తాజా ఓటరు జాబితాలో యువజనులే అధికం
40 ఏళ్లలోపు ఓటర్లు 31.14లక్షలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా:
జిల్లాలో యువ ఓటర్లదే హవా కనిపిస్తోంది. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వీరి తీర్పే శాసనం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం రెండ్రోజుల క్రితం ఓటర్ల తుది జాబితా ప్రకటించింది. ఇందులో జిల్లా ఓటర్ల సంఖ్య 50లక్షలు కాగా.. ఇందులో యువ ఓటర్లు 31.14లక్షలు. అంటే మొత్తం ఓటర్లలో యువ ఓటర్లు 62.27శాతం ఉన్నారు. ఈ లెక్కన ఎన్నికల్లో పోటీ చేసే నేతల భవిష్యత్తు అంతా యువ ఓటర్ల తీర్పుపైనే ఆధారపడనుంది.
నేతల చూపు.. యువత వైపు..
తాజా గణాంకాలను పరిశీలిస్తే ఈ దఫా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 7.41లక్షల మంది ఓటరు జాబితాలో చేరారు. ఓటరు నమోదుపై పెరిగిన చైతన్యం.. రెండుసార్లు ఓటరు నమోదు గడువు పెంచడంతో కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ సారి కొత్తగా ఓటరు జాబితాలో చేరిన వారిలో అధికభాగం యువ ఓటర్లేనని తెలుస్తోంది. ఇందులో ముప్పై సంవత్సరాలలోపు ఉన్న ఓటర్లు 16.42లక్షలు ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి శాతం 32.85. మరోవైపు సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో నాయకగణం గెలుపోటములను విశ్లేషిస్తూ యువ ఓటర్ల వైపు దృష్టి సారిస్తున్నారు.
యువ చైతన్యం
Published Sat, Feb 1 2014 11:30 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement