సాక్షి, ఢిల్లీ/బెంగళూరు: కౌన్ బనేగా కర్ణాటక ముఖ్యమంత్రి?. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీతో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం ఎంపికలో మాత్రం తర్జన భర్జనలు పడుతోంది. సీఎం రేసులో ప్రయారిటీ క్యాండిడేట్‌లుగా ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో ఎవరిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనేదానిపై చర్చలతో హస్తిన హీటెక్కిపోతోంది. రేపటి కల్లా పేరు ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో..
కొందరు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లిన సీనియర్ నేత సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనే ముఖ్యమంత్రి అవుతానని ఆశిస్తున్నా. నిన్న(ఆదివారం) జరిగిన సీఎల్పీ భేటీలో మెజార్టీ ఎమ్మెల్యేలు నన్ను ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికే కట్టుబడి ఉంటా. డీకే శివకుమార్‌తో నాకు మంచి స్నేహం ఉంది’’ అని 75 ఏళ్ల సిద్ధరామయ్య పేర్కొన్నారు. మరో 24 గంటల్లో సీఎం ఎవరో తెలుస్తుందని వ్యాఖ్యానించారాయన.
ఇక సిద్ధరామయ్య వెంట ఉన్న ఎమ్మెల్యేలలో దళిత, మైనార్టీ, ట్రైబల్, ఓబీసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ వర్గాల ప్రజాప్రతినిధుల మద్దతు తనకు ఉందని అధిష్టానం బలనిరూపణ కోసమే ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది. హైకమాండ్‌తో భేటీ అనంతరం ఆయన ఈ సాయంత్రం రాహుల్ గాంధీతో భేటీ కావొచ్చని తెలుస్తోంది.
మరోవైపు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్(62) కూడా నేడు ఢిల్లీకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన బెంగళూరులోనే ఉండడం, తాను ఢిల్లీకి వెళ్లడం లేదని డీకే శివకుమార్ స్పష్టం చేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ‘‘నేను ఢిల్లీ వెళ్లడం లేదు. నా పుట్టినరోజు వేడుకలు ఉన్నందున ఇంట్లోనే ఉంటున్నా. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా’’ అని పేర్కొన్నారాయన. అధిష్టానం నుంచి పిలుపు రానందు వల్లే ఆయన ఢిల్లీ పర్యటనకు దూరం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అధిష్టానం పిలిస్తే మాత్రం ఆయన ఢిల్లీకి వెళ్లొచ్చని సమాచారం.
కర్ణాటక సీఎం కుర్చీ విషయంలో డీకే శివకుమార్ ఓ మెట్టు కిందకు దిగొద్దని నిశ్చయించుకున్నట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. డీకే శివకుమార్‌ను బుజ్జగించేందుకు ఏఐసీసీ పరిశీలకుడు, కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. మూడు గంటలపాటు వీళ్లు భేటీ జరిగింది. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి ప్రతిపాదనను సైతం డీకే తిరస్కరించినట్లు సమాచారం. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి.. లేకుంటే కేబినెట్‌లో స్థానం కూడా వద్దంటూ డీకే, సూర్జేవాలాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బుజ్జిగింపుల పర్వంతో కాంగ్రెస్ హైకమాండ్ ఇద్దరిలో ఎవరిని సీఎం చేస్తుందో చూడాలి.
ఇదీ చదవండి: డీకేకు సీఎం పదవి దూరం.. కారణం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment