న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు అనంతరం మరోసారి దేశంలో ఎన్నికల నగరా మోగింది. జమ్ముకశ్మీర్‌తోపాటు, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే ఆ రెండు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, జార్ఖండ్‌కు సైతం అసెంబ్లీ ఎన్నికల తేదీలను నేడు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి వీటి షెడ్యూల్ గురించి సీఈసీ రాజీవ్ కుమార్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని మాత్రం రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన వివరించారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతా అవసరాల దష్ట్యా మహారాష్ట్ర ఎన్నికలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. అంతేగాక..
మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో ఓటరు జాబితాను అప్‌డేట్ చేయడంలో ఆలస్యం అయ్యిందని, ఇది ఎన్నికల నిర్వహణకు కీలకమైనదిగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పితృ పక్షం, దీపావళి, గణేష్ చతుర్థి వంటి ముఖ్యమైన పండుగుల, కార్యక్రమాలు జరగాల్సి ఉందని, ఇవన్నీ కారణాలతో ఎన్నికలను వాయిదా వేయవలసి వచ్చిందన్నారు.
చివరిసారి హర్యానాకు, మహారాష్ట్రకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు జమ్ముకి ఎన్నికలు లేవు. కానీ ఈసారి వరుసగా అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి(జమ్మూ కశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ). ఎన్నికలకు సిబ్బంది అవసరాన్ని బట్టి రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం.
రాష్ట్రాల శాసనసభ పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందు వరకు ఎన్నికలను షెడ్యూల్ విడుదల చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఈ క్రమంలో ఎన్నికలకు అవసరమైన అన్ని సన్నాహాలు సమర్థవంతంగా పూర్తయిన తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహిస్తాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment