ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి భారీ ర్యాలీ అనేక విధాల ప్రత్యేకమైనది. ‘లోక్‌తంత్ర్ బచావో’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) పేరిట సాగిన ఈ ర్యాలీకి నేతలే కాదు... ప్రజలూ పెద్దయెత్తున తరలిరావడం విశేషమైతే, ప్రతిపక్ష కూటమిని కొట్టి పారేస్తున్న విమర్శకులకు ఇది ఒక కనువిప్పు. అలాగే, క్రికెట్ లాగా ఈ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారంటూ ర్యాలీలో చేసిన ఆరోపణ ఓ సంచలనం.
కీలక ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయడం, పన్నుల భూతాన్ని పైకి తీసి పార్టీలను వేధించడం వగైరాలతో ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు లేకుండా చేస్తున్నారన్న వాదన కూడా జనసామాన్యంలోకి నెమ్మదిగా చొచ్చుకుపోతోంది. ఎన్నికల్లో తొలి ఓటు పడడానికి మరో మూడు వారాలైనా లేని పరిస్థితుల్లో... ప్రతిపక్ష కూటమి మొన్న జరిపిన మూడో ర్యాలీ అందరి దృష్టినీ ఆకర్షించింది అందుకే.
మార్చి 3న పాట్నాలో ‘జన చేతన ర్యాలీ’, మార్చి 17న ముంబయ్‌లో రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ తర్వాత ఇది మూడోది. తాజా సభను ఎన్నికల ముందు సహజంగా జరిపే అనేక ర్యాలీల్లో ఒకటిగా చూడలేం. ఎన్నికలనగానే సర్వసాధారణంగా ఉపాధి అవకాశాలు, ధరల పెరుగు దల, ఇటీవల కులగణన, విభిన్న వర్గాల మధ్య సామరస్యం లాంటి అంశాలను ప్రతిపక్షాలు భుజాని కెత్తుకుంటాయి. కానీ, ప్రతిపక్షం ఈసారి ఏకంగా ఈ ఎన్నికలను జరిపే విధానంపైనే సందేహాలు వ్యక్తం చేయడం అసాధారణం.
కేంద్రంలో గద్దె మీద ఉన్న బీజేపీ, దాని పెద్దలు ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖ వగైరాలను గుప్పెట్లో పెట్టుకొని ఎన్నికల్లో ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షాలకు చెందిన ఇద్దరు సీఎంల అరెస్టు సహా పలు ఘటనల్ని కూటమి అందుకు ఉదాహరణగా చూపిస్తోంది. అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకా శాల్ని కల్పించాల్సిన ఎన్నికల వాతావరణాన్ని ఇలా నాశనం చేశారంటోంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, దుర్నీతి లేకుండా జరిగేలా చూడాలనే వాదనను బలంగా ముందుకు తెచ్చింది.
సోరెన్, కేజ్రీవాల్‌ల సతీమణులు సహా మొత్తం 17 పార్టీలు పాల్గొన్న ర్యాలీ ఇది. కేవలం కేజ్రీవాల్‌కు సంఘీభావంగా కొలువు దీరారనే అపవాదు రాకుండా ఉండేందుకు వేదిక ముందున్న కటకటాల్లో కేజ్రీవాల్ బ్యానర్‌ను ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ పెద్దమనసుతో తొలగించడం విశేషం. మమతా బెనర్జీ, స్టాలిన్ లాంటి వారు గైర్హాజరైనా కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కు సోనియా స్వయంగా పాల్గొన్న ఈ సభలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, ప్రియాంక, పలువురు ఇతర పక్షాల నేతలు నిప్పులు చెరిగిన తీరు వారి సమర్థకులకు ఉత్సాహజనకమే. అయితే, ఇంత చేసినా ఈ ర్యాలీ వెనుక అసలైన ఉద్దేశం పట్ల అనుమానాలు తొంగిచూస్తూనే ఉన్నాయి.
ప్రజాస్వామ్యానికి కట్టుబడతామనీ, సమైక్యంగా ఉంటామనీ కూటమి పక్షాలు చెబుతున్నా వారి ఇమేజ్ ఎందుకో ఆశించినంతగా పెరుగుతున్నట్టు లేదు. ఇంకా ఏదో అపనమ్మకం, అనైక్యత, అస్పష్టత కొనసాగుతున్నాయి. కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ – ఎల్డీఎఫ్, పంజాబ్‌లో కాంగ్రెస్ – ఆప్... ఇలా ‘ఇండియా’ కూటమి భాగస్వాములే పరస్పరం తలపడడం ప్రతిపక్ష ప్రయోజనాలకే భంగకరం. ఈ పరిస్థితుల్లో... తొలి దశ ఓటింగ్ దగ్గరపడు తున్నందున జనానికి తమపై నమ్మకం పెరిగేలా ప్రతిపక్షాలు అడుగులు వేయడం కీలకం.
కేవలం మోదీని గద్దె దింపడమే కాదు... తమకంటూ స్పష్టమైన అభివృద్ధి అజెండా ఉందని కూటమి నమ్మకం కలిగించాలి. కలగూరగంప అంటూ అధికార పక్షం తక్కువ చేసి మాట్లాడుతున్న ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలు ఇకనైనా ఉద్యోగ కల్పన, ధరల నియంత్రణ, సంక్షేమం తదితర అంశాలపై కనీస ఉమ్మడి ప్రణాళికను ఓటరు దేవుళ్ళ ముందుంచాలి. కేజ్రీవాల్ సతీమణి సునీత పేర్కొన్న దేశమంతటా నిరంతర విద్యుత్ లాంటి అంశాలతో ప్రజానుకూల ఎన్నికల వాగ్దాన పత్రాన్ని ప్రకటించాలి.
‘మోదీ గ్యారెంటీ’కి పోటీగా ఇప్పటికే ప్రకటించిన అయిదు గ్యారెంటీలను కాంగ్రెస్ జనంలోకి తీసుకెళ్ళకుంటే ప్రయోజనం లేదు. ఢిల్లీ ర్యాలీతో వచ్చిన సానుకూలతను సద్విని యోగం చేసుకోవాలంటే దేశం నలుమూలలా ఇలాంటి సభలతో, ఇదే ఊపును కొనసాగించడం ముఖ్యం. కూటమిలో మమత ఉన్నట్టా లేనట్టా అని చెవులు కొరుక్కుంటున్న సమయంలో ఢిల్లీ సభలో ఆమె పార్టీ నేత పాల్గొని, కూటమిలో తృణమూల్ ఉంది, ఉంటుందని తేల్చిచెప్పడం ఊరట.
దాదాపు 400 సీట్లలో బీజేపీతో ముఖాముఖి తలపడాలన్న కూటమి కల నెరవేరలేదు. బీజేపీ, దాని మిత్రపక్షాలు దాదాపు అభ్యర్థులందరినీ ఖరారు చేసి, ప్రచారం సాగిస్తున్నందున ఇప్పటికీ పోటీలో తమ అభ్యర్థుల్ని ఖరారు చేయని ప్రతిపక్ష కూటమి తక్షణమే కళ్ళు తెరవాలి. ఈ లోటుపాట్లు అటుంచితే, ‘నియంతృత్వాన్ని గద్దె దింపండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ ఎన్నికల సంఘం ముందు కూటమి తాజాగా ఉంచిన అయిదు డిమాండ్లు అసంబద్ధమైనవని అనలేం.
ప్రతిపక్షాల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు ప్రభుత్వ సారథులు ప్రయత్నాలు సహా అనేకం అసత్యాలని అనలేం. అదే సమయంలో ఈ దొంగదెబ్బలను అడ్డుకొనేందుకు ఎన్నికల సంఘం తన పరిధిలో ఏమి చేయగలుగుతుందన్నదీ చెప్పలేం. అయితే, ప్రతిపక్షాల అనుమానాలు, ఆందోళనల్ని దూరం చేసి, నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక రాజ్యాంగబద్ధంగా తనకున్న విశేషాధికారాలను సద్వినియోగం చేయడం దాని చేతుల్లోనే ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికలను నిజాయతీగా, నిష్పక్ష పాతంగా నిర్వహించడమే దాని విధి. ఆ పని సవ్యంగా చేయడమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష. ప్రతిపక్షాలు కోరుతున్నదీ అదే!
రాజధానిలో ప్రతిపక్ష గర్జన
Published Tue, Apr 2 2024 12:16 AM | Last Updated on Tue, Apr 2 2024 11:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment