ఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఫలితాలు వెలువడి నాలుగురోజులు గడుస్తున్నా.. అన్నీ తెలిసి కూడా ఇప్పుడు మల్లగుల్లాలు పడడం కాంగ్రెస్ హైకమాండ్ వంతు అవుతోంది. కాబోయే సీఎం సిద్ధరామయ్యేనంటూ ఈ ఉదయం విస్తృతంగా ప్రచారం జరగ్గా.. ఇంకా నిర్ణయమే జరగలేదంటూ చల్లగా కబురు చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా. అయితే చర్చోపచర్చల్లో.. సీఎం కుర్చీకి బదులుగా డీకే శివకుమార్ ముందు పార్టీ రెండు ఆఫర్లను ఉంచిందని తెలుస్తోంది.
కర్ణాటక ముఖ్యమంత్రి పోస్ట్‌కు బదులుగా తను పడిన కష్టానికి డీకే శివకుమార్‌కు.. రెండు ఆఫర్లు ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో జరిగిన రెండు గంటల భేటీలో వీటి మీదే చర్చ జరిగినట్లు పార్గీ వర్గాలు చెబుతున్నాయి. అందులో..
మొదటిది.. మరెవరికీ డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకుండా కేవలం డీకే శివకుమార్ ఒక్కడికి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం. దాంతో పాటు ఇప్పుడున్న పీసీసీ చీఫ్ కొనసాగించడం. అదనంగా.. ఆరు పోర్ట్‌పోలియోలు(అదీ కోరుకున్న శాఖలు) కట్టబెట్టాలని ఒక ప్రతిపాదన డీకేఎస్ ముందు ఉంచాయి. ఒకే పదవి నిబంధనను పక్కనపెట్టి మరీ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తోంది. కానీ, డీకే శివకుమార్ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట.
ఇక రెండోది.. శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య పవర్ షేరింగ్. దీనిప్రకారం.. సిద్ధరామయ్య తొలుత సీఎం అవుతారు. రెండేళ్లపాటు పదవి చేపడతారు. ఆపై మిగిలిన మూడేళ్ల కాలానికి సీఎంగా డీకే శివకుమార్ కొనసాగుతారు. అయితే ఈ ప్రతిపాదనను శివకుమార్ మాత్రమే కాదు.. సిద్ధరామయ్య కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
గత నాలుగేళ్లుగా తన పనితీరును ప్రామాణికంగా తీసుకోవాలని డీకే శివకుమార్.. ఖర్గే, రాహుల్ వద్ద ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడి ప్రభుత్వాన్ని కూలదోసినా.. పార్టీని తాను పునర్మించానని, అలాగే పార్టీకి భారీ విజయం కట్టబెట్టానని ఆయన వారివురు వద్ద పేర్కొన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవి తప్ప మరొకటి తాను ఆశించడం లేదని, ఒకవేళ ఆ పదవి ఇవ్వకున్నా సాధారణ ఎమ్మెల్యేగా తాను ఉండిపోతానని ఆయన వాళ్లతో చెప్పినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో సీఎం ఎంపిక కాంగ్రెస్‌కు ఇప్పుడు పెద్ద పరీక్షగా మారింది. ఎందుకంటే.. ఏమాత్రం తేడా జరిగినా మరో రాజస్థాన్‌లా(అశోక్ గెహ్లట్ వర్సెస్ సచిన్ పైలట్) మారే ప్రమాదం ఉంది. అది మరీ దిగజారితే మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలినట్లు కుప్పకూలే ప్రమాదమూ లేకపోలేదు.
మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు సీఎం ఎంపికలో తీసుకోబోయే నిర్ణయం.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం కచ్చితంగా చూపెడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: బీజేపీకి కొత్త టెన్షన్.. వచ్చే వారంలో ఏం జరుగనుంది?
Comments
Please login to add a commentAdd a comment