samajwadi party crisis
-
సరికొత్త పొత్తులు.. కూడికలు, తీసివేతలు!
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు పలు రకాల మలుపులు తిరుగుతున్నాయి. బాబాయ్ - అబ్బాయ్ మధ్య మొదలైన చిన్న వివాదం కాస్తా చినికి చినికి గాలివానగా మారింది. ఒక్కో రోజు గడిచేకొద్దీ అది మరింత ముదురుతోంది. గత వారంరోజులుగా ఒకవైపు రాజీనామాలు, మరోవైపు తొలగింపులు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. పార్టీలో విభేదాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. సమాజ్‌వాదీ పార్టీ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆర్ఎల్డీలతో పొత్తుపెట్టుకునే అవకాశం ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ములాయం కూడా ఈ పొత్తుకు సూత్రప్రాయంగా అనుమతి తెలిపారని, త్వరలో ఆయా పార్టీలతో చర్చలు ఉండొచ్చని అన్నారు. అయితే తాము ఇంతవరకు యూపీలో ఏ పార్టీతోనూ పొత్తు చర్చలు మొదలుపెట్టలేదని కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీపడుతున్న షీలా దీక్షిత్ చెప్పారు. ఆర్ఎల్డీ కూడా పొత్తు వార్తలను ఖండించింది. మరోవైపు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు మద్దతు పలికే నాయకుల సంఖ్య పార్టీలో పెరుగుతోంది. కీలక నేతలు నరేష్ అగర్వాల్, బేణీప్రసాద్ వర్మ, రేవతీ రమణ్ సింగ్ లాంటి వాళ్లతో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్ నందా కూడా సీఎం బ్రిగేడ్‌తో పాటు ఉన్నట్లు స్పష్టం చేశారు. నవంబర్ మూడో తేదీ నుంచి సీఎం అఖిలేష్ యాదవ్ ప్రారంభించే రథయాత్రలో కిరణ్మయ్ నందా కూడా పాల్గొంటారని అంటున్నారు. మంత్రివర్గంలోకి మళ్లీ తనను తీసుకునే అవకాశం లేదని స్పష్టం కావడంతో శివపాల్ యాదవ్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడంతో పాటు ఇంటిముందు గోడమీద ఉన్న నేమ్ ప్లేటును కూడా తొలగించారు. ఆయన అధికారిక వాహనాన్ని కూడా అప్పగించేశారు. తీసేసిన మంత్రులను మళ్లీ పదవుల్లో నియమించాలని ములాయం చెప్పినా.. అఖిలేష్ మాత్రం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. మరో చిన్నాన్న.. ప్రొఫెసర్ సాబ్ రాంగోపాల్ యాదవ్‌తో పాటు.. బహిష్కరణకు గురైన తన అనుచరులను పార్టీలోకి తీసుకునేవరకు మంత్రులను మళ్లీ తీసుకునేది లేదని ఆయన చెప్పినట్లు సమాచారం. -
వచ్చే ఎన్నికల్లో గెలిచాక.. సీఎంను నిర్ణయిస్తాం
సమాజ్‌వాదీ పార్టీ, తమ కుటుంబం, తమ బలం, బలగం అంతా ఒక్కటిగానే ఉన్నాయని పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయిస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లేకుండా.. తన తమ్ముడు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్‌తో కలిసి ములాయం మీడియాతో మాట్లాడారు. కొంతమంది తనను ముఖ్యమంత్రిగా ఉండాలని చెబుతున్న మాట నిజమే కానీ.. ఎన్నికలకు రెండు నెలల సమయమే ఉన్నందున ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం ఎందుకని అన్నారు. మీరు ఎన్ని వివాదాస్పద ప్రశ్నలు అడిగినా.. తాను మాత్రం వివాదాస్పద సమాధానం ఒక్కటి కూడా ఇవ్వబోనని చెప్పారు. 2012లో మెజారిటీ తన పేరునే ప్రతిపాదించినా, తాను మాత్రం అఖిలేష్ యాదవ్‌నే ముఖ్యమంత్రి చేశానని, ఇప్పుడు ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సింది ఆయనేనని తెలిపారు. రాంగోపాల్ యాదవ్ చేసిన ప్రకటనలను తాను ఇప్పుడు పెద్ద సీరియస్‌గా పట్టించుకోనన్నారు. కేబినెట్ నుంచి తొలగించిన మంత్రులను మళ్లీ తీసుకుంటారా. లేదా అన్న విషయాన్ని ముఖ్యమంత్రి మీదే వదిలిపెడుతున్నానన్నారు. తమ కుటుంబంలోను, పార్టీలోను విభేదాలు సృష్టించే ప్రయత్నం బయటివ్యక్తులే చేశారని, ఇప్పుడు పార్టీలో అంతా సవ్యంగానే ఉందని చెప్పారు. అఖిలేష్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అఖిలేష్ నాయకత్వంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆయనే తమ ముఖ్యమంత్రి అని చెప్పారు. అమర్‌సింగ్‌ను బహిష్కరిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. శివపాల్ యాదవ్‌ను మళ్లీ కేబినెట్లోకి తీసుకోవడంపై కూడా దాటవేశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా.. ఒక్కొక్కరుగా మాట్లాడాలంటూనే అక్కడినుంచి వెళ్లిపోయారు.