గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. బీజేపీ, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వాలనుకున్న ఆప్ ఓటర్లను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్లు మొండిచేయి చూపారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా గుజరాత్ ఎన్నికల బరిలో దిగిన ఆప్ అత్యంత దారుణంగా చతికిల పడింది. అన్ని స్థానాల్లో బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేక పోయింది.
ఖాతా తెరవని ఆప్
182 స్థానాల్లో కేవలం 4 చోట్లా మాత్రమే గెలుపొందింది. 12 శాతం ఓట్లను సాధించి మూడో స్థానానికి పరిమితం అయ్యింది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ తుడిచిపెట్టుకుపోయింది. కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గుజరాత్‌లో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పార్టీ కీలక నేతలంతా భారీగా ప్రచారం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. బీజేపీ దూకుడు ముందు ఆప్ వ్యూహాలేవీ ఫలించలేదు.
సీఎం అభ్యర్థి ఓటమి
దీనికి తోడు గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గడ్వీకి కూడా ఓటమి తప్పలేదు. ఖంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి అయర్ ములుభాయ్ హర్దాస్‌భాయ్ బేరాపై 19,000 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. ఇసుదాన్ గాధ్వి 53,583 ఓట్లు రాగా, బేరాకు 71,345 ఓట్లు వచ్చాయి. అంతేగాక గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా కూడా ఓటమి పాలయ్యారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి వినోద్ మోరాదియా విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో ఆప్ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది.
కాంగ్రెస్ ఓట్లకు గండి
అయితే గుజరాత్‌లో ఓట్లను చీల్చడంలో మాత్రం గట్టి పాత్ర పోషించింది. కాంగ్రెస్ ఓట్లకు ఆప్ గండి కొట్టింది. గత ఎన్నికల్లో 41 శాతం ఓటింగ్ సాధించిన కాంగ్రెస్ ఈ సారి 27 శాతానికి పడిపోయింది. ఒకవేళ ఆప్ పోటీలో లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా బీజేపీకి గట్టిపోటి ఇచ్చి ఇంకొన్ని స్థానాలను గెలుచుకునేదేమో! మొత్తానికి ఈ ఏడాది పంజాబ్ అసెంబ్లీ గెలుపుతో ఊపు మీదున్న ఆప్‌కు గుజరాత్ ఎన్నికలు భారీ షాక్‌నిచ్చాయి. అసలు హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ పోటీలో ఉందా అనే స్థితికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment