ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా అందరి దృష్టి యువతపైనే. ప్రధాని మోదీకి యువతలో క్రేజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో యువ ఓటర్ల తీర్పులో కాస్త మార్పు కనిపించింది. ఈ సారి యువ ఓటర్ల మదిలో ఏముందో తెలుసుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు.
గుజరాత్‌లో యువ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. యువతలో ప్రధాని మోదీకున్న క్రేజ్‌ను ఓట్లరూపంలో మలుచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తూ ఉంటే కాంగ్రెస్, ఆప్ నిరుద్యోగ అంశాన్ని లేవనెత్తుతున్నాయి. మోదీ ఏ సభకి వెళ్లినా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లను ఆకట్టుకునే రీతిలో ప్రసంగాలు చేస్తున్నారు. గుజరాత్ మనమే నిర్మించామన్న నినాదంతో మిలీనియల్స్‌ని ఆకర్షించే వ్యూహాలు బీజేపీ రచించింది. డిజిటల్ మీడియా ప్రచారంలో బీజేపీ ముందుంది. యూత్ కోసమే ప్రత్యేకంగా 15 యాప్‌లు రూపొందించింది. 20 వేల మందికిపైగా వర్కర్లు, 60 వేల మందికి పైగా వాలంటీర్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కేంద్ర పథకాలపై యువతలో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తోంది.
కాంగ్రెస్, ఆప్ పోటాపోటీ హామీలు
యువతపై ప్రభావం చూపించే కీలక అంశాలైన ఉద్యోగాలు, విద్య అంశాల్లో కాంగ్రెస్, ఆప్ పోటాపోటీ హామీలు గుప్పించాయి. కోవిడ్–19 ప్రభావంతో లక్షలాది మంది యువత రోడ్డునపడిన కొత్తగా ఉపాధి దొరక్క అసహనంతో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి రూ. 3వేలు ఇస్తామని హామీ ఇస్తే, కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని , అందులో 50% మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువతకి నెలకి రూ.3 వేలు భృతి ఇస్తామంటూ ఆప్ బాటలోనే కాంగ్రెస్ నడిచింది. రాష్ట్రంలో విద్య నిరుపేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల భారం మోయడం కష్టంగా ఉంటోంది. ఆప్ ఢిల్లీలో మాదిరిగా విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తామని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని హామీ ఇస్తే, కాంగ్రెస్ కూడా యధాతథంగా అవే హామీలు ఇచ్చింది. ఎన్నికలకి ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉండగా బీజేపీ ఇంకా మేనిఫెస్టో కసరత్తులో నిమగ్నమైంది.
పార్టీలు కాదు పాలసీలు ముఖ్యం
ఈ సారి యువ ఓటర్లు పార్టీలు తమకు ముఖ్యం కాదంటున్నారు. ఎవరు మంచి పాలసీలు తీసుకువస్తారో వారికే ఓటు వేస్తామని నినదిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం దాదాపుగా 3 శాతం వరకు ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల పేపర్లు లీకేజీ నిరుద్యోగ యువతలో తీవ్ర అసహనాన్ని నింపుతోంది. గత ఏడేళ్లలో ఎనిమిది సార్లు పేపర్లు లీకేజీ కావడం, బాధ్యులపై ప్రభుత్వ చర్యలు తీసుకోకపోవడం పట్ల యువత ఆగ్రహంతో ఉంది. నిరుద్యోగం కంటే విద్యారంగంలో సమస్యలపైనే యువత ఎక్కువ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘మాకు పార్టీలతో సంబంధం లేదు. ఆయా పార్టీల విధానాలే ముఖ్యం. ఈ సారి ఎన్నికల్లో విద్యా రంగం గురించి ఎవరైతే ఆలోచిస్తారో వారికే మా ఓటు. బీజేపీ ప్రభుత్వం నాణ్యమైన విద్యపై అసలు దృష్టి పెట్టడం లేదు. ఫీజుల భారం కూడా ఎక్కువే’’ అని షేట్ దామోదర్ దాస్ స్కూలు ఆఫ్ కామర్స్‌కు చెందిన విద్యార్థులు చెప్పారు. ఇన్నాళ్లూ రాష్ట్ర యువత ప్రధాని మోదీ వెంట ఉన్నారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని ఎన్నికల విశ్లేషకుడు శిరీష్ కాశీకర్ అభిప్రాయపడ్డారు.
యువ ఓటర్లు ఇలా..!
రాష్ట్రంలో మొత్తం 4.9 కోట్ల మంది ఓటర్లు ఉంటే వారిలో 40 ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్నవారు 2.35 కోట్ల మంది ఉన్నారు. అంటే దాదాపుగా సగం ఓట్లు వీరివే. అందుకే ఈ ఓటర్లు గేమ్ ఛేంజర్‌గా మారుతారన్న అభిప్రాయం ఉంది. ఆ ఓటర్లలో 30–39 ఏళ్ల మధ్య వయసున్న వారు 1.21 కోట్ల మంది ఉంటే, 20–29 వయసు మధ్య ఉన్నవారు 1.03 కోట్లు ఉన్నారు. ఇక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి నమోదు చేసుకున్న వారి సంఖ్య 11.74 లక్షలని కేంద్ర ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment