హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. హర్యానాలో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుండగా.. జమ్మూ కశ్మీర్‌లో ఇండియా కూటమి హవా కొనసాగిస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ తమ పరిధిని విస్తరించుకోవాలని చూసినా.. ఆశాభంగం తప్పలేదు.
హర్యానాలో ఒక్కస్థానంలోనూ ఆప్ ఖాతా తెరవకపోగా.. జమ్ముకశ్మీర్‌లో ఓచోట బోణీ కొట్టింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఆప్' అభ్యర్థి మేహరాజ్ మాలిక్ గెలుపొందారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మాలిక్ గెలుపుతో పంజాబ్, గుజరాత్ తర్వాత మరో రాష్ట్రంలో 'ఆప్' ఖాతా తెరిచినట్టు అయింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఘోర పరాజయంపై పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. 89 స్థానాల్లో ఒంటరిగా పోటి చేసిన ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోవడంపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆప్ మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హర్యానా ఎన్నికలు అతిపెద్ద పాఠాన్ని నేర్పాయని పేర్కొన్నారు. ఎప్పుడూ అతి విశ్వాసంతో ఉండకూడదనే విషయాన్నిఈ ఫలితాలు మనకు నేర్పించాయని అన్నారు.
‘హర్యానాలో ఫలితాలను గమనిస్తే.. ఎన్నికల్లో అతి విశ్వాసం ఉండకూడదనేది మనకు నేర్పిన గుణపాఠం. ఎన్నికలు సమీపిస్తే వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతి స్థానం, ప్రతి ఎన్నిక కఠినమైనదే. గెలుపు కోసం తీవ్రంగా కష్టపడి పనిచేయాలి. అంతర్గత పోరు ఉండకూడదు.’ అంటూ కేజ్రీవాల్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. కాగా ఇదే కేజ్రీవాల్ హర్యానా ఎన్నికల్లో ప్రచారం చేస్తూ.. ఆప్ మద్దతు లేకుండా రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు.
ఇక హర్యానాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. అకార వ్యతిరేకత ఉన్నప్పటికీ వరుసగా మూడోసారి అధికారిన్ని దక్కించుకునే దిశగా సాగుతోంది. మొత్తం 90 స్థానాలకు గానూ 50 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుంది.
Comments
Please login to add a commentAdd a comment