మూడు రాష్ట్రాలు. మూడు ఎన్నికలు. మూడు పార్టీలు. మూడు విభిన్న తీర్పులు. మూడు ముక్కల్లో తాజాగా ముగిసిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సారాంశమిదే. దేశం మొత్తాన్నీ తనవైపు తిప్పుకునే సమ్మోహన శక్తి ఏ పార్టీకీ లేదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి గానీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు గానీ, బీజేపీకి పోటీగా ఎదగాలని కలలుగంటున్న ఆప్‌కు గానీ అవి ఊహించుకుంటున్నంత బలం లేదని తేలిపోయింది. ఈ మూడు పార్టీలు ఎక్కడ గెలవాలన్నా ఇంకేదో వాటికి అసంకల్పితంగా సహాయపడుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓ పార్టీగా నెగ్గలేదు. మోదీ ప్రధానిగా ఉండటం వల్ల మాత్రమే రికార్డు విజయాన్ని సాధించగలిగింది. ప్రధాని గుజరాతీ కావడం వల్లే ఆ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను ఆసాంతం పక్కకు నెట్టేసి బీజేపీని అక్కున చేర్చుకున్నారు.
ఇక హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా అది సొంత చరిష్మాతో అసలే కాదు. పాలక పక్షమైన బీజేపీపై గూడుకట్టుకుని ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్‌కు ఓటేయడం ద్వారా జనం బహిర్గతం చేశారు. ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఓటర్లు ఇలాగే స్పందించడంతో ఎంసీడీపై 15 ఏళ్ల బీజేపీ పెత్తనానికి తెర పడింది. అక్కడ కాంగ్రెస్ కన్నా ఆప్ మెరుగని ఓటర్లు భావించడంతో ఎంసీడీ కేజ్రీవాల్ పార్టీ వశమైంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ గెలిచిన పార్టీలకు సొంత బలానికి మించి అదనపు బలం వ్యతిరేక ఓటు ద్వారానో, ప్రాంతీయాభిమానం రూపేణో సమకూరింది. ఆ లెక్కన వాటివి అసంపూర్ణ విజయాలు మాత్రమే! గెలవలేదు, గెలిచామనిపించాయి!! మోదీ మ్యాజిక్‌ను నమ్ముకుని 2024లో ఏకంగా 400 ఎంపీ స్థానాలు కొల్లగొడతామని కలలుగంటున్న బీజేపీ పైకి ఏం చెబుతున్నా ఈ మూడు ఎన్నికల్లో సదరు మ్యాజిక్ ఒకే రాష్ట్రానికి, అదీ ఆయన స్వరాష్ట్రానికి మాత్రమే పరిమితమైందన్న వాస్తవం మింగుడుపడటం లేదు. తన మ్యాజిక్‌కూ పరిమితులున్నాయని మోదీకి కూడా ఈసరికే అర్థమై ఉంటుంది. కలెగూరగంప లాంటి తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎవరి పరిమితులేమిటో చూద్దాం...
మోదీ.. తగ్గుతున్న మేజిక్
గుజరాత్‌ను సుదీర్ఘకాలం పాలించిన ముఖ్యమంత్రి. ప్రస్తుతం దేశాన్నేలుతున్న ప్రధాని. ప్రపంచం దృష్టిలో విశ్వగురు. అత్యధిక ప్రజాదరణ ఉన్న నేత. బీజేపీకి పెద్ద దిక్కు. ఒకరకంగా పారీ్టకి ప్రస్తుతతం అన్నీ ఆయనే! ఎంతగా అంటే... బీజేపీ అంటే మోదీ, మోదీ అంటే బీజేపీ అనేంతగా!! వరుసగా రెండోసారి ప్రధాని పదవి చేపట్టాక మోదీ ద్విగుణీకృత ఆకర్షణ శక్తితో వెలిగిపోయినా ఆ శక్తి రాను రానూ సన్నగిల్లుతున్నట్టు కన్పిస్తోంది. తాజా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అది కొట్టొచ్చినట్టు కని్పస్తుంది. ఒకవిధంగా మోదీ గ్రాఫ్ తగ్గడం నోట్ల రద్దు నిర్ణయంతోనే మొదలైంది. తర్వాత బడా కార్పొరేట్ దిగ్గజాల భారీ రుణాలను గుండుగుత్తగా మాఫీ చేయడం మొదలుకుని ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ దాకా ఆయన గ్రాఫ్ పడిపోతూనే ఉంది. మెజారిటీ లేని రాష్ట్రాల్లో బేరసారాలతో రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ వశం చేయడం సాధారణ పౌరులకు కూడా మింగుడుపడని అంశం. ఎంసీడీలోనూ, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుని ఉంటే మోదీ గాలికి తిరుగులేదని బహుశా నిరూపితమయ్యేదేమో. కానీ జరిగింది మరొకటి. గుజరాత్‌లోనూ ఎన్నడూ లేనంతటి మెజారిటీ సాధించడం కచి్చతంగా మోదీకి ప్లస్ పాయింటే. అయితే అది మోదీ స్వరాష్ట్రం కావడం వల్లే ఆ ఘనత సాధ్యమైంది. ఆయన్ను తమ రాష్ట్ర ముద్దుబిడ్డగా గుజరాత్ ఓటర్లు భావించబట్టే ఆ స్థాయిలో అందలమెక్కించారు. మోదీ కాక మరో రాష్ట్ర నేత ఎవరైనా ప్రధానిగా ఉన్నట్టయితే గుజరాత్ ఫలితం మరోలా ఉండేదేమో! ఊహాజనితమే అయినా ఇది చర్చనీయాంశమే! గుజరాత్‌లో గెలిచింది నిస్సందేహంగా మోదీ మాత్రమే. బీజేపీ కేవలం ఆయన వెంట నడిచింది. అంతే! అదే సమయంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు మోదీ కూడా ఓడారన్నది కాదనలేని వాస్తవం!
బీజేపీ.. మోదీపైనే భారం
కేంద్రంలో అధికారంలో ఉన్న పారీ్టగా అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగరేయాలని ఉవి్వళ్లూరుతున్న బీజేపీకి హిమాచల్ ఓటమి మింగుడుపడనిదే. ఈ ఫలితంతో బీజేపీ అధికారం 16 రాష్ట్రాలకే పరిమితమైంది. వీటిలో సొంతంగా 10 రాష్ట్రాల్లో, సంకీర్ణంతో మిగతా ఆరుచోట్ల అధికారంలో ఉంది. డబుల్ ఇంజన్ (కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం) నినాదంతో దేశాన్ని హోరెత్తిస్తున్న బీజేపీకి హిమాచల్‌లో ఒక ఇంజన్ పట్టాలు తప్పడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అక్కడ కేవలం ఒక శాతం ఓటు తేడాతోనే ఓడామని మోదీ సరిపుచ్చుకునే ప్రయత్నం చేసినా ఓటమి ఓటమే కదా! పైగా హిమాచల్‌లో కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం కూడా చేయకపోయినా విజయం ఆ పార్టీనే వరించడం బీజేపీపై అక్కడి ప్రజలకున్న వ్యతిరేకతకు అద్దం పడుతుంది. స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన అగి్నపథ్, వన్ ర్యాంక్–వన్ పెన్షన్ పథకం వంటివాటిపై బీజేపీ దృష్టి పెట్టకపోవడం, కేవలం మోదీ మ్యాజిక్ మీదే మితిమీరిన నమ్మకం పెట్టుకోవడం ఓటమికి దారితీశాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జరిగిన ఒక లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు అసెంబ్లీ సీట్లలో మాత్రమే నెగ్గింది. ఆ పార్టీ ప్రాభవం తగ్గుతోందంనేందుకు ఇదీ సూచికే. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ, కతౌలీ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడటం గమనార్హం. మెయిన్‌పురితో సమాజ్‌వాదీ అభ్యరి్థ, పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఏకంగా 2.88 లక్షల ఓట్ల మెజారిటీ సాధించడం మరో విశేషం. 2024 లోక్‌సభ ఎన్నికల్లోగా బీజేపీ సంస్థాగతంగా మరింత పట్టు సాధించకుంటే పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా తయారవడం ఖాయం. లేదంటే మోదీనే నమ్ముకుని గుజరాత్ వంటి విజయాల కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది.
కాంగ్రెస్... అదే అయోమయం
ఈ పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హిమాచల్‌లో గట్టెక్కినా అది సొంతం బలంతో కాదని కాంగ్రెస్‌కూ తెలుసు. గుజరాత్‌లో, ఢిల్లీ కార్పొరేషన్లో పార్టీ కనీస స్థాయి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఆప్ దెబ్బకు గుజరాత్‌లో ముక్కోణపు పోరులో పూర్తిగా మునిగింది. కోలుకునే పరిస్థితి సుదూరంలోనూ కని్పంచడం లేదు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదు. గుజరాత్‌పైనే దృష్టి పెట్టిన కాంగ్రెస్, హిమాచల్‌లో సరైన ప్రచారం కూడా చేయలేదు. ప్రియాంకా గాంధీ అదపాదడపా పర్యటనలతో మమ అనిపించారు. రాహుల్ ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయినా బీజేపీ వైఫల్యానికి తోడు, ఆప్ ప్రభావం చూపలేకపోవడంతో కాంగ్రెస్‌ను విజయం తనంతతానుగా వరించింది. కష్టించి సాధించినది కాదు.
ఆప్... అప్పుడే కాదు!
బీజేపీకి కంచుకోట అయిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను బద్దలు కొట్టి 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెర దించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చతికిలపడింది. భారీ పథకాలు, తాయిలాలతో అట్టహాసంగా రాష్ట్ర ఎన్నికల బరిలో దిగిన ఆప్.. ‘పహలే ఆప్’ అంటూ ఏమాత్రం పోటీనివ్వకుండా బీజేపీకి దారిచి్చంది! పైగా కాంగ్రెస్ ఓట్లను భారీగా చీల్చి బీజేపీకి రికార్డు సంఖ్యలో స్థానాలు కట్టబెట్టింది. గుజరాత్‌లో సాధించిన ఓట్ల శాతం సాయంతో జాతీయ పార్టీ గుర్తింపు దక్కనుండటమే ఆప్‌కు ఏకైక ఊరట. బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనంటూ పదేపదే చీపురు ఝళిపిస్తున్న ఆప్ నిజంగా ఆ స్థాయికి చేరాలంటే మరింత సమయం తప్పదని ఈ ఫలితాలు తేల్చి చెప్పాయి. ఇక హిమాచల్ ఎన్నికల్లోనైతే ఆప్ సోదీలో కూడా లేకుండానే పోయింది. ఓడినా అనుభవం దక్కిందని తృప్తి పడటమే ఆ పారీ్టకి చివరికి మిగిలింది!
- ఎస్.రాజమహేంద్రారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment