general elcetions
-
బంగ్లాదేశ్: మైనర్లకూ ఓటుహక్కు.. యూనస్ సర్కారు నిర్ణయం
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఒకవైపు రాజకీయ అస్థిరత, మరోవైపు మైనారిటీలపై హింస కొనసాగుతోంది. ఇంతలోనే తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహ్మద్ యూనస్ తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.18 ఏళ్ల లోపు వారు కూడా..మైనర్లకు కూడా ఓటు హక్కు కల్పించాలని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘానికి మహ్మద్ యూనస్ సిఫారసు చేశారు. ఇది ఆమోదం పొందినట్లయితే బంగ్లాదేశ్‌లోని మైనర్లు అంటే 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు కూడా ఓటు వేయడానికి అర్హులవుతారు. అయితే తాత్కాలిక అధ్యక్షుడు చేసిన ఈ సిఫారసుపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)ఓటుహక్కు వయసును 17 ఏళ్లకు తగ్గించడం వలన ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెరుగుతుందని, పర్యవసానంగా ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.వ్యతిరేకించిన బీఎన్పీ2024 ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం పతనానంతరం తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా యూనస్ నియమితులయ్యారు. ఆయన తాజాగా బంగ్లాదేశ్‌లో ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలని ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. యూనస్ ఒక వీడియో సందేశంలో యువత వారి భవిష్యత్తుకు సంబంధించిన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కనీస ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అయితే అధ్యక్షుని నిర్ణయాన్ని బీఎన్పీ తీవ్రంగా వ్యతిరేకించింది.కొత్త ఓటరు జాబితా కోసం..ఢాకాలోని జాతీయ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన చర్చాకార్యక్రమంలో బీఎన్పీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ ఓటింగ్ వయసును 17 ఏళ్లకు తగ్గించాలన్న దేశ అధ్యక్షుని సూచనల మేరకు కొత్త ఓటరు జాబితాను సిద్ధం చేయాల్సి వస్తుందన్నారు. దీనివలన మరింత సమయం వృధా అవుతుందని, ఎన్నికల ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతుందని అన్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల ప్రక్రియను జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో ఎప్పటినుంచో ఉందని అలంగీర్ పేర్కొన్నారు. దేశ తాత్కాలిక అధ్యక్షుడు ఇతర పార్టీలను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ ఆరోపించారు.రాజకీయ పార్టీలతో చర్చ జరగాలిదేశ అధ్యక్షుడు ఓటింగ్‌కు 17 ఏళ్ల వయసు తగినదని చెప్పినప్పుడు ఎన్నికల కమిషన్ దానికి కట్టుబడి ఉండాల్సివస్తుంది. అలాకాకుండా దీనిపై నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్‌కే వదిలేసి ఉంటే బాగుండేది. అప్పుడు సరైన నిర్ణయం వెలువడేది. ప్రస్తుతం దేశంలో ఓటు వేసేందుకు కనీస వయస్సు 18 ఏళ్లుగా ఉంది. దానిని 17కు తగ్గించాలనుకున్నప్పుడు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదిస్తే సరిపోయేది. అప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలతో చర్చ జరిగేదని ఆలంగీర్ అన్నారు. కాగా బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షడు యూనస్ డిసెంబర్ 16న ‘విజయ్ దివస్’ ప్రసంగంలో 2025 చివరి నుంచి 2026 ప్రథమార్థం మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయిని అన్నారు. ఓటరు జాబితాను సవరించాక ఎన్నికలు జరగనున్నాయని అన్నారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు -
Lok Sabha Elections: ఆరో విడత ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆరో విడతలో తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆరో విడతలో 57 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరో షెడ్యూల్లో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.కాగా, సోమవారం ఉదయం ఆరో విడతలో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆరో విడతలో బీహార్, హర్యానా, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆరో విడతలో 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. కాగా, మే ఆరో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. మే 25వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. Election Commission issues notice for the Sixth phase of Lok Sabha elections.Elections will be held in 57 Lok Sabha seats in 6 states and 1 Union Territory. pic.twitter.com/3ASMsonYUb— Sunny Raj ( Modi ka Parivar ) (@sunnyrajbjp) April 29, 2024 -
‘‘రష్యా ఎన్నికలు ఒక బూటకం.. చనిపోయేదాకా పుతిన్‌దే పవర్’’
లండన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ చనిపోయే వరకు పవర్‌లోనే ఉంటాడని, ప్రస్తుతం జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు కింది నుంచి మీది దాకా ఒక భూటకం అని యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్, రష్యా నుంచి బహిష్కరణకు గురైన ఇన్వెస్టర్ బిల్ బ్రౌడర్ వ్యాఖ్యానించారు. అధ్యక్షఎన్నికల వేళ బ్రౌడర్ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ‘దేశ ప్రజలకు జైలు, చావు తప్ప పుతిన్ ఇచ్చేది ఏమీ లేదు. ఇది ఒక గొప్ప లీడర్ లక్షణం కాదు. పుతిన్ ప్రజలను ఇంకా అణచివేస్తే తిరుగుబాటు తప్పదు. ప్రజలు డిసైడైతే పుతిన్‌కు రొమేనియా కమ్యూనిస్టు లీడర్ నికోలే సెస్క్యూకు పట్టిన గతే పడుతుంది’అని బిల్ బ్రౌడర్ హెచ్చరించారు. హెమిటేజ్ క్యాపిటల్ అనే కంపెనీ ద్వారా రష్యాలో 1990 నుంచి 2000 సంవత్సరం వరకు భారీగా పెట్టుబడులు పెట్టిన బిల్ బ్రౌడర్ను అవినీతి ఆరోపణలపై 2005లో దేశం నుంచి బహిష్కరించారు. కాగా, తొలుత రష్యా గూఢచర్య సంస్థ కేజీబీ ఏజెంట్‌గా పనిచేసిన పుతిన్ 1999 నుంచి రష్యాలో అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ పుతిన్ గెలుపు ఖాయమేనన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో మరో ఆరేళ్లపాటు పుతిన్ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. మార్చి 15న ప్రారంభమైన రష్యా ఎన్నికలు 17 దాకా మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఇదీ చదవండి.. కెనడాలో భారత సంతతి ఫ్యామిలీ అనుమానాస్పద మృతి -
కేరళలో రష్యా ఎన్నికల పోలింగ్!!
తిరువనంతపురం: రష్యా ఎన్నికలు శుక్రవారం(మార్చ్ 15) ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్ భారత్‌లోని కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా జరుగుతుండడం విశేషం. కేరళలో నివసిస్తున్న రష్యా పౌరులు తిరువనంతపురంలోని రష్యా కాన్సులేట్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ తరహాలో ఇక్కడ నివసిస్తున్న రష్యన్ల కోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం ఇది మూడోసారని రష్యా కాన్సులేట్ డైరెక్టర్ రతీష్ నాయర్ తెలిపారు. పోలింగ్ విషయంలో తమకు సహకరిస్తున్న రష్యన్లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టూరిస్టులుగా లేదా నివాసం ఉండేందుకు భారత్ వచ్చిన రష్యన్లకు దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని రష్యా పౌరురాలు ఉలియా తెలిపారు. రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మార్చ్ 17వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్‌తో పోటీపడేందుకు ముగ్గురు అభ్యర్థులకు రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్(సీఈసీ)అనుమతిచ్చింది. ఈ ముగ్గురు ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని సమర్ధించిన వారే కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పుతిన్ గెలుపు దాదాపు ఖాయమేనన్న అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ -
Delhi: కేంద్ర కేబినెట్ చివరి భేటీ నేడు
సాక్షి,ఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ భేటీ ఆదివారం(మార్చ్ 3) జరగనుంది. పార్లమెంట్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలవనుండడంతో ఈ ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పలకనున్నారు. వారికి ప్రధాని వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు. మూడవసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధాని మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లమాటిక్ ఎనక్లేవ్‌లోని సుష్మా స్వరాజ్ భవన్లో తుది కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెలలోనే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) షెడ్యూల్ విడుదల చేయనుంది. ఇదీ చదవండి.. వచ్చే వారంలో కాంగ్రెస్ కీలక భేటీలు -
Pak: పాకిస్థాన్‌లో సంకీర్ణం.. ఆయనే ప్రధాని !
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమతో కలిసి వచ్చే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ), ముత్తహిదా ఖ్వామీ మూమెంట్(ఎమ్‌క్యూఎమ్)పార్టీలకు అధ్యక్ష, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ పదవులతో పాటు పలు మంత్రి పదవులిచ్చేందుకు నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్(పీఎంల్-ఎన్)అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆదివారం పీపీపీ, ఎంక్యూఎం పార్టీ నేతలతో నవాజ్ షరీఫ్ జరిపిన చర్చలు విజయవంతమైనట్లు సమాచారం. ప్రధాని పదవిని మాత్రం పీఎంఎల్(ఎన్) తీసుకోనుంది. ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ)ను తప్ప మిగిలిన పార్టీలన్నింటినీ ప్రభుత్వ ఏర్పాటుకు నవాజ్‌షరీఫ్ ఆహ్వానించారు. ఈసారి మిలిటరీ కూడా నవాజ్ షరీఫ్కే మద్దతు పలుకుతోందని సమాచారం. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్ ఎన్‌కు 76 సీట్లు రాగా బిలావల్ బుట్టో నేతృత్వంలోని పీపీపీకి 54 సీట్లు,ఎంక్యూఎం పార్టీకి 17 సీట్లు వచ్చాయి. ఇక ఇమమ్రాన్ఖాన్కు చెందిన పీటిఐ పార్టీకి అత్యధికంగా 97 సీట్లు రావడం గమనార్హం. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో సంకీర్ణం అనివార్యమైంది. ఇదీ చదవండి.. జర్నలిస్టుపై ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన -
పదిహేడవ లోక్‌సభ.. ప్రధాని మోదీ లాస్ట్ స్పీచ్ ఇదే..
న్యూఢిల్లీ: తమ పాలనలో దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు 17వ లోక్‌సభ చివరిరోజు సమావేశాల్లో అయోధ్య రామమందిర తీర్మానంపై ప్రధాని మాట్లాడారు. గత ఐదేళ్లలో అద్భుతమైన మార్పులు ఆవిష్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. దేశాన్ని తామెప్పుడూ వెనకడుగు వేయనివ్వలేదన్నారు. 17వ లోక్‌సభను దేశం తప్పకుండా ఆశీర్వదిస్తుందన్నారు. ‘ఎన్నో ఏళ్ల కల అయిన కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించుకున్నాం. మార్గదర్శకంగా సెంగోల్‌ను స్థాపించుకున్నాం. కరోనా లాంటి విపత్కర పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం. జీ20 సమావేశాన్ని నిర్వహించడం వల్ల భారత్ ప్రతిష్ట పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్పు కనిపిస్తోంది. పేపర్‌లెస్ పార్లమెంట్, డిజిటలైజేషన్ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పార్లమెంట్‌కు హాజరయ్యే సభ్యుల సంఖ్య పెరిగింది. ఈ ఐదేళ్లలో పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. రీ ఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. మార్పు దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. గత పదేళ్లలో దేశంలో ఉత్పాదకత పెరిగింది. ఈ టర్ములో పార్లమెంట్ సమావేశాల్లో చేసిన అనేక సంస్కరణలు గేమ్ చేంజర్లుగా మారాయి. ఉగ్రవాద నిర్మూళనకు తీసుకున్న చర్యల వల్ల కాశ్మీర్లో శాంతి పెరిగింది. ఆర్టికల్ 370 తొలగింపుతో రాజ్యాంగ నిర్మాతల ఆత్మకు శాంతి చేకూరింది. మహిళల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నారీశక్తి వందన్ చట్టం తెచ్చాం. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించి ముస్లిం మహిళల హక్కులను కాపాడాం. మేం చేసిన పనులు చూసి ముస్లిం ఆడబిడ్డలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మరో పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుంది. వికసిత్ భారత్ ఫలాలు మన భావితరాలకు అందుతాయి. రాబోయే 25 ఏళ్లు భారత్‌కు ఎంతో కీలకం. ప్రశ్న ప్రతాల లీకేజీ యువత పాలిట శాపంగా మారింది. యువతకు అన్యాయం జరగకుండా గొప్ప నిర్ణయం తీసుకున్నాం. పేపర్ లీకేజీకి పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చట్టం తెచ్చాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలను 17వ లోక్ సభ ఆమోదించింది. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టం భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతరిక్ష రంగంలో మనదేశ సత్తా చాటాం. ఆర్థిక సంస్కరణల ప్రక్రియలో ఎంపీలంతా పాలుపంచుకున్నారు’ అని ప్రధాని మోదీ తెలిపారు. ఇదీ చదవండి.. ఇండియా కూటమికి కేజ్రీవాల్ షాక్ -
సైన్యం పడగ నీడన... పాక్‌లో ఎన్నికలకు వేళాయె
అది 2018. పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల సమయం. సైన్యం ఆగ్రహానికి గురై అవినీతి కేసుల్లో దోషిగా తేలడంతో నవాజ్ షరీఫ్ అప్పటికి ఏడాది క్రితమే ప్రధాని పదవి పోగొట్టుకున్నారు. జైల్లో మగ్గుతున్నందున ఎన్నికల్లో పోటీకీ దూరమయ్యారు. క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్‌ఖాన్ సైన్యం ఆశీస్సులతో ఎన్నికల్లో నెగ్గి ఏకంగా ప్రధాని పీఠమెక్కారు. ఆరేళ్లు గడిచి పాక్ మళ్లీ సాధారణ ఎన్నికల ముంగిట నిలిచేనాటికి ఈ ఇద్దరు మాజీ ప్రధానుల విషయంలో ఓడలు బళ్లు, బళ్లు ఓడలూ అయ్యాయి. సైన్యం కన్నెర్రతో ఇమ్రాన్ పదవి పోగొట్టుకోవడమే గాక అవినీతి కేసుల్లో జైలుపాలయ్యారు. శిక్షల మీద శిక్షలు అనుభవిస్తూ ఎన్నికలకు దూరమయ్యారు. పార్టీకి కనీసం ఎన్నికల గుర్తు కూడా దక్కని దుస్థితి నెలకొంది! చికిత్స పేరుతో ఆరేళ్ల కింద లండన్ చేరి బతుకు జీవుడా అంటూ ప్రవాసంలో కాలం వెళ్లదీసిన నవాజ్ మళ్లీ సైన్యం దన్నుతో దర్జాగా స్వదేశాగమనం చేశారు. సైన్యం స్క్రిప్టులో భాగంగా అవినీతి కేసులన్నీ కొట్టుకుపోయి నాలుగోసారి ప్రధాని అయ్యేందుకు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇలా దశాబ్దాలుగా పాక్‌లో నేతల భాగ్యరేఖలను ఇష్టానికి నిర్దేశిస్తూ వస్తున్న సైన్యం కనుసన్నల్లో ఎప్పట్లాగే మరో ఎన్నికల తంతుకు సర్వం సిద్ధమవుతోంది... ఏ పౌర ప్రభుత్వమూ పూర్తి పదవీకాలం మనుగడ సాగించని చరిత్ర పాక్ సొంతం. చాలాకాలం పాటు ప్రత్యక్షంగా, మిగతా సమయంలో పరోక్షంగా సైనిక నియంతృత్వపు పడగ నీడలోనే ఆ దేశంలో పాలన సాగుతూ వస్తోంది. అలాంటి దేశంలో సైనిక పాలన ఊసు లేకుండా వరుసగా మూడోసారి సాధారణ ఎన్నికలు జరగబోతుండటం విశేషం! ఇలా జరగడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న పోలింగ్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఎప్పటి మాదిరే ఈసారి కూడా ఏయే పార్టీలు పోటీ చేయాలో, వాటి తరఫున ఎక్కణ్నుంచి ఎవరు బరిలో ఉండాలో కూడా సైన్యమే నిర్దేశిస్తూ వస్తోంది. దేశ ఆర్థికంగా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి, నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ ఆకాశాన్నంటుతూ ప్రజల బతుకే దుర్భరంగా మారిన వేళ జరుగుతున్న ఎన్నికలివి. అక్కడ ఏ ఎన్నికలూ వివాదరహితంగా జరగలేదు. కానీ ఈసారి మాత్రం అవి పరాకాష్టకు చేరాయి. నిజానికి గత నవంబర్‌లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సింది. జనగణనను కారణంగా చూపి ఫిబ్రవరి దాకా వాయిదా వేశారు. నవాజ్ స్వీయ ప్రవాసం నుంచి తిరిగొచ్చి కాలూచేయీ కూడదీసుకుని బరిలో దిగేందుకు వీలుగానే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. ఏదెలా ఉన్నా కనీసం ఈసారన్న కాస్త సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నది సగటు పాక్ పౌరుల ఆశ. అమెరికాతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి అవసరమైన ఆర్థిక సాయం రాబట్టి అవ్యవస్థను చక్కదిద్దడంతో పాటు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న భారత్‌తో సంబంధాలను మెరుగు పరుచుకోవాలన్నది వారి ఆకాంక్ష. కానీ సర్వం సైన్యం కనుసన్నల్లో సాగుతున్న తీరును బట్టి చూస్తే ఈసారీ అది అత్యాశే అయ్యేలా కనిపిస్తోంది. నవాజ్ షరీఫ్ పాక్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు 74 ఏళ్ల నవాజ్ సొంతం. భారత్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే నేతగానూ పేరుంది. దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడని కూడా చెబుతారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) సారథిగా మూడోసారి ప్రధానిగా ఉండగా 2017లో పనామా పేపర్స్, లండన్ అపార్ట్మెంట్స్ వంటి నానారకాల కేసుల్లో ఇరుక్కున్నారు. పదవి పోగొట్టుకుని జైలుపాలై ప్రాణ భయంతో లండన్ పారిపోయారు. అనంతరం పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్‌కూ నాలుగేళ్లలోపే అదే గతి పట్టింది. 2022లో నవాజ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవడంతో నవాజ్‌కు మంచి రోజులు తిరిగొచ్చాయి. గత అక్టోబర్‌లో ఆయన తిరిగొచ్చి పీఎంఎల్ (ఎన్) పగ్గాలు చేపట్టడం, సైన్యంతో పాటు న్యాయ వ్యవస్థ దన్నూ తోడై ఆయనపై అవినీతి కేసులు, శిక్షలూ ఒక్కొక్కటిగా రద్దవడం చకచకా జరిగిపోయాయి. అడ్డంకులన్నీ తొలిగి ఎన్నికల బరిలో నిలిచిన నవాజ్ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమేనంటున్నారు. ఇమ్రాన్‌ఖాన్ అనితరసాధ్యమైన క్రికెట్ నైపుణ్యంతో పాక్ ప్రజలను ఉర్రూతలూగించి నేషనల్ హీరోగా వెలుగు వెలిగిన 71 ఇమ్రాన్ రాజకీయ పిచ్‌పై మాత్రం నిలదొక్కుకోలేక చతికిలపడ్డారు. అవినీతిని రూపుమాపి, కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టి సర్వం చక్కదిద్దుతానంటూ మార్పు నినాదంతో 2018లో ప్రధాని అయ్యారాయన. కానీ ఇమ్రాన్ హయాంలో ఆర్థికంగానే గాక అన్ని రంగాల్లోనూ దేశం కుప్పకూలింది. హింసతో, అశాంతితో పాక్ అట్టుడికిపోయింది. ఆయనకు ఆదరణా అడుగంటింది. నిజానికి సైన్యం చేతిలో పావుగానే ఇమ్రాన్ రాజకీయ ప్రవేశం జరిగిందంటారు. అలాంటి సైన్యానికే ఎదురు తిరగడంతో ఇమ్రాన్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఎంత ప్రయతి్నంచినా పదవిని కాపాడుకోలేకపోయారు. పైగా జైలు శిక్ష వల్ల తాను పోటీ చేసే అవకాశం లేదు. ఆయన పార్టీ తరఫున కొందరు ధైర్యం చేసి ఇండిపెండెంట్లుగా బరిలో దిగుతున్నా చాలామంది జైలుపాలయ్యారు. పలువురు ఫిరాయించగా మిగిలిన వారు అజ్ఞతంలోకి వెళ్లిపోయారు. ఈ సమస్యలు చాలవన్నట్టు పీటీఐ ఎన్నికల గుర్తు బ్యాట్‌పైనా ఎన్నికల సంఘం వేటు వేసింది. దాంతో లక్షలాది మంది నిరక్షరాస్య ఓటర్లు బ్యాలెట్ పత్రాలపై ఇమ్రాన్ పార్టీని గుర్తించను కూడా లేరంటున్నారు. బిలావల్ భుట్టో 35 ఏళ్ల బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్. దారుణ హత్యకు గురైన మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు. షహబాజ్ షరీఫ్ సర్కారులో విదేశాంగ మంత్రిగా తన పనితీరుతో స్వదేశంలో విమర్శలపాలు, భారత్‌లో నవ్వులపాలయ్యారు. గత ఎన్నికల్లో పీపీపీ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి అన్నీ కలిసొస్తే బహుశా కింగ్‌మేకర్ అవ్వొచ్చంటున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుంటారు. 266 మందిని నేరుగా ఉన్నుకుంటారు. 70 సీట్లను మహిళలు, మతపరమైన మైనారిటీలకు; ఆరింటిని గిరిజన ప్రాంతాల వారికి రిజర్వు చేశారు. ఈ స్థానాలను పార్టీలకు గెలుచుకున్న స్థానాలను బట్టి నైష్పత్తిక ప్రాతిపదికన కేటాయిస్తారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
Ayodhya : ఎన్నికల్లో లబ్ధికే రామ్ మందిర వేడుక : కాంగ్రెస్
న్యూఢిల్లీ: అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రారంభ వేడుక ఫక్తు రాజకీయ కార్యక్రమమని కాంగ్రెస్ విమర్శించింది. ఇంకా నిర్మాణం పూర్తికాని గుడిని కేవలం రాజకీయ లబ్ధి కోసం రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టకుని బీజేపీ ప్రారంభిస్తోందని మండిపడింది. ఈ మేరకు ఢిల్లీలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలు సుప్రియా ష్రినేట్, పవన్ ఖేరా మీడియాతో మాట్లాడారు. జ్యోతిర్ మఠం చీఫ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి కూడా రామ మందిర వేడుకకు రావడం లేదని ప్రకటించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. గుడిలో రాముని విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించలేదని అందుకే శంకరాచార్య వేడుకకు రానని ప్రకటించారని ఖేరా చెప్పారు. పూర్తిగా నిర్మాణం జరగని గుడిలో రామునికి ప్రాణ ప్రతిష్ట ఎలా జరుపుతారని నలుగురు శంకరాచార్యలు ఇప్పటికే ప్రశ్నించారన్నారు. రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా ఒక రోజు రామ మందిరాన్ని సందర్శిస్తారని ఖేరా తెలిపారు. ‘దేవునితో ఒక వ్యక్తి ఆడే రాజకీయ డ్రామాను మేం అంగీకరించం’అని ఖేరా స్పష్టం చేశారు. కాగా,ఈ నెల 22న అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ట వేడుకకు దూరంగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్టకు హాజరవకపోవడం కాంగ్రెస్ మూర్ఖత్వానికి నిదర్శనం బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇదీచదవండి.. నాసిక్‌లో మోదీ ఆధ్యాత్మిక పర్యటన.. భక్తులతో కలిసి రాం భజన -
పెట్రో ధరలు తగ్గించే యోచనలో కేంద్రం!
న్యూఢిల్లీ: అధిక పెట్రో ధరల నుంచి ప్రజానీకానికి కాస్తంత ఉపశమనం కల్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లో గెలుపుతో జోరు మీదున్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించే ఉద్దేశంతో ప్రజలకు పెట్రో ధరల భారం తగ్గించనుందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.6–10 తగ్గించాలని మోదీ సర్కార్ భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలను పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోదీ ఆమోదం కోసం పంపించారని వార్తలొచ్చాయి. అయితే ఈ ధరల సవరణపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చాలా నెలలుగా ప్రభుత్వరంగ రిటైల్ చమురు కంపెనీలు పెట్రో ధరలను తగ్గించలేదు, పెంచలేదు. గత ఆర్థికసంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో రిటైల్ కంపెనీలు ఆ ధరల భారాన్ని ప్రజలపై పడేశాయి. దీంతో అప్పుడు ధరలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా ఆమేరకు రిటైల్ అమ్మకం ధరలను సంస్థలు తగ్గించలేదు. దాంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా రూ.58,198 కోట్ల ఆదాయాన్ని మూటగట్టుకున్నాయి. చివరిసారిగా 2022 మే 22వ తేదీన కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.8 , లీటర్ డీజిల్ ధర రూ.6 తగ్గింది. కొద్ది నెలలుగా కీలక రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలను పెంచలేదని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరింత తగ్గించనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. -
2024 LS polls: సగానికిపైగా ఓట్లు మనకే పడాలి
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ పార్టీ పదాదికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి మరిన్ని ఓట్లను ఒడిసిపట్టాలని పార్టీ సీనియర్ నేతలకు సూచించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్టీ జాతీయ పథాధికారుల సమావేశం ఇందుకు వేదికైంది. రెండురోజులపాటు సాగిన ఈ సమావేశం శనివారం ముగిసింది. నేషనల్ ఆఫీస్ బేరర్స్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర సంస్థాగత విభాగాల సారథులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో చర్చకొచి్చన ఇతరత్రా అంశాలను విశ్వసనీయ వర్గాలు శనివారం వెల్లడించాయి. ‘‘త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సమరంలో సగానికిపైగా ఓట్లు బీజేపీకే దఖలుపడాల్సిందే. పోలింగ్‌లో పార్టీ ఓటు షేర్ కనీసం 10 శాతమైనా పెరగాల్సిందే. 2019లో బీజేపీ 37శాతానికిపైగా ఓటు షేరు సాధించింది. ఎన్డీఏ కూటమి దాదాపు 45 శాతం ఓటుషేరు సాధించింది. 2014 నుంచి చూస్తే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు ఒక్క బీజేపీకే పడ్డాయి. దృఢ కార్యదీక్షతో ఎన్నికల క్షేత్రంలో అవిశ్రాంతంగా పనిచేయండి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అంతకుమించిన చోట్ల మన పార్టీ విజయభేరీ మోగించాలి. ఆ బాధ్యత మీదే. జనం మెచి్చన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చొచ్చుకుపొండి. తప్పుడు ఆరోపణలతో విష ప్రచారం చేసే విపక్ష పారీ్టల ఆటకట్టించండి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసిన ప్రాజెక్టులు, పనులు, వాస్తవ గణాంకాలతో ప్రజలకు నిజానిజాలకు తెలియజెప్పండి’’ అని బీజేపీ నేతలకు మోదీ సూచించారు. నాలుగు ‘కులాలను’ కలుపుకొని పొండి ‘దేశంలో నాలుగే కులాలున్నాయి. మహిళలు, యువత, రైతులు, పేదలు. ప్రచారంలో భాగంగా ఈ నాలుగు కులాలను కలిసి వారి కష్టాలకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయతి్నంచండి. అద్భుత ఫలితాలు, ప్రజాదరణ పొందిన కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లండి’ అని మోదీ సూచించారు. కేంద్రంలో బీజేపీ హయాంలో అమలవుతున్న కేంద్ర పథకాలు, వాటి లబ్ధిదారుల విజయగాథలను తెల్సుకుంటూ, ప్రజల్లో పథకాల అవగాహన పెంచుతూ ముందుకు సాగుతున్న ‘ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ను మరింతగా విజయవంతంగా చేయడంపైనా సమావేశంలో నేతలు చర్చించారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగబోయే అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి వేడుకలను మరింత బాగా నిర్వహించడం, తదితరాలూ సమావేశంలో చర్చకొచ్చాయి. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో నమోదైన విజయం.. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విజయానికి శుభసూచకమని నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారని వార్తలొచ్చాయి. బూత్ కమిటీలను పటిష్టవంతంచేస్తేనే ఎక్కువ మంది ఓటర్లను మనం చేరుకోగలమని నేతలు చెప్పినట్లు వార్తలొచ్చాయి. ‘‘మూడు రాష్ట్రాల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాం. ఇక సార్వత్రిక సమరంలోనూ హ్యాట్రిక్ కొట్టబోతున్నాం’’ అని నేతల ముందు మోదీ విశ్వాసం వ్యక్తంచేశారని తెలుస్తోంది. ‘‘మన ప్రదర్శన చూసి విపక్షాలు కంగుతినాలి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారట. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ ఘన విజయంపై ఆ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు పార్టీని పొగుడుతూ ప్రసంగించారు. వచ్చే నెలలో అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారం¿ోత్సవం సార్వత్రిక ఎన్నికల్లో పారీ్టకి బాగా కలిసొస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. -
Five States Assembly Elections 2023: బీజేపీ తీన్మార్
ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్స్ పోరులో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాలను సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో భారీ విజయంతో అధికారాన్ని నిలుపుకోగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను కాంగ్రెస్ నుంచి చేజిక్కించుకుంది. తద్వారా ఉత్తరాది హిందీ బెల్టులో తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంది. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో లభించిన ఈ సానుకూల ఫలితాలతో బీజేపీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ ఘోరమైన ఓటమి మూటగట్టుకుని కాంగ్రెస్ చతికిలపడింది. తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు తెర దించుతూ విజయం సాధించడం ఒక్కటే ఈ ఎన్నికల్లో దానికి ఊరట. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 164 సీట్లతో ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ 65 స్థానాలతో సరిపెట్టుకుంది. రాజస్తాన్‌లో పోలింగ్ జరిగిన 199 స్థానాల్లో బీజేపీ 115 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌కు 69 సీట్లు దక్కాయి. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 54 సీట్లు సాధించగా కాంగ్రెస్‌కు 35 దక్కాయి. ఇక తెలంగాణలో 119 సీట్లకు కాంగ్రెస్ 64 చోట్ల నెగ్గి మెజారిటీ సాధించగా అధికార బీఆర్ఎస్ 39 సీట్లకు పరిమితమైంది. ఐదో రాష్ట్రమైన మిజోరంలో సోమవారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధానంగా స్థానిక పార్టీలైన ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం మధ్యే పోరు సాగిందన్న అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు అక్కడ పెద్దగా ఆశలేమీ లేవు. ఆద్యంతమూ ఆధిక్యమే... ఫలితాల వెల్లడిలో తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవాయే సాగింది. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచే మధ్యప్రదేశ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లింది. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లో తొలుత కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నట్టు కని్పంచినా కాసేపటికే పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చాలామంది భావించిన ఛత్తీస్‌గఢ్‌లో కూడా స్పష్టమైన ఆధిక్యం కని్పస్తుండటం పార్టీలో జోష్ నింపింది. దాంతో ఒకవైపు లెక్కింపు కొనసాగుతుండగానే బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. జై శ్రీరాం, మోదీ నాయకత్వం వరి్ధల్లాలి అంటూ నేతలు, కార్యకర్తలు హోరెత్తించారు. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రధాన కార్యాలయాల వద్ద బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం బీజేపీకి కలిసొచ్చింది. ఈ నిర్ణయం ద్వారా మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత ప్రభావం నుంచి తప్పించుకోవడంతో పాటు రాజస్తాన్‌లో నేతల మధ్య కుమ్ములాటలకు కూడా పార్టీ చెక్ పెట్టిందని చెబుతున్నారు. మోదీ కేంద్రంగా సాగించిన ప్రచారం ఫలించింది. అంతిమంగా బీజేపీ మీద ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు అద్దం పట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనగా, కాంగ్రెస్ మత, విభజన రాజకీయాలను వారు తిరస్కరించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. నిరుత్సాహంలో కాంగ్రెస్ గత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించిన ఊపులో ఉన్న కాంగ్రెస్‌లో తాజా ఫలితాలు నిరుత్సాహం నింపాయి. ఇది తాత్కాలిక వెనుకంజేనని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కలిపి 84 లోక్‌సభ స్థానాలున్నాయి. తాజా విజయాలతో ఉత్తర, పశి్చమ భారతంలో అత్యధిక రాష్ట్రాలు బీజేపీ అధికారంలోకి వెళ్లాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయానికి ఆ ప్రాంతాల్లో మెరుగైన ప్రదర్శనే ప్రధాన కారణంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ఆశించినన్ని సీట్లు నెగ్గకపోవడం బీజేపీకి నిరాశ కలిగించగా అక్కడ తొలిసారిగా అధికారం చేపట్టనుండటం కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే అంశం. రాజస్తాన్ బీజేపీదే 115 అసెంబ్లీ స్థానాల్లో విజయం 69 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సొంతం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 200 శాసనసభ స్థానాలకు గాను 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఏకంగా 115 స్థానాల్లో జెండా ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీని సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. ఈ ఆనవాయితీని కాంగ్రెస్ బద్దలు కొట్టలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో 69 సీట్లకు పరిమితమైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీని గెలిపించలేకపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు దూకుడుగా సాగించిన ప్రచారం ముందు కాంగ్రెస్ చేతులెత్తేసింది. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామంటూ ముఖ్యమంత్రి గెహ్లోత్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ పరాజయాన్ని ఊహించలేదని పేర్కొన్నారు. తమ ప్రణాళికలు, పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో కొన్ని లోపాలు చోటుచేసుకున్నాయని అంగీకరించారు. సీఎం గెహ్లోత్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు సమరి్పంచారు. రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నా చిన్నాచితక పారీ్టలు సైతం ప్రభావం చాటాయి. భారత ఆదివాసీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, రా్రïÙ్టయ లోక్తాంత్రిక్ పార్టీ, రా్రïÙ్టయ లోక్‌దళ్ కొన్ని సీట్లు గెలుచుకున్నాయి. పలువురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. పలువురు కాంగ్రెస్ మంత్రులు ఓడిపోయారు. అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సి.పి.జోïÙకి సైతం పరాజయం తప్పలేదు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ జోద్పూర్ జిల్లాలోని సర్దార్‌పురా నుంచి వరుసగా ఆరోసారి విజయం సాధించడం విశేషం. గత ఎన్నికల్లో ఆయనకు 45,597 ఓట్ల ఆధిక్యం లభించగా, ఈసారి 26,396కు తగ్గింది. మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాషాయమే 163 స్థానాలు బీజేపీ కైవసం 66 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ భోపాల్: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయ బావుటా ఎగురవేసింది. మొత్తం 230 స్థానాలకు గాను ఏకంగా 163 స్థానాలను సొంతం చేసుకుంది. మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. ఈసారి బీజేపీని ఎలాగైనా గద్దె దించాలన్న అధికార కాంగ్రెస్ వ్యూహాలు ఫలించలేదు. ఆ పార్టీ కేవలం 66 సీట్లకే పరిమితమైంది. బీజేపీ గెలుపు నేపథ్యంలో రాజధాని భోపాల్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సంబరాలు హోరెత్తాయి. కాంగ్రెస్ కార్యాలయం బోసిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా వల్లే విజయం సాధ్యమైందని బీజేపీ నాయకులు చెప్పగా పరాజయానికి కారణాలను సమీక్షించుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. బుద్నీ అసెంబ్లీ స్థానంలో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఏకంగా లక్షకు పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈసారి బీజేపీ మధ్యప్రదేశ్‌తో పాటు ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యరి్థని ముందుగా ప్రకటించకపోవడం తెలిసిందే. అయినా పార్టీ ఘనవిజయం నేపథ్యంలో శివరాజ్ ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు. అయితే బీజేపీ ఇంతటి ఘనవిజయం సాధించినా ఏకంగా 12 మంది మంత్రులు ఓటమి పాలవడం విశేషం! అయితే అసెంబ్లీ బరిలో దిగిన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ వర్గీయ మాత్రం విజయం సాధించారు. 2013 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 165 స్థానాలొచ్చాయి. కాంగ్రెస్ 58 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి 44.88 శాతం, కాంగ్రెస్‌కు 36.38 శాతం ఓట్లు లభించాయి. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 40.89 శాతం ఓట్లతో 114 స్థానాలు సాధించింది. బీజేపీ 41.02 శాతం ఓట్లు సాధించినా 109 సీట్లే నెగ్గింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. కమల్‌నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. 15 నెలలకే కాంగ్రెస్ అగ్ర నేత జ్యోతిరాదిత్య తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలోకి ఫిరాయించారు. దాంతో కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలింది. శివరాజ్ సీఎంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఛత్తీస్‌గఢ్‌లో విరబూసిన కమలం 54 సీట్లతో బీజేపీ విజయహాసం 35 స్థానాలతో కాంగ్రెస్ ఓటమి రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారతీయ జనతా పార్టీని వరించింది. మొత్తం 90 శాసనసభ స్థానాలకు గాను బీజేపీ 54 స్థానాలు దక్కించుకుంది. అధికార కాంగ్రెస్‌కు 35 స్థానాలే లభించాయి. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన కమలం పార్టీ ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికార పీఠం సొంతం చేసుకుంది. ‘మోదీ కీ గ్యారంటీ–2023’ పేరిట బీజేపీ ఇచి్చన హామీలను ప్రజలు విశ్వసించినట్లు కనిపిస్తోంది. క్వింటాల్ రూ.3,100 చొప్పున ధరకు ఎకరాకు 21 క్వింటాళ్ల చొప్పున ధాన్యం కొనుగోలు, మహతారీ వందన్ యోజన కింద వివాహమైన మహిళలకు ఏటా రూ.12,000 చొప్పున ఆర్థిక సాయం వంటి హామీలు ప్రజలను ఆకర్శించాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కూడా బీజేపీ గెలుపునకు తోడ్పడింది. కాగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఆ పారీ్టకి ప్రతికూలంగా మారాయి. స్వయానా సీఎం బఘెల్, డిప్యూటీ సీఎం సింగ్‌దేవ్ మధ్య స్పర్థలుండటం కూడా బాగా చేటు చేసింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించి 2018లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి చతికిలపడింది. సీఎం బఘెల్ తన సొంత నియోజకవర్గం పటన్‌లో నెగ్గినా రాష్ట్రంలో మాత్రం పార్టీని గెలిపించుకోలేకపోయారు. డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్‌దేవ్ కూడా ఓటమి చవిచూశారు! అంబికాపూర్ అసెంబ్లీ స్థానంలో సమీప బీజేపీ ప్రత్యర్థి రాజేశ్ అగర్వాల్ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి సీఎం బఘెల్ ముడుపులు స్వీకరించారంటూ పోలింగ్ సమీపించిన వేళ వచి్చన ఆరోపణలు కూడా కాంగ్రెస్‌కు బాగా నష్టం చేసినట్టు కనబడుతోంది. మరోవైపు బీజేపీ ఈసారి వ్యూహాత్మకంగా సీఎం అభ్యరి్థని ప్రకటించకుండానే ఎన్నికల్లో పోటీకి దిగింది. అయినా ప్రధాని మోదీకి ఉన్న జనాదరణ, ఆయన పేరుతో ఇచి్చన హామీల ఆసరాతో పార్టీ విజయ తీరాలకు చేరింది. -
పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు
అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. దేశంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభాన్ని సరిదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సైనిక, రాజకీయ, వాణిజ్యంలో నాయకుల స్వార్ధప్రయోజనాలు పక్కకు పెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వరల్డ్ బ్యాంకు పాక్ ప్రతినిధి నజీ బాన్‌హాస్సిన్ అన్నారు. పాకిస్థాన్ ప్రస్తుతం సంక్షోభం అంచున ఉంది. 40 శాతం జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ ధరలు, తగినన్ని వనరులు లేకపోవడం సహా అనేక ఆర్ధిక కష్టాలను పాక్ ఎదుర్కొంటోంది. పిల్లల విద్యా ప్రమాణాలు, చిన్నారుల మరణాలు వంటి సూచికలు.. పాక్ పేదరికం తారా స్థాయికి చేరిందని చెబుతున్నాయని నజీ బాన్‌హాస్సిన్ తెలిపారు. 2000 నుంచి 2020 మధ్య కాలంలో పాకిస్థాన్ సగటు వాస్తవ తలసరి వృద్ధి రేటు కేవలం 1.7 శాతం మాత్రమే. ఇది దక్షిణాఫ్రికా దేశాల సగటు తలసరి వృద్ధి రేటులో సగం కంటే తక్కువగా ఉందని నజీ వెల్లడించారు. పాక్ మానవాభివృద్ధి సూచికలోనూ దక్షిణాసియాలో చిట్టచివరన ఉంది. విదేశీ నిల్వలు అడుగంటాయి. వాతావరణ మార్పులు ఆ దేశానికి శాపంగా మారుతున్నాయి. పాక్‌లో వచ్చే జనవరిలో జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఆర్ధిక పరిస్థితులు బాగులేని కారణంగా ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్ధిక వ్యవస్థను సరిచేసుకోవాల్సిన సమయమని సూచించింది. నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ఉచిత హామీలకు పోకూడదని పేర్కొంది. ఆర్ధిక రంగాన్ని గాడిన పెట్టడానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కోరింది. వృధా ఖర్చులను తగ్గించుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. ప్రజా సేవలు, మౌలిక సదుపాయాల్లో పరిమితమైన ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: పీఓకేను ఖాళీ చేయండి: భారత్ అల్టిమేటమ్ -
మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు కేసీఆర్?
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ను జాతీయ స్థాయిలో బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. కాగా మహారాష్ట్రలోని నాందేడ్ లేదా ఔరంగాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ గతంలో తెలంగాణలోని మూడు వేర్వేరు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004, 2006, 2008లో కరీంనగర్ నుంచి. 2009లో మహబూబ్‌నగర్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014లో మెదక్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కేసీఆర్, సీఎం పదవిని చేపట్టడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. జాతీయ రాజకీయాల్లో బలం చాటే వ్యూహం జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీల నేతృత్వంలోని కూటములకు సమదూరం పాటిస్తున్న కేసీఆర్ లోక్‌సభలో ఒంటరి పోరుకు సన్నద్ధమవుతున్నారు. మహారాష్ట్రలోని అన్ని లోక్‌సభ స్థానాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపేలా ఆయన వ్యూహ రచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలో 48 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, ఇప్పటికే 27 నియోజకవర్గాల పరిధిలో గ్రామ స్థాయి వరకు తొమ్మిదేసి పార్టీ కమిటీలు ఏర్పాటయ్యాయి. మహారాష్ట్రలోని 15 జిల్లాల పరిధిలో పార్టీ కార్యకలాపాలు వేగం పుంజుకున్నట్లు మహారాష్ట్ర బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా మహారాష్ట్ర నుంచి లోక్‌సభ బరిలోకి దిగడం ద్వారా జాతీయ రాజకీయాల్లో తన బలాన్ని చాటేలా కేసీఆర్ వ్యూహం సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి దక్షిణాది నుంచి తొలి హ్యాట్రిక్ సీఎంగా నిలిచేందుకే కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. -
Karnataka election results 2023: కలసి ఉంటే కలదు సుఖం
రాహుల్ జోడో యాత్ర నింపిన ఉత్సాహంతో, మల్లికార్జున ఖర్గే మంత్రాంగంతో ఉప్పు, నిప్పుగా ఉండే దిగ్గజ నేతలు సిద్ధూ, డీకే ఒక్కటయ్యారు. పోస్టర్ల నుంచి ప్రచారం వరకు ఒకే మాట ఒకే బాటగా నడిచారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. మత రాజకీయాలను సమష్టిగా ఎదుర్కొన్నారు. ఫలితంగా కర్ణాటకలో కాంగ్రెస్ అందరికీ కొత్తగా కనిపించింది. అనూహ్య విజయంతో లోక్‌సభ ఎన్నికలకు కావల్సిన ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది. అవినీతిపై ప్రచారం రాష్ట్రంలో బసవరాజ్ బొమ్మై సర్కార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. పేటీఎంను గుర్తుకు తెచ్చేలా ‘‘పేసీఎం’’ అంటూ బొమ్మై ముఖం, క్యూఆర్ కోడ్‌తో పోస్టర్లు వేయడం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. 40% కమీషన్ సర్కార్ అంటూ ప్రచారాన్ని గ్రామ గ్రామల్లోకి తీసుకువెళ్లారు. గ్రామీణాభివృద్ధి మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప పబ్లిక్ వర్క్స్ ప్రాజెక్టులో 40% కమీషన్‌ను డిమాండ్ చేశారన్న ఆరోపణలతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్ష కుమారుడు 40 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం వంటివన్నీ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంది. సిద్దూ, డీకే కాంబినేషన్ కాంగ్రెస్ పార్టీకి మరే రాష్ట్రంలో లేని విధంగా బలమైన నాయకులు కర్ణాటకలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ జోడు గుర్రాలుగా మారి గెలుపు రథాన్ని పరుగులు పెట్టించారు. ఇద్దరి మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి కలసికట్టుగా పని చేశారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ప్రజాధ్వని యాత్ర నిర్వహించారు. ఎన్నికల వ్యూహాల దగ్గర్నుంచి పార్టీ మేనిఫెస్టో వరకు, టిక్కెట్ల పంపిణీ నుంచి బూత్ మేనేజ్మెంట్ వరకు సంయుక్తంగా వ్యూహాలు రచించారు. పార్టీలో దిగ్గజ నాయకులిద్దరూ ఒక్కటి కావడంతో నాయకులంతా చేతులు కలపడం రావడం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. ఖర్గే అనుభవం ఏ పార్టీకైనా అనుభవజ్ఞలైన పెద్దలే కొండంత అండ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే 80ఏళ్ల వయసులో తన సొంత రాష్ట్రంలో ఎన్నికల్ని అత్యంత ప్రతిష్మాత్మకంగా తీసుకున్నారు. పార్టీలో అత్యంత శక్తిమంతమైన నాయకులైన సిద్దరామయ్య, శివకుమార్లను ఏకతాటిపైకి తీసుకురావడంతో ఖర్గే సగం విజయం సాధించారు. టిక్కెట్ల పంపిణీపై ముందస్తుగా కసరత్తు చేసి 124 మందితో తొలి జాబితా విడుదల చేయడం, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తూ నియోజకవర్గాల్లో అసమ్మతి గళాలు లేకుండా చూశారు. అటు అధిష్టానానికి, ఇటు స్థానిక నాయకత్వానికి వారధిగా ఉంటూ నెల రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేసి పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. సానుభూతే ఆయుధం బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన కక్షపూరిత రాజకీయాలు కూడా వికటించాయి. ప్రభుత్వంపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోని వారు కాంగ్రెస్ నాయకులపై సీబీఐ, ఈడీ కేసులు పెట్టి వేధించడం ప్రజల్లో సానుభూతిని పెంచింది. పరువు నష్టం కేసులో రాహుల్ దోషిగా తేలి ఎంపీగా అనర్హత వేటునెదుర్కోవడం, పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌పై సీబీఐ కేసులు పెట్టి తీహార్ జైల్లో పెట్టడం వంటివి కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాయి. శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించడమే దీనికి తార్కాణం. లింగాయత్ ఓట్లు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి బలమైన మద్దతుదారులైన లింగాయత్ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా చీల్చింది. బి.ఎస్. యడీయూరప్పని సీఎంగా తప్పించడంతో ఆ వర్గాన్ని పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఎన్నికలకు కాస్త ముందు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావాదిలు కాంగ్రెస్ గూటికి చేరడం కలిసొచ్చింది. పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ స్వయంగా లింగాయత్ మఠాలన్నీ సందర్శించి తాము అధికారంలోకి వస్తే వారి డిమాండ్లన్నీ తీరుస్తామన్న హామీలు ఇవ్వడంతో ఈ సారి లింగాయత్ ఓటర్లు కాంగ్రెస్‌వైపు మళ్లారు. ‘సార్వత్రిక’ విజయానికి తొలి మెట్టు ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు తొలి మెట్టు. ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వొచ్చేమో. బీజేపీయేతర పార్టీలు ఇక త్వరగా ఏకతాటి మీదకు వస్తాయని భావిస్తున్నా. బీజేపీ మత రాజకీయాలను ఓడించిన ప్రజలకు జేజేలు’’ – కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య లోకల్ వోకల్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి స్థానిక సమస్యలపైనే అత్యధికంగా దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో ప్రభావం చూపించే అంశాల జోలికి వెళ్లలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌పై ఆధారపడి బీజేపీ ఎన్నికలకి వెళ్లడాన్ని పదే పదే ప్రశ్నించింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ఇది రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలే తప్ప ప్రధాని మోదీ గురించి ఎన్నికలు కాదంటూ ప్రతీ సభలోనూ గళమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా స్థానికంగా పవర్ఫుల్ నాయకులనే ముందుంచి ప్రచారాన్ని నిర్వహించింది. ఇక రాహుల్ గాంధీ కూడా ప్రజలతో మమేకమైపోతూ స్థానిక అంశాలపైనే వారితో ముచ్చటించారు. ఫలితంగా పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా హస్తం గుర్తుకే ఓట్లు గుద్దేశారు. గ్యారంటీ కార్డుకి కురిసిన ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఈసారి ఎన్నికల్లో ఓట్లు కురిపించాయి. అయిదు హామీలతో కాంగ్రెస్ విడుదల చేసిన గ్యారంటీ కార్డులో గృహజ్యోతి (గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్), గృహలక్ష్మి (ఇంటి మహిళా యజమానికి నెలకి రూ.2 వేలు ఆర్థిక సాయం), అన్న భాగ్య (నిరుపేద కుటుంబాలకు నెలకి 10 కేజీల ఉచిత బియ్యం) యువనిధి (నిరుద్యోగ యువతకి రెండేళ్లు ఆర్థిక సాయం) శక్తి (ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం) హామీలు ప్రజల్ని విశేషంగా ఆకర్షించి కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టాయి. మైనార్టీల అండదండ.. పోలింగ్‌కు కొద్ది రోజులు ముందు బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చడం ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందని అందరూ భావించారు. కానీ మైనార్టీ ఓట్ల ఏకీకరణ జరిగి కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. ఓల్డ్ మైసూరుతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ముస్లిం ఓటర్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓటు వేశారు. హిజాబ్, హలాల్, ఆజాన్ వివాదాలతో ముస్లిం ఓటర్లందరూ ఏకమయ్యారు. ఓల్డ్ మైసూరులో కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య ముస్లిం ఓట్లు చీలిపోయేవి. కానీ ఈ సారి అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ వెంటే మైనార్టీలు నడిచారు. జోడో యాత్ర జోష్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా పార్టీ విజయానికి దోహదపడింది. కర్ణాటకలో అత్యధికంగా 24 రోజులు నడిచిన రాహుల్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఎనిమిది జిల్లాల్లో 500 కి.మీ. మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రాహుల్ నడిచారు. 2018 ఎన్నికల్లో ఈ 20 సీట్లలో అయిదు స్థానాలనే గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి 15 స్థానాల్లో విజయభేరి మోగించింది. -
విపక్షాల ఐక్యతే ముఖ్యం
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఐక్యం చేసే ప్రయత్నాలను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రతరం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌తో కలిసి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను గురువారం వేర్వేరుగా కలుసుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ దేశ ప్రయోజనాల కోసం ఏమీ చేయడం లేదని ఆరోపించారు. అందుకే పార్టీ ప్రయోజనాలతో పాటుగా దేశ ప్రయోజనాలను కూడా కాపాడడానికి కృషి చెయ్యాలని ఇరువురు నేతలకు చెప్పినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు ముందు దేశ ప్రయోజనాలను కాపాడాలన్న ఏకైక లక్ష్యం ఉందని నితీశ్ అన్నారు. అందరూ కలసికట్టుగా పోరాడితే బీజేపీపై విజయం సాధించవచ్చునని చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం త్వరలోనే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితో సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. -
2024 సెమీఫైనల్స్: 2023లో ఎన్నికలు జరిగే కీలక రాష్ట్రాలివే..
2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కానీ, అంతకు ఏడాది ముందే దేశంలో కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2023లో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలు అధికారంలోని బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్‌కు కీలకం కానున్నాయి. ► ఈశాన్య రాష్ట్రాలు: 2023 ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య మూడు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్‌లో మిజోరాంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రిపురలో ఐపీఎఫ్టీతో కలిసి అధికారంలో ఉంది బీజేపీ. అలాగే నాగాలాండ్, మేఘాలయాల్లో అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. మిజోరాంలో ప్రధానంగా కాంగ్రెస్, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ మధ్యే పోటీ ఉంటుంది. ప్రధానంగా త్రిపుర ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తొలిసారి 2018లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ప్రస్తుతం వ్యతిరేకత మింగుడుపడటం లేదు. ► కర్ణాటక: దక్షిణభారతంలో బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రం కర్ణాటక. 2023లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్, జనతా దళ్(సెక్యులర్)ల మధ్యే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తోంది. మరోవైపు.. పార్టీలో తిరుగుబాటు నేతలను బుజ్జగించి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ► తెలంగాణ: దేశంలో కొత్త ఏర్పాడిన రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరగనున్నాయి. దేశ రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా అవతరించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్కు ఎంతో కీలకంగా మారాయి. మరోవైపు.. బీజేపీ, కాంగ్రెస్‌లు అధికార మార్పిడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దక్షిణాదిలో పట్టు సాధించేందుకు తెలంగాణలో తమ బలం చూపించుకోవలాని బీజేపీ భావిస్తోంది. ► మధ్యప్రదేశ్: 2023 నవంబర్-డిసెంబర్ మధ్య మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ఇక్కడ ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటుతో సీఎంగా కమల్‌నాథ్ దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ అధికారం చేపట్టింది. దేశంలో రెండే అతిపెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో విజయం సాధించటం ద్వారా 2024 లోక్‌సభ ఎన్నికలపై పట్టు సాధించాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ► ఛత్తీస్‌గఢ్-రాజస్థాన్: 2024 ఎన్నికలకు ముందు ఈ రెండు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు.. రాజస్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వర్గ పోరు ప్రధనా ఆకర్శనగా నిలుస్తోంది. అలాగే, రాష్ట్రాల్లో అధికార మార్పిడి సంప్రదాయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: నీకే కాదు.. నీ తండ్రికి కూడా ఎవరూ భయపడటం లేదు: ఫడ్నవీస్ -
2024 సార్వత్రిక ఎన్నికలు.. ప్రధాని అభ్యర్థిపై అమిత్ షా కీలక ప్రకటన
పట్నా: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారని చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు బీజేపీ-జేడీయూ పొత్తు కొసాగుతుందని అమిత్ షా పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని వివరించారు. బిహార్ రాజధాని పట్నాలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ మోర్చాల ఉమ్మడి జాతీయ కార్యవర్గ సమావేశాలకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం ముగింపు కార్యక్రమంలో ప్రసంగించి ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీ రిటైర్ అవుతారని, ఆయన స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు రెండేళ్ల ముందే అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. మోదీనే తమ అభ్యర్థి అని కార్యకర్తలకు స్పష్టం చేశారు. కశ్మీరీలు తయారు చేసిన త్రివర్ణ పతాకాలను ఈ కార్యక్రమంలో అందరికీ పంచారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరీల ఆలోచనలు మారాయని తెలిపిందుకే వారు తయారు చేసిన జెండాలు పంపిణీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని దేశం నలుమూలలా జాతీయ జెండాలను ఎగురవేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఆగస్టు 13-15వరకు మూడు రోజులపాటు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని సూచించారు. చదవండి: బీజేపీ చర్య సిగ్గుచేటు.. -
కశ్మీర్లో త్వరలో ఎన్నికలు..?
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు రాజకీయ ప్రక్రియను ప్రారంభించడానికి, కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధణకు వివిధ పార్టీలతో చర్చించాలని కేంద్రం భావిస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు ఆదివారం ఎన్డీటీవీతో చెప్పాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. జమ్మూ కశ్మీర్‌కి ప్రత్యేక హోదా పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఏర్పాటైన 7 పార్టీల గుప్కర్ కూటమి (పీఏజీడీ) కేంద్రంతో చర్చలకు అంగీకరించింది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్.. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన చర్చలకు మాత్రమే హాజరవుతామని స్పష్టం చేసింది. 2018 జూన్‌లో మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకున్నాక కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించింది. తర్వాత ఆగస్టు, 2019లో జమ్మూ కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ... 370 ఆర్టికల్ రద్దు చేసింది. వాస్తవానికి 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిపి ఉండవలసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఎన్నికల సంఘం ఆ సాహసం చేయలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. గత ఏడాది ఆగస్టులో ఏర్పాటైన గుప్కర్ కూటమి స్థానిక ఎన్నికల్లో 100కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. కానీ, 6 నెలలుగా అంతర్గత విభేదాలతో చురుగ్గా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. ఆ కూటమి చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఇటీవల పీడీపీ చీఫ్‌తో మంతనాలు జరిపారు. ఆ తర్వాత జుమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి ఎన్నికలపై కేంద్రంతో చర్చల్లో పాల్గొంటామన్నారు. అమెరికా ఒత్తిడి పని చేస్తోందా? కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావించడం వెనుక అమెరికా ఒత్తిడి ఉందని సమాచారం. కశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడాన్నే బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు ఇటీవల వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. -
ఎన్నికలు @ కోవిడ్
న్యూఢిల్లీ: ఎన్నికల ఇంటింటి ప్రచారంలో ఐదుగురే పాల్గొనాలి..పోలింగ్ బూత్‌లలో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలి..ఈవీఎం బటన్ నొక్కే ముందు ఓటర్లు గ్లవ్స్ ధరించాలి..కోవిడ్–19 నేపథ్యంలో ఎన్నికల కమిషన్(ఈసీ) తాజాగా విడుదల చేసిన ఎన్నికల మార్గదర్శకాల్లో ఇవి కొన్ని..! కేంద్రం విడుదల చేసిన కోవిడ్–19 కంటైయిన్మెంట్ మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల బహిరంగ సభలు, సమావేశాలను రాజకీయ పార్టీలు నిర్వహించుకోవాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. కోవిడ్–19 సమయంలో జరిగే సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వివరించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్లను ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. డిపాజిట్లను కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చు. ఎన్నికల ప్రక్రియ సమయంలో కూడా మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, పీపీఈ కిట్ల వాడకం వంటి ప్రామాణిక రక్షణ చర్యలను కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో నివాసం ఉండే ఓటర్ల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేస్తామని ఈసీ తెలిపింది. ఒకవైపు, కరోనా మహమ్మారి ముప్పు మరింత తీవ్రం కానుందని ఆందోళనలు వ్యక్తమవుతుండగా, ఈసీ నిబంధనలకు లోబడి మొట్టమొదటి ఎన్నికలు బిహార్ అసెంబ్లీకి జరిగే అవకాశాలున్నాయి. అయితే, బిహార్ ఎన్నికలపై ఈసీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈసీ జారీ చేసిన విస్తృత మార్గదర్శకాలివీ.. ► నామినేషన్ దాఖలు, పత్రాల పరిశీలన, గుర్తుల కేటాయింపు వంటివి సజావుగా సాగేందుకు భౌతిక దూరం నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి చాంబర్ ఉండాలి. అభ్యర్ధులకు రిటర్నింగ్ అధికారి ముందుగానే సమయం కేటాయించాలి. ► నామినేషన్ వేసేందుకు ఎన్నికల అధికారి వద్దకు వెళ్లే అభ్యర్ధి వెంట ఇద్దరు వ్యక్తులు, రెండు వాహనాలు మాత్రమే ఉండాలి. ► ఇంటింటి ప్రచా రం సమయంలో భద్రతా సిబ్బంది మినహాయించి అభ్యర్థి సహా ఐదుగురే పాల్గొ నాలి. రోడ్‌షోల్లో పాల్గొ నే వాహన కాన్వాయ్‌లో భద్రతా సిబ్బందిని మిన హాయిస్తే ఐదు వాహనాలే ఉండాలి. ► కోవిడ్–19 మార్గదర్శకాలకు లోబడి బహిరంగ సమావేశాలు, సభలు ఏర్పాటు చేసుకోవాలి. ► జిల్లా ఎన్నికల అధికారి ముందుగా అనుమతించిన చోటే బహిరంగ సభలు జరపాల్సి ఉంటుంది. సభలకు హాజరయ్యే వారు భౌతిక దూరం వంటివి పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఎన్నికల సభలకు హాజరయ్యే వారి సంఖ్య రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎస్డీఎంఏ) పేర్కొన్న పరిమితికి లోబడి ఉండేలా చూడటం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ బాధ్యత. ► పోలింగ్‌కు కనీసం ఒక రోజు ముందు పోలింగ్ స్టేషన్లను తప్పనిసరిగా పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయాలి. ► అన్ని పోలింగ్ స్టేషన్ల ప్రవేశద్వారం వద్ద థర్మల్‌స్కానర్లు ఏర్పాటు చేయాలి. ఎన్నికల సిబ్బంది కానీ పారామెడికల్ సిబ్బంది కానీ పోలింగ్ స్టేషన్ ప్రవేశ ద్వారం వద్దే ఓటర్లకు థర్మల్ స్కానింగ్ చేపట్టాలి. ► ఓటర్లందరికీ శరీర ఉష్ణోగ్రతలు గమనించాలి. అనుమానాస్పదంగా ఉంటే రెండు పర్యాయాలు ఉష్ణోగ్రతలు తీసుకోవాలి. ఆరోగ్యశాఖ జారీ చేసిన సురక్షిత స్థాయికి మించి కనిపిస్తే వారికి పోలింగ్ ముగిసే చివరి గంటలో ఓటేసేందుకు అవకాశం ఇస్తారు. ► కోవిడ్–19 సోకి క్వారంటైన్లో గడుపుతున్న వారికి కూడా పోలింగ్ ముగిసే ఆఖరి గంటలో అవకాశం కల్పిస్తారు. ► పోలింగ్ బూత్‌లో ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కేముందు వారికి డిస్పోజబుల్ గ్లవ్స్ అందజేస్తారు. ► పోలింగ్ స్టేషన్లో ప్రస్తుతం ఉన్న 1,500 మంది ఓటర్లకు బదులు.. వెయ్యి మందికి మించి ఉండరాదు. ► ఎన్నికల ప్రక్రియ సమయంలో కోవిడ్–19 సంబంధిత ఏర్పాట్లు, నివారణ చర్యలు వంటివి పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నోడల్ అధికారులు ఉంటారు. ఎన్నికల అధికారుల శిక్షణ కూడా ఆన్లైన్లోనే జరిపే అవకాశం ఉంది. ► ఎన్నికల సిబ్బందిలో కోవిడ్–19 లక్షణాలున్న వారిని గుర్తించి, వారికి బదులుగా మరొకరిని నియమించే ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు చూసుకుంటారు. ► ఓట్ల లెక్కింపు కేంద్రానికి తీసుకువచ్చే ముందు ఈవీఎంలు, వీవీప్యాట్లను శానిటైజ్ చేయాలి. -
చీకటి ‘‘చంద్రుని’’ పగటికల
సాక్షి, అమరావతి: ‘కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, ఆంధ్రరాష్ట్రే.. ఒకానొక సుముహూర్తాన సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పటి వరకూ అధికార పీఠానికి దూరంగా ఉన్న చంద్రకాంతుడు వెంటనే ఎన్నికలబరిలో దిగాడు. ఏనాడూ స్వయంప్రకాశంలేని ఈ చంద్రుడు, అరువు బలాన్ని తెచ్చుకున్నాడు, అలవి గాని వాగ్దానాలతో అమాయకులను నమ్మించాడు. చావు తప్పి కన్నులొట్టపోయిన చందాన బొటాబొటీ, అత్తెసరు మార్కులో అధికారపీఠం దక్కించుకున్నాడు. అంతే..సీన్ మారిపోయింది. ‘భువికి తానే అధినాథుడనని’, అంతా తన ప్రయోజకత్వమేనని విర్రవీగాడు. ఇచ్చిన హామీలను అటకెక్కించాడు. ఆ హామీల జ్ఞాపకాలను కూడా వెబ్సైట్ నుంచి తొలగించాడు. ప్రత్యర్థులను అణచడానికి రెండు ఆయుధాలను చేత ధరించాడు. ఒకటి–అవినీతితో కట్టిన మూటలు, మరొకటి తప్పుడు కేసుల బనాయింపు. పుత్రరత్నం తండ్రికి అన్నిటా బాసటగా నిలిచాడు. అన్ని వర్గాలూ బాధలలో మునిగిపోయాయి. ‘ఏ దేవుజూచి నేడలుగునో, ఏ దిగ్భాగము మీద దాడి చనునో, ఏ ప్రాణులం జంపునో..’ అన్నట్టుచ విర్రవీగిన హిరణ్యకశిపుడు ప్రజలకు గుర్తుకు వచ్చాడు. ఇంకా ఈ అసురుడిని చూస్తే, నరకాసురుడు, రావణాసురుడు కూడా గుర్తుకు వచ్చారు. ఆ రాక్షసులు మాత్రం ‘మాకు వారసుడు వచ్చాడోచ్’ అని ఆనందించారు. అయిదేళ్ల చీకటి పాలన అనంతరం మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. సొంత బాకా పత్రికలు, ఛానళ్ళు ఎంత గట్టిగా బాకాలు ఊదినా, చంద్రుడిని ఏదో భయం ఆవరించింది. విపక్షనేత సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఆ నేత ప్రసంగాలకు కేరింతలు కొడుతున్నారు. ఆయనలో ఒక ఆత్మీయుడిని చూస్తున్నారు. జాతీయ ఛానళ్ళ సర్వే ఫలితాలు చూస్తే, చంద్రుని కంటికి నిద్ర కరువవుతోంది. ఇక లాభం లేదని వెంటనే పురోహితుడి దగ్గరకు పరుగుతీశాడు.. ‘పంతులూ! నేను తిరిగి సింహాసనం ఎక్కేటట్టు దీవించు. మంత్రాలు గట్టిగా చదువు’ అని ఆదేశించాడు. ‘యతో ధర్మస్తతో జయః’ అని దీవించనా అయ్యా!’ అన్నాడు పురోహితుడు. ‘ఆ దీవెనకు అర్థం ఏమి’టని ఎవరినీ నమ్మని చంద్రుడు అడిగాడు. ‘అయ్యా! రాబోయే కురుపాండవ సంగ్రామంలో తనను దీవించమని సుయోధనుడు కోరినప్పుడు, తల్లి గాంధారి పలికిన పలుకులు ఇవి’ అన్నాడు పురోహితుడు. ‘ఈ పదాలకు అర్థం ఏమిటి?’ చంద్రుడు గద్దించాడు. ‘ఎక్కడ ధర్మం ఉంటుందో, అక్కడే విజయం ఉంటుందని దీని అర్థమయ్యా!’ వివరించాడు పురోహితుడు. ‘వద్దు, అలాంటి దీవెనలు అసలే వద్దు’ అన్నాడు చంద్రుడు తత్తరపడుతూ, చెమట తుడుచుకుంటూ. ‘అయ్యా, అవినీతిపరులు శంకరగిరిమాన్యాలుచంద పట్టాలని సంకల్పం చెప్పి పూజలు ప్రారంభించనా?’ అన్నాడు పురోహితుడు. మళ్ళీ చంద్రుడు కంగారు పడ్డాడు. ‘అసలే వద్దు, ఇంకోటి చెప్పు..’ అన్నాడు చంద్రుడు. ‘అయ్యా! హత్యారాజకీయాలు చేసేవారు, నిత్యం అసత్యప్రచారాలు చేసేవారు నశించిపోవాలని సంకల్పం చెప్పనా?’ అన్నాడు పురోహితుడు. ‘అలాంటివేమీ వద్దు, నేను సింహాసనం ఎక్కాలని మాత్రమే సంకల్పం చెప్పు’ అన్నాడు చంద్రుడు. ‘సర్వాంతర్యామి భగవంతుని కన్నులు కప్పలేము కదా? పగటి కలలు నెరవేరతాయా?’ అంటూ సన్నగా గొణుక్కున్నాడు పురోహితుడు. ‘ఉదాత్తమైన సంకల్పాలను ఈషణ్మాత్రం సహించలేకపోతున్న ఈ పగటి చంద్రుడి కలను ఎందుకు నెరవేర్చాలో ఆ దేవుడే నిర్ణయించుకోవాలి’ అంటూ నిట్టూర్చాడు. – వారణాసి సుబ్రహ్మణ్యం -
2019.. వెరీ కాస్ట్లీ ఎలక్షన్స్!
వాషింగ్టన్: రాబోయే సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవి కాబోతున్నాయని అమెరికాకు చెందిన నిపుణుడు అంచనా వేశారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పటి దాకా జరిగిన అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కూడా ఇవి నిలిచే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ‘2016లో అమెరికా అధ్యక్ష, కాంగ్రెస్ ఎన్నికలకు అయిన వ్యయం 6.5 బిలియన్ డాలర్లు(రూ.46,166 కోట్లు). భారత్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల ఖర్చు సుమారు 5 బిలియన్ డాలర్లు(రూ.35,512 కోట్లు). ఈసారి వ్యయం దానికి రెట్టింపు(రూ.71,025 కోట్లు) అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో భారత ఎన్నికలే ప్రపంచంలో అత్యంత ఖరీదైనవిగా నిలవబోతున్నాయి’ అని మిలాన్ వైష్ణవ్ అనే రాజకీయ నిపుణుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ దక్షిణాసియా డైరెక్టర్, ఫెలోగా పనిచేస్తున్నారు. ఈసారి బీజేపీ, ఇతర విపక్షాల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఖర్చుకు రాజకీయ పక్షాలు ఏమాత్రం వెనకాడబోవని మిలాన్ చెప్పారు. భారత్‌లో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధానంలో పారదర్శకత లేకపోవడం పెద్ద లోపమని పేర్కొన్నారు. దీని వల్ల ఏ పార్టీ ఎక్కడి నుంచి ఎంత మొత్తాన్ని సేకరిస్తోందో తెలుసుకోవడం కష్టమవుతోందని తెలిపారు. తాము ఫండింగ్ చేసిన పార్టీ అధికారంలోకి రాకపోతే వేధింపులు తప్పవన్న భయంతో చాలా మంది విరాళాలను బహిర్గతం చేయడంలేదని అన్నారు. తాజాగా అమల్లోకి వచ్చిన ఎన్నికల బాండ్ల విధానం వల్ల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని తెలిపారు. -
కాంగ్రెస్ వ్యూహం : 250 స్ధానాల్లోనే పోటీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ రెండో సారి అధికార పగ్గాలు చేపట్టకుండా చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రాతినిథ్యం పెరిగేలా వీలైనన్ని తక్కువ స్ధానాల్లోనే పోటీకి పరిమితమవాలని ఆ పార్టీ యోచిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కనిష్టస్ధాయిలో కేవలం 250 స్ధానాల్లోనే పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాషాయ కూటమిని అధికార పీఠం నుంచి తప్పించేందుకు భావసారూప్యం కలిగిన పార్టీలతో మహాకూటమి ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు బీజేపీయేతర పార్టీలకు ఎక్కువ స్ధానాలు సర్ధుబాటు చేసేలా తాను తక్కువ సీట్లకే పరిమితం కావాలని యోచిస్తున్నట్టు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటుపై రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ బ్లూప్రింట్ రూపకల్పనలో నిమగ్నమైంది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసేందుకు ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి ఈ బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఈ కమిటీ జిల్లా, రాష్ట్ర కమిటీలతో సంప్రదింపులు జరిపి ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను హైకమాండ్ దృష్టికి తీసుకువెళతారు. అనంతరం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నివేదికలను పరిశీలించిన అనంతరం సీట్ల సర్ధుబాటుపై, ఎన్ని స్ధానాల్లో బరిలో దిగాలనే అంశంపై పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీ కొనేందుకు ఏర్పాటైన మహాకూటమిలో చేరే ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ ప్రాతినిథ్యం కల్పిస్తూ పార్టీ 250 కన్నా తక్కువ స్ధానాల్లో పోటీకి పరిమితం కావాలని పలువురు పార్టీ నేతలు సూచిస్తుండటం గమనార్హం. -
ఎందుకు ఓడిపోయాం?
ఎన్నికల్లో పరాజయానికి కారణాలపై రేపు ఏపీ పీసీసీ సమీక్ష రాష్ట్ర స్థాయి సమావేశానికి విజయవాడలో ఏర్పాట్లు విజయవాడ: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సమీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) సిద్ధమైంది. ఇందుకోసం ఈ నెల 17న విజయవాడలో రామవరప్పాడు చౌరస్తాలోని పరిణయ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమావేశం నిర్వహించనుంది. ఈ రాష్ట్ర స్థాయి సమావేశానికి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఏపీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు, మాజీ మంత్రి శైలజానాథ్, పార్టీ ప్రధాన కార్యదర్శి టీజే సుధాకర్‌లను పార్టీ నియమించింది. 13 జిల్లాల్లోనూ నియోజకవర్గాల వారీగా ఓటమికి కారణాలపై ఈ సమావేశంలో సమీక్షించడంతో పాటు పార్టీ పునరుత్తేజానికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికనూ నేతలు రూపొందించనున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూలేని విధంగా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై దృష్టి సారించి పునరుత్తేజానికి చర్యలు తీసుకోవాలన్న ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలతో విజయవాడలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని వారం కిందటే నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా 13 జిల్లాల నుంచి డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఏపీ పీసీసీ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు హాజరుకానున్నారని రుద్రరాజు పద్మరాజు తెలిపారు. -
అంతర్మథనంలో హస్తం
పరాజయూనికి కారణాల అన్వేషణలో కాంగ్రెస్ రాహుల్ సలహాదారులపై సీనియర్ల గుర్రు సోనియూ, రాహుల్‌ల రాజీనామాలపై ఊహాగానాలు.. తోసిపుచ్చిన షకీల్ అహ్మద్ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయూనికి కారణాలను అన్వేషించే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. సోమవారం కీలక వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) జరగనుండగా.. అంతకుముందే నేతలు కొందరు కత్తులు దూస్తున్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ పరిస్థితిపై చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి (సీడబ్ల్యూసీ) సమావేశ మవుతుండగా.. రాహుల్ నాయకత్వం, పార్టీ ఎన్నికల వ్యూహం, మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నారుు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కీలక సలహాదారులు కొందరిపై సీనియర్ నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరైతే టికెట్ల పంపిణీ చేసిన తీరును బహిరంగంగానే తప్పుబడుతున్నారు. జైరాం రమేశ్, మోహన్‌గోపాల్, మధుసూదన్ మిస్త్రీ, మోహన్ ప్రకాశ్, అజయ్ మాకెన్ తదితరులు విమర్శల దాడికి గురవుతున్నవారిలో ఉన్నారు. రాహుల్‌తో పాటు పార్టీ అధ్యక్షురాలు సోనియూగాంధీ కూడా సీడ బ్ల్యూసీ భేటీలో రాజీనామాల సమర్పణకు సిద్ధమైనట్టుగా శనివారం మీడియూలో ఊహాగానాలు సాగారుు. అరుుతే ఉన్నతస్థారుు పార్టీవర్గాలు ఈ ఊహాగానాలను తోసిపుచ్చారుు. ‘అంతా ఒట్టిదే. ముందుకు వెళ్లే మార్గం ఇది కాదు. అది పరిష్కారం కూడా కాదు..’ అని పార్టీ అగ్రనాయకత్వానికి సన్నిహితంగా మెలిగే వర్గాలు వ్యాఖ్యానించారుు. అవన్నీ ఊహాజనిత వార్తలేనని పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ చెప్పారు. ఊహాజనిత వార్తలపై తాను ఊహాగానాలు చేయదలుచుకోవడం లేదని కాంగ్రెస్ ప్రతినిధి కూడా అరుున అహ్మద్ అన్నారు. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయూనికి బాధ్యత వహిస్తున్నామని చెప్పిన సోనియూ, రాహుల్.. ఇది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పుగా అంగీకరించారు. ఈ విషయంలో మేము ఆలోచించాల్సింది ఎంతో ఉందని అని వారన్నారు. అరుుతే పార్టీ టికెట్టు కేటారుుంచిన తర్వాత కూడా కొందరు అభ్యర్థులు కాంగ్రెస్ విడిచిపోవడం విచారకరమని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు అనిల్‌శాస్త్రి పేర్కొన్నారు. టికెట్లిచ్చిన తీరుపై తీవ్ర సమీక్ష జరపాల్సిన ఆవశ్యకతను ఇది స్పష్టం చేస్తోందని అన్నారు. అప్పుడే పార్టీలో చేరినవారికి పళ్లెంలో పెట్టి టికెట్లు ఇవ్వడం జరగదని రాహుల్ అంతకుముందు చెప్పినా.. పలువురి విషయంలో అలాగే జరిగిందని, అందువల్ల రాహుల్ అభిప్రాయూనికి విరుద్ధంగా వ్యవహరించిన వారే ప్రస్తుత పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని శాస్త్రి చెప్పారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం ఓటమిపాలు కావడం.. మంత్రులు, పార్టీ కార్యకర్తలకు మధ్య పూర్తిగా సంబంధాలు లేవనే విషయం స్పష్టం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. రాహుల్ పనితీరుపై ఒకపక్క పార్టీలో గొణుగుళ్లు ఉన్నప్పటికీ.. గాంధీ కుటుంబ ప్రభావం క్షీణిస్తోందనే వాదనను ఆ నేత తోసిపుచ్చారు. గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూశామని ఆయన అన్నారు. మరోవైపు బలమైన ప్రాంతీయ నేతలు లేకపోవడానికి కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో మట్టి కరవడాన్ని ఒక నేత గుర్తు చేశారు. కాంగ్రెస్ ఘోర పరాజయూనికి కారణాలను పేర్కొంటూ ఒకటీ రెండురోజుల్లో తాను రాహుల్‌కు లేఖ రాయనున్నట్టు అనిల్ శాస్త్రి తెలిపారు. రాహుల్‌కు కమల్‌నాథ్ మద్దతు రాహుల్‌కు సీనియర్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ దన్నుగా నిలిచారు. రాహుల్ రాజీనామా చేయూల్సిన అవసరం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. అరుుతే పార్టీ సమీక్షించుకోవాలని, ఇంటిని ఓ క్రమంలో పెట్టాలని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గత ఎనిమిది నెలల నుంచే ముఖ్యమైన స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ పనితీరులో గానీ, అది సాధించిన విజయూల్లో కానీ ఆయన పాత్ర ఏమీ లేనట్టుగా మాట్లాడుతున్నారు! ఏమి తర్కమిది?’ అని కమల్‌నాథ్ ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పార్టీయే నియమించింది. పార్టీ ఒక్కటే ఆయన్ను తొలగించగలదు కానీ.. అది ఆ విధంగా చేయూలనుకోవడం లేదు..’ అని ఆయన అన్నారు.