మీ కన్నా నేనే పెద్ద గూండాను!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం నేపథ్యంలో కొడుకు అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశించి పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న యువత కన్నా తానే పెద్ద గూండానని తేల్చిచెప్పారు. కొడుకు అఖిలేశ్, బాబాయి శివ్‌పాల్ యాదవ్ మధ్య ఆధిపత్యం కోసం ఎస్పీలో తీవ్రస్థాయిలో రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా శివ్‌పాల్‌తోపాటు ఆయన సన్నిహిత మంత్రులపై సీఎం అఖిలేశ్ వేటు వేయగా.. అఖిలేశ్ సన్నిహితుడు రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి శివ్‌పాల్ యాదవ్ గెంటేసిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ శివ్‌పాల్-అఖిలేశ్ మధ్య నిట్టనిలువుగా చీలిపోయింది.
ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ఎస్పీ అత్యవసర భేటీని ములాయం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఊహించినట్టుగానే అఖిలేశ్‌పై పరోక్ష వ్యాఖ్యలతో ములాయం విరుచుకుపడ్డారు. అదేసమయంలో ఈ సంక్షోభానికి కారణమైనట్టు భావిస్తున్న తమ్ముడు శివ్‌పాల్, సీనియర్ నేత అమర్‌సింగ్‌కు మద్దతు పలికారు. ఆయన ఏమన్నారంటే..
- పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఎంతో క్లిష్టమైనదని నాకు తెలుసు. పార్టీలో ఇలాంటి విభేదాలు రావడం బాధ కలిగిస్తోంది
- ఎంతో కష్టపడి మేం ఈ పార్టీని స్థాపించాం.
- మేం యువతకు ప్రాధాన్యం ఇచ్చాం. యువత పార్టీలో ఎక్కువసంఖ్యలో చేరేవిధంగా పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేశాం.
- కానీ ఈ పార్టీలో చేరిన యువ నాయకులు తమకుతాము గూండాలం అనుకుంటున్నారు. కానీ నేను వారి కన్నా ఇంకా పెద్ద గూండాను.
- ఇది నేను స్థాపించిన పార్టీ. ఈ రోజుకూ నేను బలహీన వ్యక్తిని కాదు. యువత నా వెంట లేరని ఎంతమాత్రం అనుకోకండి.
- విమర్శలను చెవికెక్కించుకోలేని వారు నాయకుడిగా ఎదగలేరు
- కొంతమంది మంత్రులు భజనపరులుగా మారిపోయారు. పెద్ద మనసుతో ఆలోచించలేనివారు మంత్రులు కాలేరు.
- పార్టీలోని బలహీనతలపై పోరాడాల్సిన సమయంలో మనలో మనం పోరాడుకుంటున్నాం.
-
భజనపరులతో, నినాదాలతో పార్టీని నడిపించలేం.