బీజేపీ ‘మహా’ విజయం | Mahayuti landslide win in Maharashtra Assembly Polls | Sakshi
Sakshi News home page

బీజేపీ ‘మహా’ విజయం

Published Sun, Nov 24 2024 5:04 AM | Last Updated on Sun, Nov 24 2024 9:55 AM

Mahayuti landslide win in Maharashtra Assembly Polls

మహారాష్ట్రలో మహాయుతి కూటమి హవా

288 స్థానాలకు ఏకంగా 233 కైవసం 

49 సీట్లతో కుదేలైన ఎంవీఏ కూటమి  

జార్ఖండ్‌ను నిలుపుకున్న ఇండియా కూటమి 

56 అసెంబ్లీ స్థానాలతో ఘనవిజయం 

బీజేపీని మట్టి కరిపించిన హేమంత్‌

మహారాష్ట్రపై కాషాయజెండా నిండుగా రెపరెపలాడింది. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో బీజేపీ సారథ్యంలోని మహాయుతి ఘనవిజయం సాధించింది. ఏకంగా నాలుగింట మూడొంతుల సీట్లు ఒడిసిపట్టింది! అధికార కూటమి దెబ్బకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమి కకావికలమైంది. 

ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 29 స్థానాలు విపక్షాల్లో ఏ పార్టీకీ దక్కకపోవడం విశేషం. అయితే, మహారాష్ట్రలో తలబొప్పి కట్టిన విపక్ష ఇండియా కూటమికి జార్ఖండ్‌ ఫలితాలు ఊరటనిచ్చాయి. జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి హోరాహోరీ పోరులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని నిలువరించి అధికారాన్ని నిలబెట్టుకుంది.  

ముంబై/రాంచీ: మహారాష్ట్రపై కాషాయజెండా నిండుగా రెపరెపలాడింది. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో బీజేపీ సారథ్యంలోని మహాయుతి ఘనవిజయం సాధించింది. ఏకంగా నాలుగింట మూడొంతుల సీట్లు ఒడిసిపట్టింది! శనివారం వెల్లడైన ఫలితాల్లో 288 స్థానాలకు గాను ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుని దుమ్ము రేపింది. అధికార కూటమి దెబ్బకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమి కకావికలైంది.

 కేవలం 49 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం చవిచూసింది. ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ ఆద్యంతం బీజేపీ కూటమి జోరే కొనసాగింది. రౌండు రౌండుకూ ఆధిక్యాన్ని పెంచుకుంటూ మధ్యాహా్ననికల్లా మెజారిటీ మార్కు 145ను, ఆ తర్వాత చూస్తుండగానే 200 స్థానాలనూ దాటేసింది. చివరికి 233 స్థానాలు సొంతం చేసుకుంది. 

ఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ హ్యాట్రిక్‌ కొట్టిన బీజేపీ తాజాగా మహారాష్ట్రలోనూ దక్కిన అఖండ విజయంతో అంతులేని సంబరాల్లో మునిగిపోయింది. ఆ పార్టీ 149 సీట్లలో పోటీ చేయగా ఏకంగా 132 చోట్ల విజయం సాధించడం విశేషం! మహారాష్ట్రలో ఆ పారీ్టకి ఇన్ని అసెంబ్లీ సీట్లు రావడం ఇదే తొలిసారి. 

బీజేపీ భాగస్వాములైన సీఎం ఏక్‌నాథ్‌ షిండే సారథ్యంలోని శివసేన 57, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ 41 స్థా నాలు గెలుచుకున్నాయి. మహాయుతి అభ్యర్థుల్లో ఏకంగా 15 మంది లక్షకు పైగా మెజారిటీ సాధించడం విశేషం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ ఫలితాలు బీజేపీకి ఎనలేని ఉత్సాహాన్ని అందించాయి. మరోవైపు 101 సీట్లలో బరిలో దిగిన ఎంవీఏ కూటమి సారథి కాంగ్రెస్‌ కేవలం 16 సీట్లే నెగ్గింది. 

పీసీసీ చీఫ్‌ నానా పటోలే అతి కష్టమ్మీద గట్టెక్కగా పృథీ్వరాజ్‌ చవాన్, బాలాసాహెబ్‌ థోరట్‌ వంటి దిగ్గజాలు ఓటమి చవిచూశారు. ఎంవీఏ భాగస్వాముల్లో 95 స్థానాల్లో పోటీ చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన 20, 86 చోట్ల బరిలో దిగిన రాజకీయ కురువృద్ధుడు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం 10 చోట్ల విజయం సాధించాయి. ఈ ఫలితాలు ఉద్ధవ్‌ రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్ధకంగా మార్చడమే గాక శరద్‌ పవార్‌కు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తెర దించాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 29 స్థానాలు విపక్షాల్లో ఏ పారీ్టకీ దక్కకపోవడం విశేషం! 

విపక్షాలకు జార్ఖండ్‌ ఊరట 
మహారాష్ట్రలో తల బొప్పి కట్టిన విపక్ష 
ఇండియా కూటమికి జార్ఖండ్‌ ఫలితాలు ఊరటనిచ్చాయి. అక్కడ జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి హోరాహోరీ పోరులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని నిలువరించి అధికారాన్ని నిలబెట్టుకుంది. 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 56 చోట్ల విజయం సాధించింది. కూటమి సారథి జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) దుమ్ము రేపింది. 43 స్థానాల్లో బరిలో దిగిన సీఎం హేమంత్‌ సోరెన్‌ పార్టీ ఏకంగా 34 సీట్లలో విజయ కేతనం ఎగరవేయడం విశేషం. దాని భాగస్వాముల్లో 30 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్‌ 16, 6 చోట్ల బరిలో దిగిన ఆర్జేడీ 4, 4 చోట్ల పోటీ చేసిన సీపీఐ (ఎంఎల్‌–ఎల్‌) 2 స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్డీఏ కూటమి కేవలం 23 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 21 చోట్ల గెలుపొందింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement