Punjab Assembly Elections 2022: పంజాబ్‌లో క్లిష్టమైన సమస్యగా భావించిన ముఖ్యమంత్రి ఎంపిక.. ప్రకటనను ఎట్టకేలకు పూర్తి చేసింది కాంగ్రెస్. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న నవజోత్ సింగ్ సిద్ధూను ఎలాగోలా పార్టీ చల్లబర్చింది. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌సింగ్ చన్నీనే.. సీఎం అభ్యర్థిగా ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..
అంతకు ముందు కొన్ని గంటలపాటు పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా.. అభ్యంతరం లేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ సిద్ధూ ప్రకటించడంతో ఆసక్తికరంగా మారింది సీన్. ఈ తరుణంలో.. స్టేజ్‌పై సీఎం అభ్యర్థిగా చన్నీ పేరును ప్రకటించిన వెంటనే ఆసక్తికర దృశ్యం కనిపించింది. సిద్ధూ చన్నీ కుడి చెయ్యిని పైకి ఎత్తగా.. ఆక్షణంలోనే చన్నీ తన ఎడమ చేతితో సిద్ధూకి పాదాభివందనం చేశాడు. ‘సిద్ధూజీ.. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసేయండి. మీ మోడల్ కచ్చితంగా అమలు అయ్యి తీరుతుంది’ అని చన్నీ ఆ వెంటనే వ్యాఖ్యానించడం విశేషం.
లూథియానా: ఇక పంజాబ్‌లో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు పార్టీ నేత రాహుల్ గాంధీ పెద్ద షాక్ ఇచ్చారు. పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ పేరును రాహుల్ ఆదివారం పంజాబ్‌లో వర్చువల్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించి.. ప్రసంగించారు.
నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రావాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. పేదరికాన్ని, ఆకలిని అర్థం చేసుకున్నవారే కావాలని అంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. ‘‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. దాన్ని మీరు సులభతరం’’ చేశారు అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అనంతరం చన్నీ, సిద్ధూ, పార్టీ నేత సునీల్ జాఖర్‌ను రాహుల్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మీడియా, టీవీ చర్చా కార్యక్రమాల్లో నాయకులు పుట్టుకురారని తెలిపారు. కొన్ని సంవత్సరాల పోరాటంతోనే వ్యక్తులు నాయకులుగా ఎదుగుతారని వివరించారు. గొప్ప నాయకులకు తమ పార్టీలో లోటు లేదన్నారు. ప్రజల కోసం నిలబడే నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నారని పేర్కొన్నారు. చన్నీ, సిద్ధూల రక్తంలో పంజాబ్ ఉందన్నారు.
సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కాంగ్రెస్ నాయకత్వం పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. ప్రజల మనోభావాలను కూడా తెలుసుకుంది. ఇందుకోసం అటోమేటెడ్ కాల్ సిస్టమ్‌ను ఉపయోగించుకుంది. దళిత సిక్కు నాయకుడైన చరణ్‌జిత్‌సింగ్ చన్నీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. వర్చువల్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఆయన ప్రధానమంత్రిగా కాదు, ఒక రాజులాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ రోడ్లపై ఎవరికైనా సాయం చేయడం ఎప్పుడైనా చూశారా? ఆయన ప్రజల మధ్య ఉండడం ఎప్పుడైనా గమనించారా? అని ప్రజలను ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
పదవుల కోసం పాకులాడలేదు: సిద్ధూ
తాను ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్ సిద్ధూ అన్నారు. ఆయన లూథియానాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. గత 17 ఏళ్లుగా రాజకీయ జీవితం కొనసాగిస్తున్నానని, పదవులపై ఎప్పుడూ ఆశపడలేదని పేర్కొన్నారు. పంజాబ్ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని మాత్రమే కోరుకున్నానని వివరించారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. గత ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేశారని కొనియాడారు. మార్పునకు సమయం ఆసన్నమైందని వెల్లడించారు. పంజాబ్ అభివృద్ధి కంటే తనకు కావాల్సింది ఇంకేమీ లేదని వ్యాఖ్యానించారు. సీఎం అభ్యర్థి ప్రకటనపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిద్ధూ ట్వీట్ చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. బీజేపీ శ్రుతులకు అనుగుణంగా అమరీందర్ డ్యాన్స్ చేస్తున్నారని ఆరోపించారు. పంజాబ్‌ను లూటీ చేసిన నాయకులు ఇప్పుడు డబల్ ఇంజన్ ప్రభుత్వం అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఆ అధికారం రాహుల్‌కు ఎక్కడిది?: బీజేపీ
చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అధికారం రాహుల్ గాంధీకి ఎక్కడుందని బీజేపీ నేత, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదివారం ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో రాహుల్‌కు ఎలాంటి హోదా లేదని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఏ అధికారంతో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని నిలదీశారు. పేరు చివర ‘గాంధీ’ అన్న ఒక్క అర్హత మాత్రమే రాహుల్‌కు ఉందని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment