గుజరాత్ అంటే మోదీ. మోదీ అంటే గుజరాత్. రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా ఇదే మాట వినిపిస్తోంది. ఆయన పేరే ఓ బ్రాండ్‌గా మారి బీజేపీకి అప్రతిహతంగా అధికారాన్ని అందిస్తోంది. కేజ్రీవాల్ తదితరుల సభల్లోనూ జనం మోదీ నామజపం చేయడం రాష్ట్రంలో ఆయన కరిష్మాకు నిదర్శనం. మరి ఈసారేం జరగనుంది? త్రిముఖ పోరులో మోదీ ఇమేజీ బీజేపీని మరోసారి గట్టెక్కించగలదా? సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న గుజరాతీయులు మళ్లీ మోదీ మంత్రమే జపిస్తారా?
గుజరాత్‌లో 27 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, కాంగ్రెస్, ఆప్ పోటాపోటీ ఉచిత హామీలు కమలనాథుల్ని కలవరపెడుతున్నాయి. కరోనా తాలూకు ఆర్థిక, సామాజిక సమస్యల నుంచి రాష్ట్రం ఇంకా బయట పడలేదు. రాష్ట్రంలో బీజేపీకి బలమైన నాయకులెవరూ లేకపోవడంతో ఈసారి కూడా గెలిపించే బాధ్యత మోదీ భుజస్కంధాలపైనే పడింది. ‘ఈ గుజరాత్ నేనే నిర్మించాను’ నినాదంతో ఎన్నికల్ని ఆయన తన చుట్టూ తిప్పుకుంటున్నారు. డిసెంబర్ 1, 5 రెండు దశల్లో జరిగే పోలింగ్‌కు ఓటర్ స్లిప్పులను స్వయంగా ఇవ్వడానికి మోదీ సన్నాహాలు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 28, 29ల్లో, డిసెంబర్ 2–3ల్లో ఆయన ఇంటింటికి వెళ్లి వాటిని పంచుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బ్రహ్మాస్త్రంగా కమలనాథులు భావిస్తున్నారు.
ఇమేజ్ లేని సీఎంలు
మోదీ ప్రధాని అయ్యాక గుజరాత్ సీఎంలుగా చేసిన ఎవరికీ ప్రజల్లో పేరు లేదు. ఆనందీ బెన్ పటేల్ హయాంలో పటీదార్ల ఉద్యమం ఎగిసిపడడం, పటీదార్ అయ్యుండీ ఆమె ఉద్యమాన్ని అణిచే చర్యలకు దిగి సొంత వర్గానికే దూరమయ్యారు. దాంతో విజయ్ రూపానీని సీఎంను చేశారు. కరోనాను ఎదుర్కోలేక ఆయనా దిగిపోయారు. ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్‌ను రాష్టంలోనే చాలామంది గుర్తు పట్టరంటే అతిశయోక్తి కాదు.
సన్నాఫ్ గుజరాత్
మోదీ ఈసారి ప్రచారంలో ప్రజలతో వ్యక్తిగత భావోద్వేగ బంధానికి ప్రాధాన్యమిస్తున్నారు. ‘నేను మీ కొడుకును. ఆశీర్వదించండి’ అంటూ ఓట్లడుగుతున్నారు. గత ఎన్నికల్లో అధికార వ్యతిరేకత, పటీదార్ల ఉద్యమ ప్రభావం, జీఎస్టీ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ బీజేపీ 99 స్థానాలతో అధికారం నిలుపుకుందంటే కేవలం మోదీ కార్డుతోనే. అందుకే ఈసారీ హిందూత్వ, డబుల్ ఇంజన్ నినాదాలతో పాటు ‘ఇది నేను నిర్మించిన గుజరాత్’, ‘ఇవి గతిని మార్చే ఎన్నికలు’ అంటూ మోదీ ప్రచారం చేస్తున్నారు. సామూహిక వివాహాల్లో పాల్గొంటూ, ఆదివాసీల్లో కలిసిపోతూ ప్రచారం చేస్తున్నారు.
కీలక సవాళ్లు
మోదీకి ఈసారి సొంత పార్టీ నుంచే అసలు పరీక్ష ఎదురవుతోంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన 17 మందికి టికెట్లివ్వడంతో పార్టీలో అసమ్మతి మొదలైంది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ ఇప్పుడు ఆ పార్టీ వారినే ఇలా అక్కున చేర్చుకోవడమేంటని రెబెల్ నేతలంటున్నారు. కరోనా, చమురు ధరలు, ద్రవ్యోల్బణం తదితరాలతో మోదీ ఇమేజ్ తగ్గుతూ వస్తోంది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తదుపరి ప్రధానిగా మోదీకి 53% మందే ఓటేశారు. ఒకప్పుడిది 70 శాతానికి పైగా ఉండేది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 2002లో 127 నెగ్గిన బీజేపీ 2007లో 117, 2012లో 116 సీట్లకుకు పరిమితమైంది. 2017లో 99తో సరిపెట్టుకుంది! ఈ పరిస్థితుల్లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హ్యాట్రిక్ కొట్టాలంటే గుజరాత్ ఎన్నికల్లో నెగ్గితీరాలి. అందుకే ఈ ఎన్నికలు ఆయనకు అగ్నిపరీక్షగా మారాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Gujarat Assembly Elections 2022: బ్రాండ్ మోదీకే పరీక్ష!
Published Sun, Nov 27 2022 5:10 AM | Last Updated on Sun, Nov 27 2022 9:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment