మొత్తం 25 మందిలో గెలిచింది 8 మందే
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కండువాలు మార్చుకుని బరిలోకి దిగిన వారిని ప్రజలు తిరస్కరించారు. పార్టీ మారి పోటీ చేసిన మొత్తం 25 మంది నాయకుల్లో కేవలం 8 మందిని మాత్రమే ఓటర్లు గెలిపించారు. మిగతా 15 మందికి పరాజయం తప్పలేదు. ఈ ఎన్నికల్లో దాదాపు ప్రతి పార్టీ బయటి పార్టీల నుంచి వచ్చిన వారిని రంగంలోకి దించాయి.
ఇతర పార్టీల తిరుగుబాటుదార్లకు ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధికంగా 11 మందికి, బీజేపీ ఏడుగురికి, కాంగ్రెస్ ఐదుగురికి టిక్కెట్లిచ్చాయి. అయితే, ఆప్ తరఫున పోటీ చేసిన 11 మందిలో నలుగురు మాత్రమే గెలవగా.. ఏడుగురు ఓడిపోయారు. బీజేపీ నుంచి పోటీ చేసిన ఏడుగురిలో నలుగురు విజయం సాధించగా, ముగ్గురు ఓటమి చెందారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరి పోటీకి దిగిన ఐదుగురిలో ఒక్కరు కూడా గెలవలేకపోయారు.
మిల్కిపూర్‌లో బీజేపీ ఘన విజయం
యూపీలోని అయోధ్య జిల్లాలో మిల్కి పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్ని కలో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో, ఈ జిల్లాలోని అన్ని స్థానాలూ బీజేపీ వశమైన ట్లయింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మిల్కిపూర్ (ఎస్‌సీ) ఎమ్మెల్యే అవధేశ్ ప్రసాద్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటును తిరిగి నిలబెట్టుకోవాలని అవధేశ్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్‌ను బరిలోకి దించింది.
అయితే, బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాశ్వాన్ 61,710 ఓట్ల మెజారిటీతో అజిత్‌పై ఘన విజయం సాధించారు. అదేవిధంగా, తమిళనాడులోని ఈరోడ్(ఈస్ట్)స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార డీఎంకే విజయం సాధించింది. డీఎంకే అభ్యర్థి చందిర కుమార్, సమీప ప్రత్యర్థి నామ్ తమిళర్ కట్చి(ఎన్‌టీకే)కు చెందిన ఎంకే సీతాలక్ష్మిపై 91 వేల పైచిలుకు ఓట్లతో తిరుగులేని గెలుపు సాధించారు. ఈరోడ్(ఈస్ట్) నుంచి ఎన్నికైన కాంగ్రెస్‌కు చెందిన ఈవీకేఎస్ ఇళంగోవన్ మృతితో ఈ ఉప ఎన్నిక జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment