అందులో శివపాల్ పేరు లేదు
సమాజ్వాద్ పార్టీలో తండ్రికొడుకుల మధ్య నెలకొన్న సైకిల్ సమరానికి సోమవారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటనతో తెరపడింది. కొడుకు అఖిలేష్కే సైకిల్ గుర్తు ఇస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించడంతో, ఇక నేతాజీ సైతం ఎన్నికల సంఘం నిర్ణయానికి తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసీ ప్రకటన అనంతరం రెండో సారి తండ్రితో భేటీ అయిన ఎస్పీ చీఫ్, కొడుకు అఖిలేష్కు, ములాయం 38 అభ్యర్థులతో కూడిన ఓ జాబితాను సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో కొడుకుకు ఇష్టంలేని తన తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్ పేరును ములాయం చేర్చలేదని వెల్లడవుతోంది. కొడుకు వ్యతిరేకతతో తీవ్రంగా మనస్తాపం పొందిన సమయంలో నేతాజీకి వెన్నంటే ఉన్న శివ్పాల్ పేరును ములాయం తన అభ్యర్థుల జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. అయితే శివ్ పాల్ కొడుకు ఆదిత్య యాదవ్ పేరును మాత్రం నేతాజీ తన జాబితాలో చేర్చారు.
అంతేకాక, ములాయం వారసత్వం కోసం పాకులాడుతున్న ఆయన చిన్న కోడలు అపర్ణ యాదవ్, ఓం ప్రకాశ్ సింగ్, నారద్ రాయ్, షదాబ్ ఫాతిమా, గాయత్రి ప్రసాద్ ప్రజాపతిలకు ములాయం తన జాబితాలో ప్రత్యేక స్థానం కల్పించినట్టు తెలుస్తోంది. అఖిలేష్కు వ్యతిరేకంగా పోటీకి దిగుతానని ఫైర్ అయిన ములాయం సింగ్, ఇక కొడుకు అభ్యర్థనకు తలొగ్గినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. సైకిల్ గుర్తు అఖిలేష్కే కేటాయిస్తు ఎన్నికల సంఘం ప్రకటించిన అనంతరం అఖిలేష్ తండ్రితో భేటీ అయి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం మంగళవారం కూడా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. రాష్ట్రంలో మరోసారి ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే తమ లక్ష్యమని అఖిలేష్ చెప్పారు. ప్రతిఒక్కర్ని తనతో కలుపుకుని పోటీ చేస్తామని పేర్కొన్నారు. నేతాజీని కూడా కలుపుకుని పోటీ చేస్తామని, తమ బంధుత్వం ఎన్నటికీ విడదీయరానిదని అఖిలేష్ అన్నట్టు తెలిసింది.