గుజరాత్ మొదటి దశ పోలింగ్ ముగిసింది. రెండో దశలో ప్రచారం ఉధృతంగా సాగుతోంది. గుజరాత్ మోడల్ పాలనతో సెంట్రల్ గుజరాత్ అభివృద్ధిలో దూసుకుపోయింది. అధికార పార్టీకి అడ్డాగా మారింది. ఉత్తర గుజరాత్ పలు రకాల సమస్యలతో బీజేపీకి సవాళ్లు విసురుతోంది. మధ్య గుజరాత్‌లో కాంగ్రెస్ హవా తగ్గిపోతే, ఉత్తరాన ఆప్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో రెండు ప్రాంతాల్లోనూ రెండు పార్టీల మధ్యే పోరు నెలకొంది. ఈ దశలో ఏ పార్టీ పట్టు బిగిస్తుంది ?
గుజరాత్ రెండో దశ పోలింగ్ ఈ నెల 5న మొత్తం 93 స్థానాలకు జరగనుంది. మధ్య గుజరాత్‌లో 61 అసెంబ్లీ స్థానాలకు, ఉత్తర గుజరాత్‌లో 32 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. మధ్య గుజరాత్‌లో ఆదివాసీలు, నగరీకరణ జరిగిన ప్రాంతాలతో నిండి ఉంది. మొత్తం ఎనిమిది జిల్లాల్లో అహ్మదాబాద్, వడోదరా, ఖేదాలో కొన్ని ప్రాంతాలు, ఎస్టీల ప్రాబల్యం కగిలిన పంచ్‌మహల్ జిల్లాల్లో బీజేపికి పట్టు ఉంటే, మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.
ఎస్టీ ప్రాంతాల్లో ఎదురొడ్డుతున్న కాంగ్రెస్
గిరిజన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది.ఈ సారి ఎన్నికలకి కాస్త ముందు కాంగ్రెస్‌లో ప్రముఖ ఎస్టీ నాయకుడు, ఛోటా ఉదేపూర్ నియోజకవర్గం నుంచి 10సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్‌సిన్హ్ రథ్వా బీజేపీలో చేరడం ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా మారింది. మోహన్ సిన్హాకున్న మంచిపేరు వల్ల మహిసాగర్, దాహోద్ జిల్లాల్లో ఓటర్లు బీజేపీకి మద్దతుగా ఉండే అవకాశాలున్నాయని బరోడా యూనివర్సిటీ ప్రొఫెసర్ అమిత్ ధోలకియా అభిప్రాయపడ్డారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న క్షత్రియ, హరిజన, ఆదివాసీ, ముస్లిం (ఖామ్) సామాజిక వర్గం ఓట్లు కూడా ఈ సారి గంపగుత్తగా ఆ పార్టీకి వచ్చే అవకాశాల్లేవని, ఆ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుడు రవీంద్ర త్రివేది వ్యాఖ్యానించారు.ఈ ప్రాంతంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ వైపే ఓటర్లు చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
గుజరాత్ మోడల్ పాలనతో బాగా లబ్ధి పొందిన పట్టణాలు, నగరాల్లో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. ముస్లిం ఓట్లు కాంగ్రెస్, ఆప్ మధ్య చీలి బీజేపీ లాభపడే అవకాశాలైతే ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో కాంగ్రెస్ కంటే ఆప్ పట్టు పెంచుకుంది. మొత్తమ్మీద మధ్య గుజరాత్ మరోసారి బీజేపీకే జై కొట్టే అవకాశాలున్నాయి.
ఉత్తరాన బీజేపీకి సవాళ్లు
ఈ ప్రాంతంలో చిన్ని చిన్న పట్టణాలు ఎక్కువగా ఉన్నాయి. చిరు వ్యాపారులు కరోనాతో భారీగా నష్టపోవడంతో పాటు నిరుద్యోగం అమాంతంగా పెరిగిపోయింది. అధిక ధరలతో సామాన్యులకు బతుకు భారంగా మారింది. ఇవన్నీ బీజేపీకి సవాళ్లుగా మారాయి. ఈ ప్రాంతంలో సామాజిక సమీకరణలు కూడా బీజేపీకి అంతగా అనుకూలంగా లేవు. ఠాకూర్ల ప్రాబల్యం అధికం. వీరంతా మొదట్నుంచి కాంగ్రెస్‌కే మద్దతుగా ఉన్నారు.
పటేళ్లు, ఠాకూర్లు చెరో పార్టీకి మద్దతునివ్వడం ఆనవాయితీగా మారిపోయింది. దళితులు, ముస్లింలు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారు మొదట్నుంచి బీజేపీ వెంట లేకపోవడం పార్టీకి ఆందోళన కలిగించే అంశమే. ఈ ప్రాంతం ఉద్యమాల ఖిల్లాగా కూడా పేరు పడింది. హార్దిక్ పటేల్ నేతృత్వంలో పటీదార్ ఆందోళన, అల్పేశ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఠాకూర్ల ఆందోళన, జిగ్నేష్ మేవానీ నేతృత్వంలో దళితుల ఆందోళనలు ఇక్కడ ఉధృతంగా జరిగాయి. అధికార పార్టీపై ఆ ఉద్యమాల ప్రభావం ఇంకా ఉండడం కమలనాథుల్ని కలవరపెడుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment