అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో, తుది దశ ప్రచారానికి శనివారం తెరపడింది. రెండో దశలో 93 అసెంబ్లీ స్థానాలకు 5న పోలింగ్ జరగనుంది. 833 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అయితే ప్రచారంలో బీజేపీ, ఆప్‌తో కాంగ్రెస్ పోటీ పడలేకపోయింది. అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఒక్కరే ప్రచార భారం మోశారు.
మోదీ.. అన్నీ తానై
రాష్ట్రంలో బీజేపీ 27 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించే బాధ్యతను ప్రధాని మోదీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. 31 ర్యాలీలు, 3 నగరాల్లో అతి పెద్ద రోడ్ షోలతో సుడిగాలి ప్రచారం చేశారు. అహ్మదాబాద్‌లో గురువారం ఆయన రోడ్ షో దేశంలోనే అతి పెద్దదిగా చరిత్ర సృష్టించింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాలను మీదుగా 50 కి.మీ. వరకు ఈ రోడ్ షో సాగింది. నాలుగు గంటల సేపు సాగిన ఈ రోడ్ షోకి జనం పోటెత్తారు.
రోడ్డుకిరువైపులా కిలో మీటర్ల మేర 10 లక్షల మంది వరకు నిల్చొని మోదీకి జన నీరాజనం సమర్పించారని బీజేపీ చెప్పుకుంటోంది. ప్రధాని ఏ సభకు వెళ్లినా మోదీ, మోదీ, మోదీ అంటూ యువత ఉత్సాహంగా కేకలు వేయడం కనిపించింది. ప్రచారంలో మోదీ ప్రధానంగా గుజరాత్ ఆత్మగౌరవ నినాదాన్ని, తమ పార్టీ చేస్తున్న అభివృద్ధినే ప్రస్తావించారు. అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎక్కడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. ఆప్ పేరు తీసుకురాకుండా ఆ పార్టీ ఇచ్చే ఉచిత పథకాలను మోదీ ఎక్కడికక్కడ ఎండగట్టారు.
ఉచితానికి, సంక్షేమానికి మధ్య తేడా తెలుసుకోవాలంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చురకలంటించారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ప్రచారం నిర్వహించారు. ఇక ఆప్ తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. 30కిపైగా ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొని ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. ప్రతీ చోటా ఉచిత విద్యుత్ పథకాన్నే ఎక్కువగా ప్రస్తావించారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఎదుగుతామని ఆప్ ధీమాగా ఉంది. కాగా గుజరాత్ ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి.
అది కాంగ్రెస్ ఢూండో యాత్ర: స్మృతీ
భారత్ జోడో యాత్ర నిజానికి కాంగ్రెస్ ఢూండో (అన్వేషణ) యాత్ర అంటూ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో శనివారం బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. 8న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలొచ్చాక కాంగ్రెస్ ఢూండో యాత్ర మొదలవుతుందని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment