2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్ మోడల్ గురించి నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేసి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు అదే తరహాలో నడుస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో ఢిల్లీ మోడల్ అనే ప్రచారంతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ముక్కోణపు పోటీకి తెరతీశారు. ఇంతకీ ఆమ్ ఆద్మీ పార్టీ కింగా? కింగ్‌మేకరా? రానున్న ఎన్నికల్లో ఏం జరగబోతోంది?
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ఎన్నికల్ని స్వయంగా తన భుజస్కంధాలపై మోస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దిగాలని నిర్ణయించిన దగ్గర్నుంచి వారానికి ఒకసారి రాష్ట్రానికి వస్తూ రోడ్డు షోలు సమావేశాలు నిర్వహిన్నారు. ఆప్‌లో మరో నేత సందీప్ పాఠక్ బూత్ మేనేజ్‌మెంట్, సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటే నిరంతరం సీట్ల వారీగా అంతర్గత సర్వేలు చేయిస్తూ వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళుతున్నారు.
సంక్షేమ మంత్రం
కొత్తగా గుజరాత్ గోదాలోకి దిగిన పార్టీ కావడంతో ప్రజల్ని తమవైపు ఆకర్షించడానికి ఆప్ సంక్షేమ మంత్రాన్ని జపిస్తోంది. ఢిల్లీ మోడల్ పరిపాలనను చూపిస్తూ విద్య, ఆరోగ్య రంగ రూపురేఖల్ని మార్చేస్తామని చెబుతోంది. గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,, నిరుద్యోగ భృతి నెలకి రూ.3 వేలు, 18 ఏళ్ల వయసు పైబడిన మహిళలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం, కొత్తగా ప్రాక్టీసు మొదలు పెట్టే లాయర్లకి స్టైఫండ్ , ప్రతీ సర్పంచ్‌కి నెలకి రూ.10 వేల వేతనం ఇలా ఒక్కోసారి ఒక్కో హామీని ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.
బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాకుండా ఆప్ అవతరించినా అది పార్టీ సాధించే అతి పెద్ద విజయమని భావిస్తోంది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఆప్ రాకతో కాంగ్రెస్ భారీగా నష్టపోవడం చూశాం. గుజరాత్‌లో కూడా అదే జరుగుతుందన్న అంచనాలున్నాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత హామీలు ఇచ్చే వలలో పడవద్దంటూ ప్రచారం చేస్తున్నారు. అ వలలో పడితే స్వయంసృమద్ధి సాధించి గుజరాత్ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోలేమంటూ కేజ్రీవాల్‌కి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరి ఓట్లను చీలుస్తుంది ?
ఇప్పటివరకు నిర్వహించిన వివిధ సర్వేలు ఆప్ 22% వరకు ఓటు షేరు సాధిస్తుందని చెబుతున్నాయి. కాంగ్రెస్‌కి అండదండగా ఉండే ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు ఆప్ ఉచిత హామీలతో ఆప్ వైపు మొగ్గు చూపించవచ్చు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు 22% ఉంటే, ఒబీసీలు 40% వరకు ఉన్నారు. ఈ ఓటు బ్యాంకులో అత్యధికం ఆప్‌కు మళ్లిపోయే అవకాశాలున్నాయి. ఢిల్లీ మోడల్ పాలనపై ఆసక్తి ఉండే అర్బన్ ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవడానికి ఆప్ ప్రయత్నిస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్య రంగాల్లో ఢిల్లీలో వచ్చిన మార్పుల్ని ఆప్ వివరిస్తోంది. గత 20 ఏళ్లుగా వరసపెట్టి బీజేపీ విజయాలు సాధిస్తున్న 66 పట్టణ స్థానాలపై ఆప్ ఎక్కువగా దృష్టి సారించింది. 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏడు కార్పొరేషన్లలో కలిపి ఆప్ 14% ఓటు షేరు సాధించింది. రాజ్‌కోట్‌లో 19%, అహ్మదాబాద్‌లో 20%, సూరత్‌లో 28% ఓటు షేరు సాధించిన ఆత్మవిశ్వాసంతో కనీసం కింగ్ మేకర్‌గా నిలుస్తామని ఆప్ ధీమాగా ఉంది.
అనుకూలం..
- ఆప్ పరిపాలన కొత్తగా ఉండబోతోందని దిగువ మధ్యతరగతి ప్రజల్లో బలమైన అభిప్రాయం ఏర్పడడం
- ఆప్ ఇచ్చే ఉచిత పథకాల పట్ల వివిధ వర్గాల ప్రజల్లో ఆకర్షణ
- ఢిల్లీ మోడల్ పాలన చూపించి ఓటర్లను తమ వైపు తిప్పుకునే నేర్పరితనం
- రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి విస్తృతంగా ప్రచారం చేయడం
ప్రతికూలం..
- క్షేత్రస్థాయిలో పార్టీకి బలం లేదు, ప్రజాదరణ కలిగిన నాయకులెవరూ ఆప్‌లో చేరలేదు
- గుజరాత్ రాజకీయాలపై సీనియర్ నాయకులకు అవగాహన లేమి
- ఎన్నికల బరిలో మొదటిసారి దిగడంతో నిర్ధారంగా ఓటు బ్యాంకు లేదు.
- బీజేపీకి బీ టీమ్ ఆప్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న విస్తృత ప్రచారం
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment