మూడో పర్యాయం.. మూడింతల వేగం  | President Droupadi Murmu addressed both Houses of Parliament | Sakshi
Sakshi News home page

మూడో పర్యాయం.. మూడింతల వేగం 

Published Sat, Feb 1 2025 4:00 AM | Last Updated on Sat, Feb 1 2025 4:00 AM

President Droupadi Murmu addressed both Houses of Parliament

దేశ అభ్యున్నతి కోసం అసాధారణ వేగంతో పనిచేస్తున్న కేంద్రం  

పేదలు, మధ్యతరగతి ప్రజలు, యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అగ్రతాంబూలం  

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టీకరణ 

పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం  

న్యూఢిల్లీ: దేశ అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ వేగంతో పనిచేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు, విధానాలను అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్లో వేగంగా మూడు రెట్లు పెరిగిందని అన్నారు.

 ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా అంకితభావంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్‌సభ చాంబర్‌లో పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. 60 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 

దేశ ప్రగతి ప్రయాణంలో అమృతకాలం నడుస్తోందని, ఇప్పటిదాకా సాధించిన అపూర్వమైన విజయాలతో ప్రభుత్వం దేశానికి నూతన శక్తిని ఇచ్చిందని తెలిపారు. మహా కుంభమేళాలో మౌని అమావాస్య రోజు తొక్కిసలాటలో భక్తులు మరణించడం పట్ల రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు నివాళులరి్పంచారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలను వివరించారు. ద్రౌపదీ ముర్ము ప్రసంగం ఆమె మాటల్లోనే...  

అప్పుడే అభివృద్ధికి సార్థకత  
శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఇస్రో వంద రాకెట్‌ ప్రయోగాలు పూర్తిచేయడం ప్రశంసనీయం. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న గగన్‌యాన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లే రోజు  ఇక ఎంతోదూరంలో లేదు. కోవిడ్‌–19 మహమ్మారి, ఇతర దేశాల్లో యుద్ధాలు, తద్వారా అంతర్జాతీయంగా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది. మన బలాన్ని ఆర్థిక వ్యవస్థ చాటి చెబుతోంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. 

ఒకే దేశం.. ఒకే పన్ను అనే విధానంతో జీఎస్టీని తీసుకొచ్చింది. దీనితో అన్ని రాష్ట్రాలూ ప్రయోజనం పొందుతున్నాయి. అభివృద్ధి ఫలాలు సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి సైతం అందాలి.  అప్పుడే ఈ అభివృద్ధికి ఓ సార్థకత ఉంటుంది. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కింద ప్రభుత్వం 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించింది. ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన కింద 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు      ఇచ్చింది. సౌభాగ్య యోజన కింద 80 కోట్ల మందికి రేషన్‌ సరుకులు అందజేస్తోంది. 

స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి జల జీవన్‌ మిషన్‌ను అమలు చేస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో తాము గౌరవంగా జీవించగలమన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది. పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తే.. పేదరికాన్ని జయించగలమన్న ధీమా వారిలో పెరుగుతుంది. ప్రభుత్వ కృషితో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. వారంతా ఒక నూతన మధ్యతరగతి వర్గంగా మారారు. దేశ పురోభివృద్ధికి వారు ఒక చోదకశక్తి.  
డిజిటల్‌ విప్లవంలో ముందంజ  
భారతదేశ సామాజిక, ఆర్థిక, జాతీయ భద్రతకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డిజిటల్‌ మోసాలు, సైబర్‌ నేరాలు, డీప్‌ ఫేక్‌ వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యను కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి. భౌతికమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే సామాజిక మౌలిక సదుపాయాల విప్లవంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత పదేళ్లలో ప్రగతిలో కొత్త అధ్యాయం లిఖించింది. డిజిటల్‌ విప్లవంలో మనం ముందంజలో ఉన్నాం. డిజిటల్‌ టెక్నాలజీ రంగంలో ఇండియా అతిపెద్ద గ్లోబల్‌ ప్లేయర్‌గా అవతరించింది. మన దేశంలో ప్రజలకు 5జీ సరీ్వసులు అందుతున్నాయి. ఇక మన డిజిటల్‌ చెల్లింపులు ప్రపంచ దేశాలను అబ్బురపరుస్తున్నాయి. ప్రపంచం మొత్తంలో 50 శాతానికి పైగా రియల్‌–టైమ్‌ డిజిటల్‌ లావాదేవీలు మనదేశంలోనే జరుగుతున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వానికి డిజిటల్‌ టెక్నాలజీని ప్రభుత్వం ఒక సాధనంగా వాడుకుంటోంది.   

మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం  
‘మహిళల సారథ్యంలో ప్రగతి’ అనేది ప్రభుత్వ విధానం. మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తోంది. 91 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 10 కోట్ల మంది మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆయా సంఘాలకు రూ.9 లక్షల కోట్లు అందజేసింది. వారు ఆర్థిక స్వాతంత్య్రం గణనీయంగా పెంచుకుంటున్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న లక్ష్యంతో నారీశక్తి వందన్‌ అధినియంను ప్రభుత్వం తీసుకొచ్చింది. రైల్వే నెట్‌వర్క్‌ ద్వారా కన్యాకుమారితో కశీ్మర్‌ అనుసంధానమైంది. ఉధంపూర్‌–బారాముల్లా–శ్రీనగర్‌ రైలు ప్రాజెక్టు పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా 71 వందేభారత్, అమృత్‌ భారత్, నమో భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. ప్రధాన నగరాల సమీపంలో 100కుపైగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రూ.28,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. 

ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ  
దేశంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలని కేంద్రం సంకల్పించింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2023–14లో దేశంలో రికార్డు స్థాయిలో 322 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. పీఎం–కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ప్రభుత్వం రైతులకు రూ.41,000 కోట్లు అందజేసింది. పంటలకు కనీస మద్దతు ధరలను పెంచింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ మన దేశంలోనే ఉంది. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్ల మెట్రో రైలు నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చింది. రూ.8,000 కోట్లతో అదనంగా 52,000 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నూతన పరిపాలనా విధానానికి సంస్కరణ, పనితీరు, మార్పు అనేవి పర్యాయ పదాలుగా మారాయి’’ అని రాష్ట్రపతి ముర్ము స్పష్టంచేశారు.   

జమిలి ఎన్నికలపై ముందడుగు
‘‘బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అహరి్నశలూ కృషి చేస్తోంది. పేద కుటుంబాలకు ఇళ్లు ఇవ్వబోతోంది. గ్రామీణులకు ప్రాపర్టీ కార్డులు అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. 70 ఏళ్లు దాటినవారిలో 6 కోట్ల మందికి ఆరోగ్య బీమా పథకం వర్తింపజేస్తోంది. కీలకమైన జమిలి ఎన్నికలతోపాటు వక్ఫ్‌ సవరణ బిల్లుపై ప్రభు త్వం ముందడుగు వేసింది. అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్‌ మాత్రం ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థిరత్వంలో ఒక మూలస్తంభంగా నిలిచింది. ఈ విషయంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారింది. భారతదేశ బలాలు, విధానాలు, ఉద్దేశాల పట్ల ప్రపంచ దేశాలు విశ్వాసం కనబరుస్తున్నాయి. క్వాడ్, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థతోపాటు జీ20లో ఇండియాదే కీలకపాత్ర.   

సమతుల్య అభివృద్ధి అత్యంత కీలకం
ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధికి సానుకూల వాతావరణం ఏర్పడింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు ఏమిటో ప్రభుత్వానికి తెలుసు. తాము ఒంటరిమన్న భావనను వారిలో తొలగించడానికి కృషి చేస్తోంది. ఈశాన్యంలో శాంతి సాధన కోసం పదికిపైగా ఒప్పందాలు కుదిరాయి. వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు సమతుల్య అభివృద్ధి అత్యంత కీలకం. దేశమంతటా అన్ని ప్రాంతాలూ సమానంగా పురోగతి సాధించాలన్నదే కేంద్రం ఉద్దేశం. అండమాన్, నికోబార్‌ దీవులు, లక్షదీవుల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రారంభించింది.  

అందరికీ నాణ్యమైన వైద్య సేవలు
సమాజంలో అన్ని వర్గాలకు ప్రజలకు తక్కువ రుసుముతో నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ చర్యలతో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు క్రమంగా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా 1.75 లక్షల ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాబోయే ఐదేళ్లలో మెడికల్‌ కాలేజీల్లో కొత్తగా 75 వేల సీట్లు రాబోతున్నాయి. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక విద్యా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత పదేళ్లలో ఉన్నత విద్యా సంస్థల సంఖ్య భారీగా పెరిగింది. వాటిలో నాణ్యత కూడా మెరుగుపడింది.

మధ్య తరగతికి సొంత గూడు
ప్రభుత్వ పథకాలతో దళితులు, గిరిజనులు, బీసీలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో వారు భాగస్వాములవుతున్నారు. సొంత గూడు కలిగి ఉండాలన్నది మధ్య తరగతి ప్రజల కల. దాన్ని నిజం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గృహరుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మోసాలకు తావులేకుండా ‘రెరా’ వంటి చట్టాలు తీసుకొచ్చింది. ‘అందరికీ ఇళ్లు’ అనేది ప్రభుత్వ లక్ష్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement