ఎన్నికల్లో యువత ఓటే కీలకం!
-
రాష్ట్ర ఓటర్లలో వారిదే పైచేయి
-
వచ్చే ఎన్నికల్లో యువత ఓటే కీలకం
-
3.52 కోట్ల మంది యువ ఓటర్లు
-
మహిళల సంఖ్య లక్షల్లో తగ్గుదల
త్వరలో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓటే కీలకం కానుంది. రాష్ట్రంలో 6.23 కోట్ల మంది ఓటర్లుండగా.. అందులో 3.52 కోట్ల మంది యువతే.
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓటే కీలకం కానుంది. రాష్ట్ర ఓటర్ల సంఖ్యలో సగానికిపైగా యువ ఓటర్లే ఉన్నారు. ఇటీవల కేంద్ర ఎన్నిల కమిషన్‌తో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితా బయట ఉన్న యువతను జాబితాలోకి తీసుకురావడానికి అనేక చర్యలను చేపట్టారు. దీంతో కొత్తగా ఏకంగా 76 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులను ఓటర్లుగా నమోదు చేసేందుకు యూనివర్శిటీలు, కాలేజీల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6.23 కోట్ల మంది ఓటర్లుండగా ఇందులో ఏకంగా 3.52 కోట్ల మంది యువ ఓటర్లే ఉన్నారు. 18-19 సంవత్సరాల మధ్యగల యువతీ, యువకులు 15 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. అలాగే 20-29 సంవత్సరాల మధ్యగల 1.75 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. 30-39 సంవత్సరాల మధ్యగల 1.62 కోట్ల మంది ఓటర్లుగా ఉన్నారు.
మూడు లక్షలు తగ్గిన మహిళా ఓటర్లు
రాష్టంలో మహిళా ఓటర్ల సంఖ్య తగ్గిపోయి, పురుష ఓటర్ల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగానే రాష్ట్రంలో పురుష, మహిళల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంది. అదే తీరులో గత ఏడాది జనవరి తరువాత నుంచి మహిళా ఓటర్ల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. గత ఏడాది జనవరిన ప్రకటించిన ఓటర్ల జాబితాలో 2.90 కోట్ల మంది పురుష ఓటర్లుండగా మహిళా ఓటర్లు 2.92 కోట్ల మంది ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ సంఖ్య తలకిందులైంది. ఇంటింటి ఓటర్ల జాబితా తనిఖీల అనంతరం పురుష ఓటర్లు పెరిగిపోయారు. మహిళా ఓటర్లు ఏకంగా నాలుగు లక్షల మంది తగ్గిపోయారు. గత ఏడాది సెప్టెంబర్‌లో పురుష ఓటర్లు 2.99 కోట్ల మంది ఉండగా మహిళా ఓటర్లు 2.95 కోట్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ప్రచురించిన ఓటర్ల తుది జాబితాలో కూడా మహిళా ఓటర్లు సంఖ్య పురుష ఓటర్ల కన్నా తక్కువగా ఉంది. ప్రస్తుతం పురుష ఓటర్లు 3.13 కోట్ల మంది ఉండగా మహిళా ఓటర్లు 3.10 కోట్ల మంది ఉన్నారు. అంటే పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు సంఖ్య మూడు లక్షలు తక్కువగా ఉంది.
2014 ఓటర్ల తుది జాబితాలో వయస్సు వారీగా ఓటర్ల సంఖ్య ఇలా ఉంది.
18-19 15,06,182
20-29 1,75,45,213
30-39 1,62,40,970
40-49 1,19,43,442
50-59 79,66,734
60-69 46,91,449
70-79 19,95,028
80 పైన 4,96,935
మొత్తం 6,23,85,953