కొడుకు కోసం తమ్ముణ్ని బలి చేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌పై విమర్శలు కురిపించారు. ములాయం తన కొడుకు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కోసం, తమ్ముడు శివపాల్ యాదవ్‌ను బలిపశువును చేశారని విమర్శించారు.
ములాయం కుటుంబంలో విభేదాలన్నీ డ్రామాగా ఆమె అభివర్ణించారు. అఖిలేష్ తమతో విభేదిస్తున్నట్టుగా ములాయం డ్రామా నడిపించారని ఆరోపించారు. అఖిలేష్ ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ములాయం కుటుంబ సభ్యులు ఈ నాటకం ఆడారని ధ్వజమెత్తారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అఖిలేష్‌కు ఓటమి ఖాయమని మాయావతి అన్నారు. ఇక ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రథయాత్రపై స్పందిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, అభ్యర్థులను నిలబెట్టలేని దయనీయ పరిస్థితిలో ఉందని అన్నారు. యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో మాయావతి పైవిధంగా స్పందించారు.