ఎన్నికల ప్రచారంలో ఎవరి గోల వారిదే! అభ్యర్థులు ఎడాపెడా హామీలతో ఓటర్లకు గాలం వేస్తుంటే, ఎన్నికల అధికారులేమో పోలింగ్ శాతం పెంచేందుకు ‘బ్యాండ్’ బాజా మోగిస్తున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు, ముఖ్యంగా యువ ఓటర్లను బూత్‌లకు రప్పించేందుకు హర్యానా ఎన్నికల అధికారులు వినూత్నంగా మ్యూజికల్ బ్యాండ్లను రంగంలోకి దించుతున్నారు.
ఎన్నికల థీమ్ సాంగ్స్‌తో మాంచి సంగీత విభావరుల ద్వారా వారిలో చైతన్యం పెంచే పనిలో పడ్డారు. ఈ బ్యాండ్‌లు ఓటర్లను, ముఖ్యంగా యువత ఓటేసేలా జోష్ నింపడంతో పాటు ఎన్నికలకు సంబంధించి ఓటర్లలో అవగాహన కూడా పెంచుతాయని హర్యానా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనురాగ్ అగర్వాల్ చెబుతున్నారు. పంచ్‌కులలో తొలి ఎలక్షన్ థీమ్ మ్యూజిక్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు.
తర్వాత యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రతి జిల్లాలో ఇలాంటి మ్యూజిక్ బ్యాండ్స్ అలరిస్తాయని పేర్కొన్నారు. హర్యానాలో మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కనున్నారు. ఇక్కడ 18–19 ఏళ్ల ఓటర్లు 3.65 లక్షల మంది ఉండగా 20–29 వయస్సున్న ఓటర్ల సంఖ్య 39 లక్షలు.
మ్యూజిక్ అంటే ఫిదా అయిపోయే యువతను లక్ష్యంగా చేసుకునే ఈసీ బ్యాండ్ మోగిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం ’చునావ్ కా పర్వ్ – దేశ్ కా గర్వ్‘ (ఓట్ల సంబరం – దేశానికి గర్వకారణం) నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని అగర్వాల్ చెప్పారు. ప్రజాస్వామ్యానికున్న పవర్‌ను, ఓటు ప్రాధాన్యాన్ని తెలుసుకోవడానికి యువత, ముఖ్యంగా తొలిసారి ఓటేసే యువతరం పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో హర్యానాలో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కనీసం 75 శాతాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారట!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment