హరియాణాలో సంకుల సమరం
బీజేపీ కంచుకోటల్లో కాంగ్రెస్ పాగా
ఒకట్రెండు చోట్ల జేజేపీ గట్టి పోటీ
ప్రధాన ప్రాంతాల్లో ఓటు షిఫ్టే కీలకం
హరియాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో అధికార బీజేపీ, కాంగ్రెస్ నువ్వా, నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. అయితే ఇటీవలి లోక్‌సభ ఎన్ని కల్లో మెరుగైన ప్రదర్శనతో జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికార పారీ్టకి ముచ్చెమటలే పట్టిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల ఆగ్రహం వంటివి బీజేపీని కుంగదీస్తున్నాయి. వీటిని గరిష్టంగా సొమ్ము చేసుకునే ప్రయత్నాలకు హస్తం పార్టీ పదును పెడుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతాలవారీగా చూస్తే పలు కంచుకోటల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఆ మేరకు ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు స్థానిక పార్టీ జేజేపీ పుంజుకుంటూ కమలానికి గట్టి సవాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా కీలకమైన ప్రాంతాల్లో ఈసారి ‘ఓటు షిఫ్టు’ ఎలా ఉండనుందన్నది తుది ఫలితాలను శాసించే అవకాశాలు కని్పస్తున్నాయి...
బీజేపీ నేల చూపులు...
2019 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బీజేపీ, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కీలక అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓట్ల శాతాన్ని బాగా కోల్పోయింది. ఉదాహరణకు ఫిరోజ్‌పూర్ జిర్కా, నూహ్ అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఏకంగా 16 శాతం చొప్పున ఓట్లు తగ్గాయి. మరోవైపు నారాయణ్‌గఢ్ వంటి చోట్ల పార్టీ ఓటు శాతం 14 శాతానికి పైగా పెరిగినా పెద్దగా లాభం లేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 10 స్థానాలకు పదింటినీ ఒడిసిపట్టగా తాజా ఎన్నికల్లో వాటిలో సగం సీట్లకు కోత పడింది.
కాంగ్రెస్ పైపైకి...
కాంగ్రెస్ మాత్రం ఈ లోక్‌సభ ఎన్నికల్లో పలు అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుని లాభపడింది. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి అంబాలా కంటోన్మెంట్ స్థానంలో ఏకంగా 39.8 శాతం, అంబాలా సిటీలో 36.6 శాతం చొప్పున ఓట్లు పెరిగాయి! ఓట్ల శాతం తగ్గిన అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ నష్టం జరగకపోవడం విశేషం. ఉదాహరణకు పంచ్‌కులలో 4.5 శాతం, కాల్కాలో 2 శాతం మాత్రమే ఓట్లు తగ్గాయి. దాంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేక చతికిలపడ్డ కాంగ్రెస్, తాజా ఎన్నికల్లో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది.
కాంగ్రెస్ భారీగా పుంజుకుంటున్న కీలక ప్రాంతాలు: బాగ్రీ, జాట్‌లాండ్
వీటిలో 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆదరణ పెరిగింది.
బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటున్నకంచుకోటలు: అహిర్వాల్, జీటీ రోడ్ బెల్ట్
ఈ రెండు ప్రాంతాల్లో ఇప్పటికీ బీజేపీ ఆధిపత్యమే సాగుతున్నా 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల శాతంలో తగ్గుదల నమోదైంది.
బీజేపీకి ఓట్లు బాగా తగ్గిన ప్రాంతం: బ్రజ్
అహిర్వాల్, జీటీ రోడ్ బెల్ట్ ప్రాంతాల్లో బీజేపీ పటిష్టంగానే కని్పస్తున్నా జాట్‌లాండ్, బాగ్రీల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. బ్రజ్ ప్రాంతంలో ఇరు పారీ్టలూ గట్టిగా తలపడుతున్నాయి. దాంతో అందరి దృష్టీ అక్టోబర్ 5న జరిగే పోలింగ్ మీదే ఉంది!
ప్రస్తుత పరిస్థితి...
పోలింగ్‌కు ఇంకా నెల రోజులే ఉన్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ కంచుకోటలపై పట్టు మరింత పెంచుకోవడంతో పాటు బలహీపడుతున్న ప్రాంతాల్లో నష్టాలను కట్టడి చేయడంపై ప్రధానంగా దృష్టి సారించాయి. అయితే క్రమంగా బలపడుతున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నుంచి రెండు పారీ్టలకూ గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా జాట్‌లాండ్, బాగ్రీ ప్రాంతాల్లో జేజేపీ జోరు మీదుంది. ఈ నేపథ్యంలో హరియాణాలో ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగడం ఖాయంగా కన్పిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పారీ్టలవారీ ఓటింగ్ శాతాన్ని బట్టి చూసినా అదే తేటతెల్లమవుతోంది. అదే ట్రెండు కొనసాగితే 2019లో మాదిరిగానే ఈసారి కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాట్‌లాండ్, బాగ్రీ ప్రాంతాల్లో ఎవరిది పై చేయి అవుతుందనే దాన్నిబట్టి తుది ఫలితం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
అంకెల్లో...
→ 90 అసెంబ్లీ స్థానాలకు గాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో 74 స్థానాల పరిధిలో బీజేపీ ఓట్ల శాతం కాస్తో కూస్తో పెరిగింది.
→ కానీ 16 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఓట్ల శాతం బాగా తగ్గింది.
→ దాంతో 2019 ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 5 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు బీజేపీ కోల్పోయింది.
→ మరోవైపు కాంగ్రెస్ బాగా పుంజుకుంది. పోటీ చేసిన 81 సీట్లకు గాను 68 చోట్ల ఓట్ల శాతాన్ని బాగా పెంచుకుంది.
→ దాంతో 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓట్ల శాతం కాస్త తగ్గినా ఏకంగా 5 లోక్‌సభ సీట్లు ఒడిసిపట్టగలిగింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment