పార్లమెంట్‌కు చేరిన ‘నోట్ల కట్టల జడ్జి’ వ్యవహారం | Congress Raise Justice Yashwant Varma Issue Reached Parliament Updates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌కు చేరిన ‘నోట్ల కట్టల జడ్జి’ వ్యవహారం

Published Tue, Mar 25 2025 9:41 AM | Last Updated on Tue, Mar 25 2025 9:41 AM

Congress Raise Justice Yashwant Varma Issue Reached Parliament Updates

న్యూఢిల్లీ, సాక్షి: అధికారిక బంగ్లాలో కాలిపోయిన నోట్ల కట్టలతో వార్తల్లోకి ఎక్కిన జస్టిస్‌ యశ్వంత్‌ శర్మ వ్యవహారం పార్లమెంట్‌కు చేరింది. ఈ అంశంపై చర్చ జరగాలంటూ లోక్‌సభలో  కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. 

ఈ ఘటన న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు కలిగించడంతో పాటు ఆ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్న ఆయన.. సంబంధిత న్యాయ శాఖ మంత్రి నుంచి ఈ వ్యవహారంపై వివరణ ఇప్పించాలని స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు లోక్‌సభ కార్యదర్శికి సోమవారమే లేఖ రాశారాయన.

 

 

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో భారీఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో.. తీవ్ర అభ్యంతరాల నడుమే ఆయన్ని అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు కొలిజీయం. అయితే జస్టిస్‌ వర్మను హైకోర్టులోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటామని అలహాబాద్‌ బార్‌ అసోషియేషన్‌ నిరసనకు సిద్ధమైంది. నివారమే ఈ వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజేఐ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువంటూ లేని ఈ కమిటీ విచారణ.. సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది.

హోలీ రోజు జడ్జి బంగ్లాలో అగ్నిప్రమాదం జరగ్గా..  ఓ గదిలో కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ వీడియోను పోలీస్‌ కమిషనర్‌ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయకు సమర్పించగా.. ఆయన దానిని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు అందించారు. దీనిపై సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి నివేదిక మొత్తాన్ని ఫొటోలు, వీడియోలతో సహా తన వెబ్‌సైట్‌లో పెట్టింది. 

వెబ్‌సైట్‌లో పెట్టిన ఆ వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు.. జస్టిస్ వర్మ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా దీనిని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement