మోదీపై ములాయం అనూహ్య వ్యాఖ్యలు
లక్నో: బీజేపీ నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సమయం వచ్చినప్పుడల్లా విరుచుకుపడే ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తాజాగా అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అఖిలేశ్-శివ్‌పాల్ యాదవ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని చల్లార్చేందుకు ములాయం లక్నోలో పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'ప్రధాని మోదీని చూడండి. అకింతభావం, అకుంఠిత శ్రమతో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన తన తల్లిని వీడబోనని ఎప్పుడూ చెప్తూ ఉంటారు' అని ములాయం ప్రశంసించారు. అదేవిధంగా తాను తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌ను, సీనియర్ నేత అమర్‌సింగ్‌ను వీడబోనని స్పష్టం చేశారు. "అమర్ సింగ్ నాకు సోదరుడు లాంటివాడు. కష్టసమయాల్లో ఎన్నోసార్లు నాకు అండగా నిలిచాడు. శివ్‌పాల్ ప్రజానాయకుడు. నా కోసం, పార్టీ కోసం శివ్‌పాల్ చేసిన కృషిని నేను ఎప్పటికీ మరువను. వారిద్దరినీ వదులుకోలేను' అని ములాయం అన్నారు. అమర్ సింగ్ చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోయాయని, ఆయనను తప్పుబట్టడానికి ఏమీ లేదని చెప్పారు.