సాక్షి, ఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి విషయంలో తేడాలు జరిగితే కాంగ్రెస్‌కు డీకే శివకుమార్ రాజీనామా చేస్తారనే ప్రచారం ఒకటి కన్నడ మీడియా ఛానెల్స్ ద్వారా చక్కర్లు కొడుతోంది. అయితే ఆ ప్రచారంపై డీకేఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారాయన.
పార్టీ(కాంగ్రెస్‌ను ఉద్దేశించి..) నాకు తల్లిలాంటిది. పార్టీకి రాజీనామా చేస్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేనెందుకు రాజీనామా చేస్తా. అలాంటి ప్రచారం చేసేవాళ్లపై దావా వేస్తా జాగ్రత్త. 135 ఎమ్మెల్యే మద్దతు నాకు ఉంది అని ఢిల్లీలో తనని పలకరించిన మీడియా ప్రతినిధులతో తెలిపారాయన.
ఢిల్లీలో కన్నడ సీఎం ఎంపిక ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఉదయం నుంచి కీలక నేతలు చర్చోపచర్చలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లు కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపికపై చర్చించారు. ఇక సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు వేర్వేరుగా ఈ సాయంత్రం ఖర్గేతో భేటీ కానున్నారు.
తొలుత ఐదు గంటల ప్రాంతంలో డీకే శివకుమార్, ఆపై ఆరు గంటలకు సిద్ధరామయ్య ఖర్గేతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అటుపై ఇద్దరూ రాహుల్ గాంధీతోనూ భేటీ కావొచ్చని తెలుస్తోంది. అంతా సజావుగా జరిగితే.. ఇవాళ రాత్రికే కర్ణాటక సీఎం ఎవరూ అనేదానిపై ఒక ప్రకటన వెలువడొచ్చని, ఉత్కంఠ వీడొచ్చని అటు కాంగ్రెస్ శ్రేణులు ఇటు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: సీఎం ఎంపిక కోసం వాళ్ల లాబీయింగ్?
Comments
Please login to add a commentAdd a comment