తమ్ముడికే ములాయం మద్దతు!
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న కుటుంబపోరుకు తెరదించేందుకు పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్వయంగా రంగంలోకి దిగారు. న్యూఢిల్లీలో ఉన్న ఆయన గురువారం లక్నో బయలుదేరారు. లక్నోలో గురువారం పార్టీ సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. అదేవిధంగా తనయుడు, యూపీ సీఎం అఖిలేశ్‌తోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
పార్టీ అధ్యక్ష పదవి విషయంలో తనయుడు అఖిలేశ్, తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ మధ్య అంతర్గత వర్గ పోరు భగ్గుమన్న సంగతి తెలిసిందే. అఖిలేశ్‌ను ఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. ఆ పదవిని తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌కు ములాయం కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవమానంతో అఖిలేశ్ రగిలిపోతున్నప్పటికీ ములాయం తమ్ముడికే మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది.
స్థానిక టీవీ చానెళ్ల కథనం ప్రకారం పార్టీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా శివ్‌పాల్ యాదవ్‌కు ములాయం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా ఆయన అఖిలేశ్ కేబినెట్‌లోనూ మంత్రిగా కొనసాగుతారని తేల్చి చెప్పినట్టు సమాచారం. తనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో ప్రతీకార చర్యగా శివ్‌పాల్ యాదవ్ మంత్రిత్వశాఖలకు కోతపెట్టి.. ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే.
ములాయంను ఎవరూ సవాల్ చేయకూడదు!
అన్న కొడుకు అఖిలేశ్ వ్యతిరేకిస్తున్నప్పటికీ తాను ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతానని శివ్‌పాల్ యాదవ్ స్పష్టం చేశారు. తనను ఎస్పీ చీఫ్‌గా నియమిస్తూ ములాయం నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని ఎవరూ కూడా సవాల్ చేయకూడదని మీడియాతో చెప్పారు. పార్టీ ఐక్యంగా ఉందని, 2017లో మరోసారి అధికారాన్ని సాధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.