే డిగ్రీలు, లేదా వృత్తి నైపుణ్యాలు నేర్చుకునేందుకు వారు ప్రయత్నించడం లేదు. దాంతో మార్కెట్ అవసరాలకు.. విద్యార్థులు నేర్చుకుంటున్న నైపుణ్యాలకు మధ్య చాలా అంతరం ఉంటోంది. అందువల్ల ప్రైవేటు రంగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలనిచ్చే కోర్సులను రూపొందించే విధంగా ప్రభుత్వ విధానాలను యువత ప్రభావితం చేయాల్సి ఉంది. సంప్రదాయ విద్యా విధానంలో మార్పులు చేయడం ద్వారా కానీ, కొత్త కోర్సుల రూపకల్పన ద్వారా కానీ విద్యార్థుల వృత్తి నైపుణ్యాలను పెంచే దిశగా ప్రభుత్వంపై యువత ఒత్తిడి తేవాల్సి ఉంది. ప్రపంచీకరణ ప్రయోజనాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్యాలను పెంచుకునే విషయంపై తెలంగాణ యువత దృష్టి పెట్టాలి. తెలంగాణ యువతలోని కొన్ని వర్గాల్లో స్వయం ఉపాధిపై, సొంతంగా పరిశ్రమలు స్థాపించడంపై ఆసక్తి ఉంది. దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే విషయంలో కూడా వాస్తవం ఉంది. అయితే, సరైన రుణ సదుపాయాలు కల్పించడంలో కానీ, వ్యాపార నిర్వహణలో సహకారం విషయంలో కానీ ఉన్న అనేక అడ్డంకులు వారిని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. వ్యాపారావకాశాల్లో, ఉద్యోగ కల్పనలో అభివృద్ధికి అవకాశం ఉన్న ఈ రంగంపై యువత దృష్టి పెట్టాలి. చిన్న, మధ్య తరహ పరిశ్రమల స్థాపనకు నడుం కట్టాలి. దీనివల్ల నిరుద్యోగ సంక్షోభానికి కూడా సమాధానం లభిస్తుంది. ప్రభుత్వ సహాయంపై ఆధారపడటం కాకుండా, తమ జీవితాల్లో నిజమైన మార్పు రావడానికి యువత వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వినూత్న ఆవిష్కరణల అభివృద్ధిని నిరుద్యోగ సంక్షోభానికి పరిష్కారంగా భావించవచ్చు. నూతన అభివృద్ధిదాయక తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం యువత సానుకూల చైతన్యంతో, అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంది. ఆకలి, అభిలాష, స్ఫూర్తి, పట్టుదల, అద్భుత శక్తి కలిగిన యువత.. తెలంగాణ నవ నిర్మాణంలో తన వంతు పాత్ర కచ్చితంగా పోషించగలదు. ఆరు దశాబ్దాల పోరాటం ఫలించింది. 2014 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మనుగడ మొదలు పెట్టనుంది. ఈ నేపథ్యంలో తమ ఆశలకు, ఆశయాలకు ప్రతిరూపమైన బంగారు తెలంగాణను రూపొందించుకునేందుకు యువత పోషించాల్సిన పాత్ర, అనుసరించాల్సిన వ్యూహం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. - ప్రొఫెసర్ కె.స్టీవెన్సన్ జర్నలిజం విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం మార్పు కోసం పరితపిస్తారు ‘‘వచ్చే ఎన్నికల్లో యువతీ యువకుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 30 ఏళ్ల లోపు యువకుల్లో సహజంగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. సెంటిమెంటుతో కూడిన భావోద్వేగాల ఆధారంగా వారు ఓట్లు వేసే అవకాశముంది. తమలా ఉండే నాయకుని వైపే వారు మొగ్గుతారు. వారికి కులం, మతం పట్టవు. సమాజం కోసం పాటుపడే వారికి మాత్రమే ఓటు వేస్తారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు. - ఎ.వి.రంగనాథ్, ఎస్పీ, ఖమ్మం జిల్లా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు ‘‘యువ ఓటర్లు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. నమ్మిన పార్టీకే నిర్భయంగా ఓటేస్తారు. సుపరిపాలను, జవాబుదారీతనాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పార్టీ కంటే ముఖ్యంగా నేతను చూసి ఓటేసే అవకాశముంది. అభ్యర్థి నచ్చకపోతే ‘నోటా’ మీట నొక్కేవారిలో యువకులే అధికంగా ఉంటారు’’ - సిద్ధార్థ జైన్, కలెక్టర్, పశ్చిమగోదావరి జిల్లా ఆలోచించి ఓటేస్తారు ‘‘సాధారణ ఓటర్లు ప్రలోభాలకు గురవుతుంటారు. కానీ యువతీ యువకులు మాత్రం అలాగాక మంచీ చెడు ఆలోచిస్తారు. ఎవరు సరైన నాయకుడో పరిశీలించి ఓటేస్తారు. దీనివల్ల మనం సరైన నాయకత్వాన్ని చూసే అవకాశముంటుంది’’ - డాక్టర్ నిఖిత, ఉస్మానియా ఆసుపత్రి, హైదరాబాద్ ‘రెడీమేడ్’తో బతుకు ఛిద్రం వృత్తిపథం: స్వర్ణకారులు మేం చేసే ఆభరణాలు మగువల ఒంటిపై మెరుస్తాయి గానీ మా బతుకులు మాత్రం మెరవడం లేదు. మార్కెట్లోకి వస్తున్న రెడీమేడ్ వస్తువులు మా బతుకులను ఛిద్రం చేస్తున్నాయి. దీనికి తోడు పెద్దపెద్ద కంపెనీలు సైతం నగల దుకాణాలు ప్రారంభించడంతో మా బతుకులు దుర్భరం గా మారుతున్నాయి. ఎవరూ మా సమస్యలను పట్టించు కున్న పాపాన పోవడం లేదు. మా సామాజిక వర్గం నుంచి ఏ పార్టీలోనూ గట్టి ప్రతినిధి లేకపోవడం వల్ల మా సమ స్యలు బయటకు రాకుండా పోతున్నాయి. ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు ఆ తర్వాత మా సమస్యలు చెప్పేందుకు వెళ్తే కనీసం కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వస్తున్న రెడీమేడ్ ఆభరణాలతో మేం పోటీ పడలేక పోతున్నాం. దాంతో పూట గడవక పస్తులుండాల్సి వస్తోంది. ప్రస్తుతం బంగారం పనులు లేక వెండి పనులు చేస్తూ పొట్టపోసు కుంటున్నాం. ఒకప్పుడు పెళ్లిళ్ల సీజన్లో మా దుకాణాలు కిటకిటలాడేవి. కానీ ఇప్పుడు ఒక్కరు కూడా రావడం లేదు. సంప్రదాయ ఆభరణాలపై మోజు తగ్గిన మహిళలు తేలికపాటి మిషన్ తయారీ ఆభరణాలపై మక్కువ చూపుతున్నారు. దాంతో ఉపాధి లేక, వేరే పని చేయలేక రోడ్డన పడాల్సిన దుస్థితి దాపురించింది. ఇంత నరకం అనుభవిస్తున్నా కనీసం మా గురించి మాట్లాడేవారే కరువవడం మాకు బాధగా ఉంది. - టి.వెంకటాచారి, వనపర్తి, మహబూబ్‌నగర్ యూత్ పార్టీ తిరుగుబాటు స్వభావం గల కొందరు యువకులు అమెరికాలో ఈ పార్టీని 1967లో ప్రారంభించారు. ఈ పార్టీ కార్యకర్తలను ‘యిప్పీ’లనే వారు. అమెరికా అధ్యక్ష పదవికి 1968లో జరిగిన ఎన్నికల్లో అడవి పందిని అభ్యర్థిగా బరిలోకి దించి ఈ పార్టీ అందరి దృష్టినీ ఆకర్షించింది. పేరుకు ఇది రాజకీయ పార్టీయే అయినా, చిత్ర విచిత్ర విన్యాసాలతో మీడియాను ఆకట్టుకునే ప్రయత్నాలు, విచిత్రమైన నిరసనల ద్వారానే ప్రచారంలోకి వచ్చింది. పాతికేళ్లకే ఎమ్మెల్యే అప్పుడు ఆమె వయసు కేవలం 25 ఏళ్లు. డాక్టరు కోర్సు చదివి ప్రజా సేవ చేద్దామనుకున్నారు. అనుకోని విధంగా నేతగా మారి ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. దేశంలోనే పిన్నవయసు ఎమ్మె ల్యేగా గుర్తింపు పొందారు. ఆమే డాక్టర్ బాణోతు చంద్రావతి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికలలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తరఫున తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఖమ్మం రూరల్ మండలం పెదతండా ఆమె స్వగ్రామం. లంబాడా (ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన ఆమె కుటుంబం మొదటి నుంచి సీపీఐలో ఉంది. ఆమె తండ్రి రామ్మూర్తి ఆర్టీసీలో డిపో మేనేజర్. తాతయ్య బీక్యా నాయక్ పార్టీలో చురుకుగా పనిచేసేవారు. జిల్లా కమ్యూనిస్టు యోధుడు రజబ్ అలీకి శిష్యుడుగా గుర్తింపు పొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో వైరా ఎస్టీ వర్గానికి రిజర్వ్ కావడంతో బీక్యా నాయక్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆ కుటుంబం నుంచి ఎవరికైనా టికెట్ ఇవ్వాలని పార్టీ భావించింది. దాంతో విద్యాధికురాలు అయిన చంద్రావతికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదిం చారు. అప్పుడే ఆమె విశాఖలో మెడిసిన్ ఫైనలియర్ పూర్తి చేశారు. వెంటనే ఆమెను పార్టీ సంప్రదించడం... ఆమె అంగీకరించడం... పార్టీ అభ్యర్థిగా ఖరారు కావడం... విజయం సాధించడం.. అన్నీ చకాచకా జరిగిపోయాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ సురేశ్‌ను ఆమె కులాంతర వివాహం చేసుకున్నారు. - సాక్షి ప్రతినిధి, ఖమ్మం -
యువ మంత్ర
కిర్గిజిస్థాన్: గుణగణన కేవలం యాభై లక్షల జనాభా ఉన్న చిన్న దేశం కిర్గిజిస్థాన్. ఇక్కడ పార్టీల కంటే అభ్యర్థి గుణగణాలను చూసే ఓట్లేస్తారు. ఈ దేశంలోని యువత ఓటు వేసేందుకు చాలా ఆసక్తి చూపుతుంది. తజకిస్థాన్: పరిగణన ఈ దేశంలో యువత ప్రాతినిధ్యం ఎక్కువ. దేశ ప్రజల్లో అక్షరాస్యులు ఎక్కవే కావడంతో ఓటుపై అవగాహన ఎక్కువే. ఇక్కడి యువత రాజకీయాలను ఓ వృత్తిగా పరిగణిస్తుంది. అఫ్గానిస్థాన్: ఉద్యోగావకాశం ఇక్కడ అధ్యక్ష తరహా పాలన. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగు తాయి. యువత ఎన్నికల్లో భారీగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతుంది. ఓటరు కార్డు ఉంటే ఉద్యోగాలు సులభంగా రావడానికి అవకాశాలెక్కువ. ఇరాన్: గండిపడే అవకాశం ఈ దేశంలో నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఓటరు కార్డు పాస్‌పోర్టు తరహాలో ఉంటుంది. ప్రతి ఎన్నికల్లో ఓటు వేశాక అందులో ఓ స్టాంప్ వేస్తారు. స్టాంప్‌లు తక్కువుంటే ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. చైనా: ఆసక్తి తక్కువ అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఉపాధి కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఓటేసేందుకు ప్రజల్లో ఆసక్తి తక్కువ. రాజకీయాల్లోకి రావడానికి యువత ముందుకు రాదు. అమెరికా: యువశక్తి ఎక్కువ ఇప్పుడు అమెరికాలో యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటోంది. ఒకప్పుడు ఎన్నికల్లో యువత పాత్ర చాలా తక్కువగా ఉండేది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటివి యువతలో మార్పు తెచ్చాయి. నేపాల్: నవశక్తిదే తెగువ ఏడేళ్ల కితమే ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన నేపాల్‌లో 18 ఏళ్లు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఓటు ఉంటుంది. అక్కడ రాచరికానికి చరమగీతం పాడటంలో యువత పాత్రే కీలకం. ఓటు వేసేందుకు అందరూ ఆసక్తి చూపుతుంటారు. యెమన్: ఎనలేని హవా ఇక్కడ ఐదు దశల్లో జరిగే ఎన్నికల్లో అధ్యక్ష ఎన్నికే కీలకం. అమెరికా అధ్యక్ష ఎన్నికను పోలి ఉంటుంది. యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటుంది. ఎన్నికల్లో హామీలివ్వడం, మరచిపోవడం మామూలే. -
ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో యువ ఓటర్లతో పాటు ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లను సైతం ఓటింగ్‌లో పాల్గొనేలా చైతన్యం చేయడానికి జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జేసీ శరత్ పేర్కొన్నారు. ఓటర్లు పోలింగ్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని కోరుతూ అవగాహన, భాగస్వామ్యం కార్యక్రమ నిర్వహణపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ శరత్ మాట్లాడుతూ ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని గ్రామైక్య సంఘాలు, యువకులతో చైతన్య ర్యాలీలు నిర్వహించాలన్నారు. గతంలో ఏ పోలింగ్ బూత్‌లు లేదా గ్రామాల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైందో గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. గ్రామైక్య సంఘాల సమావేశాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకొనే అంశం చర్చనీయాంశంగా ఉండాలని తెలిపారు. ఓటు హక్కు వినియోగం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటు హక్కు ప్రాధాన్యత, పాత్రపై కళాశాల స్థాయిలోను చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. మండల, నియోజకవర్గం, డివిజన్ స్థాయిలో యువతతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో దయానంద్, జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డీఐఓ శాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలి కలెక్టరేట్: ఎన్నికల నిర్వహణ ప్రతి అధికారికి గౌరవనీయమైన బాధ్యతగా గుర్తించి సమర్థవంతంగా నిర్వహించాలని జేసీ శరత్ సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో ఎంపీడీఓలు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17న ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ప్రతి మండల రిటర్నింగ్ అధికారి సమర్థవంతంగా విధులు నిర్వహించాలని, ఎన్నికలు సజావుగా జరిగేలా బాధ్యతలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రూపొందించిన నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. ఈనెల 17 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 21న నామినేషన్ల స్కూృటినీ ఉంటుందన్నారు. నామినేషన్ల ఉపసంహరణ 24న మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుందన్నారు. ఎంపీటీసీగా నామినేషన్ వేసే ఎస్సీ,ఎస్టీ,బీసీలకు రూ.1250, ఇతరులకు రూ. 2500 డిపాజిట్ చేయాలన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులకు ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రూ.2500, ఇతరులకు రూ.5వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. నామినేషన్, స్కూృటినీ, రిటర్నింగ్ అధికారులు మాత్రమే చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఉంటేనే నామినేషన్లు స్వీకరించాలన్నారు. స్కూృటినీ సమయంలో పాటించాల్సిన నిబంధనలు రిటర్నింగ్ అధికారులకు వివరించారు. ఎలాంటి నామినేషన్లను తిరస్కరించవచ్చో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల పేర్లను నోటీసు బోర్డులో అతికించాలన్నారు. పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తెలుగు వర్ణమాల క్రమంలో తయారు చేసి గుర్తులు కేటాయించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించని, పార్టీలపై, పార్టీ అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, సంగారెడ్డి డివిజన్ పంచాయతీ అధికారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో యువత ఓటే కీలకం!
రాష్ట్ర ఓటర్లలో వారిదే పైచేయి వచ్చే ఎన్నికల్లో యువత ఓటే కీలకం 3.52 కోట్ల మంది యువ ఓటర్లు మహిళల సంఖ్య లక్షల్లో తగ్గుదల త్వరలో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓటే కీలకం కానుంది. రాష్ట్రంలో 6.23 కోట్ల మంది ఓటర్లుండగా.. అందులో 3.52 కోట్ల మంది యువతే. సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓటే కీలకం కానుంది. రాష్ట్ర ఓటర్ల సంఖ్యలో సగానికిపైగా యువ ఓటర్లే ఉన్నారు. ఇటీవల కేంద్ర ఎన్నిల కమిషన్‌తో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితా బయట ఉన్న యువతను జాబితాలోకి తీసుకురావడానికి అనేక చర్యలను చేపట్టారు. దీంతో కొత్తగా ఏకంగా 76 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులను ఓటర్లుగా నమోదు చేసేందుకు యూనివర్శిటీలు, కాలేజీల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6.23 కోట్ల మంది ఓటర్లుండగా ఇందులో ఏకంగా 3.52 కోట్ల మంది యువ ఓటర్లే ఉన్నారు. 18-19 సంవత్సరాల మధ్యగల యువతీ, యువకులు 15 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. అలాగే 20-29 సంవత్సరాల మధ్యగల 1.75 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. 30-39 సంవత్సరాల మధ్యగల 1.62 కోట్ల మంది ఓటర్లుగా ఉన్నారు. మూడు లక్షలు తగ్గిన మహిళా ఓటర్లు రాష్టంలో మహిళా ఓటర్ల సంఖ్య తగ్గిపోయి, పురుష ఓటర్ల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగానే రాష్ట్రంలో పురుష, మహిళల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంది. అదే తీరులో గత ఏడాది జనవరి తరువాత నుంచి మహిళా ఓటర్ల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. గత ఏడాది జనవరిన ప్రకటించిన ఓటర్ల జాబితాలో 2.90 కోట్ల మంది పురుష ఓటర్లుండగా మహిళా ఓటర్లు 2.92 కోట్ల మంది ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ సంఖ్య తలకిందులైంది. ఇంటింటి ఓటర్ల జాబితా తనిఖీల అనంతరం పురుష ఓటర్లు పెరిగిపోయారు. మహిళా ఓటర్లు ఏకంగా నాలుగు లక్షల మంది తగ్గిపోయారు. గత ఏడాది సెప్టెంబర్‌లో పురుష ఓటర్లు 2.99 కోట్ల మంది ఉండగా మహిళా ఓటర్లు 2.95 కోట్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ప్రచురించిన ఓటర్ల తుది జాబితాలో కూడా మహిళా ఓటర్లు సంఖ్య పురుష ఓటర్ల కన్నా తక్కువగా ఉంది. ప్రస్తుతం పురుష ఓటర్లు 3.13 కోట్ల మంది ఉండగా మహిళా ఓటర్లు 3.10 కోట్ల మంది ఉన్నారు. అంటే పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు సంఖ్య మూడు లక్షలు తక్కువగా ఉంది. 2014 ఓటర్ల తుది జాబితాలో వయస్సు వారీగా ఓటర్ల సంఖ్య ఇలా ఉంది. 18-19 15,06,182 20-29 1,75,45,213 30-39 1,62,40,970 40-49 1,19,43,442 50-59 79,66,734 60-69 46,91,449 70-79 19,95,028 80 పైన 4,96,935 మొత్తం 6,23,85,953 -
యువ ఓటర్లకు స్మార్ట్ కార్డులు
మార్చి తొలి వారంలో కొత్త ఓటర్లకు పంపిణీ ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో జారీ విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : కొత్తగా ఓటరు నమోదు చేయించుకున్న వారికి త్వరలోనే స్మార్ట్ ఓటర్ కార్డులు రానున్నాయి. మార్చి మొదటి వారంలోగా వీటిని అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. 2013 నవంబర్ 18వ తేదీ నాటికి జిల్లాలో 30,76,585 మంది ఓటర్లున్నారు. ఆ తరువాత 1,43,149 మంది ఓటర్లు పెరిగారు. 18,19 ఏళ్ల వయసున్నవారు 51 వేల మంది నమోదు చేయించుకున్నారు. వీరికి తొలిదశలో స్మార్ట్ఓటరు కార్డులు రానున్నాయి. ప్రాధాన్యక్రమంలో మిగిలినవారికి తర్వాత అందజేస్తారు. ప్రస్తుతం విశాఖ దక్షిణం, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో యువ ఓట ర్లకు కార్డులు వచ్చాయి. అధికారులు ఇప్పటికే వాటి పంపిణీ చేపట్టారు. ఈనెలాఖరుకు అన్ని నియోజకవర్గాల్లో కొత్త యువ ఓటరు కార్డులు రానున్నాయి. మార్చి తొలి వారం నాటికి కొత్త ఓటర్లందరికీ కార్డులు వస్తాయని, వెంటనే పంపిణీ చేస్తామని అధికారులంటున్నారు. పాత ఓటర్లు మాత్రం లామినేటెడ్ ఓటరు కార్డులతోనే ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంటుంది. కార్డులను ఇంటికి వచ్చి అధికారులు అందజేస్తారు. -
ఓటు నమోదు.. పట్టని యువత
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఓటర్లుగా నమోదు కావడానికి యువత ఆసక్తి చూపడం లేదు. యువతను వంద శాతం ఓటర్లుగా నమోదు చేయించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నా ఫలితం లేదు. గత నెల 31న ప్రకటించిన ఓటర్ల తుది జాబితాను పరిశీలిస్తే యువత ఓటర్లుగా నమోదయ్యేందుకు ఉత్సాహం చూపడం లేదని స్పష్టమవుతోంది. జిల్లాలో 18 ఏళ్ల పైబడిన వారు 27,11,140 మంది ఉన్నారు. ఇందులో 18, 19 ఏళ్ల మధ్య ఉండే యువత 1,55,010 మంది ఉన్నారు. వీరందరిని ఓటర్లుగా గుర్తించేందుకు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఓటర్లుగా నమోదు కానివారిలో అత్యధికంగా విద్యార్థులే ఉన్నట్లుగా గుర్తించిన అధికార యంత్రాంగం విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఓటర్లుగా నమోదయ్యేలా ప్రోత్సహించాలని కోరింది. కానీ 18, 19 ఏళ్లు యువత 71,756 మంది మాత్రమే ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. మొత్తంగా 18 ఏళ్ల పైబడిన వారు 27,11,140 మంది ఉంటే ఓటర్లు మాత్రం 29,64,172 మంది ఉన్నారు. అంటే జనాభా కంటే ఓటర్లు 2,53,032 మంది ఎక్కువగా ఉన్నారు. వీరందరినీ బోగస్ ఓటర్లుగా పరిగణిస్తారు. బోగస్ ఓటర్ల తొలగింపునకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల ముందు బోగస్ ఓటర్లను తొలగిస్తే కాంగ్రెస్ రాజకీయ పార్టీల నుంచి ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో అధికారులు బోగస్ ఓటర్ల జోలికి వెళ్లలేదనే ఆరోపణలున్నాయి. బోగస్ ఓటర్లకు నిదర్శనాలు: గోనెగండ్ల మండలం లింగందిన్నెలోని దాదాపు 10 కుటుంబాలు దశాబ్దాల క్రితం కోడుమూరుకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డాయి. ఈ కుటుంబాలకు సంబంధించి లింగందిన్నె గ్రామంలో ఇప్పటికి 45 ఓట్లు ఉండటం విశేషం. గ్రామస్తులు ఫారం-7 ద్వారా పలుసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసివేయడం లేదు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన 200 మంది కర్నూలులోని మద్దూర్‌నగర్, లక్ష్మీనగర్‌లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లుగా ఉన్నారు. వీటిపైన ఫారం-7 దరఖాస్తులు ఇచ్చినా అధికారులు ఎన్నికల సమయంలో వీటిని తొలగిస్తే అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని తొలగించ లేదు. ప్యాపిలి మండలం అలేబాదు గ్రామానికి చెందిన దాదాపు 15 కుటుంబాలు వివిధ ప్రాంతాలకు కొన్నేళ్ల క్రితమే వలస వెళ్లాయి. ఈ కుటుంబాలకు చెందిన 65 మంది ఇప్పటి గ్రామంలో ఓటర్లుగా ఉన్నారు. వీటిని తొలగించేందుకు పలుసార్లు ఫారం-7 ద్వారా ఫిర్యాదులు చేసినా అధికార యంత్రాంగం స్పందించలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బోగస్ ఓటర్లపై అధికారులు దృష్టి పెట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనాభాతో పోలిస్తే ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి వయస్సు గ్రూపు ఓటర్లు జనాభా 18-19 71,756 15,570 20-29 9,23,996 7,97,301 30-39 7,78,433 6,33,913 40-49 5,49,112 4,66,014 50-59 3,47,071 2,95,414 60-69 1,96,078 2,55,332 70-79 79,468 85,323 80 ప్లస్ 18,438 52,833 మొత్తం 29,64,352 26,01700 -
యువ చైతన్యం
తాజా ఓటరు జాబితాలో యువజనులే అధికం 40 ఏళ్లలోపు ఓటర్లు 31.14లక్షలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో యువ ఓటర్లదే హవా కనిపిస్తోంది. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వీరి తీర్పే శాసనం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం రెండ్రోజుల క్రితం ఓటర్ల తుది జాబితా ప్రకటించింది. ఇందులో జిల్లా ఓటర్ల సంఖ్య 50లక్షలు కాగా.. ఇందులో యువ ఓటర్లు 31.14లక్షలు. అంటే మొత్తం ఓటర్లలో యువ ఓటర్లు 62.27శాతం ఉన్నారు. ఈ లెక్కన ఎన్నికల్లో పోటీ చేసే నేతల భవిష్యత్తు అంతా యువ ఓటర్ల తీర్పుపైనే ఆధారపడనుంది. నేతల చూపు.. యువత వైపు.. తాజా గణాంకాలను పరిశీలిస్తే ఈ దఫా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 7.41లక్షల మంది ఓటరు జాబితాలో చేరారు. ఓటరు నమోదుపై పెరిగిన చైతన్యం.. రెండుసార్లు ఓటరు నమోదు గడువు పెంచడంతో కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ సారి కొత్తగా ఓటరు జాబితాలో చేరిన వారిలో అధికభాగం యువ ఓటర్లేనని తెలుస్తోంది. ఇందులో ముప్పై సంవత్సరాలలోపు ఉన్న ఓటర్లు 16.42లక్షలు ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి శాతం 32.85. మరోవైపు సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో నాయకగణం గెలుపోటములను విశ్లేషిస్తూ యువ ఓటర్ల వైపు దృష్టి సారిస్తున్నారు.