
న్యూఢిల్లీ: తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై మండిపడుతున్న డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్(Privilege motion) ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.
తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది తమిళుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా అని అన్నారామె.
జాతీయ విద్యా విధానం విషయంలో తమిళనాడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని.. ఈ విషయంలో ఏమాత్రం నిజాయితీ లేకుండా వ్యవహరించిందని ధర్మేంద్ర ప్రధాన్(dharmendra pradhan) మండిపడిన సంగతి తెలిసిందే. ‘‘వాళ్లకు ఏమాత్రం నిజాయితీ లేదు. విద్యార్థుల జీవితాలు నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ సోమవారం బడ్జెట్ మలివిడత సమావేశాల సందర్భంగా లోక్‌సభ వ్యాఖ్యలు చేశారు. దీంతో డీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగగా.. సభ వాయిదా పడింది.
అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై డీఎంకే భగ్గుమంది. ధర్మేంద్ర ప్రధాన్‌వి తలపొగరు వ్యాఖ్యలని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఇది తమిళులను అవమానించడమేనని,ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిస్తారా? అంటూ మండిపడ్డారు.
మరోవైపు.. పీఎం శ్రీ(PM SHRI) పథకం విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎంవోయూపై సంతకాలకు అంగీకరించి.. ఆపై వెనక్కి తగ్గిందని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదని.. ఈ ప్రకటన పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించేదేనని.. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని డీఎంకే అంటోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కనిమొళి ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయగా.. ఆ తీర్మానాన్నిస్పీకర్ ఓం బిర్లా పరిశీలించనున్నారు. ఒకవేళ స్పీకర్ గనుక ఆ తీర్మానాన్ని అంగీకరిస్తే దర్యాప్తునకు ఆదేశిస్తారు. అందులో ఉల్లంఘన జరిగినట్లు తేలితే క్రమశిక్షణా ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment