
కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్యకే అప్పగించాలని..
ఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఒక అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అధికారిక ప్రకటన లాంఛనమని సమాచారం.
ఆదివారం జరిగిన సీఎల్పీ భేటీలో 135 మందిలో 90 మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకే మద్దతు ఇచ్చారని, ఈ విషయాన్ని పార్టీ పరిశీలకులు హైకమాండ్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారని తెలుస్తోంది. ఇంకోవైపు సోమవారం ఢిల్లీకి వెళ్లిన సిద్ధరామయ్య.. కీలక నేతలతో వరుసగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇంకోవైపు అవకాశాలు సన్నగిల్లుతుండడంతో సీఎం రేసులో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్.. ఒకింత అసహనం, అసంతృప్తితో కూడిన స్టేట్‌మెంట్లు ఇస్తూ వస్తున్నారు.
డీకేకు వైద్య పరీక్షలు
డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు ఆయన అనుచర గణం చెబుతోంది. తనకు ఆరోగ్యం బాగోలేదని ఆయన కేడర్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. ఆరోగ్యం కుదుటపడితే రేపు(మంగళవారం) ఆయన ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది.
ఇదీ చదవండి: అవసరమైతే నిరసన తెలుపుతా-డీకే శివకుమార్