వచ్చే ఎన్నికల్లో గెలిచాక.. సీఎంను నిర్ణయిస్తాం
వచ్చే ఎన్నికల్లో గెలిచాక.. సీఎంను నిర్ణయిస్తాం
Published Tue, Oct 25 2016 3:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
సమాజ్‌వాదీ పార్టీ, తమ కుటుంబం, తమ బలం, బలగం అంతా ఒక్కటిగానే ఉన్నాయని పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయిస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లేకుండా.. తన తమ్ముడు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్‌తో కలిసి ములాయం మీడియాతో మాట్లాడారు. కొంతమంది తనను ముఖ్యమంత్రిగా ఉండాలని చెబుతున్న మాట నిజమే కానీ.. ఎన్నికలకు రెండు నెలల సమయమే ఉన్నందున ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం ఎందుకని అన్నారు. మీరు ఎన్ని వివాదాస్పద ప్రశ్నలు అడిగినా.. తాను మాత్రం వివాదాస్పద సమాధానం ఒక్కటి కూడా ఇవ్వబోనని చెప్పారు. 2012లో మెజారిటీ తన పేరునే ప్రతిపాదించినా, తాను మాత్రం అఖిలేష్ యాదవ్‌నే ముఖ్యమంత్రి చేశానని, ఇప్పుడు ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సింది ఆయనేనని తెలిపారు.
రాంగోపాల్ యాదవ్ చేసిన ప్రకటనలను తాను ఇప్పుడు పెద్ద సీరియస్‌గా పట్టించుకోనన్నారు. కేబినెట్ నుంచి తొలగించిన మంత్రులను మళ్లీ తీసుకుంటారా. లేదా అన్న విషయాన్ని ముఖ్యమంత్రి మీదే వదిలిపెడుతున్నానన్నారు. తమ కుటుంబంలోను, పార్టీలోను విభేదాలు సృష్టించే ప్రయత్నం బయటివ్యక్తులే చేశారని, ఇప్పుడు పార్టీలో అంతా సవ్యంగానే ఉందని చెప్పారు. అఖిలేష్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అఖిలేష్ నాయకత్వంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆయనే తమ ముఖ్యమంత్రి అని చెప్పారు. అమర్‌సింగ్‌ను బహిష్కరిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. శివపాల్ యాదవ్‌ను మళ్లీ కేబినెట్‌లోకి తీసుకోవడంపై కూడా దాటవేశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా.. ఒక్కొక్కరుగా మాట్లాడాలంటూనే అక్కడినుంచి వెళ్లిపోయారు.
Advertisement
Advertisement