chief minister candidate
-
‘మహా’ సీఎం ఎవరు..? నేడు నిర్ణయం వెలువడే ఛాన్స్ !
ముంబై:అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం నేపథ్యంలో మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఎం, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేకు మళ్లీ సీఎం పదవి ఇచ్చే అవకాశం లేనట్టేనంటున్నారు. కూటమి సారథిగానే గాక అత్యధిక స్థానాలు నెగ్గిన పార్టీగా బీజేపీకే ఆ అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి అహోరాత్రాలు శ్రమించిన ఆయనకు అందలం ఖాయమంటున్నారు. ఢిల్లీకి రావాల్సిందిగా ఆయనకు బీజేపీ అధినాయకత్వం నుంచి ఇప్పటికే పిలుపు కూడా వచ్చినట్లు సమాచారం. ఫడ్నవీస్ మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందించారు. సీఎం ఎవరన్నది మహాయుతి నేతలంతా కలిసి నిర్ణయిస్తారని శనివారం మీడియాకు చెప్పారు. ఫలితాల అనంతరం షిండే, ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం ఎవరన్న దానిపై అసలు వివాదమే లేదు. దీనిపై చర్చించేందుకు సీఎం షిండేతో నేను, అజిత్ పవార్ ఆయన నివాసంలో భేటీ కానున్నాం’’అంటూ ముక్తాయించారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు సాఫీగా జరుగుతుందని షిండే కూడా అన్నారు. అనంతరం ఫడ్నవీస్ మరోసారి మీడియాతో మాట్లాడుతూ సీఎం పదవి తనకే దక్కాలనే అర్థం ధ్వనించేలా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారుల సాయంతో విపక్షాల చక్రవ్యూహాన్ని ఛేదించడంలో విజయం సాధించానని చెప్పుకొచ్చారు. -
స్మృతి ఇరానీకి ఢిల్లీ పగ్గాలు?
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా..నూతన ముఖ్యమంత్రి ఆతిశి ప్రమాణస్వీకారం.. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలన్న గట్టి పట్టుదలతో ముందుకు కదులుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోనే తన నిజాయితీని నిరూపించుకొని మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానంటూ కేజ్రీవాల్ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించడంతో ఆయనకు గట్టి పోటీనిచ్చే నేతను రంగంలోకి దించే వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే మాజీ కేంద్రమంత్రి, ఫైర్‌బ్రాండ్ స్మృతి ఇరానీని ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సభ్యత్వ నమోదు బాధ్యతలను ఆమెకు కట్టబెట్టిన కమలదళం, మున్ముందు మరిన్ని బాధ్యతలు కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.పీఠమెక్కాలన్న కసితో బీజేపీ.. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఎదుర్కొనే క్రమంలో బీజేపీ మాజీ ఐపీఎస్ కిరణ్‌బేడీని తమ ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కిరణ్‌బేడీ ఏమాత్రం ప్రభావం చూపకపోగా, ఆమె నాయకత్వాన్ని ఏమాత్రం లెక్కపెట్టని బీజేపీ శ్రేణులన్నీ క్షేత్రస్థాయిలో మౌనం వహించాయి. దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీ 70 స్థానాలకు గానూ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ తర్వాత 2020 ఎన్నికల్లో సీఎం అభ్యరి్థని ప్రకటించకుండానే బీజేపీ పోటీకి దిగింది. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. కేవలం 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. అదే 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీలోని ఏడింటికి ఏడు సీట్లు గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బోల్తా పడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్‌కు తిరిగి అధికారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ ముందునుంచే ఎన్నికల ప్రణాళికలను అమలు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే స్మృతి ఇరానీని ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలం చేసే పనిలో పడింది. ఢిల్లీ బీజేపీకి చెందిన 14 జిల్లా యూనిట్లలోని ఏడింటిలో సభ్యత్వ నమోదు బాధ్యతలను పార్టీ ఆమెకు కట్టబెట్టింది. ఈ నెల 2వ తేదీ నుంచి ఢిల్లీలోని ప్రతి వార్డులో ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. సభ్యత్వ కార్యక్రమాలలో బూత్ స్థాయి కార్యకర్తల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయడంపై ఆమె దృష్టి పెట్టారు. దక్షిణ ఢిల్లీలో ఇప్పటికే ఆమె ఒక ఇంటిని సైతం కొనుగోలు చేశారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో అమేధీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ చేతిలో ఓటమి అనంతరం ఎక్కడా కనిపించని ఆమెకు తాజాగా ఢిల్లీ బాధ్యతలు కట్టబెట్టారనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ఇప్పటికే బీజేపీ తరఫున దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, ఎంపీ బాసూరీ స్వరాజ్ క్రియాశీలంగా ఉన్నప్పటికీ ఆమె తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు ఎంపీలు మనోజ్ తివారీ, ప్రదీప్ ఖండేల్వాల్, కామజీత షెరావత్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వంటి సీనియర్లు ముఖ్యమంత్రి ముఖాలుగా ఉన్నప్పటికీ వాక్చాతుర్యం, గాంధీ కుటుంబ వ్యతిరేక భావజాలమున్న ఇరానీనే సరైన మార్గమని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ఆప్ కొత్త ముఖ్యమంత్రి ఆతిశిని ఎదుర్కొనేందుకు ఇరానీ సరితూగుతారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల వ్యూహరచన, ప్రచార ప్రణాళిక, అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను ఆమెకు అప్పగించవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -సాక్షి, న్యూఢిల్లీ -
రాహుల్ నివాసం వద్ద డీకేఎస్ మద్దతుదారుల నినాదాలు
ఢిల్లీ: మూడు రోజుల చర్చల తర్వాత.. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసిందనే ప్రచారం ఊపందుకుంది. ఈలోపు సాయంత్రం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆ పేరును అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ లోపు.. హస్తినలో ఇవాళ హాట్ హాట్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం పదవిని ఆశించిన డీకే శివకుమార్ తన సోదరుడితో కలిసి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అవ్వగా.. ఆయన మద్దతుదారులు నివాసం బయట నిరసనకు దిగారు. డీకే శివకుమార్‌కే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలంటూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు వాళ్లు. దత్త పుత్రుడు కావాలా? అసలు పుత్రుడు కావాలా? అంటూ డీకేఎస్‌ను సీఎం చేయాలంటూ నినాదాలు చేశారు వాళ్లు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రావడానికి డీకేఎస్ కారణమని, ఆయనకు కాకుండా సీఎం పోస్ట్ ఎవరికి ఇచ్చినా ఆ నిర్ణయం చారిత్రక తప్పిదమే అవుతుందని వ్యాఖ్యానించారు వాళ్లు. ఒకపక్క సీఎంగా సిద్ధరామయ్య పేరు దాదాపు ఖరారు కావడంతో బెంగళూరులోని ఆయన నివాసం బయట ఫొటోకు పాలాభిషేకం చేశారు మద్దతుదారులు. దీనికి ప్రతిగానే డీకేఎస్ అనుచరగణం ఇలా రాహుల్ నివాసం బయట గుమిగూడినట్లు తెలుస్తోంది. రాహుల్‌తో భేటీ అనంతరం డీకే సోదరులు నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు. #WATCH | Supporters of Congress leader Siddaramaiah pour milk on his poster and chant slogans for him outside his residence in Bengaluru, even as the suspense over #KarnatakaCMRace continues. pic.twitter.com/HQG0gzsb1G — ANI (@ANI) May 17, 2023 #WATCH | Karnataka Congress president DK Shivakumar leaves from 10, Janpath after meeting party leader Rahul Gandhi, as Karnataka CM decision remains pending pic.twitter.com/BvTTJG4T8T — ANI (@ANI) May 17, 2023 ఇదీ చదవండి: జస్ట్ 16 ఓట్ల ఆధిక్యంతో నెగ్గిన బీజేపీ అభ్యర్థి -
ఖర్గేతో ముగిసిన డీకేఎస్, సిద్ధూ భేటీ.. సీఎం ప్రకటనపై ఉత్కంఠ
ఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా.. సీఎం ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ చర్చోపచర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఇవాళ వరుసగా భేటీ అయ్యారు. తొలుత డీకే శివకుమార్, ఆపై సిద్ధరామయ్య ఖర్గేతో ఆయన నివాసంలో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఇద్దరూ చెరో గంటకుపైనే ఖర్గేతో చర్చించారు. ఈ క్రమంలో ఇద్దరూ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే.. ఇద్దరితో సమాలోచనల సారాంశాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ చర్చించాలని ఖర్గే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఖర్గేతో భేటీ అనంతరం.. పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లారు సిద్ధారామయ్య. ఇప్పటికే ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన పార్టీ పరిశీలకులు.. హైకమాండ్‌కు ఆ నివేదికను అందించారు. ఆపై ఇద్దరు అభ్యర్థులతో ఖర్గే విడివిడిగా భేటీ అయ్యారు. ఎమ్మెలఏల మద్దతు తనకే ఉందని సిద్ధరామయ్య, ఖర్గేతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక డీకే శివకుమార్ సోలోగా తాను పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టినట్లు చెప్పినట్లు సమాచారం. కుదిరితే రేపు లేకుంటే ఎల్లుండి బెంగళూరులో కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరనేదానిపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే స్వయంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. #UPDATE | #WATCH | Karnataka Congress president DK Shivakumar leaves from the residence of the party's national president Mallikarjun Kharge, in Delhi. pic.twitter.com/FqUPpf77Da — ANI (@ANI) May 16, 2023 #UPDATE | #WATCH | Congress leader Siddaramaiah leaves from the residence of party president Mallikarjun Kharge, in Delhi. pic.twitter.com/dwE9uDKq8z — ANI (@ANI) May 16, 2023 -
Karnataka: రాజీనామా వార్తలపై డీకేఎస్ సీరియస్
సాక్షి, ఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి విషయంలో తేడాలు జరిగితే కాంగ్రెస్‌కు డీకే శివకుమార్ రాజీనామా చేస్తారనే ప్రచారం ఒకటి కన్నడ మీడియా ఛానెల్స్ ద్వారా చక్కర్లు కొడుతోంది. అయితే ఆ ప్రచారంపై డీకేఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారాయన. పార్టీ(కాంగ్రెస్‌ను ఉద్దేశించి..) నాకు తల్లిలాంటిది. పార్టీకి రాజీనామా చేస్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేనెందుకు రాజీనామా చేస్తా. అలాంటి ప్రచారం చేసేవాళ్లపై దావా వేస్తా జాగ్రత్త. 135 ఎమ్మెల్యే మద్దతు నాకు ఉంది అని ఢిల్లీలో తనని పలకరించిన మీడియా ప్రతినిధులతో తెలిపారాయన. ఢిల్లీలో కన్నడ సీఎం ఎంపిక ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఉదయం నుంచి కీలక నేతలు చర్చోపచర్చలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లు కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపికపై చర్చించారు. ఇక సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు వేర్వేరుగా ఈ సాయంత్రం ఖర్గేతో భేటీ కానున్నారు. తొలుత ఐదు గంటల ప్రాంతంలో డీకే శివకుమార్, ఆపై ఆరు గంటలకు సిద్ధరామయ్య ఖర్గేతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అటుపై ఇద్దరూ రాహుల్ గాంధీతోనూ భేటీ కావొచ్చని తెలుస్తోంది. అంతా సజావుగా జరిగితే.. ఇవాళ రాత్రికే కర్ణాటక సీఎం ఎవరూ అనేదానిపై ఒక ప్రకటన వెలువడొచ్చని, ఉత్కంఠ వీడొచ్చని అటు కాంగ్రెస్ శ్రేణులు ఇటు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదీ చదవండి: సీఎం ఎంపిక కోసం వాళ్ల లాబీయింగ్? -
Karnataka: సిద్ధరామయ్యకే సీఎంగా అవకాశం!
ఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఒక అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అధికారిక ప్రకటన లాంఛనమని సమాచారం. ఆదివారం జరిగిన సీఎల్పీ భేటీలో 135 మందిలో 90 మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకే మద్దతు ఇచ్చారని, ఈ విషయాన్ని పార్టీ పరిశీలకులు హైకమాండ్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారని తెలుస్తోంది. ఇంకోవైపు సోమవారం ఢిల్లీకి వెళ్లిన సిద్ధరామయ్య.. కీలక నేతలతో వరుసగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు అవకాశాలు సన్నగిల్లుతుండడంతో సీఎం రేసులో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్.. ఒకింత అసహనం, అసంతృప్తితో కూడిన స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు. డీకేకు వైద్య పరీక్షలు డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు ఆయన అనుచర గణం చెబుతోంది. తనకు ఆరోగ్యం బాగోలేదని ఆయన కేడర్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. ఆరోగ్యం కుదుటపడితే రేపు(మంగళవారం) ఆయన ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. ఇదీ చదవండి: అవసరమైతే నిరసన తెలుపుతా-డీకే శివకుమార్ -
సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్: డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం విషయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్(61) పార్టీ హైకమాండ్‌కు మరోసారి గట్టి సంకేతాలు పంపించారు. ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని చెబుతున్న ఆయన.. అవసరమైతే నిరసన తెలుపుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ అంటూ ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు. తన నివాసంలో ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన.. కాసేపటికే మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లో నాకంటూ ఓ వర్గం లేదు. ఎమ్మెల్యేలంతా నా వాళ్లే. ఒంటరిగా కాంగ్రెస్‌కు 135 సీట్లు తెచ్చిపెట్టా. పైగా కాంగ్రెస్ చీఫ్(మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి..) నావైపే ఉన్నారు. నా బలాన్ని ఎవరూ లాక్కోలేరు. అలాగే.. వేరే వాళ్ల బలంపై నేను మాట్లాడను. అవసరమైతే నిరసన తెలుపుతా అంటూ పేర్కొన్నారాయన. ఇక ఢిల్లీకి తాను వెళ్లబోవట్లేదని తేల్చి చెప్పిన శివకుమార్.. పనిలో పనిగా చివరిలో సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు.. తిరుగుబాటు చేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నేనేం తిరుగుబాటు చేయను. అలాగే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడను. నేనేం బచ్చాగాడ్ని కాదు. నాకంటూ ఓ విజన్ నాకుంది. అలాగే పార్టీ పట్ల విధేయత కూడా ఉంది. ముందు పార్టీ అధిష్టానాన్ని నిర్ణయం తీసుకోనివ్వండి అని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఇదిలా ఉంటే.. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందంటూ హస్తిన పర్యటనకు వెళ్లిన సిద్ధరామయ్య(75), ఇవాళ రాత్రి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అవుతారనే ప్రచారం నడుస్తోంది. ఇదీ చదవండి: డీకే శివకుమార్‌తో నాకు మంచి దోస్తీ ఉంది! -
‘నేను ఒంటరిని.. పార్టీని గెలిపించుకున్నా!’
బెంగళూరు: పార్టీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానని, కర్ణాటకను కాంగ్రెస్‌కు ఇవ్వాలన్న లక్ష్యం సాధించానని, సీఎం ఎవరన్నదానిపై ఇక హైకమాండ్‌దే తుది నిర్ణయమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఒకవైపు సీఎం అభ్యర్థిపై పార్టీ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతున్న వేళ.. సీనియర్ నేత సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లడం తెలిసిందే. అయితే డీకే శివకుమార్ మాత్రం బెంగళూరులో ఉండిపోయారు. ఇవాళ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల నడుమ తన ఫామ్‌హౌజ్‌లో చేసుకున్నారాయన. అనంతరం బెంగళూరులోని నివాసానికి చేరుకున్నారు. అక్కడ మద్దతుదారులతో భేటీ అయిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. కర్ణాటక పీసీసీ చీఫ్, సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్ తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు.‘‘ ఇవాళ నా పుట్టినరోజు. వేడుకల్లో పాల్గొనేందుకు ఇక్కడే ఉండిపోయా. తర్వాత ఢిల్లీకి వెళ్తా. పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డా. 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ధైర్యం కోల్పోలేదు. కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చాను. నా టార్గెట్ కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించడం. నా అధ్యక్షతన 135 స్థానాలు గెలిపించుకున్నా. గెలుపు కోసం నేతలంతా సహకరించారు. .. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా. సిద్ధరామయ్యతో ఎలాంటి విభేధాలు లేవు. నా బర్త్‌డే వేడుకల్లో కూడా ఆయన పాల్గొన్నారు. సీఎం ఎవరన్నదానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నాకంటూ ఉన్న మద్దతు దారుల సంఖ్యను చెప్పను. ఎందుకంటే నేను ఒంటరిని.. ఒంటరిగానే పార్టీని గెలిపించుకున్నా. ఢిల్లీ వెళ్లి నా గురువును కలుస్తా. సీఎం అభ్యర్థి ఎవరు అనేదానిపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది. సోనియా, రాహుల, ఖర్గేలు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు అని శివకుమార్ పేర్కొన్నారు. #WATCH | It's my birthday today, I'll meet my family. Afterwards,I'll leave for Delhi.Under my leadership,we've 135 MLAs, all in one voice said-matter (to appoint CM) is to be left to the party high command. My aim was to deliver Karnataka&I did it: K'taka Cong Pres DK Shivakumar pic.twitter.com/xlqvVCBLdv — ANI (@ANI) May 15, 2023 ఇదీ చదవండి: ఇంతకన్నా కానుక ఏముంటుంది?-డీకే శివకుమార్ -
‘నేనే సీఎం అవుతానని ఆశిస్తున్నా’
సాక్షి, ఢిల్లీ/బెంగళూరు: కౌన్ బనేగా కర్ణాటక ముఖ్యమంత్రి?. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీతో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం ఎంపికలో మాత్రం తర్జన భర్జనలు పడుతోంది. సీఎం రేసులో ప్రయారిటీ క్యాండిడేట్లుగా ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో ఎవరిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనేదానిపై చర్చలతో హస్తిన హీటెక్కిపోతోంది. రేపటి కల్లా పేరు ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో.. కొందరు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లిన సీనియర్ నేత సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనే ముఖ్యమంత్రి అవుతానని ఆశిస్తున్నా. నిన్న(ఆదివారం) జరిగిన సీఎల్పీ భేటీలో మెజార్టీ ఎమ్మెల్యేలు నన్ను ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికే కట్టుబడి ఉంటా. డీకే శివకుమార్‌తో నాకు మంచి స్నేహం ఉంది’’ అని 75 ఏళ్ల సిద్ధరామయ్య పేర్కొన్నారు. మరో 24 గంటల్లో సీఎం ఎవరో తెలుస్తుందని వ్యాఖ్యానించారాయన. ఇక సిద్ధరామయ్య వెంట ఉన్న ఎమ్మెల్యేలలో దళిత, మైనార్టీ, ట్రైబల్, ఓబీసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ వర్గాల ప్రజాప్రతినిధుల మద్దతు తనకు ఉందని అధిష్టానం బలనిరూపణ కోసమే ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది. హైకమాండ్‌తో భేటీ అనంతరం ఆయన ఈ సాయంత్రం రాహుల్ గాంధీతో భేటీ కావొచ్చని తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్(62) కూడా నేడు ఢిల్లీకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన బెంగళూరులోనే ఉండడం, తాను ఢిల్లీకి వెళ్లడం లేదని డీకే శివకుమార్ స్పష్టం చేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ‘‘నేను ఢిల్లీ వెళ్లడం లేదు. నా పుట్టినరోజు వేడుకలు ఉన్నందున ఇంట్లోనే ఉంటున్నా. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా’’ అని పేర్కొన్నారాయన. అధిష్టానం నుంచి పిలుపు రానందు వల్లే ఆయన ఢిల్లీ పర్యటనకు దూరం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అధిష్టానం పిలిస్తే మాత్రం ఆయన ఢిల్లీకి వెళ్లొచ్చని సమాచారం. కర్ణాటక సీఎం కుర్చీ విషయంలో డీకే శివకుమార్ ఓ మెట్టు కిందకు దిగొద్దని నిశ్చయించుకున్నట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. డీకే శివకుమార్‌ను బుజ్జగించేందుకు ఏఐసీసీ పరిశీలకుడు, కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. మూడు గంటలపాటు వీళ్లు భేటీ జరిగింది. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి ప్రతిపాదనను సైతం డీకే తిరస్కరించినట్లు సమాచారం. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి.. లేకుంటే కేబినెట్లో స్థానం కూడా వద్దంటూ డీకే, సూర్జేవాలాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బుజ్జిగింపుల పర్వంతో కాంగ్రెస్ హైకమాండ్ ఇద్దరిలో ఎవరిని సీఎం చేస్తుందో చూడాలి. ఇదీ చదవండి: డీకేకు సీఎం పదవి దూరం.. కారణం అదేనా? -
Karnataka Assembly Election 2023: ఎన్నికలు ముగిశాకే సీఎం ఎంపిక: ఖర్గే
శివాజీనగర: కర్ణాటకలో ఎన్నికలు ముగిసిన తరువాతే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి, హైకమాండ్ చర్చించి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తుందని తెలిపారు. ఎన్నికలకు ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం తమ సంప్రదాయం కాదని చెప్పారు. సోమవారం చిక్కమగళూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ లింగాయత్ ముఖ్యమంత్రిని ప్రకటించాలన్న బీజేపీ సవాల్‌పై స్పందిస్తూ తమ పార్టీలో కులాల వారీగా సీఎంను ప్రకటించడం లేదన్నారు. బీజేపీలో అవినీతి ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలు విసుగెత్తారని, అదే ఇతరులపై చిన్న ఆరోపణ వస్తే వెంటనే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తారని ఆరోపించారు. -
అధిష్టానం ఆ పని చేయబోదు: సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న వేళ.. మరోవైపు జాతీయ పార్టీలు రెండూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై వేచిచూసే ధోరణినే అవలంభిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి మాత్రం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల పేర్లు ప్రధానంగా తెర మీద వినిపిస్తున్నాయి. అయితే.. సీఎం ఎవరనే నిర్ణయం పార్టీ అధిష్టానం చేతులో కూడా ఉండదని అంటున్నారు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య. కాంగ్రెస్‌కు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. అధికార రాష్ట్రాలను ఒక్కొక్కటిగా చేజార్చుకుంటూ పోతున్న హస్తానికి.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక బూస్ట్‌గా పని చేయడానికైనా కన్నడనాట విజయం రుచిచూడాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే.. సీఎం అభ్యర్థి విషయంలో అక్కడ సిద్ధరామయ్యకు, పార్టీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. పైగా ఈ ఇద్దరి మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న విభేదాల కారణంగా.. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారు? ఆపై పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి సైతం నెలకొంది. ఈ క్రమంలో.. సీఎం అభ్యర్థిత్వంపై ఉన్న పోటీపై సిద్ధరామయ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నేను కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వాడినే. అలాగే.. డీకే శివకుమార్ కూడా. కానీ, పార్టీ అధిష్టానం మాత్రం శివకుమార్‌కు సీఎం పదవి కట్టబెట్టదు.. బెట్టలేదు కూడా అని సిద్ధరామయ్య తేల్చారు. ఎందుకంటే.. ‘‘కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎంపికలో అధిష్టానం జోక్యం చేసుకోదు. అది ఏనాడూ జరగబోదు కూడా. ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ సీఎం ఎంపిక ఉంటుంది. గెలిచిన ఎమ్మెల్యేల ఎంపిక చేసిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు’’ అంటూ తెలిపారు. ఇక.. సీఎం పదవికి యువనాయకత్వాన్ని ఎందుకు అంగీకరించబోరన్న ప్రశ్నకూ.. ఆయన భిన్నంగా స్పందించారు. నాకిప్పుడు 75 ఏళ్లు. ఒకరకంగా ఇదే నా చివరి ఎన్నిక అంటూ దాటవేత సమాధానం ఇచ్చారు. 2020 జులైలో.. సిద్ధరామయ్య నమ్మకస్తుడిగా ఉన్న దినేష్ గుండును తప్పించి మరీ ట్రబుల్ షూటర్‌గా పేరున్న శివకుమార్‌కు పార్టీ పగ్గాలు అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పటి నుంచి సిద్ధరామయ్య-శివకుమార్‌ల వైరం మరింతగా ముదిరింది. అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఒక్కటిగా కనిపించిన ఈ నేతలు.. అటుపై ఫిబ్రవరిలో విడివిడిగా బస్సు యాత్రలో నిర్వహించి ఎవరిదారి వారిదేనని చాటిచెప్పారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ వీళ్ల విభేధాల ప్రభావం పడుతోంది. అయితే ఈ ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే.. కర్ణాటక అసెంబ్లీలో హంగ్ ఫలితం, జేడీఎస్‌తో పొత్తూ ఈ రెండు ప్రచారాలను తోసిపుచ్చడం.. కాంగ్రెస్ ఘన విజయంతో తిరిగి కన్నడనాట అధికారంలో వస్తుందనే ధీమా వ్యక్తం చేయడం మాత్రమే. -
హిమాచల్ సీఎం ఎంపిక.. భారమంతా ప్రియాంకపైనే!
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్ పార్టీ. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం భేటీ అయినా సీఎం పేరు ఖరారు కాలేదు. దీంతో అభ్యర్థి ఎంపిక బాధ్యతను అధిష్టానానికి కట్టబెడుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు ఎమ్మెల్యేలు. హిమాచల్‌లో తదుపరి ముఖ్యమంత్రి రేసులో ప్రతిభా సింగ్, ముకేశ్ సింగ్ అగ్నిహోత్రి, సుఖ్విందర్ సింగ్ సుఖు ముందంజలో ఉన్నారు. ప్రియాంక గాంధీకే క్రెడిట్.. హిమాచల్‌లో పార్టీ విజయం సాధించటంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తుది నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం మధ్యాహ్నం కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రియాంక ప్రకటించనున్నారని పేర్కొన్నాయి. హిమాచల్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పార్టీని ముందుండి నడిపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎన్నికల వ్యూహంలో కీలక భూమిక పోషించారు. బీజేపీనీ ఓడించి పార్టీని గెలిపించటంలో ప్రియాంక పాత్ర కీలకమైందని పలువురు నేతలు ప్రశంసలు కురిపించారు. ఈక్రమంలోనే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యత ఆమెకే అప్పగించినట్లు తెలుస్తోంది. సీఎంగా ముకేశ్.. విక్రమాదిత్యకు డిప్యూటీ..! ముఖ్యమంత్రి పదవి రేసులో ప్రతిభా సింగ్, ముకేశ్ అగ్నిహోత్రి, సుఖ్విందర్ సింగ్ సుఖుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే, ముకేశ్ అగ్నిహోత్రికి ముఖ్యమంత్రి పదవి, విక్రమాదిత్యకు డిప్యూటీ సీఎం ఇచ్చే యోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, చివరకు ఎవరికి ఆ పదవి దక్కుతుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇదీ చదవండి: ‘సీఎం పీఠం మా నేతకే..’ హిమాచల్‌లో ఆశావహుల మద్దతుదారుల డిమాండ్ -
పాత కాపులకే పట్టం
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చిన పది రోజులకు ఎట్టకేలకు అన్నిచోట్లా ముఖ్య మంత్రుల ఎంపిక ప్రహసనం ముగిసింది. పంజాబ్‌లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్)ని మినహాయిస్తే, మిగతా 4 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొత్తవే కానీ సారథులు పాతవాళ్ళే. ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ అధికారం నిలుపుకొన్న బీజేపీ చిత్రంగా పాత కాపులపైనే మళ్ళీ భరోసా పెట్టింది. పార్టీలోనూ, బయటా తిరుగులేని యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని యూపీ సంగతి వేరు. ఆ ఒక్కటీ అటుంచితే, అసమ్మతుల మొదలు అధికారం కోసం పోటీ దాకా అనేకం ఉన్న రాష్ట్రాల్లోనూ పాత సారథులకే బీజేపీ జై కొట్టడం గమనార్హం. మణిపూర్‌లో బీరేన్ సింగ్ ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేయగా, మరో 3 రాష్ట్రాల్లో ఈ వారంలోనే ప్రమాణ స్వీకారోత్సవాల హంగామా. పదిరోజుల ఊహాగానాల తర్వాత ఉత్తరాఖండ్‌లో... సొంత సీటులో ఓటమి పాలైన పుష్కర్ సింగ్ ధామీనే మళ్ళీ సీఎంగా పార్టీ ఎంపిక చేయడంతో ఇప్పుడు చర్చంతా ఈ పాత కాపుల విజయసూత్రాల చుట్టూ నడుస్తోంది. 70 స్థానాల ఉత్తరాఖండ్‌లో 47 సీట్లు గెలిచి, బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న తొలి పార్టీ అనే ఘనత దక్కించుకుంది. అయితే, పోటీ చేసిన ఖటీమా నియోజకవర్గం నుంచి సీఎం ధామీ ఓడిపోవడం పార్టీకి పెద్ద షాక్. ధామీ ఓడారు గనక ఆ పదవి తమకు దక్కుతుందని ఇతర సీనియర్లు ఆశపడ్డారు. రకరకాల పేర్లు వినవచ్చాయి. పరిశీలకులుగా అధిష్ఠానం పంపిన మంత్రుల సమక్షంలో మంగళవారం ఆ ఊహాగానాలకు తెర పడింది. «45 ఏళ్ళ దామీకే మళ్ళీ సీఎం పీఠం లభించింది. ఈ ఎన్నికలకు ఆరేడు నెలల ముందు వివిధ రాష్ట్రాల్లో సీఎంలను పేక ముక్కలలా మార్చారన్న అపకీర్తి బీజేపీ మూటగట్టుకుంది. ఆ అప్రతిష్ఠకు భిన్నంగా ఇప్పుడు ఫలితాలు వచ్చాక పాత సారథు లనే ఆ పార్టీ కొనసాగించింది. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో గత మార్చిలో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌ను మార్చారు. వచ్చిన తీరథ్ సింగ్ రావత్ సైతం వివాదాస్పద మయ్యారు. స్త్రీల వస్త్రధారణపై వ్యాఖ్యలు, హరిద్వార్ కుంభమేళాలో కోవిడ్ నిబంధనల వైఫల్యం, టీకాల డేటాలో ప్రభుత్వ మతలబుల లాంటి కారణాలతో పదవి పోగొట్టుకున్నారు. ఆయన స్థానంలో గత జూలైలో పగ్గాలు చేతబట్టి, ఉత్తరాఖండ్‌కు సీఎం అయ్యారు ధామీ. ఓటమి అంచున ఉందనుకున్న పార్టీ అదృష్టాన్ని తిరగరాశారు. తీరా ఓడిపోతుందనుకున్న బీజేపీని గెలిపించారు. సొంత సీటులో ఓడినా, పదవి రేసులో మాత్రం అధిష్ఠానం ఆశీస్సులతో గెలిచారు. మణిపూర్ సంగతికొస్తే, 79.85 శాతంతో దేశ సగటు కన్నా ఎక్కువ అక్షరాస్యత రేటున్న ఈ కీలక సరిహద్దు రాష్ట్రంలో తీవ్రవాదం, జాతుల ఘర్షణ కూడా ఎక్కువే. 60 స్థానాల ఈశాన్య రాష్ట్రంలో 2017లో బీజేపీ గెలిచింది 21 సీట్లే. అప్పట్లో 28 సీట్లతో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించినా, కమలనాథులే ప్రభుత్వం ఏర్పాటుచేయడం మరో పెద్ద కథ. ఆటుపోట్లెన్నో తట్టుకుంటూ అయిదేళ్ళుగా విజయవంతంగా మైనారిటీ ప్రభుత్వం నడిపారు బీరేన్ సింగ్. తాజా ఎన్నికల్లో పార్టీ బలాన్ని 32కు పెంచి, మెజారిటీ సాధించి పెట్టారు. సీఎం సీటుకు ఇతరులు పోటీ పడ్డా, బీరేన్‌కు అది అనుకూలించింది. బీరేన్ నియంతృత్వ ధోరణిని నిరసించే అసమ్మతి వర్గం చివరకు ఏమీ చేయలేకపోయింది. అధిష్ఠానం సహజంగా విజయసారథి వైపే మొగ్గింది. ఎన్నికల అనంతరం ఆరుగురు ఎమ్మెల్యేల జనతాదళ్ (యు), అయిదుగురు ఎమ్మెల్యేల నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ మద్దతుతో ఈసారి బీరేన్ది సుస్థిర సర్కార్. నాగాలాండ్ సరిహద్దు గ్రామాలతో ఘర్షణలు, నిరుద్యోగం, వివాదాస్పద సాయుధ బలగాల చట్టం లాంటి వాటిని బీరేన్ ఎలా పరిష్కరిస్తారో? ఎమ్మెల్యేల బేరసారాలకూ, పార్టీ ఫిరాయింపులకూ పేరుపడ్డ 40 స్థానాల గోవాలో గతంలో అతి పెద్ద పార్టీ కాంగ్రెసైనా, బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్ చీలిక వర్గం వచ్చి కలవడం కలిసొచ్చింది. తాజా ఎన్నికల్లో మాత్రం మెజారిటీకి ఒక్క సీటు తక్కువగా 20 సీట్లతో బీజేపీనే అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, అంతర్గత కలహాలు, సీఎం ఆశావహులతో చిక్కొచ్చింది. పార్టీని గెలిపించిన ప్రమోద్ సావంత్ సొంత పార్టీలోని ప్రత్యర్థి విశ్వజిత్ రాణే లాంటి వారిని దాటుకొని రావాల్సిన పరిస్థితి. ఫలితాలొచ్చి పది రోజులు దాటినా, అనేక కారణాలతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. అమిత్ షా స్వయంగా ప్రమోద్, విశ్వజిత్‌లతో భేటీ జరిపినట్టు వార్తలొచ్చాయి. ఇతర పార్టీల మద్దతు కూడగట్టిన ప్రమోద్‌నే సారథిగా అధిష్ఠానం మరోసారి ఎంచుకుంది. ఎన్నికలలో అధికార పక్షానికి ఉండే సహజ వ్యతిరేకతకు ఎదురొడ్డి, ముందుండి మరీ పార్టీని గెలిపించడం ఈ రెండోసారి సీఎంలకున్న సానుకూలత. బీరేన్, ధామీ, ప్రమోద్ సావంత్‌లకు మళ్ళీ సీఎం పీఠం దక్కింది అందుకే. బీజేపీ నేతలూ ఆ మాటే చెబుతున్నారు. అయితే, శాసనసభా పక్ష సమావేశాల్లో ఏకగ్రీవంగా జరిగిన ఎన్నిక లాంటి లాంఛనపూర్వక మాటలకు చాలా ముందే రాజ్‌నాథ్ సింగ్ లాంటి పరిశీలకుల నోట కాబోయే ముఖ్యమంత్రులెవరో సూచనలు వచ్చేశాయి. ‘‘మ్యాచ్‌ను అద్భుతంగా ముగించే క్రికెటర్ ధోనీ లాంటి వారు ధామీ’’ లాంటి వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. మొత్తానికి, ఒకప్పటి కాంగ్రెస్ అధిష్ఠానం లాగే, నేటి బీజేపీ కూడా సీల్డ్ కవర్ సీఎంల సంస్కృతికి అతీతమేమీ కాదని తాజా సీఎం ఎంపికలతో తేలిపోయింది. పార్టీ జెండాను మరింత పైకెత్తడంలో ఈ సరికొత్త పాత సీఎంలు సఫలమైతే అధిష్ఠానానికి అంతకు మించి ఇంకేం కావాలి! -
సిద్ధూ త్యాగం.. చన్నీ పాదాభివందనం
Punjab Assembly Elections 2022: పంజాబ్‌లో క్లిష్టమైన సమస్యగా భావించిన ముఖ్యమంత్రి ఎంపిక.. ప్రకటనను ఎట్టకేలకు పూర్తి చేసింది కాంగ్రెస్. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న నవజోత్ సింగ్ సిద్ధూను ఎలాగోలా పార్టీ చల్లబర్చింది. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌సింగ్ చన్నీనే.. సీఎం అభ్యర్థిగా ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అంతకు ముందు కొన్ని గంటలపాటు పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా.. అభ్యంతరం లేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ సిద్ధూ ప్రకటించడంతో ఆసక్తికరంగా మారింది సీన్. ఈ తరుణంలో.. స్టేజ్‌పై సీఎం అభ్యర్థిగా చన్నీ పేరును ప్రకటించిన వెంటనే ఆసక్తికర దృశ్యం కనిపించింది. సిద్ధూ చన్నీ కుడి చెయ్యిని పైకి ఎత్తగా.. ఆక్షణంలోనే చన్నీ తన ఎడమ చేతితో సిద్ధూకి పాదాభివందనం చేశాడు. ‘సిద్ధూజీ.. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసేయండి. మీ మోడల్ కచ్చితంగా అమలు అయ్యి తీరుతుంది’ అని చన్నీ ఆ వెంటనే వ్యాఖ్యానించడం విశేషం. లూథియానా: ఇక పంజాబ్‌లో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు పార్టీ నేత రాహుల్ గాంధీ పెద్ద షాక్ ఇచ్చారు. పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ పేరును రాహుల్ ఆదివారం పంజాబ్‌లో వర్చువల్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించి.. ప్రసంగించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రావాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. పేదరికాన్ని, ఆకలిని అర్థం చేసుకున్నవారే కావాలని అంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. ‘‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. దాన్ని మీరు సులభతరం’’ చేశారు అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అనంతరం చన్నీ, సిద్ధూ, పార్టీ నేత సునీల్ జాఖర్‌ను రాహుల్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మీడియా, టీవీ చర్చా కార్యక్రమాల్లో నాయకులు పుట్టుకురారని తెలిపారు. కొన్ని సంవత్సరాల పోరాటంతోనే వ్యక్తులు నాయకులుగా ఎదుగుతారని వివరించారు. గొప్ప నాయకులకు తమ పార్టీలో లోటు లేదన్నారు. ప్రజల కోసం నిలబడే నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నారని పేర్కొన్నారు. చన్నీ, సిద్ధూల రక్తంలో పంజాబ్ ఉందన్నారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కాంగ్రెస్ నాయకత్వం పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. ప్రజల మనోభావాలను కూడా తెలుసుకుంది. ఇందుకోసం అటోమేటెడ్ కాల్ సిస్టమ్‌ను ఉపయోగించుకుంది. దళిత సిక్కు నాయకుడైన చరణ్‌జిత్‌సింగ్ చన్నీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. వర్చువల్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఆయన ప్రధానమంత్రిగా కాదు, ఒక రాజులాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ రోడ్లపై ఎవరికైనా సాయం చేయడం ఎప్పుడైనా చూశారా? ఆయన ప్రజల మధ్య ఉండడం ఎప్పుడైనా గమనించారా? అని ప్రజలను ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పదవుల కోసం పాకులాడలేదు: సిద్ధూ తాను ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్ సిద్ధూ అన్నారు. ఆయన లూథియానాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. గత 17 ఏళ్లుగా రాజకీయ జీవితం కొనసాగిస్తున్నానని, పదవులపై ఎప్పుడూ ఆశపడలేదని పేర్కొన్నారు. పంజాబ్ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని మాత్రమే కోరుకున్నానని వివరించారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. గత ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేశారని కొనియాడారు. మార్పునకు సమయం ఆసన్నమైందని వెల్లడించారు. పంజాబ్ అభివృద్ధి కంటే తనకు కావాల్సింది ఇంకేమీ లేదని వ్యాఖ్యానించారు. సీఎం అభ్యర్థి ప్రకటనపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిద్ధూ ట్వీట్ చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. బీజేపీ శ్రుతులకు అనుగుణంగా అమరీందర్ డ్యాన్స్ చేస్తున్నారని ఆరోపించారు. పంజాబ్‌ను లూటీ చేసిన నాయకులు ఇప్పుడు డబల్ ఇంజన్ ప్రభుత్వం అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ అధికారం రాహుల్‌కు ఎక్కడిది?: బీజేపీ చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అధికారం రాహుల్ గాంధీకి ఎక్కడుందని బీజేపీ నేత, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదివారం ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో రాహుల్‌కు ఎలాంటి హోదా లేదని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఏ అధికారంతో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని నిలదీశారు. పేరు చివర ‘గాంధీ’ అన్న ఒక్క అర్హత మాత్రమే రాహుల్‌కు ఉందని ఎద్దేవా చేశారు. -
అస్సాంలో కమలదళానికి కఠిన పరీక్ష
అస్సాంలో కమలదళానికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. క్లీన్ఇమేజ్తో బీజేపీ విజయానికి తోడ్పడిన ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ను మళ్లీ సీఎంగా ఎంపిక చేయాలా లేక అస్సాంలో అత్యంత ప్రజాదరణగల నేతల్లో ఒకరైన ఆర్థిక మంత్రి హిమంతా బిశ్వ శర్మను సీఎం చేయాలా అనే దానిపై బీజేపీ అధినాయకత్వం తేల్చుకోవాల్సి ఉంది. బీజేపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం ద్వారా సీఎం మార్పుపై ముందుగా సంకేతాలు ఇచ్చిందన్న అభిప్రాయం ఓవైపు వ్యక్తమవుతుండగా... మరోవైపు అధికారంలో ఉన్న రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి బీజేపీ చర్చించిన సంప్రదాయమేదీ గత 40 ఏళ్లలో లేదనే అంశమూ తెరపైకి వస్తోంది. ఏది ఏమైనా వారిద్దరి రాజకీయ భవిష్యత్తును ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్ణయిస్తారని, మోదీ ఎంపిక మేరకు సీఎం అభ్యర్థి ఎవరో ఖరారవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సర్బానంద... విద్యార్థి నేతగా మొదలై... దిబ్రూగఢ్‌కు చెందిన సర్బానంద సోనోవాల్ ఆ రాష్ట్ర కీలక రాజకీయ నేతల్లో ఒకరిగా ఎదిగారు. బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి చొరబడే అక్రమ వలసదారులను వెనక్కి పంపాలంటూ 1970లలో భారీ ఉద్యమం సాగించిన ఆల్‌అస్సాం స్టూడెంట్స్ యూనియన్‌లో విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. 1992 నుంచి 1999 వరకు ఆ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సంస్థ రాజకీయ అవతారమైన అసోం గణ పరిషత్ (ఏజీపీ)లో 2001లో చేరారు. తదనంతర పరిణామాల్లో 2011లో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2014లో లఖీంపూర్ ఎంపీగా గెలిచి మోదీ మంత్రివర్గంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అయ్యారు. 2016లో అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ఆయనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిని గెలిపించి సీఎం పగ్గాలు చేపట్టారు. హిమంతా... విలక్షణ నేత అస్సాంలోని గువాహటికి చెందిన డాక్టర్‌హిమంతా బిశ్వ శర్మ విలక్షణ రాజకీయ నేతగా అంచెలంచెలుగా ఎదిగారు. కాలేజీ రోజుల్లో విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేసిన అనుభవమున్న శర్మ 2001లో కాంగ్రెస్‌లో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో తొలిసారి ఏజీపీ నేత బీర్గు కుమారు ఫుకన్‌ను ఓడించి జాలుక్‌బరి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2006, 2011లో అదే నియోజకవర్గం నుంచి గెలిచి హ్యాట్రిక్‌కొట్టారు. 2006లో వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శర్మ 2011లో విద్యాశాఖ పగ్గాలు అందుకున్నారు. ఆ శాఖలో మంచి పనితీరు కనబరిచారు. 2014లో నాటి కాంగ్రెస్ సీఎం తరుణ్‌గొగోయ్‌పై తిరుగుబాటు చేసి 2015లో బీజేపీలో చేరారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో జాలుక్‌బరి స్థానం నుంచి తిరిగి గెలవడం ద్వారా ప్రభుత్వంలో కేబినెట్‌మంత్రిగా చేరారు. -
వచ్చే ఎన్నికల్లో గెలిచాక.. సీఎంను నిర్ణయిస్తాం
సమాజ్‌వాదీ పార్టీ, తమ కుటుంబం, తమ బలం, బలగం అంతా ఒక్కటిగానే ఉన్నాయని పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయిస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లేకుండా.. తన తమ్ముడు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్‌తో కలిసి ములాయం మీడియాతో మాట్లాడారు. కొంతమంది తనను ముఖ్యమంత్రిగా ఉండాలని చెబుతున్న మాట నిజమే కానీ.. ఎన్నికలకు రెండు నెలల సమయమే ఉన్నందున ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం ఎందుకని అన్నారు. మీరు ఎన్ని వివాదాస్పద ప్రశ్నలు అడిగినా.. తాను మాత్రం వివాదాస్పద సమాధానం ఒక్కటి కూడా ఇవ్వబోనని చెప్పారు. 2012లో మెజారిటీ తన పేరునే ప్రతిపాదించినా, తాను మాత్రం అఖిలేష్ యాదవ్‌నే ముఖ్యమంత్రి చేశానని, ఇప్పుడు ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సింది ఆయనేనని తెలిపారు. రాంగోపాల్ యాదవ్ చేసిన ప్రకటనలను తాను ఇప్పుడు పెద్ద సీరియస్‌గా పట్టించుకోనన్నారు. కేబినెట్ నుంచి తొలగించిన మంత్రులను మళ్లీ తీసుకుంటారా. లేదా అన్న విషయాన్ని ముఖ్యమంత్రి మీదే వదిలిపెడుతున్నానన్నారు. తమ కుటుంబంలోను, పార్టీలోను విభేదాలు సృష్టించే ప్రయత్నం బయటివ్యక్తులే చేశారని, ఇప్పుడు పార్టీలో అంతా సవ్యంగానే ఉందని చెప్పారు. అఖిలేష్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అఖిలేష్ నాయకత్వంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆయనే తమ ముఖ్యమంత్రి అని చెప్పారు. అమర్‌సింగ్‌ను బహిష్కరిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. శివపాల్ యాదవ్‌ను మళ్లీ కేబినెట్లోకి తీసుకోవడంపై కూడా దాటవేశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా.. ఒక్కొక్కరుగా మాట్లాడాలంటూనే అక్కడినుంచి వెళ్లిపోయారు. -
ప్రస్తుత ముఖ్యమంత్రికే మరో చాన్స్
వచ్చే సంవత్సరం జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉంటారన్నది గందరగోళంగా మారింది. స్వయానా పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్లు ఎవరూ ఆటోమేటిగ్గా సీఎం అభ్యర్థులు కాబోరని చెప్పి అందరినీ అయోమయంలో పారేశారు. అయితే.. ఆయన సన్నిహిత అనుచరుడు ఒకరు మాత్రం 2017 ఎన్నికల్లో సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవేనని కుండ బద్దలుకొట్టారు. ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహిత అనుచరుడైన కిరణ్మయ్ నందా ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అఖిలేష్ యాదవ్‌ను ఇంతకుముందు గట్టిగా వ్యతిరేకించిన పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ కూడా రాబోయే ఎన్నికల్లో అఖిలేష్‌నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను సమర్థిస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా పార్టీ సీనియర్ నాయకుడు రాంగోపాల్ యాదవ్ తాజాగా అన్నయ్య ములాయంకు ఒక లేఖ రాశారు. అందులో.. రాష్ట్రంలో ఉన్న మొత్తం 403 సీట్లకు గాను వంద కంటే తక్కువ స్థానాల్లో గెలిస్తే.. దానికి ములాయమే ఏకైక బాధ్యుడు అవుతారని అందులో పేర్కొన్నారు. -
ప్రత్యామ్నాయం మేమే..
‘ఆడ లేక మగ’ అన్న చందంగా తమిళనాడు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది డీఎంకే లేదా అన్నాడీఎంకే అనేది ఐదు దశాబ్దాలుగా అలవాటుగా మారిపోయింది. పాలిటిక్స్ తెలియని పిల్లోడిని అడిగినా జయలలిత లేదా కరుణానిధి సీఎం అని ఇట్టే చెబుతారు. ఉదయించే సూర్యునికి ఇక శాశ్వత గ్రహణమే, రెండాకులు ఇక శాశ్వతంగా చిరిగిపోయినట్లే అంటున్నారు పాట్టాలిమక్కల్ కట్చి(పీఎంకే) యువజన విభాగ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్. రాజకీయాల్లో పదవుల కోసం ఆరాటపడే ఈరోజుల్లో వెత్తుక్కుంటూ వచ్చిన అవకాశాలను సైతం కాదన్న డాక్టర్ రాందాస్ తనయుడే ఈ అన్బుమణి. ఆ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారు, ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు, మార్పును కోరుతున్నారు. ఇదిగో మేమున్నామని ముందుకొచ్చింది పీఎంకే. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తానని పార్టీ యువజన విభాగం అధ్యక్షులు, ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ అంటున్నారు. ఈ సందర్భంగా సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. - సాక్షి ప్రతినిధి, చెన్నై * హామీలు కాదు, విశ్లేషణలతో ప్రజలను ఒప్పించా * లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టుకున్న డీఎంకే, అన్నాడీఎంకేలు నిషేధం విధిస్తాయా? * రైతు సంక్షేమంలో వైఎస్ఆర్ పాలనే నాకు ఆదర్శం * పీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ రాందాస్ సాక్షి: రాజకీయాల్లో కాకలు తీరిన కరుణానిధే పొత్తుల కోసం వెంపర్లాడిన తరుణంలో మీ పార్టీ ఒంటరిపోరుకు సిద్ధం కావడంలోని మీ ధైర్యం? అన్బుమణి: ఈ ప్రశ్నకు కొంచెం పెద్ద జవాబే చెప్పాల్సి ఉంటుంది. అన్నిపార్టీలు ఎన్నికలు సమీపించిన తరువాత ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. నేను ఏడాది క్రితమే క్యాంపెయిన్ ప్రారంభించా. సీఎం అభ్యర్థిగానే ప్రజల్లోకి వెళ్లాను. దాదాపుగా రాష్ట్రమంతా చుట్టేశాను. 22 జిల్లాల్లో లిక్కర్ వ్యతిరేక ప్రచారాలు చేసినపుడు మహిళలు పెద్ద సంఖ్యలో మద్దతు పలకడమేకాదు పీఎంకేలో చేరిపోయారు. ఏడు రోజులు, ఏడు సిటీలు, ఏడు సమస్యలు అంటూ సరికొత్త విధానంతో ప్రజలవద్దకు వెళ్లాను. ఒక్కో సిటీలో నాలుగు గంటలపాటు ప్రజలతో పరస్పర సంభాషణ సాగిం చాను. ఈ సుదీర్ఘ ప్రయాణం వల్ల ప్రజలు మార్పు కోరుతున్నట్లు స్పష్టమైంది. డీఎంకే లేదా అన్నాడీఎంకేలు యాభై ఏళ్లుగా సాగించిన పాలనతో ప్రజలు విసిగిపోయినట్లు స్పష్టంగా గోచరించింది. ప్రజలు మార్పుకోరుకున్నపుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో డిల్లీలో కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాలే ఉదాహరణ. సాక్షి: పార్టీకి మరింత బలం చేకూరేలా పొత్తులకోసం ఎందుకు ప్రయత్నించలేదు.? అన్బుమణి: ఆ తప్పు జీవితంలో చేయం. రెండుసార్లు ఆ తప్పుచేశాం...ప్రజలకు క్షమాపణ చెప్పాల్సివచ్చింది. ఒకసారి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ, మరోసారి భారతీయ జనతాపార్టీ నాయకత్వంలో ఎన్డీఏతో పొత్తుపెట్టుకుని జీవితంలో పెద్ద పొరపాటు చేశాము. చేసిన తప్పుకు ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాము. కేడర్ ఒత్తిడి మేరకు అలాంటి నిర్ణయం తీసుకవాల్సి వచ్చింది. ఆ తప్పు చేయకుంటే ఈరోజు రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉండేది. సాక్షి: అన్నాడీఎంకే, డీఎంకేల కంటే మెరుగైన పాలనను మీరు ఇస్తారని ఓటర్లను ఎలా నమ్మిస్తారు ? అన్బుమణి: ఆదర్శమైన పాలనకు ఆరు సూత్రాలు. ఆదర్శవంతమైన పాలనకు అరుసూత్రాలు సిద్ధం చేసుకుని వాటిని ఎలా అమలు చేయగలుతామో ప్రజలకు వివరించాను. లిక్కర్ , అవినీతి నిర్మూలన, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక విధానంలో సమూలమైన మార్పులు ...ఈ ఆరు సూత్రాలతో ఆదర్శమైన పాలన అందిస్తాము. కేవలం చెప్పడం కాదు, ఎలా సాధించగలుగుతామో ప్రజలకు సశాస్త్రీయంగా వివరించాను. ప్రభుత్వ లావాదేవీలన్నీ కంప్యూటీకరణ చేస్తాం. పేపర్ అనేది లేకుండా ఈ గవర్నర్సెను ప్రవేశపెడతాం. ముఖ్యమంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉంటా. ఫోన్ ద్వారా ప్రజలు సీఎం సెల్‌కు నేరుగా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే తగిన చర్య ఉంటుంది. ప్రతిపక్ష నేతలతో సత్సంబంధాలు నెరుపుతూ స్వయంగా కలుస్తాను. కేబినెట్ సమావేశాలను సచివాలయంలోగాక జిల్లాల్లో నిర్వహిస్తాను. నాతోపాటూ మంత్రులంతా పాల్గొని ఆయా జిల్లాల సమస్యను చర్చించి వెంటనే నిర్ణయం తీసుకుంటాం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జిల్లాల్లో కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళతా. సాక్షి: అనేక ఆకర్షణీయమైన పథకాలు, ఉచిత వస్తువులకు అలవాటుపడిన ఓటర్లు మీసుపరిపాలనను అర్థం చేసుకుంటారా? అన్బుమణి: ఉచితాల ప్రసక్తేలేదు. దానికోసం వెచ్చించే నిధులను మరో శాశ్వత అభివృద్ధికి వినియోగిస్తాం. మిక్సీలు, గ్రైండర్లు ఉచితంగా ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలకు దూరంగా ఉంటాము. ఆ నిధులను మరో మంచి కార్యక్రమాలకు వినియోగిస్తాం. సాక్షి: ఇరుగు పొరుగు జిల్లాలతో సాగునీటి సమస్యల వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు. ? అన్బుమణి: సాటి ప్రభుత్వాలపై సవాల్ చేసే ధోరణి సరికాదు. సామరస్యంగా మాట్లాడితే సులువుగా అంగీకరిస్తారు. వ్యవసాయానికి సాగునీరు ఎంతో ఆధారం, ఈ విషయంలో ఇరుగు పొరుగు రాష్ట్రాలను స్వయంగా వెళ్లి సామరస్య ధోరణిలో వివాదాలు పరిష్కరిస్తాను. నాకు ఈగో లేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేనే పొరుగురాష్ట్రాల సీఎంల వద్దకు వెళతాను. పరిష్కారం కోసం ఎవరి వద్దకైనా వెళ్లేందుకు నేను సిద్ధం. అంతే గాక నదులు, చెరువులు తదితర నీటి పరివాహక ప్రాంతాల్లో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున చెక్‌డ్యాంలను నిర్మించడం ద్వారా నీటి వనరులను కాపాడుకుంటాము. సాక్షి: అనేక అవస్థలు పడుతున్న అన్నదాతలు అన్బుమణి నుండి ఏమేరకు ఆశించవచ్చు.? అన్బుమణి: వైఎస్ఆర్ పాలనే ఆదర్శం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు ఆదర్శం. రైతు సంక్షేమం కోసం ఆయన రాజకీయజీవితాన్నే అంకితం చేశారు. మాది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం. రైతుల కష్టనష్టాలపై పూర్తిగా అవగాహన ఉంది. రాష్ట్ర జనాభాలో 60 శాతం రైతన్నలే. అన్బుమణి అధికారంలోకి వస్తే తమకు మేలు జరగడం ఖాయమని వారు నమ్ముతున్నారు. వ్యవసాయం, హార్టికల్చర్, వాటర్ మేనేజిమెంట్ ఇలా వ్యవసాయాన్ని మూడుగా విభజించి ముగ్గురు మంత్రులను నియమిస్తాం. వైఎస్ఆర్ తన హయాంలో ఏపీ వార్షిక బడ్జెట్లో వైఎస్ఆర్ వ్యవసాయానికి రూ.18వేల కోట్లు కేటాయించారు. 35 హెక్టార్ల సాగుభూమిని 75 లక్షల హెక్టార్లకు పెంచగలిగారు. ఇదే పద్ధతిని నా పాలనలో అనుసరిస్తాను. ప్రస్తుతం తమిళనాడులో మొత్తం 48 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని కోటి హెక్టార్లకు పెంచడం నా లక్ష్యం. ఇందులో నీటి ఆధారిత 33 లక్షల హెక్టార్లను 60 లక్షల హెక్టార్లకు పెంచుతాను. రూ.55వేల కోట్లు వ్యవసాయ బడ్జెట్ నిర్ణయం. సాక్షి: వ్యవసాయం సరే గిట్టుబాటు దర మాటేమిటి ? అన్బుమణి: అందరికీ అన్నంపెట్టే రైతులు తాము పండించిన ధాన్యానికి తాము ధర నిర్ణయించుకోలేని పరిస్థితి నిజంగా దుర్భరమే. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు వ్యవసాయ దిగుబడుల ధరను రైతులు, నిపుణులే నిర్ణయిస్తారు. ప్రభుత్వం కేవలం మానిటరింగ్ చేస్తుంది. 30 జిల్లాల్లో స్పెషల్ ఆగ్రో ఎకనామిక్ జోన్లను ఏర్పాటు చేస్తాను. అలాగే ప్రకృతి సిద్ధ వ్యవసాయాన్ని ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తాం. సాక్షి: మీ ప్రణాళికను వింటూ ఉంటే మాకు నమ్మశక్యంగానే ఉంది. మరి ఓటర్ల మాటేమిటి ? అన్బుమణి: రాష్ట్రంలో 5.70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 60 శాతం మంది తటస్థ ఓటర్లు. అంటే పార్టీలకు అతీతంగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించేవారు. 35 ఏళ్లకు అటు ఇటుగా ఉండే యువత 2.5 లక్షల వరకు ఉన్నారు. వీరంతా నా ఆలోచనను విశ్వసిస్తున్నారు. గడచిన పార్లమెంటు ఎన్నికల్లో ధర్మగిరిలో ఎంపీగా గెలిచానంటే సీనియర్ సిటిజన్లు, తటస్థ ఓటర్లే ప్రధాన కారణం. అలాగే మహిళలు మద్య నిషేధం కోరుతున్నారు. సాక్షి: కులపరమైన ముద్రను అధగమించారా? అన్బుమణి: వన్నియర్ల సమస్యలపై పోరాడాం. అంతమాత్రానా మాది కులపరమైన పార్టీ కాదు. మా పార్టీలో అన్ని కులాలు, మతాలవారు ఉన్నారు. సాక్షి: రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో మీరు ఎన్నిగెలుస్తారని ధీమాతో ఉన్నారు.? అన్బుమణి: 150 సీట్లు గ్యారంటీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా స్పష్టమైన మెజార్టీ సాధిస్తాం. సాక్షి: మీకు అంతటి నమ్మకం ఎలా వచ్చింది. ? అన్బుమణి: 1989లో పార్టీని ప్రారంభించి ఈ 26 ఏళ్ల కాలంలో ఏటా షాడో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాం. అంటే మా పార్టీ అధికారంలో ఉంటే బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయి, దేనికి ఎంత ప్రధాన్యత అనేది ప్రజలకు చెబుతూనే ఉన్నాము. నిర్మాణాత్మకమైన రాజకీయాలను నడుపుతున్నాము. అందుకనే పార్టీ పెట్టిన కొత్తల్లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించాము. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ హత్యోదంతం హవాలోనూ ఒక ఎమ్మెల్యేను గెలిపించుకున్నాము. 1996లో నలుగురు ఎమ్మెల్యేలు గెలవగా 8.5 శాతం ఓట్లు సాధించాం. మధ్యలో యూపీఏ, ఎన్డీఏలతో పొత్తులకు పోకుండా అదే పోకడను కొనసాగించి ఉంటే ఈపాటికి అధికారంలోకి వచ్చేవారం. సాక్షి: తమిళనాడులో సంఖ్యాపరంగా ద్వితీయ పౌరులైన తెలుగువారు ఎదుర్కొంటున్న భాషాపరమైన సమస్యపై మీ సమాధానం ఏమిటి? అన్బుమణి: తమిళనాడు ప్రజల్లో తెలుగువారు కూడా ఒక భాగమే. రాష్ర్టంలో తమిళ జనాభా తరువాత తెలుగువారే అధికం, రాష్ట్రాలుగా విడిపోయాముగానీ ఒకప్పుడు అందరం ఒకటే కదా. తమిళనాడు నుండి ఏపీ, తెలంగాణ గా విడిపోయినా ఇక్కడ స్థిరపడిపోయిన తెలుగువారికి సమగౌరవం ఇవ్వడం మా విధి. మా ప్రభుత్వం వస్తే ఈ విషయాన్ని స్పష్టంగా పాటిస్తాం. నిర్బంధ తమిళం వంటి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తాం. సాక్షి: రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అనేది ఈ ఎన్నికల్లో ఒక ప్రధాన నినాదంగా మారిపోయింది. అన్నిపార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో సైతం చోటు చేసుకునే అవకాశం ఉంది. మీ పార్టీ స్టాండ్ ఏమిటి ? అన్బుమణి: రాష్ట్రంలో అనాది నుంచి అంటే గత మూడు దశాబ్దాలుగా మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నది మా పార్టీ మాత్రమే. అంతేకాదు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నాం. ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై ఉండే 600 టాస్మాక్ దుకాణాలను తమ ఉద్యమాలతో ఇటీవల మూయించాం. ఒక్క లిక్కర్ మాత్రమే కాదు సిగరెట్ సైతం అనారోగ్యమని భావించేవారం. అందుకే గతంలో కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రిగా పొగత్రాగడం (సిగరెట్) ఎంతటి చేటో తెలియజెపుతూ మంచి ఫలితాలను రాబట్టాను. కేంద్రమంత్రిగా మంచి చేశాడు, సీఎం అయితే కూడా అలానే చేస్తాడు, సంపూర్ణ మద్య నిషేధం సాధిస్తాడని ప్రజలు విశ్వసిస్తున్నారు. సాక్షి: మరి ఇదే వాగ్దానాన్ని జయలలిత, కరుణానిధి కూడా ఇచ్చారు కదా ? అన్బుమణి: సంపూర్ణ మద్య నిషేధం విషయంలో జయలలిత, కరుణ ఇద్దరూ సమానులే. అధికారంలో ఉన్నపుడు మద్యాన్ని ఏరులై పారించి నేడు మోసపూరిత మాటలు వల్లిస్తున్నారు. మద్య నిషేధం అమలు సాధ్యం కాదని గతంలో అసెంబ్లీలో ప్రకటించిన జయలలిత నేడు ఎన్నికల వేళ హామీ ఇవ్వడం ప్రజలను చీట్ చేయడమే అవుతుంది. జయలలితలో ఆ ఉద్దేశమే ఉండి ఉంటే ఐదేళ్ల క్రితం ఆమె అధికారంలోకి వచ్చినపుడే చేసి ఉండవచ్చు. అలాగే కరుణానిధి సైతం గత 20 ఏళ్ల కాలంలో మద్య నిషేధంపై ఆరుసార్లు ప్రకటించారు. నేడు ఏడోవాగ్దానంతో ఎన్నికలకు దిగుతున్నాడు. రాష్ట్రంలో 12 లిక్కర్ ఫ్యాక్టరీలు ఉండగా వాటిల్లో 6 డీఎంకే వారివి, 3 అన్నాడీఎంకే, 2 కాంగ్రెస్ వారివి. వీరా రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం సాధించేది. సాక్షి: పీఎంకే వ్యవస్థాపకులైన డాక్టర్ రాందాస్ రాజకీయాల్లో ఉన్నా ఎన్నికల్లో పోటీచేయక పోవడానికి కారణం ఏమిటి ? అన్బుమణి: పదవులకు నాన్న దూరం 40 ఏళ్లక్రితం క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. అయితే పార్లమెంటు, అసెంబ్లీలోకి అడుగుపెట్టనని నిర్ణయించుకున్నారు. నైతిక విలువలు, సిద్ధాంతపరమైన రాజకీయాలు ఆయనకు ఇష్టం. అందుకే ఇంతవరకు ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వాజ్‌పేయి,రాజీవ్‌గాంధీ స్వయంగా ఆహ్వానించినా సున్నితంగా నిరాకరించారు. సాక్షి: ఆల్‌ది బెస్ట్ సార్. అన్బుమణి: ధ్యాంక్స్. -
సీఎం అభ్యర్థి నేనే
టీనగర్: తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు బీజేపీ అధినేత నరేంద్ర మోడీ మద్దతు తెలుపుతారని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశం కోయంబేడులోగల పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. సమావేశంలో పార్లమెంటు ఎన్నికల్లో డీఎండీకే వైఫల్యం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రానున్న అసెంబ్లీ ఎన్నికల గురించిన వ్యూహం వంటి వాటిపై చర్చించారు. సమావేశంలో అనేక తీర్మానాలు ప్రవేశపెట్టారు. విజయకాంత్ మాట్లాడుతూ డీఎండీకే కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి తమ జిల్లా పరిధిలో గల ప్రాంతాల్లో పార్టీ నాయకులు సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరారు. నగర గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు సూచనలు అందజేయాలన్నారు. బీజేపీ నాయకులు కొందరు రజనీకాంత్‌ను రాజకీయంలోకి ఆహ్వానిస్తున్నారని అయితే అది విఫలమైందన్నారు. రాష్ట్రంలోను, కేంద్రంలోను బీజేపీతో తమకు సత్ సంబంధాలు ఉన్నాయన్నారు. అందువల్ల బీజేపీ కూటమిలో పొత్తులు కుదుర్చుకుంటామన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి తాను మాత్రమేనని ఇందులోఎటువంటి మార్పు లేదన్నారు. అవినీతిని అంతమొందించేందుకు, రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మోడి తనకు మద్దతు ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
రజనీకాంత్‌కు సాదర స్వాగతం: బీజేపీ
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను తాము ఆకర్షిస్తున్నామన్న వార్తలను తమిళనాడు బీజేపీ ఖండించింది. అయితే.. ఆయన వస్తానంటే మాత్రం తమ పార్టీ సాదర స్వాగతం పలుకుతుందని చెప్పింది. ఈ మేరకు బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు తమిళసలై సౌందరరాజన్ మాట్లాడారు. రజనీకాంత్ అంటే బీజేపీ చాలా సానుకూలంగా ఉందని, ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీని కూడా ఎన్నికల ప్రచార సమయంలో కలిశారని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీని బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారన్నవి మాత్రం మీడియాలో వస్తున్న కథనాలు మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఆ కథనాలను తమ పార్టీ ఎప్పుడూ ధ్రువీకరించలేదని అన్నారు. గతంలో కూడా ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నదులను అనుసంధానం చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టుకు రజనీకాంత్ కోటి రూపాయల విరాళం ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. జాతీయ దృక్పథం ఉన్న రజనీని తాము సాదరంగా స్వాగతిస్తామని తెలిపారు.