హిమాచల్‌ప్రదేశ్‌లో ఖాతా తెరవలేకపోయింది. గుజరాత్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆప్ కలలు కంది. కానీ ఆ కలలన్నీ కల్లలైపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఊడవలేకపోయిన చీపురు మూలకూర్చుండిపోయింది. గుజరాత్ ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా రావడంతో ఆ పార్టీకి కాస్త బలం వచ్చినట్టయింది.
ఈ ఏడాది మొదట్లో జరిగిన పంజాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎరగవేయడంతో గుజరాత్‌లో కూడా ఆ పార్టీ ప్రబల శక్తిగా ఎదుగుతుందని అందరూ భావించారు. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా తన ఉనికిని చాటుతుందని అనుకున్నారు. కానీ రెండు రాష్ట్రాల్లోనూ ఆప్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఆప్‌కి జాతీయ పార్టీ హోదా దక్కడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రెండేళ్ల ముందు నుంచి రాష్ట్రంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ గుజరాత్‌పై దృష్టి పెట్టడం, సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ సత్తా చాటడంతో తొలిసారిగా రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది.
అయితే మొదట్నుంచి ఆప్ కాంగ్రెస్‌నే విమర్శిస్తూ ఆ పార్టీ ఓటు బ్యాంకునే లక్ష్యంగా చేసుకోవడంతో నామమాత్రంగానే మిగిలిపోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఆమ్ మొదట్లో విస్తృతంగా తిరిగినప్పటికీ అవినీతి ఆరోపణల కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్‌తో ఆప్ ఆశలు వదిలేసుకుంది. గుజరాత్‌లో వివిధ మీడియా సంస్థల పోల్స్ కూడా ఆప్‌కి 20 శాతం వరకు ఓట్లు వస్తాయని అంచనా వేశాయి. కానీ ప్రధాని నరేంద్ర మోదీకి సొంత గడ్డ మీదనున్న క్రేజ్ ముందు కేజ్రివాల్ నిలబడలేకపోయారు.
చదవండి: (ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం)
జాతీయ పార్టీ హోదా
‘‘గుజరాత్ ప్రజలు మాకు జాతీయ పార్టీ హోదా కట్టబెట్టారు. ఇప్పటివరకు దేశంలో కొన్ని పార్టీలకు మాత్రమే ఆ హోదా ఉంది. నిజంగా ఇది మాకో అద్భుతమైన విజయం’’.. గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అరవింద్ కేజ్రివాల్ పంపిన సందేశమిది. జాతీయ పార్టీకి హోదా రావడానికున్న షరతుల్లో ఒకటైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలో 6శాతం ఓట్లు, కనీసం రెండు సీట్లలో గెలిచి ఉండాలి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆప్ గోవాలో 6శాతం ఓట్లు, 2 సీట్లను సాధించింది. ఇప్పుడు గుజరాత్‌లో అయిదు సీట్లను గెలుచుకొని, 13శాతం ఓట్లతో జాతీయ పార్టీ హోదాని దక్కించుకుంది.
దేశంలో ఉన్న జాతీయ పార్టీలివే..
మన దేశంలో ఇప్పటివరకు ఎనిమిది మాత్రమే జాతీయ పార్టీలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీకి మాత్రమే ఈ గుర్తింపు ఉంది. ఆప్‌ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తిస్తే తొమ్మిదో జాతీయ పారీ్టగా అవతరిస్తుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయ హోదాతో వచ్చే మార్పులేంటి ?
►పార్టీకి జాతీయ హోదా వస్తే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే ఎన్నికల గుర్తు లభిస్తుంది
►సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆకాశవాణి, దూరదర్శన్‌లో బ్రాడ్‌కాస్ట్, టెలికాస్ట్ బాండ్స్ లభిస్తాయి
►40 మంది స్టార్ క్యాంపైనర్లు ప్రచారంలో పాల్గొనచ్చు. వారికయ్యే ఖర్చులు అభ్యర్థులకుండే ఖర్చుల పరిమితి నుంచి మినహాయిస్తారు.
►పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి రాష్ట్రాల్లో ప్రభుత్వ జాగాలు లభిస్తాయి.
►అభ్యర్థులు నామినేషన్ వేసినప్పుడు ఒకరే ప్రొపోజర్ ఉంటే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment