ముంబై:అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం నేపథ్యంలో మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండేకు మళ్లీ సీఎం పదవి ఇచ్చే అవకాశం లేనట్టేనంటున్నారు. కూటమి సారథిగానే గాక అత్యధిక స్థానాలు నెగ్గిన పార్టీగా బీజేపీకే ఆ అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది.
ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి అహోరాత్రాలు శ్రమించిన ఆయనకు అందలం ఖాయమంటున్నారు. ఢిల్లీకి రావాల్సిందిగా ఆయనకు బీజేపీ అధినాయకత్వం నుంచి ఇప్పటికే పిలుపు కూడా వచ్చినట్లు సమాచారం. ఫడ్నవీస్ మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందించారు. సీఎం ఎవరన్నది మహాయుతి నేతలంతా కలిసి నిర్ణయిస్తారని శనివారం మీడియాకు చెప్పారు.
ఫలితాల అనంతరం షిండే, ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం ఎవరన్న దానిపై అసలు వివాదమే లేదు. దీనిపై చర్చించేందుకు సీఎం షిండేతో నేను, అజిత్ పవార్ ఆయన నివాసంలో భేటీ కానున్నాం’’అంటూ ముక్తాయించారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు సాఫీగా జరుగుతుందని షిండే కూడా అన్నారు.
అనంతరం ఫడ్నవీస్ మరోసారి మీడియాతో మాట్లాడుతూ సీఎం పదవి తనకే దక్కాలనే అర్థం ధ్వనించేలా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారుల సాయంతో విపక్షాల చక్రవ్యూహాన్ని ఛేదించడంలో విజయం సాధించానని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment