ఎన్నికల వేళ.. ఏరులై పారుతోంది! | Unauthorized sales of alcohol | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ.. ఏరులై పారుతోంది!

Published Thu, Mar 27 2014 3:21 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

Unauthorized sales of alcohol

విజయనగరం రూరల్, న్యూస్‌లైన్ :
జిల్లాలో వరుస ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వారం రోజులకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కోడ్ అమల్లోకి వచ్చింది.
 
 మద్యం అనధికార అమ్మకాలు జోరు..
 ఏ ఎన్నికలు వచ్చినా.. మందుబాబులకు పండగే. అలాంటిది మూడు ప్రధాన ఎన్నికలు ఒకేసారి వస్తే... వారి జీవితం మూడు ఫుళ్లు.. ఆరు క్వార్టర్ల లెక్కన సాగిపోయినట్లే. ప్రస్తుతం మందుబాబుల పరిస్థితి అలానే ఉంది. ఎన్నికల పుణ్యమాని జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. ఇదే సందర్భంలో బెల్టుషాపుల ద్వారా అనధికార అమ్మకాలు పెరిగాయి. నాటుసారా కూడా విరివిగా లభిస్తోంది.
 
అబ్కారీశాఖ అధికారులు, పోలీసులు నిత్యం దాడులు చేస్తున్నా.. అక్రమ మద్య ప్రవాహం మాత్రం ఆగడం లేదు. దాబాల్లోనూ, రెస్టారెంట్లలోనూ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. లెసైన్స్ దుకాణాల్లో సైతం చిల్లర అమ్మకాలు సాగిపోతున్నాయి. ఇక కల్తీ సారా ప్రవాహానికి అడ్డుకట్టే లేకపోతోంది.
 
ఈ నెల మూడో తేదీన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు 516 కేసులు నమోదు చేశారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 237 మందిని అరెస్టు చేసి, రెండు వాహనాలను సీజ్ చేశారు.జిల్లా వ్యాప్తంగా సారా నిల్వలు ఉంచిన 149 మందిపై ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేశారు. 56 మందిని అరెస్టు చేశారు. 1,470 లీటర్ల సారాయిని సీజ్ చేశారు. 56,050 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారాయిని సరఫరా చేస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు.
 
నల్లబెల్లం కేసు ఒకటి నమోదు చేశారు. 1,460 కేజీల నల్లబెల్లాన్ని సీజ్ చేశారు.94 కల్లు నమూనాలను సేకరించి, ల్యాబ్‌లకు పంపారు.అనధికార బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్న 160 మందిని అరెస్టు చేశారు. బెల్టు దుకాణాల నుంచి 532.67 లీటర్ల మద్యాన్ని, 129.53 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు.నిబంధనలు పాటించని 14 లెసైన్సు రెస్టారెంట్లు, మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేశారు. 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఎంఆర్‌పీ ఉల్లంఘన కేసులు ఎనిమిది, నిర్ణీత సమయం కంటే అదనంగా అమ్మకాలు చేస్తున్న ఐదు దుకాణాలపై కేసులు నమోదు చేశారు.గంజాయి అక్రమ రవాణా కేసులు మూడు నమోదు చేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. 34.900 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.102 మందిపై మండల తహశీల్దార్ల సమక్షంలో బైండోవర్ కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement