ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ ఎత్తుగడ
ఆమెనే ఢిల్లీ సీఎం అభ్యరి్థగా పెడతారని ప్రచారం
ఇప్పటికే ఢిల్లీ సభ్యత్వ నమోదు బాధ్యతలు అప్పగింత
దక్షిణ ఢిల్లీలో ఇల్లు సైతం కొనుగోలు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా..నూతన ముఖ్యమంత్రి ఆతిశి ప్రమాణస్వీకారం.. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలన్న గట్టి పట్టుదలతో ముందుకు కదులుతోంది.
వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోనే తన నిజాయితీని నిరూపించుకొని మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానంటూ కేజ్రీవాల్ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించడంతో ఆయనకు గట్టి పోటీనిచ్చే నేతను రంగంలోకి దించే వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే మాజీ కేంద్రమంత్రి, ఫైర్‌బ్రాండ్ స్మృతి ఇరానీని ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సభ్యత్వ నమోదు బాధ్యతలను ఆమెకు కట్టబెట్టిన కమలదళం, మున్ముందు మరిన్ని బాధ్యతలు కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పీఠమెక్కాలన్న కసితో బీజేపీ..
2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఎదుర్కొనే క్రమంలో బీజేపీ మాజీ ఐపీఎస్ కిరణ్‌బేడీని తమ ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కిరణ్‌బేడీ ఏమాత్రం ప్రభావం చూపకపోగా, ఆమె నాయకత్వాన్ని ఏమాత్రం లెక్కపెట్టని బీజేపీ శ్రేణులన్నీ క్షేత్రస్థాయిలో మౌనం వహించాయి. దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీ 70 స్థానాలకు గానూ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ తర్వాత 2020 ఎన్నికల్లో సీఎం అభ్యరి్థని ప్రకటించకుండానే బీజేపీ పోటీకి దిగింది.
ఈ ఎన్నికల్లోనూ బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. కేవలం 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. అదే 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీలోని ఏడింటికి ఏడు సీట్లు గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బోల్తా పడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్‌కు తిరిగి అధికారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ ముందునుంచే ఎన్నికల ప్రణాళికలను అమలు చేసే పనిలో పడింది.
ఇందులో భాగంగానే స్మృతి ఇరానీని ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలం చేసే పనిలో పడింది. ఢిల్లీ బీజేపీకి చెందిన 14 జిల్లా యూనిట్లలోని ఏడింటిలో సభ్యత్వ నమోదు బాధ్యతలను పార్టీ ఆమెకు కట్టబెట్టింది. ఈ నెల 2వ తేదీ నుంచి ఢిల్లీలోని ప్రతి వార్డులో ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. సభ్యత్వ కార్యక్రమాలలో బూత్ స్థాయి కార్యకర్తల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయడంపై ఆమె దృష్టి పెట్టారు.
దక్షిణ ఢిల్లీలో ఇప్పటికే ఆమె ఒక ఇంటిని సైతం కొనుగోలు చేశారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో అమేధీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ చేతిలో ఓటమి అనంతరం ఎక్కడా కనిపించని ఆమెకు తాజాగా ఢిల్లీ బాధ్యతలు కట్టబెట్టారనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ఇప్పటికే బీజేపీ తరఫున దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, ఎంపీ బాసూరీ స్వరాజ్ క్రియాశీలంగా ఉన్నప్పటికీ ఆమె తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఆమెతో పాటు ఎంపీలు మనోజ్ తివారీ, ప్రదీప్ ఖండేల్‌వాల్, కామజీత షెరావత్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వంటి సీనియర్లు ముఖ్యమంత్రి ముఖాలుగా ఉన్నప్పటికీ వాక్‌చాతుర్యం, గాంధీ కుటుంబ వ్యతిరేక భావజాలమున్న ఇరానీనే సరైన మార్గమని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ఆప్ కొత్త ముఖ్యమంత్రి ఆతిశిని ఎదుర్కొనేందుకు ఇరానీ సరితూగుతారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల వ్యూహరచన, ప్రచార ప్రణాళిక, అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను ఆమెకు అప్పగించవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
-సాక్షి, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment