సరికొత్త పొత్తులు.. కూడికలు, తీసివేతలు!
సరికొత్త పొత్తులు.. కూడికలు, తీసివేతలు!
Published Wed, Oct 26 2016 5:03 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు పలు రకాల మలుపులు తిరుగుతున్నాయి. బాబాయ్ - అబ్బాయ్ మధ్య మొదలైన చిన్న వివాదం కాస్తా చినికి చినికి గాలివానగా మారింది. ఒక్కో రోజు గడిచేకొద్దీ అది మరింత ముదురుతోంది. గత వారంరోజులుగా ఒకవైపు రాజీనామాలు, మరోవైపు తొలగింపులు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. పార్టీలో విభేదాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. సమాజ్‌వాదీ పార్టీ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆర్ఎల్‌డీలతో పొత్తుపెట్టుకునే అవకాశం ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ములాయం కూడా ఈ పొత్తుకు సూత్రప్రాయంగా అనుమతి తెలిపారని, త్వరలో ఆయా పార్టీలతో చర్చలు ఉండొచ్చని అన్నారు. అయితే తాము ఇంతవరకు యూపీలో ఏ పార్టీతోనూ పొత్తు చర్చలు మొదలుపెట్టలేదని కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీపడుతున్న షీలా దీక్షిత్ చెప్పారు. ఆర్ఎల్‌డీ కూడా పొత్తు వార్తలను ఖండించింది.
మరోవైపు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు మద్దతు పలికే నాయకుల సంఖ్య పార్టీలో పెరుగుతోంది. కీలక నేతలు నరేష్ అగర్వాల్, బేణీప్రసాద్ వర్మ, రేవతీ రమణ్ సింగ్ లాంటి వాళ్లతో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్ నందా కూడా సీఎం బ్రిగేడ్‌తో పాటు ఉన్నట్లు స్పష్టం చేశారు. నవంబర్ మూడో తేదీ నుంచి సీఎం అఖిలేష్ యాదవ్ ప్రారంభించే రథయాత్రలో కిరణ్మయ్ నందా కూడా పాల్గొంటారని అంటున్నారు. మంత్రివర్గంలోకి మళ్లీ తనను తీసుకునే అవకాశం లేదని స్పష్టం కావడంతో శివపాల్ యాదవ్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడంతో పాటు ఇంటిముందు గోడమీద ఉన్న నేమ్ ప్లేటును కూడా తొలగించారు. ఆయన అధికారిక వాహనాన్ని కూడా అప్పగించేశారు. తీసేసిన మంత్రులను మళ్లీ పదవుల్లో నియమించాలని ములాయం చెప్పినా.. అఖిలేష్ మాత్రం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. మరో చిన్నాన్న.. ప్రొఫెసర్ సాబ్ రాంగోపాల్ యాదవ్‌తో పాటు.. బహిష్కరణకు గురైన తన అనుచరులను పార్టీలోకి తీసుకునేవరకు మంత్రులను మళ్లీ తీసుకునేది లేదని ఆయన చెప్పినట్లు సమాచారం.
Advertisement
Advertisement