రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు కీలకం. అందులోనూ ప్రత్యర్థి ఊహించని రీతిలో ఎత్తుగడలు వేయడం మరీ అవసరం. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రథసారథి అరవింద్ కేజ్రీవాల్ ఆ సంగతి ఒంట బట్టించుకున్నారు. ఇమేజ్ పడిపోతోందనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ప్రకటన, వినూత్న నిర్ణయంతో మళ్ళీ పుంజుకొనే ఆయన ఈసారీ అదే పద్ధతిని అనుసరించారు. మద్యం పాలసీ కేసు వ్యవహారంలో ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలైన రెండు రోజులకే ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ తీసుకున్న అనూహ్య నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
సీఎం పదవి నుంచి వైదొలగాల్సిందిగా బీజేపీ కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నా కిమ్మనాస్తిగా ఉన్న కేజ్రీవాల్ ఇప్పుడే ఎందుకీ నిర్ణయం తీసుకున్నారన్నది ఆసక్తి రేపుతోంది. సీనియర్ మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్ మొదలు కేజ్రీవాల్ సతీమణి సునీత దాకా స్వల్పకాలిక కొత్త సీఎం ఎవరవుతారనే చర్చ జరుగుతోంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారం సమావేశమై చర్చించగా, మంగళవారం ఉదయం కొత్తనేత ఎంపికకై శాసనసభా పక్ష సమావేశం, సాయంత్రం రాజీనామా లేఖ ఇచ్చేందుకు లెఫ్టినెంట్ గవర్నర్‌తో కేజ్రీవాల్ భేటీ జరగనుండేసరికి ఢిల్లీ రాజకీయం వేడెక్కింది.
అసెంబ్లీని అసలు రద్దు చేయాలనే ఆలోచన కూడా ఉన్నా, కొన్నేళ్ళ క్రితం ఆప్ అసెంబ్లీని రద్దు చేసి, తక్షణ ఎన్నికలకు సిఫార్సు చేసినప్పుడు చెవికెక్కించుకోకుండా కేంద్రం తరువాతెప్పుడో తాపీగా ఎన్నికలు పెట్టింది. ఈసారి కూడా ఆ ప్రమాదం ఉన్నందున కేజ్రీవాల్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తీర్పుతో నిజాయతీ నిరూపించుకొని మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చొంటానంటూ కేజ్రీవాల్ ఆదివారం చేసిన భీషణ ప్రతిజ్ఞ వెనుక బయటకు చెప్పని కారణాలు అనేకం.
సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా ఆప్ నేతలు పలువురు ఇప్పటికే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. అందుకే... 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ప్రభవించిన పార్టీ తమపై వచ్చిన ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు ఎన్నికల మార్గం ఎంచుకుంటోంది. అగ్నిపరీక్షకు సిద్ధం అనడం తెలివైన ఎత్తుగడే. రాజీనామా నిర్ణయం రాజకీయ సిక్సర్ అని కొందరు విశ్లేషకులు అంటున్నది అందుకే. అవినీతి మచ్చను తుడుచుకోవడం దగ్గర నుంచి పెరుగుతున్న అధికారపక్ష వ్యతిరేకతను తగ్గించుకోవడం వరకు అనేక విధాలుగా ఈ నిర్ణయం కేజ్రీవాల్‌కు ఉపకరించవచ్చు. ప్రతిపక్ష శిబిరం వల్ల పెరిగిన బీజేపీ వ్యతిరేకత నుంచి లబ్ధి పొందనూవచ్చు.
నిర్ణీత కాలవ్యవధి ప్రకారం చూసినా వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది గనక అయిదు నెలల ముందు రాజీనామా వల్ల కేజ్రీవాల్ వస్తే లాభమే తప్ప, పోయేదేమీ లేదు. తాజాగా బెయిలిస్తూ, సీఎం ఆఫీసుకు వెళ్ళరాదు, అధికారిక ఫైళ్ళపై సంతకాలు చేయరాదు, కేసుపై బహిరంగ ప్రకటనలు చేయరాదంటూ సుప్రీమ్ కోర్ట్ పెట్టిన కఠిన నిబంధనల రీత్యా కేజ్రీవాల్ ఎలాగూ సీఎంగా వ్యవహరించలేరు. కాబట్టి, పదవికి రాజీనామా చేస్తూ, మహారాష్ట్రతో పాటు నవంబర్‌లోనే ముందస్తు ఎన్నికలు జరపాలంటూ ఆయన పోరుబాట పట్టారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘ప్రతీకార రాజకీయాలు’ చేస్తోందని ఆరోపిస్తూ, బాధితుడిగా తనను తాను చూపించుకోవ డానికి కూడా ఆయనకు ఇదే సరైన సమయం. ఎలాగూ ఎన్నికలు జరిగేంత వరకు ఈ కొద్ది కాలం వేరెవరో సీఎంగా ఉన్నా, చక్రం తిప్పేది కేజ్రీవాలే! కనుక బాధ లేదు. అదీ కాక, మధ్యలో కేంద్ర పాలన ఉన్న ఒక్క ఏడాది మినహా 2013 డిసెంబర్ నుంచి ఢిల్లీని ఏలుతున్నందున ఓటర్లలో వ్యతిరే కత పేరుకుంది. దాని నుంచి తప్పించుకోవడానికీ, క్షేత్రస్థాయిలో జనంతో మమేకమై ముచ్చటగా మూడోసారి పార్టీ విజయావకాశాల్ని మెరుగుపరచడానికీ ఈ రాజీనామా డ్రామా అక్కరకొస్తుంది.
అయితే, ఇందులో కొన్ని రిస్కులూ లేకపోలేదు. గడచిన 20 నెలల పైచిలుకు కాలంలో ప్రధాన ఆప్ నేతలు పలువురు ఏదో ఒక అంశంలో జైలుకెళ్ళారు. మద్యం కుంభకోణం వ్యవహారం, కేంద్రం వర్సెస్ ఢిల్లీ సర్కార్‌ల గొడవ మధ్య పాలన పడకేసింది. ఢిల్లీలో ప్రాథమిక పౌర వసతులు కుప్పకూలాయి. ఆ మధ్య అన్యాయంగా ముంచెత్తిన వాన నీళ్ళలో చిక్కుకొని ఐఏఎస్ శిక్షణార్థులు ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అందుకు ఓ మచ్చుతునక.
బడి చదువులు, ఆరోగ్య వసతులు సమూలంగా మార్చేస్తామంటూ ఆప్ అధికారంలోకి వచ్చినా, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో పరిస్థితి తద్విరుద్ధంగా ఉంది. వీటన్నిటి నుంచి జనం దృష్టి మరల్చడం అంత సులభమేమీ కాదు. అసెంబ్లీ రద్దు చేయకుండా నవంబర్‌లో ఎన్నికలనేవి మాటల్లోనే తప్ప చేతల్లో సాధ్యం కాదు. రద్దు చేసి అడిగినా, నవంబర్‌లోనే ఎన్నికలు పెట్టడం తప్పనిసరి కాదు. ఒకవేళ నవంబర్‌లోనే ఎన్నికలొస్తే ఆప్‌కు సమయం సరిపోతుందా అన్నదీ ప్రశ్నార్థకమే. ఎన్నికలు జాప్యమైతే అనేక ఇతర రాష్ట్రాల్లోని పార్టీలలో లాగే కొత్త సీఎంతో ఆప్‌లో అసమ్మతి పెరిగే ప్రమాదమూ లేకపోలేదు.
ఆప్ ఇప్పుడు కీలకమైన కూడలిలో ఉంది. ఢిల్లీ, ఆ తర్వాత పంజాబ్‌లలో సత్తా చాటినా, ఇతర రాష్ట్రాలకు విస్తరించడంలో విఫలమైంది. ఇప్పుడు ఢిల్లీలోనే అగ్నిపరీక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే విలాసవంతమైన సీఎం అధికారిక నివాసం, అమలు కాని పథకాలతో జనంలో పలచనైన కేజ్రీవాల్ ప్రతిష్ఠను కూడగట్టుకోవడం కష్టమే. పైగా కేంద్ర, రాష్ట్ర సర్కార్ల మధ్య పెనుగులాటలో ప్రజలు బాధితులవుతున్నారు.
కుంటుబడ్డ పాలనతో కష్టాలు చవిచూస్తున్నారు. కేజ్రీవాల్ అవినీతి పరుడా, కాదా అన్నది తేల్చాల్సింది కోర్టు కాగా ప్రజాకోర్టులో నిజాయతీ సర్టిఫికెట్ తెచ్చుకుంటానని ఆయన చెప్పడం నాటకీయంగా బాగుంటుందే కానీ, నికరంగా ప్రజలకు ఒరిగేది శూన్యం. మరి ప్రతి సంక్షోభాన్నీ అవకాశంగా మార్చుకుంటారని పేరున్న కేజ్రీవాల్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో?
రాజీనామా వ్యూహం
Published Tue, Sep 17 2024 12:07 AM | Last Updated on Tue, Sep 17 2024 8:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment