the Election Commission
-
నిబంధనల మేరకే..
► అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక ► సర్వసభ్య సమావేశంలో ఎంపిక ► ఫిర్యాదు చేసిన వారే ప్రతిపాదించారు ► సీఈసీకి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ లేఖ సాక్షి ప్రతినిధి, చెన్నై: నిబంధనల మేరకే తన నియామకం జరిగిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి తెలిపారు. పార్టీ సంప్రదాయం ప్రకారం సర్వసభ్య సమావేశం ద్వారా ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకున్నారని సీఈసీకి సమర్పించిన వివరణలో ఆమె పేర్కొన్నారు.అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత ఆమె స్థానంలో ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. ఆ తరువాత నెలకొన్న విభేదాల వల్ల మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ తదితరులపై ఆమె బహిష్కరణ వేటు వేశారు. నిరంతరాయంగా ఐదేళ్లపాటు సభ్యత్వంలేని శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన 12 మంది పార్లమెంటు సభ్యులు సీఈసీకి ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని ప్రకటించాలి్సందిగా వారు కోరారు. ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదుపై బదులివ్వాల్సిందిగా శశికళను సీఈసీ కోరింది. శశికళ తరఫున పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఇటీవలే సీఈసీకి వివరణ ఇచ్చారు. అయితే శశికళ ఇచ్చిన నోటీసుపై దినకరన్ బదులివ్వడం ఏమిటని సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసును అందుకున్న శశికళనే ఈనెల 10వ తేదీలోగా బదులివ్వాలని ఇటీవల ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు 70 పేజీలతో కూడిన ఉత్తరం ద్వారా శుక్రవారం బెంగళూరు జైలు నుంచే సీఈసీకి శశికళ బదులిచ్చారు. గతంలో దినకరన్ ఇచ్చిన వివరాలనే శశికళ తరఫు న్యాయవాది సీఈసీకి సమర్పించారు. ప్రధాన కార్యదర్శిని పార్టీ సర్వసభ్య సమావేశం ద్వారానే ఎన్నుకుంటారని, తన నియామకం కూడా అదే రీతిన జరిగింది. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తులే పార్టీ సర్వ సభ్యసమావేశంలో తన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా కలిసి ఎకగ్రీవంగా తనను ఎన్నుకున్నారు. పార్టీ నియమ నిబంధనలకు లోబడే ఎన్నిక జరిగిందని శశికళ వివరణ ఇచ్చారు. -
నేటితో నామినేషన్లకు తెర
► ఓటర్ల బ్యాంకు అకౌంట్లపై డేగకన్ను ► నగదు బట్వాడాకు అడ్డుకట్ట సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల సమయాల్లో అక్రమాలకు పాల్పడకుండా అభ్యర్థులపై నిఘా పెట్టడం మామూలే. అయితే తమిళనాడులో తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏకంగా ఓటరుపైనే నిఘాపెట్టేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఓటుకు నోటు ప్రలోభాన్ని అడ్డుకునేందుకు ఓటర్లపైనా, వారి బ్యాంకు ఖాతాలపైనా నిఘాపెట్టి కొత్త సంప్రదాయానికి తెరదీసింది. మధురై జిల్లా అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో నగదు బట్వాడా సాగినట్లు కోర్టు భావించడం వల్ల గతంలో రద్దయ్యాయి. ఎమ్మెల్యే శీనివేల్ మృతి వల్ల తిరుప్పరగున్రం నియోజవర్గంతోపాటు తంజావూరు, అరవకురిచ్చిలో ఈనెల 19వ తేదీన పోలింగ్ జరుగనుంది. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, పీఎంకే, డీఎండీకే పార్టీలు తమ అభ్యర్దులను రంగంలోకి దింపాయి. సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే మినహా అన్ని పార్టీలూ అన్నాడీఎంకే చేతిలో డిపాజిట్టు కోల్పోయి భారీ ఓటమితో మట్టికరిచాయి. ఈసారి ఉప ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కకున్నా కనీసం మెరుగైన ఓట్లు రాబట్టుకునేందుకు కొన్ని పార్టీలు పాటుపడుతున్నాయి. ఇప్పటికే ఒకసారి నగదు బట్వాడా ఆరోపణలు ఎదుర్కొన్నందున ఉప ఎన్నికల్లో ఈ అపప్రధ నుండి తప్పించుకునేందుకు ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ఉప ఎన్నికల్లో నిఘా చర్యలపై ఒక అధికారి మాట్లాడుతూ, ఓటర్లకు నగదు బట్వాడా జరుగకుండా మూడు నియోజకవర్గాల్లో ఐదు కంపెనీల కేంద్ర భద్రతాదళాలు, ఫ్లయింగ్ స్వ్క్డాడ్లు రంగంలో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మరే రాష్ట్రంలోనూ ఎన్నికలు లేనందున ఈ మూడు నియోజకవర్గాలపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అదనపు బలగాలు వస్తున్నాయని తెలిపారు. మూడు నియోజకవర్గాల్లోని అభ్యర్దులు ఎన్నికల నిబంధనలను తుంగలోతొక్కినట్లుగాా వ్యవహరిస్తే మరోసారి ఎన్నికలను వాయిదావేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. తంజావూరు, అరవకురిచ్చీల్లో వాహనాల తనిఖీల్లో రూ.7.12 కోట్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఓటర్లకు నగదు పంచేందుకు వీలులేని విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ పరిస్థితిల్లో అధికారుల కళ్లుగప్పి ఓటర్ల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని ఆయన అన్నారు. అందుకే ఓటర్ల బ్యాంకు ఖాతాలపై కూడా నిఘాపెట్టామని తెలిపారు. ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున సొమ్ము జమ చేయడం, డ్రా చేయడం జరుగుతోందాని ప్రతిరోజూ వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. అనుమానం వస్తే నియోజకవర్గాల్లోని ఓటర్ల ఇళ్లను కూడా తనిఖీ చేస్తామని అన్నారు.ఎన్నికల అధికారులతోపాటూ ఆదాయపు పన్నుశాఖ అధికారులు సైతం తనిఖీల్లో పాల్గొంటారని తెలిపారు. అన్నాడీఎంకే అభ్యర్థికి చుక్కెదురు తిరుప్పరగున్రం అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే బోస్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఉదయకుమార్తోపాటూ కల్లంబల్ అనే గ్రామానికి వెళ్లారు. 2006 నుంచి 2011 వరకు ఏకే బోస్ ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిత్యం వహిస్తున్నారు. గ్రామానికి మౌళిక సదుపాయాలను కల్పిస్తామని గడిచిన రెండు ఎన్నికల్లోనూ హామీ ఇచ్చి ప్రజలను వంచించారని దుయ్యబడుతూ ప్రచారానికి వచ్చిన బోస్‌ను, మంత్రిని గ్రామస్తులు ముట్టడించారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో మంత్రి ఉదయకుమార్, అభ్యర్థి బోస్ వెనుదిరిగారు. పుదుచ్చేరీ నెల్లితోప్పు కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రి నారాయణస్వామికి మద్దతుగా డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఈనెల 13వ తేదీన పుదుచ్చేరీలో ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉండగా, తమిళనాడు, పుదుచ్చేరీల్లో ఉప ఎన్నికలు జరగుతున్న నాలుగు కేంద్రాల్లో నామినేషన్లకు బుధవారం తెరపడనుంది. -
అమ్మ వేలిముద్ర !
► బీ ఫాంలో అన్నాడీఎంకే ► అధినేత్రి జయ వేలిముద్ర ► వివాదాన్ని లేవనెత్తిన విపక్షాలు ► ఓకే అంటూ ఈసీ అంగీకారం ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న ముగ్గురు అన్నాడీఎంకే అభ్యర్థుల బీఫాంలలో పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత సంతకం చేయకుండా వేలిముద్ర వేయడం వివాదాలకు తెరతీసింది. ఆమె అరోగ్యంగా ఉన్నపుడు అమ్మ వేలిముద్రా అంటూ విపక్షాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్య కారణాలతో జయలలిత సెప్టెంబరు 22వ తేదీ నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు చేసిన చికిత్స ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది, దాదాపుగా కోలుకున్నారని వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రి పడకపై కూర్చుని వైద్యులతో మాట్లాడుతున్నారని, తన చేతులతోనే ఆహారాన్ని తీసుకుంటున్నారని ఇటీవల వరకు చెబుతూ వచ్చారు. అమ్మ ఆసుపత్రి చికిత్స పొందుతున్న తరుణంలోనే తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంలలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ముగ్గురు అభ్యర్థులకు జయలలిత పార్టీ అధినేత్రి హోదాలో బీ ఫాంలను జారీ చేయడం తప్పనిసరి. జయ అంగీకారంతో కూడిన బీఫాంలను ఎన్నికల కమిషన్‌కు అప్పగించినపుడే అభ్యర్థులకు రెండాకుల గుర్తును కేటాయిస్తారు. అన్నాడీఎంకే తరఫున పోటీచేసే అభ్యర్థులకు 1989 నుంచి జయలలిత సంతకంతో కూడిన బీఫాంలనే అందజేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన అన్నాడీఎంకే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయగా, బీ ఫాంలో అమ్మ సంతకం ఉండాల్సిన స్థానంలో ఎడమచేతి వేలిముద్ర ఉంది. అమ్మ కోలుకున్న పరిస్థితుల్లో వేలిముద్ర వేయాల్సిన ఆవశ్యకత ఏమిటని విపక్షాలు విమర్శలు లేవనెత్తాయి. వేలిముద్ర వేసింది జయలలితేనా, బీఫాంలో వేలి ముద్ర చెల్లుతుందా అంటూ మరికొందరు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. వేలిముద్రపై వైద్యుని వివరణ వేలి ముద్రకు సాక్షి సంతకం చేసిన రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ బాలాజీ విపక్షాలకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సీఎం కుడిచేతి గుండా మందులు ఎక్కిస్తున్న కారణంగా ఎడమ చేతి బొటనవేలి ముద్రను వేయించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. వేలిముద్ర వేసేపుడు ఆమె సృ్పహలోనే ఉన్నారు, వేలిముద్ర తీసుకోవడం సీఎంకు తెలుసని ప్రకటించాల్సి వచ్చింది. ఈసీ వివరణ ఈ నేపథ్యంలో వేలిముద్ర వ్యవహారంపై చీఫ్ ఎలక్షన్ కార్యాలయం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఒక ఉత్తరం రాసింది. అన్నాడీఎంకే తరఫున పోటీచేస్తున్న ముగ్గురు అభ్యర్థులకు అందజేసే ఏ, బీ ఫారంలలో పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత చేతి ముద్రలు వినియోగిస్తున్నట్లు 26వ తేదీన పార్టీ కార్యాలయం నుంచి తమకు ఉత్తరం అందిందని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యుని సమక్షంలో వేసిన వేలిముద్ర ఉప ఎన్నికల్లో చెల్లుబాటు అవుతుందని సీఈసీ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల అధికారి సైతం వేలిముద్రతో కూడిన బీఫాంలపై ఆమోద ముద్ర వేశారు. వేలిముద్రపై ఏమా వేగం? బీఫాంలలో జయ వేలిముద్రను ఆమోదించడంలో ఎన్నికల కమిషన్ చూపిన వేగం అశ్చర్యాన్ని కలిగిస్తోందని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ వ్యాఖ్యానించారు. వేలిముద్రను అంగీకరించడం అన్నాడీఎంకేపై ఎన్నికల కమిషన్ చూపుతున్న హద్దుమీరిన ఆదరణ అని దుయ్యబట్టారు. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
జిల్లాపరిషత్ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెల 19 న విడుదల చేసిన పంచాయతీ ఉప పోరుకు శుక్రవారం నుంచి నామినేషన్లుు స్వీకరిస్తున్నట్లు జడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో మోహన్‌లాల్ తెలిపారు. జిల్లాలో ఖాళీ ఏర్పడిన ఒక ఎంపీటీసీ, మూడు సర్పంచ్, 38 వార్డుసభ్యుల స్థానాలకు వచ్చే నెల 8న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారని మోహన్‌లాల్ పేర్కొన్నారు. అంతకుముందు అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారన్నారు. ఎన్నికలు జరిగే మండలాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, పోలింగ్, ఓట్ల లెక్కింపు ఆయా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉంటుందని తెలిపారు. సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్ ఎంపీటీసీ స్థానం ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వికలాంగులశాఖ సహాయ సంచాలకులు చిన్నయ్య, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఎంపీడీఓ శ్రీనివాస్‌రావును నియమించగా, మిగిలిన సర్పంచి, వార్డుసభ్యుల ఎన్నికకు రిటర్నింగ్ అధికారులుగా స్టేజ్–1 ఈవోపీఆర్డీలను నియమించామని పేర్కొన్నారు. -
పోలింగ్ ప్రశాంతం
నాలుగు శాసన మండలి స్థానాలకు ముగిసిన ఎన్నికలు బెంగళూరు: నాలుగు శాసనమండలి స్థానాల కోసం గురువారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దీంతో అటు రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఇటు ఎన్నికల కమిషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈనెల 13న వెల్లడి కానున్నాయి. దక్షిణ గ్రాడ్యుయేట్ నియోజక వర్గం, పశ్చిమ ఉపాధ్యాయ నియోజక వర్గం, వాయువ్య గ్రాడ్యుయేట్ నియోజకవర్గం, వాయువ్య ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో 3,48,907 ఓటర్లు ఉండగా 59 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రతి నియోజక వర్గంలో అధికార కాంగ్రెస్‌తోపాటు విపక్ష భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌లు తమ అభ్యర్థులను బరిలో దించగా వాయువ్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మాత్రం జేడీఎస్ సహకారంతో స్వతంత్ర అభ్యర్థి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మొదటి మూడు గంటలు కొంత నెమ్మదిగా ప్రారంభమైన పోలింగ్ అటు పై నెమ్మదిగా పుంజుకుంది. మొత్తం ఓటర్లలో.53.14 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
కూతురి పెళ్లి బాధ్యతను అప్పుగా చూపిన అభ్యర్థి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లో తన అవివాహిత కుమార్తె పెళ్లి బాధ్యతను అప్పుల జాబితాలో చూపారు! గాందెర్‌బాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మహమ్మద్ యూసఫ్ భట్ ఈ నిర్వాకం వెలగబెట్టాడు. దీనిపై విమర్శలు రావడంతో స్పందించారు. ‘నా కుమారులు సంపాదిస్తున్నారు కానీ, ఆమె సంపాదించడం లేదు. కుమార్తె పెళ్లి తండ్రి బాధ్యత. నా కూతురి పెళ్లికి బ్యాంకులో జమచేసిన డబ్బు గురించి అఫిడవిట్లో తెలిపాను’ అ చెప్పారు. తనకు సరిగ్గా చదువు రాకపోవడంతో బాధ్యతకు, అప్పుకు మధ్య తేడాను అర్థం చేసుకోలేకపోయానన్నారు. తనకు రూ.11 లక్షల చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్సీ సీటు కోసం దివంగత నేషనల్ కాన్ఫరెన్స్ నేత హాజీ యూసఫ్‌కు రూ. 84 లక్షలు ఇచ్చానని తెలిపారు. -
ఈసీ ఉత్తర్వులు సరికాదు
నిధుల సేకరణపై పార్టీల డిమాండ్ న్యూఢిల్లీ: ఎన్నికల వ్యయం, నిధుల సమీకరణలో పారదర్శకత పాటించాలంటూ ఎన్నికల సంఘం రూపొందించిన మార్గదర్శకాలను రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. అసందిగ్ధంగా ఉన్న వీటిని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. రూ.20,000 దాటిన విరాళాలను నగదుగా స్వీకరించరాదని, చెక్కుల ద్వారానే సేకరించాలని ఈసీ స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయంది. దీనిపై పార్టీలు అభ్యంతరం తెలిపాయి. న్యాయపరంగా ఇవి చెల్లుబాటు కావని కాంగ్రెస్ పేర్కొంది. అన్ని పార్టీలతో చర్చించటంతోపాటు న్యాయశాఖ సలహా తీసుకోవాలని కాంగ్రెస్ నేత వోరా సూచించారు. ఈమేరకు ఆయన ఈసీకి లేఖ రాశారు. సమావేశాలు, వీధుల్లో చందాల సేకరణ ద్వారా విరాళాలు సమకూర్చుకుంటున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. హుండీలో చందాలు వేసే దాతలకు రసీదులు ఇవ్వాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపింది. ఈసీ ఉత్తర్వులో పలు అంశాలు చెల్లవని, వీటికి తప్పుడు భాష్యాలు చెప్పే అవకాశం ఉందని సీపీఎం పేర్కొంది. -
13న జిల్లాలో యథావిధిగా ముఖ్యమంత్రి పర్యటన
కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా ఖరారు చేసినట్లుగానే ఈనెల 13న జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక జరగనున్న ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని మినహాయించి జన్మభూమి కార్యక్రమాల నిర్వహణకు అనుమతివ్వడంతో సీఎం పర్యటనకు మార్గం సుగమమైంది. ఈ మేరకు శుక్రవారం జిల్లా యంత్రాంగానికి అధికారిక సమాచారం అందింది. ఓర్వకల్లు మండలం కాల్వ, హుసేనాపురం.. బనగానపల్లె మండలం పసుపుల గ్రామాల్లో నిర్వహించనున్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, ఇతర అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆదేశించారు. 13న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న దృష్ట్యా శుక్రవారం రాత్రి ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం ముందుగా బనగానపల్లె, ఆ తర్వాత ఓర్వకల్లు మండలంలో ఆయన పర్యటించే అవకాశం ఉందన్నారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించారు. సమావేశంలో జేసీ కన్నబాబు, సీపీఓ ఆనంద్‌నాయక్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం మండల నోడల్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ జన్మభూమి కార్యక్రమాలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పింఛన్ల వెరిఫికేషన్ చేపట్టండి వివిధ కారణాలతో నిలుపుదల చేసిన పింఛన్లపై మరోసారి వెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జన్మభూమి-మా ఊరు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లతో నిలుపుదల చేసిన పింఛన్లను పునఃపరిశీలన చేపట్టాలన్నారు. అర్హులని తేలిన వారికి తిరిగి పింఛన్లు మంజూరవుతాయని వివరించారు. కర్నూలు నుంచి కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ మాట్లాడుతూ ఆళ్లగడ్డ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడం వల్ల రెండు రోజుల పాటు వెరిఫికేషన్ నిలిచిపోయిందన్నారు. అందువల్ల పునఃపరిశీలనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. -
మోసకారి బాబును అనర్హుడిగా ప్రకటించాలి
అనంతపురం టవర్‌క్లాక్ : తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబును ముఖ్యమంత్రి పదవికి అనర్హుడిగా ప్రకటించాలని వామపక్షపార్టీల నేతలు ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగదీష్‌తోపాటు సీపీఐ సీనియర్ నాయకుడు ఎంవీ రమణ, సీపీఎం నగర కార్యదర్శి రాంభూపాల్, నల్లప్ప, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకరరెడ్డి, సీపీఐ ఎంఎల్ నాయకుడు చంద్రశేఖర్, ఎస్‌యూసీఐ నాయకులు రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చంద్రబాబు నె రవేర్చలేదని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చె ప్పి ఉన్న ఉద్యోగాలను ఊడదీస్తున్నారని, రైతుకు అండగా నిలవాల్సిన బాబు వ్యవసాయాన్ని బ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రైతులు, మహిళలను మొండి బకాయిదారులుగా మార్చి ఆయా వర్గాలను నీరు గార్చారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ. 8లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇంత భారీ బడ్జెట్‌ను ఎక్కడ నుంచి తెస్తారని నిలదీశారు. అక్టోబర్‌లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈనెల 29 నుంచి అక్టోబర్ 12 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపటుతున్నట్లు ప్రకటించారు. 13న అన్ని మండల కార్యాలయాల ఎదుట ఆందోళన చేపడతామని, మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
బూత్‌లవారీ కౌంటింగ్ రద్దుపై మీరేమంటారు?: సుప్రీం
కేంద్రానికి నోటీసులు నాలుగు వారాల్లో సమాధానం చెప్పండి న్యూఢిల్లీ: ఎన్నికల్లో బూత్‌లవారీగా ఓట్ల లెక్కింపును రద్దు చేయాలన్న ఎన్నికల కమిషన్ (ఈసీ)విజ్ఞప్తిపై కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ అంశంపై 4 వారాల్లోగా తమ నిర్ణయమేంటో తేల్చి చెప్పాలని కేంద్రాన్ని సోమవారం ఆదేశించింది. ప్రస్తుత నిబంధనలను సవరించకుండా ఈ చర్య చేపట్టవచ్చో లేదో చెప్పాలంటూ ఈసీకి సూచించింది. ఎన్నికల్లో గెలిచినవారు.. తమకు తక్కువ ఓట్లువచ్చిన ప్రాంతంపై కక్షసాధింపునకు దిగడానికి ఈ బూత్‌ల వారీ లెక్కింపు ఆస్కారమిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. కేంద్రం ఈ అంశంపై ఐదేళ్లుగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని, దీన్ని న్యాయ కమిషన్‌కు ఎందుకు రిఫర్ చేసిందని ప్రశ్నించింది. ‘ఈ విషయంలో ఎన్నికల సంఘం తన విధిని సక్రమంగా నిర్వర్తించగలదు. కానీ ఈ అంశంలో లా కమిషన్ ఏం చేస్తుందని.. వారి అభిప్రాయం అడిగారు. ఐదేళ్లుగా ఈ అంశాన్ని ఇలా నాన్చడంలో మీ ఉద్దేశం ఏమిటి’ అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పంజాబ్‌కు చెందిన అడ్వొకేట్ వేసిన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
నియోజకవర్గాలు.. మరో రెండు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో మరో రెండు నియోజకవర్గాలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 12 నియోజకవర్గాలతో తాజాగా రెండు కలిస్తే..మొత్తం 14 నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నట్లు అధికార వర్గాల సమాచారం. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. పునర్విభజన ప్రక్రియకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా గణాంకాల సేకరణపై దృష్టి సారించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌లోని 294 నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రానికి 119, ఆంధ్రరాష్ట్రానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించారు. అయితే పునర్విభజన అనంతరం తెలంగాణలో అసెంబ్లీల సంఖ్య 175, ఆంధ్రలో నియోజకవర్గాల సంఖ్య 225కు పెరగనున్నట్లు ఇప్పటికే ఎన్నికల కమిషన్ తేల్చింది. ఈ మేరకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించాల్సి ఉంది. జనాభా ప్రాతిపదికన.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మూడు లేదా నాలుగు మండలాల కంటే ఎక్కువగా ఉండకుండా ..కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశమున్నట్లు అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం ఒంగోలు లోక్‌సభ పరిధిలో జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు మార్కాపురం, గిద్దలూరు, కొండపి, యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాలున్నాయి. బాపట్ల లోక్‌సభ కింద జిల్లాలో అద్దంకి, పర్చూరు, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో అద్దంకి, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రాంతాల్ని విభజించి ఒక కొత్త నియోజకవర్గం ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. కందుకూరు అసెంబ్లీ మాత్రం నెల్లూరు లోక్‌సభ పరిధిలో ఉంది. సంతనూతలపాడు, కొండపి, యర్రగొండపాలెం రిజర్వుడు నియోజకవర్గాలుగా ఉండగా, పునర్విభజనలో జిల్లాకు మరో రిజర్వుడు నియోజకవర్గం రావచ్చని ప్రస్తుత ఓటర్లు, సామాజికవర్గ గణాంకాల ఆధారంగా అధికారులు అంచనా వేస్తున్నారు. 2008-09 డీలిమిటేషన్ జరిగినప్పుడు మార్టూరు, కంభం నియోజకవర్గాలు చీలిపోయిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గంలో రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది ఓటర్లున్నారు. తాజాగా చేపట్టనున్న కొత్త ఓటర్ల చేర్పులతో కలిపి ఒక్కో నియోజకవర్గానికి రెండు లక్షల ఓటర్లకు మించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. జిల్లా మొత్తం జనాభాలో బీసీల తర్వాత అత్యధిక జనాభా, ఓటర్లు ఎస్సీలున్న ప్రాంతం రిజర్వుడుగా మారే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. -
మండల పరిషత్ సారథుల ఎంపిక విధి విధానాలు..
మంచిర్యాల రూరల్ : ఈ నెల 4వ తేదీన మండల ప్రజా పరిషత్ సారథుల ఎన్నికకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలతోపాటు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంపీటీసీలు మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో-ఆప్షన్ సభ్యుడి ఎంపిక కోసం ఎన్నికల సంఘం సూచించిన నియమాలు పాటించాలి. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులపై పోటీ చేసి గెలుపొందిన ఎంపీటీసీలు ఆయా పార్టీలు జారీ చేసిన విప్‌కు అనుగుణంగా నడుచుకోవాలి. విప్‌ను దిక్కరించే వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఎంపికైన ఎంపీటీసీలు చాలా మంది రిజర్వేషన్లు అనుకూలించి కొత్తగా ఎంపికైన వారే ఉండడంతో వారిలో పలు రకాల అనుమానాలను నివృత్తి చేసేందుకు విధి విధానాలు అందిస్తున్నాం. ముందుగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల రోజునే కో-ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకుంటారు. ఒక్కో మండలానికి ఒక్కో కో-ఆప్షన్ సభ్యుడు ఉంటాడు. కో-ఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసే వారు మైనార్టీకి చెందిన వారై ఉండాలి. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బుద్ధిస్టు, జొరాస్ట్రియన్ మైనార్టీ వర్గాలకు చెందిన వారు, మన రాష్ట్ర భాషలు కాకుండా ఇతర రాష్ట్రాల భాషలు మాట్లాడే వయోజనులు కో-ఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసేందుకు అర్హులు. వీరు ఆయా మండలానికి చెందిన వారై ఉండాలి. జూలై 4వ తేదీన ఉదయం 10 గంటలలోపు మండల పరిషత్ కార్యాలయంలో కో-ఆప్షన్ సభ్యులుగా పోటీ చేసేవారు నామినేషన్లు దాఖలు చేయాలి. 10 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, అనంతరం పోటీలో ఉన్నవారి పేర్ల ప్రచురణ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. అనంతరం వెంటనే కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కోసం తక్షణ సమావేశం ఉంటుంది. ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులు పోటీలో ఉంటే, తెలుగు అక్షరమాల ప్రకారం జాబితాను సిద్ధం చేసి క్రమసంఖ్యలో నంబర్లను కేటాయించి, ఎన్నిక చేస్తారు. వీరిని ఎంపిక చేసేందుకు ఎంపీటీసీలు చేతులెత్తి ఓటు వేస్తారు. సమావేశంలో కో-ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకునేందుకు ఎంపీటీసీలకు విప్ నియమాలు వర్తించవు. కోరం ఉంటేనే అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక కోసం జూలై 4వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు తక్షణ సమావేశాన్ని ప్రిసైడింగ్ అధికారి ఏర్పాటు చేస్తారు. ఎంపిక నిర్వహణకు అరగంటలోగా ఎంపీటీసీల్లో సగం మంది తప్పనిసరిగా హాజరు కావాలి. ఆయా మండలంలోని ఎంపీటీసీల్లో సగంగానీ, అంత కంటే ఎక్కువ మందిహాజరైతే కోరం ఉన్నట్లు, సగం కంటే తక్కువ మంది సమావేశానికి హాజరైతే కోరం లేనట్లు, ఇలా కోరం లేకున్నా, కోరం ఉండి ఎన్నిక జరగని పక్షంలో ప్రిసైడింగ్ అధికారి మరుసటి రోజున అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహణకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. పనిదినమైనా, సెలవు రోజైన సమావేశం ఉం టుంది. ఒకవేళ ఎన్నికకు కోరం లేక, ఇతరత్రా కారణాలతో మరోసారి ఎన్నిక జరగకపోతే, విషయాన్ని ఎన్నికల కమీషన్‌కు తదుపరి ఆదేశాల కోసం నివేదిస్తారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేవారి పేరును ఒక సభ్యుడు సూచించాలి. మరో సభ్యుడు సమర్ధించాలి. ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే, చేతులెత్తే పద్ధతి ద్వారా తమ ఓటు వేయాలి. ఈ తతంగాన్ని అంతా ప్రిసైడింగ్ అధికారి వీడియో ద్వారా రికార్డు చేస్తారు. ఎవరికి ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉంటే వారిని అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడినప్పుడు, వారికి సమాన ఓట్లు వచ్చిన పక్షంలో ప్రిసైడింగ్ అధికారి ‘డ్రా’ పద్ధతిలో ఎన్నికైన వారిని ప్రకటిస్తారు. విప్ ధిక్కరిస్తే అనర్హతే.. మండల పరిషత్తు ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరిగినందున, ఆయా పార్టీల గుర్తులపై గెలిచిన వారు, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ సూచించిన నిర్ణయాలకు కట్టుబడాలి. దీన్నే విప్ అంటారు. పార్టీ ఆదేశాలను ఏమాత్రం ధిక్కరించినా, ఆయా పార్టీలు వారి అభ్యర్థులపై కొరఢా ఝుళిపించే అవకాశం ఉంటుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని అమలయ్యేలా చూసేందుకు పార్టీ పక్షాన ఒక విప్‌ను నియమించుకోవచ్చు. పార్టీ విప్ ఎవరనే విషయాన్ని నిర్దేశిత ప్రొఫార్మలో ప్రత్యేక సమావేశానికి ముందే ఎన్నికల అధికారికి అందజేయాలి. స్థానిక సంస్థలకు ఎన్నికైన తమ పార్టీ సభ్యుడిని గానీ, పార్టీ ఇతర నాయకుడిని గానీ విప్‌గా నియమించవచ్చు. స్థానిక సభ్యుడికి సమావేశం మందిరంలోకి ప్రవేశించే అవకాశం, అధికారం ఉంటుంది. ఇతర సభ్యుడైతే లోనికి ప్రవేశించేందుకు అనుమతించరు. పార్టీ నిర్ణయం, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసిన సభ్యుడు, పార్టీ పక్షాన ఎన్నికైన సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎవరికి ఓటు వేయాలనే పూర్తి సమాచారంతో కూడిన పత్రాలను సమావేశానికి కనీసం గంట ముందు ఎన్నికల అధికారికి అందించాలి. అయితే విప్ జారీ అయినా, ఒకవేళ ఏ సభ్యుడైనా సదరు పత్రాలపై సంతకాలు చేయకపోతే విప్ వర్తించదు. ఏ పార్టీ సభ్యుడైనా విప్‌ను అందుకుని, ఎన్నిక సందర్భంగా దిక్కరించి, ఇతరులకు ఓటు వేస్తే ఆ ఓటు చెల్లుతుంది. విప్ ఉల్లంఘనపై పార్టీ విప్ మూడు రోజుల్లోపు ఎన్నికల అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఆయన సదరు సభ్యుడిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించరాదో వివరించాలని నోటీసు జారీ చేస్తారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేయడంతో, ఆ సభ్యుడు అర్హత కోల్పోయే అవకాశం ఏర్పడుతుంది. -
జంప్‌జిలానీల్లో ‘విప్’ భయం
మోర్తాడ్: ఎన్నికల సంఘం ప్రకటనతో జంప్‌జిలానీల్లో ‘విప్’ భయం పట్టుకుంది. స్థానిక సంస్థల సభ్యులు పార్టీల గుర్తులపై ఎన్నిక కావడంతో వారు పరోక్ష ఎన్నికల్లో పార్టీల నాయకత్వం నిర్ణయం ప్రకారమే ఓటు వేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సభ్యత్వం ర ద్దు అవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటిం చిం ది. దీంతో జంప్జిలానీలను ‘విప్’ కలవరపెడుతోం ది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడిన 50 రోజుల తర్వాత మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు జరుగనున్నాయి. గురు, శుక్ర, శనివారాల్లో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వనుంది. ఇప్పటికే క్యాంపుల్లో జిల్లా పరిషత్, మున్సిపల్‌ల కంటే మండల పరిషత్‌లలోనే జంప్‌జిలానీలు ఎక్కువగా ఉన్నారు. మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు ఏ పార్టీకి వస్తే ఇతర పార్టీల ఎంపీటీసీ సభ్యులు మెజార్టీ ఎంపీటీసీల క్యాంపులకు వెళ్లారు. మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోటీ నెలకొంది. అనేక చోట్ల టీఆర్ఎస్ శిబిరాల్లో కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. కొన్ని శిబిరాల్లో టీఆర్ఎస్ ఎంపీటీసీలు ఉన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆ పార్టీ తరపున నెగ్గిన చాలామంది ఎంపీటీసీలు కాంగ్రెస్ క్యాంపుల నుంచి తిరిగి వచ్చారు. కొందరు కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు కూడా టీఆర్ఎస్ క్యాంపుల్లో ఉన్నారు. సభ్యత్వమే రద్దు గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే విప్ జారీ చేస్తామని ఆయా పార్టీల నాయకత్వం హెచ్చరించినా వీరు పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విప్‌లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ సారి మాత్రం పార్టీ గుర్తుపై గెలిచిన సభ్యులు ఆయా పార్టీల విప్‌కు అనుగుణంగానే ఓటు వేయాలని స్పష్టంచేసింది. లేకుంటే సభ్యత్వం రద్దు అవుతుందని ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి నోటిఫికేషన్లోనే స్పష్టం చేశారు. దీంతో పార్టీ విప్‌కు ప్రాధాన్యత పెరిగింది. పార్టీ ఆదేశాలను పాటించని నాయకులపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఎంతో శ్రమించి గెలుపొందిన తాము పార్టీ విప్‌ను ధిక్కరిస్తే వేటు పడుతుందని ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి దాదాపు ఇన్నిరోజుల పాటు క్యాంపులను నిర్వహించినా ‘విప్’ దెబ్బకు వృథా అయిపోయిందని వాపోతున్నారు. ఈసారి విప్ జారీ వల్ల చాలా మండలాల్లో చైర్మన్, వైఎస్‌చైర్మన్ ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
వచ్చేసారికి 15
పెరగనున్న మూడు అసెంబ్లీ స్థానాలు 2019 ఎన్నికల్లోపు కొత్తవి ఏర్పాటు ఆశల్లో ద్వితీయ శ్రేణి నేతలు మారనున్న రాజకీయ ముఖచిత్రం లోక్‌సభ నియోజకవర్గాల పరిధి కాకుండా... జిల్లాను యూనిట్‌గా తీసుకుని పునర్విభజన ప్రక్రియ చేపడతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాగే జరిగితే గతంలో నియోజకవర్గాలు ఉన్న చేర్యాల మళ్లీ అసెంబ్లీ సెగ్మెంట్‌గా ఏర్పడే అవకాశం ఉండనుంది. తొర్రూరు, హసన్‌పర్తి, కేసముద్రం, నెక్కొండ వంటి జనాభా ఎక్కువగా ఉండే మండల కేంద్రాలను కొత్త నియోజకవర్గాల కేంద్రాలుగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండనుంది. సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులోనే ‘కొత్త రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి’ అని పేర్కొనబడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. సాధారణ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల కమిషన్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి పెట్టనుంది. వచ్చే ఎన్నికల్లోగా కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. గతంలో పలుమార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. పార్లమెంట్ నిర్ణయం ప్రకారం సాధారణంగా ప్రతి 20 లేదా 30 ఏళ్లకు ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. 1978, 2009 ఎన్నికలకు ముందు పునర్విభజన చేశారు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన మళ్లీ జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ సంఖ్య 153కు పెరగనుంది. 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పునర్విభజన ప్రక్రియలో భాగం గా ప్రతి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో కొత్తగా రెండు అసెంబ్లీ సెగ్మెంట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి తగ్గించి కొత్త వాటిని ఏర్పాటు చేస్తారు. మన జిల్లాలో కొత్తగా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఏర్పడే ఆస్కారముంది. జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఈ సెగ్మెంట్ పరిధిలో అదనంగా రెండు కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లు ఏర్పాటు కానున్నాయి. వరంగల్ నగర జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు అదనంగా మరో నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వరంగల్ రూరల్ పేరుతో ఈ సెగ్మెంట్ ఏర్పడే అవకాశం ఉంది. మరో నియోజకవర్గం ఏ మండలం కేంద్రంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో నియోజకవర్గాలుగా ఉన్న హసన్‌పర్తి, ధర్మసాగర్, శాయంపేట పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో మన జిల్లాలోని నాలుగు, ఖమ్మం జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మన జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ప్రస్తుత పరిధిని తగ్గించి మిగిలిన భాగంతో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పాటు కానుంది. దీన్ని ఏ మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొత్త స్థానాలపై కోటి ఆశలు మొత్తంగా జిల్లాలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు ఏ మండల కేంద్రంగా ఉంటాయి... అక్కడి రిజర్వేషన్ పరిస్థితులు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న విధంగా కొత్త జిల్లాల ఏర్పాటు ముందుగా జరిగితే... నియోజకవర్గాల పునర్విభజన అనేది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జరగనుంది. ఇన్నాళ్లు మండల స్థాయిలో ఇప్పటికే పదవులు అనుభవించిన వారి దృష్టి ఇప్పుడు నియోజకవర్గాలపై పడింది. కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గాలపై ద్వితీయ శ్రేణి నేతలు ఆశలు పెట్టుకున్నారు. తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు నాయకులు సైతం... కొత్తగా ఏర్పడే నియోజకవర్గం అనుకూలంగా ఉంటుందా అనే విషయంపై ఆలోచిస్తున్నారు. -
నంబర్ గేమ్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో రాజకీయం వేడెక్కింది. స్థానిక సంస్థల సారథుల ఎంపికకు ముహూర్తం ఖరారుకావడమే తరువాయి.. రాజకీయపక్షాలు ‘కుర్చీలాట’లో పైచేయి సాధించేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. నంబర్‌గేమ్‌లో ముందు వరుసలో ఉండేం దుకు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. మున్సిపాలిటీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో శుక్రవారం ప్రధాన పార్టీలు అంతర్గత సమావేశాల్లో బిజీగా గడిపాయి. సొంత పార్టీ సభ్యులను క్యాంపులకు తరలించడం మొదలు ఇతర పార్టీల సభ్యుల మద్దతు కూడగట్టే అంశంపై చర్చోపచర్చలు సాగించాయి. మండలాల్లో పాగా వేసే దిశగా వ్యూహారచన చేస్తున్న ఆశావహులు.. ఎంపీటీసీలను మరోసారి యాత్రలకు పంపారు. స్థానిక సంస్థల పీఠాలను కైవసం చేసుకునే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్న అధిష్టానాలు.. సొంత పార్టీ సభ్యులను కాపాడుకునే బాధ్యత కూడా వారికే కట్టబెట్టారు. నగర పంచాయతీ/మున్సిపాలిటీల చైర్మన్ల ఎంపికపై టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నాయి. పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నంలో స్పష్టమైన అధిక్యత లభించడంతో ఈ రెండింటి చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. బడంగ్‌పేటలో కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ లభించింది. అలాగే తాండూరులో టీఆర్ఎస్, మజ్లిస్‌లు పోటాపోటీగా కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్నికల అనంతరం ఈ ఇరుపార్టీల మధ్య బంధం బలపడిన నేపథ్యంలో ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించే వాతావరణం కనిపిస్తోంది. ఇక వికారాబాద్‌లో మాత్రం ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అత్యధిక సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలను అనుకూలంగా మలుచుకునే దిశగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. టీడీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న ఆ పార్టీ.. ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఓటు హక్కు కలిగియున్న ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా వికారాబాద్ మున్సిపాలిటీనే ఆఫ్షన్‌గా ఇచ్చారు. దీంతో సంఖ్యాబలం అటు ఇటు అయ్యే అవకాశం కనిపిస్తోంది. జోరుగా మంతనాలు! సుదీర్ఘ విరామం తర్వాత అత్యధిక జెడ్పీటీసీలు సాధించిన కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా జిల్లా పరిషత్ పీఠాన్ని అధిరోహించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఆ పార్టీ అగ్రనేతలు విభేదాలు పక్కనపెట్టి శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రసాద్‌కుమార్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో సమావేశమైన సీఎల్పీ నేత జానారెడ్డి.. ఎట్టి పరిస్థితుల్లో జెడ్పీ చేజార్చుకోవద్దని తేల్చిచెప్పారు. సొంత పార్టీ సభ్యులను సమన్వయపరిచే బాధ్యతను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్‌లకు అప్పగించిన జానా.. ఇతర పార్టీల మద్దతు కూడగట్టే అంశాన్ని కేఎల్లార్‌కు కట్టబెట్టారు. మరోవైపు శంషాబాద్‌లో ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు సమావేశమై.. తాజా పరిణామాలను చర్చించుకున్నారు. యాదవరెడ్డి తప్పుకుంటే బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని ఎనుగు జంగారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో హైకమాండ్‌తో ఈ అంశంపై శనివారం చర్చించాలని నిర్ణయించారు. కాగా, మంచిరెడ్డితో భేటీ అయిన కేఎల్లార్, ప్రసాద్‌లకు స్పష్టమైన హామీ లభించలేదు. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశంపై పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ముందు మీ పార్టీలో ఏకాభిప్రాయం సాధించండి.. అప్పుడు మా నిర్ణయాన్ని వెల్లడిస్తామని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇదిలావుండగా.. జిల్లా పరిషత్ కుర్చీ దక్కించుకునేందుకు దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్.. కాంగ్రెస్, టీడీపీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. కాంగ్రెస్‌లో అనైక్యతతో మేజిక్ ఫిగర్‌ను సాధిస్తామని భావిస్తున్న ఆపార్టీ.. టీడీపీలో ఒక వర్గం తమకు అనుకూలంగా ఉంటుందని అంఛనా వేస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలతో మంత్రి పి.మహేందర్‌రెడ్డి చర్చించినట్లు తెలిసింది. సాధ్యమైనంతవరకు అధిక సంఖ్యలో మండల పరిషత్‌లను కైవసం చేసుకునే దిశగా వ్యూహరచన చేయాలని ఆదేశించినట్లు సమాచారం. -
విప్ ధిక్కరించారో...
ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: జిల్లా, మండల పరిషత్ పాలకవర్గ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-అప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన నిబంధనలు ఇప్పటికే జారీ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జిల్లా, మండల పరిషత్ కార్యాలయాలకు ఎన్నికల కమిషన్ నుంచి అందాయి. మరో వారం రోజుల్లో పాలక వర్గాలను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ పూర్తికావడం, ఫలితాలు వెలువడడం, పాలకవర్గం ఎంపిక వంటి ప్రక్రియలు ఆలస్యంగానే జరుగుతున్నాయి. ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత మరో మూడు నాలుగు రోజుల్లో జిల్లా, మండల పరిషత్‌ల ఎన్నికలు కూడా పూర్తిచేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఇలా... * సెక్షన్ 17 (3) (వీ)ప్రకారం మండల పరిషత్‌కు ఇద్దరు మైనార్టీ సభ్యులను కో-అప్షన్ సభ్యులుగా ఎన్నుకోవచ్చు. 21 ఏళ్లు నిండిన జిల్లాలో ఓటు హక్కు కలిగిన వారు అర్హులు. *సెక్షన్(171) (1) ప్రకారం జెడ్పీ చైర్మన్‌ను జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) సభ్యులు చేతులు ఎత్తి ఎన్నుకోవాలి. ఇక్కడ కూడా గుర్తింపు పొందిన పార్టీలు జారీ చేసిన విప్ మేరకే నడుచుకోవాలి. విప్ దిక్కరిస్తే జెడ్పీటీసీ సభ్యత్వం రద్దుచేసే అవకాశం ఆయా పార్టీలకు ఉంది. * జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్, అధ్యక్షులను ఎన్నుకునేందుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతోపాటు కో-ఆప్షన్ సభ్యులే అర్హులు. * ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేదు. వారు ఆయా సమావేశాలకు హాజరైతే కూర్చోనేందుకు ప్రత్యేక స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. * సమావేశ భవనం ఎలాంటి ప్రచారాలకు ఇవ్వకూడదు. సభ్యులను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకూడదు. *ఏవేని కారణాలతో కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగకపోతే ఆ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలి. *ఈఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశంలో ఎన్నికైన సభ్యుల్లో రెండింట మూడోవంతు కోరం తప్పనిసరిగా ఉండాలి. దీనికోసం గంట సమయాన్ని కేటాయిస్తారు. అప్పటికీ కోరం లేకపోతే మరుసటి రోజుకు సమావేశాన్ని వాయిదా వేస్తారు. ఆరోజు కూడా పరిస్థితిలో మార్పురాకపోతే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహిస్తారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ఇలా... *పంచాయతీ రాజ్ చట్టం 1994, సెక్షన్ 149 (1) (వీ)ప్రకారం ప్రతి మండలానికి ఒక మైనార్టీని కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నుకోవాలి. కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నుకునే వ్యక్తికి 21 ఏళ్లు నిండి ఆదే మండలంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. *సెక్షన్ 153 (1)ప్రకారం మండలంలో అధ్యక్ష, ఉపాధ్యక్షుల్ని సభ్యులు చేతులెత్తే పద్దతిలో ఎన్నుకోవాలి. గుర్తింపు పొందిన పార్టీలు జారీ చేసిన విప్ మేరకే అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. విప్‌ను దిక్కరించిన వారి సభ్యత్వాన్ని రద్దుచేసే అధికారం ఆయా పార్టీలకు ఉంటుంది. -
రెవెన్యూ యంత్రాంగం ప్రక్షాళన
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెనువెంటనే జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో సమూల ప్రక్షాళన జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి మొదలు రెండు డివిజన్ల ఆర్డీవోలు, పలువురు తహసీల్దార్లకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కీలకమైన శివారు మండలాల్లోని డిప్యూటీ కలెక్టర్ స్థాయి తహసీల్దార్లందరినీ బదిలీ చేసింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పొరుగు జిల్లాలకు వెళ్లి తిరిగొచ్చిన తహసీల్దార్ల పోస్టింగ్‌లపై జిల్లా యంత్రాంగం మంగళవారం రాత్రి దాకా కసరత్తు చేసింది. సమర్థత, పనితీరును ప్రామాణికంగా తీసుకొని జిల్లా కలెక్టర్ బి. శ్రీధర్ బదిలీల జాబితా రూపొందించగా.. సచివాలయ స్థాయిలో లాబీయింగ్, రాజకీయ ఒత్తిళ్లతో జాబితా పూర్తిగా మారిపోయింది. తమ కనుసన్నల్లో మెలిగే అధికారులకు కీలక పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ‘మంత్రాంగం’ నెరపడంతో బదిలీలు కొలిక్కిరాలేదు. ప్రభుత్వ స్థాయిలో జాబితాలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచనలు రావడంతో బదిలీలు బుధవారానికి వాయిదాపడ్డాయి. డీఆర్వో, ఇద్దరు ఆర్డీవోల బదిలీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కారు.. తొలి రోజే జిల్లా రెవెన్యూ అధికారిపై బదిలీ వేటు వేసింది. రాయలసీమకు చెందిన ఎస్. వెంకటేశ్వర్లును బదిలీ చేస్తూ ఆయన స్థానంలో సుందర్ అబ్నార్‌ను నియమించింది. అలాగే ఎన్నికల ముందు జిల్లాకు వచ్చిన చేవెళ్ల, రాజేంద్రనగర్ ఆర్డీవోలకు కూడా స్థానభ్రంశం కలిగించింది. రాజేంద్రనగర్ ఆర్డీవోగా గతంలో జిల్లాలో పనిచేసిన సురేశ్ పొద్దార్‌ను నియమించింది. మరోవైపు శివార్లలోని కీలక మండలాల తహసీల్దార్లందరినీ సాగనంపింది. భూముల విలువలు ఆకాశాన్నంటడంతో హాట్ సీట్లుగా మారిన ఈ మండలాల్లో పోస్టింగ్ దక్కించుకునేందుకు అత్యున్నతస్థాయిలో పైరవీలు సాగుతాయి. ఈ క్రమంలోనే ఈ మండలాలపై కన్నేసిన పలువురు తమ పలుకుబడిని ఉపయోగించి పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. జిల్లా న్యాయాధికారిగా పనిచేస్తున్న హరీశ్‌ను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీకి చెందిన ఇతని స్థానంలో విక్టర్‌ను నియమించింది. అంతర్జాతీయ విమానాశ్రయం భూ సేకరణాధికారిగా పనిచేస్తున్న ఎంవీ భూపాల్‌రెడ్డికి హైదరాబాద్ జిల్లా న్యాయాధికారిగా పోస్టింగ్ ఇచ్చింది. 31 మంది తహసీల్దార్లకు స్థానచలనం ఇతర జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించి వెనక్కి వచ్చిన తహసీల్దార్ల పోస్టింగ్‌లపై జిల్లా యంత్రాంగం రోజంతా కుస్తీ పట్టి జాబితా తయారు చేసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో కొత్త తహసీల్దార్ల నియామకానికి ఉత్తర్వులు కూడా సిద్ధం చేసింది. దీంట్లో శివారు మండలాల్లోని ఆరుగురు డిప్యూటీ కలెక్టర్ స్థాయి తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో గ్రామీణ మండల తహసీల్దార్ల బదిలీలకు సంబంధించి జిల్లా యంత్రాంగం జాబితాను తయారు చేసింది. అయితే, ఈ పోస్టింగ్‌లపై తీవ్ర రాద్ధాంతం నెలకొంది. ఉద్యోగసంఘాల ఒత్తిళ్లు, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుల తాకిడి పెరిగిపోవడంతో జాబితా ఆసాంతం మారిపోయింది. పొరుగు జిల్లాల నుంచి మరికొందరు.. అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో తహసీల్దార్ల బదిలీలపై అయోమయం నెలకొంది. మరోవైపు పొరుగు జిల్లాలకు చెందిన కొందరు తహసీల్దార్లను రంగారెడ్డి జిల్లాకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే పోస్టింగ్‌లను నిలిపివేయాలని జిల్లా యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాగా, నగరానికి ఆనుకొని ఉన్న మండలాల్లో పోస్టింగ్‌ల కోసం తీవ్ర స్థాయిలో పైరవీలు సాగాయి. కలెక్టరేట్లోనే తిష్టవేసిన తహసీల్దార్లు కోరుకున్న మండలాలను దక్కించుకునేందుకు తమదైన శైలిలో పలుకుబడిని ఉపయోగించారు. -
ఈ నాయకులు.. మాకొద్దు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఈ నాయకులు మాకొద్దంటూ పలువురు ఓటర్లు నోటా(నన్ ఆఫ్ ది ఎబో) మీట నొక్కారు. నిజామాబాద్ అర్బన్‌లో అతి తక్కువగా ఈ మీటను ఉపయోగించుకోగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా నోటాకు ఓటేశారు. ఎలక్షన్ కమిషన్ ఎన్ని చర్యలు తీసుకున్నా చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు కాదు. నచ్చిన అభ్యర్థులు ఎవరూ లేనందున తాము ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని సాకులు చెప్పేవారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు బ్యాలెట్లో నోటాను చేర్చారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో దీనిని చాలామంది వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో 7,766 మంది ఓటర్లు నోటా బటన్ నొక్కారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో 8,264 మంది ఓటర్లు నోటాకు ఓటేశారు. ఇక నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 695 మంది, నిజామాబాద్ రూరల్ స్థానంలో 2 వేల మంది, కామారెడ్డిలో 1,479, బాన్సువాడలో 1,313, జుక్కల్‌లో 1,430, బోధన్‌లో 1,397, ఆర్మూర్‌లో 1,435, బాల్కొండలో 1,525, ఎల్లారెడ్డిలో 2,212 మంది నోటాను వినియోగించుకున్నారు. జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సుమారు 16 వేలపైచిలుకు మంది ఓటర్లు నోటాకు ఓటేసి అభ్యర్థులెవరూ నచ్చలేదని చెప్పడం గమనార్హం. మహిళ మెడలోంచి చైన్ చోరీ నిజామాబాద్క్రైం, న్యూస్‌లైన్ : ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ మెడలోంచి దొంగలు బంగారు గొలుసును తెంపుకొని పరారయ్యారు. ఒకటో టౌన్ ఎస్హెచ్ఓ నర్సింగ్ యాదవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన సరిత తన తోటి కోడలుతో కలిసి శనివారం నిజామాబాద్‌లోని ద్వారకానగర్‌లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో చూపించుకుని నడుచుకుంటూ వెళ్తుండగా వీరి వద్దకు బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చారు. సరిత మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకొని పారిపోయారు. ఆమె తేరుకుని అరిచేలోపే దొంగలు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్హెచ్ఓ తెలిపారు. -
రెండు ఎంపీటీసీలకు నేడు ఎన్నిక
ఇందూరు/ ధర్పల్లి, న్యూస్‌లైన్: జిల్లాలో రద్దయిన రెండు ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. పిట్లం మండలంలోని బండపల్లి, ధర్పల్లి మండలంలోని మైలారం ఎంపీటీసీ స్థానాలు నిబంధనలకు విరుద్ధంగా వేలం పాట ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారనే ఆరోపణలతో గత నెల 12న ఆ రెండు స్థానాల ఎన్నికను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తర్వాత ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి నామినేషన్ లు స్వీకరించారు. మైలారం స్థానానికి స్వతంత్ర అభ్యర్థి సీహెచ్ ప్రకాష్, కాం గ్రెస్ అభ్యర్థి లలితా నాయక్‌లు బరిలో ఉన్నారు. ఎంపీటీసీ పరిధిలో మై లా రం, కేశారం గ్రామాలు ఉన్నాయి. మొత్తం 1823 మంది ఓటర్లు ఉన్నారు. కేశారం గ్రామంలోని ఒకటో నంబర్ పోలింగ్ కేంద్రంలో 565 మంది, మై లారంలో రెండో నంబర్ పోలింగ్ బూత్‌లో 615 మంది, మూడో బూత్‌లో 643 మంది ఓటర్లు ఉన్నారు. బండపల్లి స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి రజినీ కాంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నడ్పి గంగారాం పోటీలో నిలిచారు. ఇక్కడ మొ త్తం 2235 మంది ఓటర్లు ఉండగా, మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందిని నియమించారు. బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ ఉ.7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఫలితాలను సోమవారం వెల్లడిస్తారు. వేతనంతో కూడిన సెలవు మైలారం, బండపల్లి ఎంపీటీసీ స్థానాల పరిధిలోని దుకాణాలు, ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఆదివారం వేతనంతో కూడిన సెల వును జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ప్రకటించారు.యజమానులు కార్మికులకు సెలవునిస్తూ ఓటు వేసే విధంగా సహకరించాలని ఒక ప్రకటనలో కోరా రు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. -
భూపాలపల్లి 21.. ‘తూర్పు’ 16 రౌండ్లు
లెక్కింపునకు 14 టేబుళ్ల ఏర్పాటు వేర్వేరుగా పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు చివరగా భూపాలపల్లి ఫలితం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను వేర్వేరుగా లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రంలో స్థల సమస్య ఉన్నట్లయితే మరో గదిలో లెక్కించుకోవచ్చని ఎన్నికల కమిషన్ సూచించింది. అయితే ఒకే హాల్లో వేర్వేరు టేబుళ్లను ఏర్పాటు చేసి లెక్కింపు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఈవీఎంలు (కంట్రోల్ యూనిట్) టేబుల్‌కు ఒకటి చొప్పున లెక్కిస్తారు. అలా నియోజకవర్గం లెక్కింపు పూర్తయ్యేసరికి ఒక టేబుల్‌పై ఎన్ని ఈవీఎంలు లెక్కిస్తారో అన్ని రౌండ్ల లెక్కింపు జరిపినట్లు లెక్క. ఉదాహరణకు.. జనగామ అసెంబ్లీ పరిధిలో మొత్తం 267 ఈవీఎంలు ఉన్నాయి. 14 టేబుల్స్‌కు ఒక్కో టేబుల్‌కు 20 ఈవీఎంల చొప్పున లెక్కకు వస్తాయి. చివరి రౌండ్ వరకు మొదటి టేబుల్‌పై ఒక ఈవీఎంను మాత్రమే లెక్కిస్తారు. అంటే జనగామ లెక్కింపు మొత్తం 20 రౌండ్లలో పూర్తవుతుందన్న మాట. కాగా, జిల్లాలోనే అత్యధిక ఈవీఎంలను భూపాలపల్లిలో వాడారు. ఇక్కడ మొత్తం 289 ఈవీఎంలలో ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఇక్కడ 21 రౌండ్ల లెక్కింపు చేయాల్సి ఉంటుంది. అతి తక్కువ ఈవీఎంలను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వాడారు. ఇక్కడ కేవలం 213 మాత్రమే ఉన్నాయి. దీంతో ఫలితం 16 రౌండ్లకే తెలుస్తుందన్న మాట. అంటే.. వరంగల్ తూర్పు లెక్కింపు ప్రారంభమైన మూడు గంటల్లోపు వచ్చే అవకాశం ఉంది. అధికారులు అంతా అనుకున్నట్లు పనిచేస్తే ఎక్కువ రౌండ్లున్న భూపాలపల్లి ఫలితం చివరగా వెలువడొచ్చు. లేదంటే లెక్కింపు సందర్భంగా ఈవీఎంలు మొరాయిస్తే మరింత ఆలస్యం కావచ్చు. అయితే నియోజకవర్గాల వారీగా లెక్కింపు రౌండ్లను ఓసారి పరిశీలిస్తే.. -
‘పుర’ ఫలితాలు నేడే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: టిక్.. టిక్.. టిక్.. గడియారం చప్పుడు రాజకీయ పార్టీల నేతల గుండెల్లో దడ పుట్టిస్తోంది. మరికొద్ది సేపట్లో పురపాలక సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం, పోలింగ్ పనుల్లో బిజీగా గడిపిన నేతల భవితవ్యం కొన్ని గంటల్లో తేలనుంది. సోమవారం ఉదయం 8గంటలకు పురపాలక సంఘాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. గత మార్చి 30న జిల్లాలోని వికారాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం, బడంగ్పేట్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఫలితాల తాలూకు ప్రభావం ఉంటుందని భావించిన పలువురు నేతలు కోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు అన్ని ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగియడంతో ఫలితాలను తేల్చేందుకు ఎన్నికల సంఘం ఉపక్రమించింది. ఇందులో భాగంగా సోమవారం పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు ప్రకటించనుండగా.. మంగళవారం ప్రాదేశిక స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తేలనున్న 663 మంది భవిష్యత్తు ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరిధిలో 119 కౌన్సిలర్ స్థానాలకుగాను వివిధ పార్టీలకు చెందిన 663 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. శక్తియుక్తులన్నీ కూడగట్టి జోరుగా ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు ఫీట్లు చేశారు. ఓటింగ్ సమయం వరకు గెలుపు కోసం కృషి చేసిన వీరంతా నెలకుపైబడి ఫలితాల కోసం అంచనాలు వేసి తమ బలమెలా ఉందనే కోణంలో రకరకాల సర్వేలు నిర్వహించారు. మొత్తంగా సోమవారం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే అంశం మధ్యాహ్నం వరకు స్పష్టం కానుండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లెక్కింపు ఇక్కడే.. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు మార్చి 30న పోలింగ్ జరిగింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పురపాలక ఎన్నికల ఫలితాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇబ్రహీంపట్నం, బడంగ్పేట్, పెద్ద అంబర్పేట్ నగర పంచాయతీలకు సంబంధించి నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదేవిధంగా వికారాబాద్ మున్నిపల్ ఎన్నికల కౌంటింగ్ వికారాబాద్‌లోని ఎస్ఏపీ కాలేజీలో, తాండూరు మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు తాండూరు టీఆర్సీలో నిర్వహిస్తున్నారు. -
వెన్నంపల్లిలో రీ పోలింగ్
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం వెన్నంపల్లిలోని 170 పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం శనివారం ఆదేశాలు జారీ చేసింది. గత నెల 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన ఈవీఎంలో 204 ఓట్లు నమోదైన తరువాత ఈవీఎం మొరాయించింది. దీంతో అధికారులు మరో ఈవీఎంను అక్కడ ఏర్పాటు చేయగా అందులో 210 ఓట్లు పోలయ్యాయి. ఈ పోలింగ్ కేంద్రంలో 471 ఓటర్లు ఉండగా, 414 ఓట్లు పోలయ్యాయి. ముందుగా ఏర్పాటు చేసిన ఈవీఎంలోని 204 ఓట్లు ఎవరికి పడ్డాయనే విషయం ఈవీఎంలో ఫలితాలు చూపించకపోవచ్చనే భావనకు అధికారులు వచ్చారు. ఈ విషయాన్ని ఎన్నికల సం ఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఈ నెల 13న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేకాధి కారి ఎన్.మధసూదన్ తెలిపారు. రీ పోలింగ్‌ను ఎంపీకి మాత్రమే జరుగుతుందని చెప్పారు. -
ఒకచోట రీపోలింగ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సందర్భంలో ఈవీఎం పనిచేయని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి ఈ అంశంపై చర్చించారు. అలాంటి సంఘటనలుంటే వెంటనే తనకు నివేదించాలని సూచించారు. దీంతో జిల్లాలోని కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని 371ఎ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పనిచేయకపోవడంతో అక్కడ పోలింగ్‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆ ఒక్క కేంద్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి నివేదించగా అందుకు ఈసీ స్పందిస్తూ ఆమోదముద్ర వేసింది. ఈ కేంద్రంలో ఈ నెల 13న రీపొలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. -
కోరుట్లలో రీ ఎలక్షన్ నిర్వహించాలి
హైకోర్టును ఆశ్రయించనున్న శివసేన అభ్యర్థి కోరుట్ల, న్యూస్‌లైన్ : కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌పై హైకోర్టులకు వెళ్లనున్నట్లు శివసేన నియోజకవర్గ అభ్యర్థి కరిజెంగుల నరేశ్ తెలిపారు. పట్టణంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తమకు కేటాయించిన బాణం-విల్లు గుర్తు తారుమారైందని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందన్నారు. దీంతో మంగళవారం హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. చిన్నపాటి పొరపాట్లకే కోడ్ ఉల్లంఘన కేసులు పెట్టే ఎన్నికల కమిషన్.. గుర్తు కేటాయింపులో వారే తప్పు చేశారన్నారు. సమావేశంలో శివసేన నాయకులు గట్ల విజయ్‌కుమార్, జిల్లా కన్వీనర్‌రామాగౌడ్, ఇందూరి వేణుగోపాల్ పాల్గొన్నారు. -
పెయిడ్ న్యూస్ కేసులో అశోక్‌చవాన్‌కు చుక్కెదురు
సాక్షి, ముంబై: పెయిడ్ న్యూస్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావ్ చవాన్‌కు చుక్కెదురైంది. తనపై ఎన్నికల కమిషన్ ప్రారంభించిన దర్యాప్తును నిలిపివేయాల్సిందిగా కోరుతూ చవాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. దీంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చవాన్‌కు అనుకూలంగా అనేక వార్తలు వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. దీంతో చవాన్ ఎన్నికల ఖర్చు పరిమితి దాటిందని ఆరోపిస్తూ ఆయన ప్రత్యర్థి మాధవ్ కిన్వల్కర్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఎన్నికల కమిషన్ దర్యాప్తు అధికారులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్యాప్తును నిలిపివేయాలని అశోక్ చవాన్ ముందుగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో కూడా ఊరట లభించకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో కూడా అదే తీర్పు పునరావృతం కావడం, ఎన్నికల కమిషన్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వార్తపత్రికల్లో ఇచ్చే ప్రకటనల ఖర్చులు చూపించనట్టయితే ఎన్నికల కమిషన్‌కు దర్యాప్తు చేసేందుకు పూర్తి అధికారాలున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో చవాన్ దర్యాప్తును ఎదుర్కొనక తప్పని పరిస్థితి నెలకొంది. -
పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మపరిశీలకుల పాత్ర కీలకం
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సూక్ష్మపరిశీలకుల (మైక్రోఅబ్జర్వర్లు) పాత్ర కీలకమని, వారు ఇచ్చే నివేదిక ఆధారంగానే రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కే రాంగోపాల్ చెప్పారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశమందిరంలో సూక్ష్మ పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకులు వ్యవహరించాల్సిన పలు అంశాలపై సమగ్రంగా వివరించారు. అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు సూక్ష్మ పరిశీలకుడు ఇచ్చే నివేదికతో పాటు ప్రిసైడింగ్ అధికారి డైరీని కూడా ఆధారంగా తీసుకుని రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందన్నారు. పోలింగ్ కేంద్రం లోపల అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా ? లేదా అనే విషయాన్ని చెక్‌లిస్టు ఆధారంగా పరిశీలించి నిర్ధారించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రం బయట ఎన్ని గొడవలు జరిగినా లోపల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంటే పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీచేస్తున్న చోట అందరి ఏజెంట్లను అనుమతించడానికి స్థలం సమస్య వస్తుందని, అక్కడ ప్రాధాన్య క్రమంలో జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు కలిగిన పార్టీల ప్రాతిపదికన ఏజెంట్లను అనుమతించాలని చెప్పారు. మీడియా ప్రతినిధుల్లో కూడా జిల్లా ఎన్నికల అధికారి జారీచేసిన గుర్తింపుకార్డులు ఉన్నవారినే లోనికి అనుమతించాలన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాలని, సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించాలని, అప్పటివరకు వరుసలో ఉన్న అందరినీ ఓటింగ్‌కు అనుమతించాలన్నారు.ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, డీఆర్వో శేషయ్య పాల్గొన్నారు. -
బద్ధకమానిర్లక్ష్యమా
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 18,52,970 మంది ఓటర్లున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 13,25,045 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 5,27,925 మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారన్న మాట. జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో మేజర్ పంచాయతీలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. జిల్లాలో విద్యావంతులు, మేధావులు, మహిళలు, విద్యార్థులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఎక్కువ మంది పోలింగ్‌కు దూరంగా ఉంటుండడంపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది. 90 శాతం ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేలా చూడాలన్న లక్ష్యంతో ఎలక్షన్ కమిషన్ ఎన్నో చర్యలు తీసుకుంది. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఓటర్లను చైతన్యవంతం చేయడానికి కమిటీలను నియమించింది. ప్రధాన కూడళ్లలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. కళాబృందాలను రంగంలోకి దింపింది. మైకుల ద్వారా సైతం ప్రచారం చేపట్టింది. ఇంటింటికి అధికారులే వెళ్లి పోల్ చీటీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంది. అయినా బద్ధకస్తులు కదల్లేదు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేదు. ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో పోలింగ్ శాతం 2 శాతానికి మించి పెరగలేదు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మరీ దారుణంగా 52.02 శాతమే పోలింగ్ నమోదైంది. అయితే గత ఎన్నికలతో పోల్చితే ఈసారి అర్బన్‌లో కాస్త పోలింగ్ శాతం పెరగడం మాత్రమే అధికారులకు ఉపశమనం ఇచ్చింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ 39 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 43 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామాల్లోనే చైతన్యం పట్టణ ప్రాంతాల్లోని వారు పోలింగ్‌కు దూరంగా ఉండగా.. గ్రామీణులు మాత్రం ఎండను లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. ఏ పోలింగ్ కేంద్రం వద్ద చూసినా భారీ క్యూ కనిపించింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా 78.86 శాతం పోలింగ్ నమోదు కాగా.. బాన్సువాడలో 76.76, జుక్కల్‌లో 76.46, బోధన్‌లో 75.44 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సర్కారుకు గండి
ఎన్నికల వేళ ఆబ్కారీ ఆదాయానికి బొక్క రెండు నెలల్లో రూ.20 కోట్లపైనే నష్టం ఈసీ నిబంధనలే కారణమని ఆగ్రహం అయినా ఆగని ‘మహా’ మద్యం ప్రవాహం అక్రమార్కులకు కాసులు కురిపించిన ఎన్నికలు ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఎన్నికలు అంటే గుర్తొచ్చేది డబ్బు, మద్యం. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అభ్యర్థులు డబ్బు వెదజల్లడం, మద్యం పంపిణీ చేయడం సాధారణం. దీంతో డబ్బు, మద్యం ప్రభావాన్ని అరికట్టేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ) చేసిన ప్రయత్నాలు కొంతవరకు సఫలమైనా.. అక్రమార్కులు అడ్డ‘దారు’ల్లో మద్యాన్ని దిగుమతి చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి దేశీదారు అక్రమంగా డంప్ చేశారు. సాధారణంగా ఎన్నికల సమయం ఆబ్కారీ శాఖకు ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది. అయితే ఈసారి మున్సిపల్, స్థానిక, సార్వత్రిక ఎన్నికలు జరిగినా రెండు నెలల కాలంలో దాదాపు రూ.20 కోట్లకుపైగా ప్రభుత్వానికి నష్టం వచ్చింది. ఈసీ నిబంధనతో ఆదాయం కోల్పోయినా.. ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచిదేనని అధికారులు పేర్కొంటున్నారు. ఈసీ నిబంధన తంటా.. మార్చి 30న మున్సిపల్, ఏప్రిల్ 6,11 తేదీల్లో రెండు విడతలుగా జిల్లా పరిషత్, మండల పరిషత్, ఏప్రిల్ 30న శాసనసభ, లోకసభ ఎన్నికలు జరిగాయి. గతేడాది ఎంత మద్యం అమ్మకాలు జరిగాయో ఎన్నికల వేళ ఆ నెలలో అంతే మద్యం అమ్మకాలు జరగాలని, అప్పుడు ఎంత మద్యం సరఫరా చేశారో ఇప్పుడు కూడా అంతే ఇవ్వాలని ఈసీ నిబంధన విధించింది. ఇదీ ఆబ్కారీ శాఖకు ప్రతిబంధకంగా మారింది. 2013 ఏప్రిల్‌లో ఇండియన్ మేడ్ లిక్కర్(ఐఎంఎల్) 87,917 కేసులు, బీర్లు 1,40,347 కేసులు విక్రయాలు జరిగాయి. దీని ద్వారా అబ్కారీ శాఖకు రూ.41.92 కోట్లు ఆదాయం సమకూరింది. ఈసారి 2014 ఏప్రిల్ నెలలో ఐఎంఎల్ కేవలం 59,996 కేసులు, బీర్లు 87,848 కేసులు అమ్ముడు పోయాయి. కేవలం రూ.31.17 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే దాదాపు రూ.10 కోట్ల మేర ఆబ్కారీ శాఖకు నష్టం వచ్చింది. ఎన్నికల వేళ కావడంతో మద్యం సరఫరా పెంచి ఇచ్చేదుంటే ఇంకో రూ.10 కోట్ల ఆమ్మకాలు పెరిగేవి. మద్యం వ్యాపారులు కోరినప్పటికీ డిపోలు మద్యం సరఫరా చేయలేదు. దీంతో జిల్లాలో రోజు సుమారు 30 షాపుల వరకు సరుకు లేక మూతబడ్డాయి. జిల్లాలో ప్రతి నెల లక్ష ఐఎంఎల్ కేసులు, లక్ష బీర్ల కేసులు విక్రయాలు జరుగుతాయి. తద్వారా రూ.45 కోట్ల మేర ఆదాయం లభిస్తుంది. అయితే ఎన్నికల సమయంలో ఆదాయంపై ఆశలు పెట్టుకున్నప్పటికీ అవి నీరుగారాయి. అక్రమ మద్యం ఒకవైపు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మద్యం అమ్మకాలపై ప్రతిబంధకాలు ఉండగా మరోపక్క వ్యాపారులు అక్రమ మార్గంలో తమ దందా కొనసాగించారు. జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దు ఉండటం, సరిహద్దు ప్రాంతాలైన నాందేడ్, యావత్మాల్, చంద్రపూర్, గడ్చిరోలి పరిధిలోని బోకర్, కిన్వట్, కేళాపూర్, పాండ్రకౌడ, రాజుర ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలను ఆనుకొని జిల్లాలో 20 మండలాలు సరిహద్దున ఉన్నాయి. ఎన్నికలకు 48 గంటల ముందు జిల్లాలో మద్యం దుకాణాలు మూసిఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే ఈసారి సరిహద్దు మహారాష్ట్ర ప్రాంతాల్లోనూ ఈ నిబంధనలను పెట్టడంతో సరిహద్దు నుంచి దేశీదారు, చీప్‌లిక్కర్ తరలిద్దామనుకున్న వ్యాపారుల ఆశలు అడియాశలయ్యాయి.అయితే ఈ విషయంలో అభ్యర్థులు ముందు జాగ్రత్త పడి ముందుగానే మద్యం నిల్వలను సమకూర్చుకున్నారు. చివరి రెండ్రోజుల్లో జోరుగా దేశీదారు, చీప్‌లిక్కర్ పంపిణీ జరిగింది. కాగా ఈ రెండు నెలల కాలంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 57లక్షల మద్యంను పోలీసులు పట్టుకోవడం జరిగింది. -
రూ.కోట్లలో ఖర్చు.. రూ. లక్షల్లో లెక్కలు
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ఓటరు మహాశయుడిని ప్రసన్నం చేసుకోవడానికి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కోట్ల రూపాయలు కుమ్మరించారు. గెలుపు కోసం తొక్కాల్సిన అడ్డదారులు అన్నీ తొక్కారు. ఇదే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా గుర్తింపు ముద్ర వేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఒక అసెంబ్లీ అభ్యర్థి రూ.28 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.70 లక్షలు లోబడి ఎన్నికల్లో ఖర్చు చేయాలి. ఇది ఎన్నికల సంఘం నిబంధన. వాస్తవంగా అయితే అభ్యర్థులు అంతే ఖర్చు చేయాలి. కానీ వారు చేసిన ఖర్చు అంచనా వేస్తే కళ్లు తిరగాల్సిందే. కొన్ని చోట్ల కోట్లు దాటడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా పోటీ చేస్తున్న అభ్యర్థుల సార్వత్రిక ఎన్నికల ఖర్చు దాదాపు రూ.90 కోట్లు దాటినట్లు పరిశీలకుల అంచనా. అత్యంత ఖరీదైన ఎన్నికలు సాధారణంగా ఎన్నికలంటేనే ఖరీదైన వ్యవహారం. ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులు ఈసారి ఎన్నికలను అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మార్చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోటీ ఆధారంగా అభ్యర్థులు ఓట్ల కోసం కోట్లు కుమ్మరించారు. ఒకటి, రెండు నియోజకవర్గాల్లోనైతే రూ.కోట్లు ఖర్చయినా సరే కచ్చితంగా మనం గెలవాలంతే అంటూ అభ్యర్థులు మొండి పట్టుదలతో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఒక్కో అభ్యర్థి కనీసం రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. అభ్యర్థుల రోజువారీ ఖర్చు చూస్తే కనీసం రోజుకు అభ్యర్థుల వెంబడి 100 మందికిపైగా ఉండి ప్రచారం చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి మద్యం అంతా అభ్యర్థి ఖాతాలోనే. రోజూ వీరికి పెట్టే ఖర్చు దాదాపు రూ.30 వేలు. పదిహేను రోజుల్లో కనీసం వీరి కోసం దాదాపు రూ.7 లక్షలు దాటింది. ఇక మద్దతుదారులు ప్రచారం చేయడానికి అద్దె వాహనాలు, ప్రచార వాహనాలు, కళాబృందాల ఖర్చు అదనం. రోడ్‌షో, బహిరంగ సభల ఏర్పాట్ల ఖర్చు కన్నా, ఆ కార్యక్రమాలకు జనాలను తరలించేందుకు పెట్టిన ఖర్చు రెట్టింపుగా ఉంటుంది. సభకు ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ.300 చొప్పున చెల్లించి జనాలను తరలించారు. ఇలా సభల కోసం 3 వేల నుంచి 5 వేల వరకు జనాలను తరలించారు. ఈలెక్కన వీరందరు పెట్టిన ఖర్చు రూ.50 లక్షలుపైనే ఉంటుంది. రూ.కోట్ల కట్టలతో ఓట్ల కొనుగోలు ఇక అన్నింటినీ మించి ఓట్ల కొనుగోలుకు రూ.కోట్లు ఖర్చు పెట్టారు. చాలా మంది అభ్యర్థులు తమ పరిధిలోని యువజన సంఘాల ఓట్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో యువజన సంఘానికి రూ.5 వేల వరకు అందజేశారు. ఒక నియోజకవర్గంలో సుమారు 200 యువజన సంఘాలు ఉంటాయి. ఈ లెక్కన రూ.10 లక్షలు చాలా నియోజకవర్గాల్లో యువజన సంఘాలకు ఆయా పార్టీల అభ్యర్థులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు మహిళా సంఘాలు, కుల సంఘాలు, అభివృద్ధి కమిటీలకు తాయిలాలు, విందులు, వినోదాలు అదనం. ఓటరు అడుగుతున్నాడు కాబట్టి ఇస్తున్నామని అభ్యర్థి, అభ్యర్థి ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటున్నామని ఓటరు ప్రజాస్వామ్యాన్ని వ్యాపారం చేశారు. ఎన్నికలకు ఒక రోజు ముందు మద్యం ఏరులై పారింది. గ్రామాల్లోని ప్రతి ఇంటికి ఒక మద్యం బాటిల్, రూ.500 చొప్పున అందించారు. ఆ ఒక్క రోజులోనే అభ్యర్థి రూ.లక్షల్లో ఖర్చు చేయడం గమనార్హం. రూ.కోట్లలో ఖర్చు.. రూ.లక్షల్లో లెక్కలు.. ప్రసుత్తం ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఉండే ఏకైక అర్హత డబ్బులు ఖర్చు చేయడమే. పార్టీలు కూడా ఎంత ఖర్చు పెడుతారో నిర్ధారణకు వచ్చాకే టిక్కెట్లు కేటాయించే సంస్కృతి పెరిగింది. రూ.కోట్లు సులువుగా ఖర్చు చేస్తున్న అభ్యర్థులు లెక్కలు మాత్రం రూ.లక్షల్లో చూపిస్తున్నారు. ఎన్నికల సంఘం వ్యయ పరిమితిని దాటితే గెలిచినా వేటు వేసే అవకాశం ఉండడంతో, లెక్కల్లో పిసినారితనం ప్రదర్శిస్తున్నారు. అయితే అభ్యర్థుల ఖర్చును చూసిన ఓటరు ఇన్ని డబ్బులు ఎలా సంపాదించారని ఆశ్చర్యపోతున్నారు. ఇంత డబ్బు ఖర్చు చేసినా తమను ఓటరు దయ తలుస్తాడో లేదోననే గుబులు అభ్యర్థుల్లో మొదలైంది. ఏదేమైనా ఈ డబ్బు ఎన్నికల్లో ఎంత మేర ప్రభావం చూపిందో ఫలితాలు వచ్చే దాకా వేచి చూడాల్సిందే. అద్దె వాహనాల్లో ఖర్చుల అంచనా.. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి రోజు కనీసం 20 వాహనాలను తన మద్దతు దారులకు ఇచ్చి నియోజకవర్గంలో ప్రచారానికి పంపించారు. ఒక్కో వాహనానికి అద్దె రూ.1000, మద్దతు దారులకు రోజు రూ.3 వేలు చెల్లించారు. ఇలా ఒక వాహనానికి రూ.4 వేలు వెచ్చించారు. ఇలా పదిహేను రోజుల నుంచి లెక్కిస్తే ఒక అసెంబ్లీ అభ్యర్థి రూ. 15 లక్షలకు పైనే ఖర్చు చేశారు. ఇక ఎంపీ అభ్యర్థుల ఖర్చులకొస్తే ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గలేదని తెలుస్తోంది. -
వ్యయంపై నిఘా!
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: మిము వీడని నీడము మేమే.. అంటూ ఎన్నికల వ్యయ పరిశీలకులు అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. డేగకన్ను నిఘాతో ఖర్చుల పద్దు రూపొందిస్తున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. అభ్యర్థులు వినియోగిస్తున్న కాన్వాయ్ మొదలుకొని.. ప్రచారంలో ఎక్కడెక్కడ తిరిగేది.. ఖర్చు చేస్తున్న మొత్తాన్ని వ్యయ పరిశీలకులు గుట్టుగా లెక్కిస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఓ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు ఇప్పటికే సుమారు రూ.20 లక్షలు అయినట్లు ఎన్నికల వ్యయ పరిశీలకులు నివేదిక రూపొందించినట్లు సమాచారం. ప్రచారంలో భాగంగా అభ్యర్థులు సమావేశాలు ఏర్పాటు చేస్తూ నాయకులు, కార్యకర్తలకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. భోజన ఖర్చులు అభ్యర్థుల ఖాతాలోకి రాకుండా రకాల రకాలుగా గిమ్మిక్కులు చేస్తున్నారు. ఎన్ని చేసినా ఎన్నికల వ్యయ పరిశీలకుల డేగకన్ను నుంచి తప్పించుకోలేకపోతున్నారు. దీంతో కొంతమంది అభ్యర్థులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తమ తోడుగా ప్రచారానికి వస్తున్న నాయకుల వాహనాల ఖర్చు కూడా వారి ఖాతాల్లో జమ అవుతున్నట్లు జాగ్రత్తలు వహిస్తున్నారు. నాయకులు వారి కార్లను సుమారు రెండు, మూడు కిలో మీటర్ల దూరం నిలిపి అభ్యర్థుల వెంట ప్రచారానికి కదులుతున్నారు. ఇటీవల ఓ పార్టీ పార్లమెంట్, ఎమ్మెల్యే అభ్యర్థులు కార్యకర్తల సమావేశాన్ని ఓ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేశారు. ఓ చోటా నాయకుడి జన్మదినం ఉందంటూ సమావేశానికి వచ్చిన కార్యకర్తలకు ఫంక్షన్హాలుకు కొద్ది దూరంలో భోజన సదుపాయం కల్పించారు. ఈ భోజనాల వద్దకు అభ్యర్థులు రావడంతో అక్కడ చేసిన ఖర్చులో సగం ఎమ్మెల్యే అభ్యర్థి ఖాతాలో జమ అయినట్లు తెలుస్తోంది. ఆర్భాటాలకు దూరంగా.. ఎన్నికల వ్యయ పరిశీలకుల నుంచి తప్పించుకోలేక అభ్యర్థులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. హంగూ ఆర్భాటాలకు దూరంగా ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కులాలు, వర్గాల వారికి గ్రూపులతో సమావేశం ఏర్పాటు చేసుకుని, వారికి కావాల్సినవి సమకూర్చుకుంటూ గెలుపు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రధాన పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా అవి ఎన్నికల వ్యయ పరిశీలకుల దృష్టికి రాకుండా జాగ్రత్త వహిస్తున్నారు. -
‘ఉక్కు మహిళ’కు ఓటు లేదు!
చట్టం పేరిట ఇరోం షర్మిల ఓటు హక్కును అడ్డుకున్న ఈసీ సార్వత్రిక ఎన్నికల సాక్షిగా ప్రజాస్వామ్యం అపహాస్యం ఇంఫాల్: ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో సార్వత్రిక ఎన్నికల సాక్షిగా ఓ ఉద్యమ తరంగం ఓటు హక్కు ‘చట్టబద్ధ అణచివేత’కు గురైంది! హత్యలు, అత్యాచారాలు, దోపిడీల వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వ్యక్తులు జైళ్ల నుంచి సైతం పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు అభ్యంతరం చెప్పని ఎన్నికల కమిషన్... సామాన్యుల తరఫున దశాబ్ద కాలానికిపైగా అలుపెరగని పోరాటం సాగిస్తున్న ఓ మానవ హక్కుల కార్యకర్తకు మాత్రం నిబంధనల పేరుతో ఓటును దూరం చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో 13 ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలకు ఎన్నికల అధికారులు ఓటు హక్కు నిరాకరించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందంటూ గత ఎన్నికల్లో ఓటేయని ఆమె ఈసారి ఓటేసేందుకు ముందుకొచ్చినా ఆమెను చట్టం పేరు చెప్పి అడ్డుకున్నారు. షర్మిల నిరవధిక నిరాహార దీక్షకు దిగడంతో ఆమెపై పోలీసులు ఆత్మహత్య అభియోగాలు నమోదు చేశారు. ఈ అభియోగం కింద ఆమెను ఏక బిగువన ఏడాదిపాటు జైల్లో పెట్టే వీలుంది. షర్మిల బలహీనంగా ఉండటంతో ఆమెను మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని ఓ ఆస్పత్రి ప్రత్యేక వార్డులో ఉంచి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ఆమె ఉంటున్న గదినే సబ్ జైలుగా మార్చారు. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 62 (5) ప్రకారం జైల్లో ఉండే వ్యక్తికి ఓటేసే హక్కు లేదు. ఈ నిబంధన కారణంగానే షర్మిలకు మణిపూర్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించలేకపోయినట్లు ఓ అధికారి చెప్పారు. -
ఆదాయ పన్ను వివరాలు ఈసీకి సమర్పించాం
వైఎస్సార్సీపీ వెల్లడి.. దీనిపై మీడియా దుష్ర్పచారాన్ని ఖండించిన పార్టీ హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించిందని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్సీపీ 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను వివరాలను సమర్పించలేదని జరుగుతున్న దుష్ర్పచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. 2012-13 ఆర్థిక సంవత్సరపు ఆదాయపు పన్ను వివరాల పత్రాలను తమ పార్టీ.. నిర్దేశించిన నిబంధనలు, సెక్షన్ల ప్రకారం ఎన్నికల కమిషన్‌లోని ఐటీ విభాగానికి సమర్పించామని, ఆ మేరకు అక్నాలెడ్జ్మెంట్ కూడా పొందామని వివరిస్తూ, తమపై నిరాధారంగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు తెలిపింది. వాస్తవాలేమిటో కనీసం నిర్ధారించుకోకుండా, నిజానిజాలు తెలుసుకోవడానికి సంబంధిత వ్యక్తులనుగానీ, సంస్థలనుగానీ సంప్రదించకుండా ఇలాంటి నిరాధారమైన వార్తలను టీవీల్లో ప్రసారం చేయడం అనేది దురుద్దేశంతో కూడిన చర్య అని, దీనిని తాము ఖండిస్తున్నామని పేర్కొంది. -
రామ్‌దేవ్ యోగా శిబిరాలపై ఈసీ ఝలక్...
బాబా రామ్‌దేవ్ నిర్వహించే యోగా శిబిరాలపై ఎన్నికల కమిషన్ గట్టి ఝలక్ ఇచ్చింది. యోగా శిబిరాలను ఎన్నికల ప్రచారం కోసం దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నట్లయితే, అనుమతి నిరాకరించాలంటూ అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలు పంపింది. యోగా శిబిరాల నిర్వాహకులు ఇదివరకు వాటిని దుర్వినియోగం చేసుకున్న దాఖలాలు ఉన్నట్లయితే, అనుమతులు ఇవ్వరాదని స్పష్టం చేసింది. కాగా, పంజాబ్‌లో ఏప్రిల్ 2న యోగా శిబిరం నిర్వహించిన రామ్‌దేవ్, తన శిబిరాన్ని బీజేపీ-అకాలీ కూటమికి ప్రచారం కోసం వాడుకున్నట్లుగా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, ఢిల్లీలో రామ్‌దేవ్ నిర్వహించిన యోగా శిబిరానికి మోడీ హాజరు కావడంతో ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసు పంపింది. -
కాకి లెక్కలు కుదరవు!
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ఇడ్లీ రూ.16, వడ రూ.20, ఉప్మా రూ.16 ఇదేదో ఉడిపీ హోటల్ మెనూ అనుకుంటే పొరపాటే. ఈ ధరలు ఎన్నికల కమిషన్ నిర్ధారించినవి. మారేటు సప‘రేటు’ అంటూ ఎన్నికల కమిషన్ అభ్యర్థుల ఖర్చులను కట్టు దిట్టం చేసింది. ప్రతి అభ్యర్థి తమ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టి ఆ తర్వాత కాకి లెక్కలు చూపకుండా ఎన్నికల కమిషన్ స్వయంగా ఎన్నికల ప్రచారానికి స్టేజీ కట్టింది మొదలు మైకు సెట్ రేటు, డ్రైవర్ బత్తా వరకు ప్రతి ధరను నిర్థారించింది. ప్రచార కార్యక్రమాల నిర్వహణలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉపయోగించే పలు ప్రచార సాధనాలు, వస్తువుల ధరలను ఎన్నికల కమిషన్ నిర్ణయించి వాటిని వెల్లడించింది. రాజకీయపార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఎన్నికల ప్రచార వ్యయాన్ని, నిర్థారించిన రేట్లను ఖర్చుల్లో చూపాల్సిందే. ఎన్నికల కమిషన్ నిర్ణయంతో అభ్యర్థులు ఎన్నికల వ్యయం విషయంలో తప్పుడు లెక్కలు చూపేందుకు ఎటువంటి ఆస్కారం ఉండదు. లేదంటే ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగి అభ్యర్థులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయంటున్నారు ఎన్నికల అధికారులు. ఎన్నికల కమిషన్ నిర్థారించిన రేట్లు ఇలా ఉన్నాయి. క్ర.సం. ఐటం రేట్లు 01. ఇడ్లీప్లేటు రూ.16 02. వడ ప్లేటు రూ.20 03. ఉప్మా ప్లేటు రూ.16 04. మైక్రోఫోన్ రూ.1000 05. యాంప్లిఫయిర్ రూ.3వేలు 06. స్టేజీ డెకరేషన్(20/12 సైజు) రూ.6వేలు 07. స్టేజీ డెకరేషన్(16/8 సైజు) రూ.5వేలు 08. క్లాత్బ్యానర్లు(ఒకఫీటుకు) రూ.25 09. గుడ్డ జెండాలు(ఒకటికి) రూ.25 10. ఫ్లెక్సీ తయారీ(స్క్వేర్ఫీట్కు) రూ.8 11. పోస్టర్లు(17/27సైజు 1000కి) రూ.3500 12. కటౌట్ తయారీ (స్క్వేర్‌ఫీట్) రూ.125 13. డీవీడీ (ఒకటికి) రూ.10 14. ఆడియో క్యాసెట్(ఒకటికి) రూ.20 15. ఆడియో క్యాసెట్ రికార్డర్(ఒకటికి) రూ.35 16. భోజనం(ఒకరికి) రూ.55 17. సుమో/ఇండికా కారు(ఒక రోజుకు) రూ.1000 18. సుమో/ఇండికా కారు డ్రైవర్ బత్తా(ఒకరోజుకు) రూ.200 -
పార్టీలకు ముకుతాడేదీ?
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మామూలు సొసైటీని క్రమబద్ధీకరించడానికి ఒక చట్టం ఉంది. కంపెనీల పైన అదుపు కంపెనీ లా బోర్డుకు ఉంది. బ్యాంకుల నెత్తిన రిజర్వ్‌బ్యాంక్ అంకుశం మోపుతూ ఉంటుంది. చిట్‌ఫండ్ కంపెనీలకు కూడా ఒక క్రమపద్ధతి ఉండే చట్టాలున్నాయి. రాజకీయ పార్టీలకే ఏ అదుపూ ఆజ్ఞలు లేవు. వారిని అడిగేవారు లేరు. ఇంతపెద్ద రాజ్యాంగం రాసిన పెద్దలు, ప్రజాప్రాతినిధ్య చట్టాలు రూపొందించిన మేధావులు రాజకీయ నాయకులని సక్రమంగా నడిపించే చట్టాలను రాయలేకపోయారు. స్వతంత్ర సమరం నడిపి రాజ్యాంగ రచన చేసిన ధీశాలురే కానీ తరువాత కాలంలో రాజకీయ పార్టీలను అదుపు చేసే ఒక శక్తి అవసరం అవుతుందని వారు ఊహించలేకపోయారు. ఎన్నికల సంఘం.. కాగితం పులి రాజ్యాంగంలో రాజకీయ పార్టీ అన్న పదమే రాలేదు. రాయలేదు. ఎన్నిక కావలసిన వ్యక్తికి అర్హతలు రాశారు. ఎన్నికైన వ్యక్తి బాధ్యతలు రాశారు. కానీ వారిని ఎంపిక చేసే రాజకీయ పార్టీకి సంబంధించిన రీతి రివాజులు, నీతినియమాలు లేవు. ఎన్నికల కమిషన్ మన దేశంలో ఎన్నికలు నిర్వహించే సంస్థ. దానికి విస్తృతమైన అధికారాలున్నమాట నిజమే. కానీ, ఆ అధికారాలు ఎన్నికల సమయంలో మాత్రమే పనిచేస్తాయి. తరువాత ఎన్నికైన ప్రభుత్వం కనుసన్నల్లో మెలగవలసిందే. ఎన్నికల సంస్కరణల విషయంలో సలహాలు చెప్పడం తప్ప రాజకీయ నాయకులను అదుపు చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదు. కనీసం రాజకీయ పార్టీలు నిర్దేశించిన అర్హతలను పాటించే విధంగా ఆదేశాలు ఇచ్చే అధికారం కానీ, ఆ అర్హతను కోల్పోయిన పార్టీల గుర్తింపును, అసలు పార్టీని రద్దుచేసే అధికారాలు గానీ ఎన్నికల కమిషన్‌కు లేనేలేవు. కొత్త పార్టీ ఏర్పడగానే ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు. శాశ్వతంగా కొనసాగవచ్చు. రాజకీయ పార్టీకి రద్దు సమస్యే లేదు. గుర్తింపు లభించడానికి కొన్ని అర్హతలు నిర్దేశించారు. గుర్తింపు లేకపోయినా గుర్తు ఇస్తారు. ఇక ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా జనానికి గుర్తున్నా లేకపోయినా పాత గుర్తుతో మిగిలిపోతుంది. కొత్త పార్టీలకు గుర్తులే దొరకనన్ని పార్టీలు మన దేశంలో ఉన్నాయి. చివరకు గుర్తులు దొరకకపోవడం వల్ల చెప్పులను, చీపురుకట్టలను కూడా ఆశ్రయించవలసిన దుస్థితి ఏర్పడింది. జై సమక్యాంధ్ర పార్టీ నేతలు ఏ కారణం చేతనైనా ఇంకేపార్టీలో కలిసినా సరే కనీసం చెప్పుల గుర్తుకూడా మరొకరికి దక్కదన్న మాట. ఇదీ మన ఎన్నికల చట్టం. రిజిస్టర్ చేయవచ్చు కానీ డీరిజిస్టర్ చేసే అధికారం లేని కాగితం పులి ఎన్నికల సంఘం. రాజకీయ పార్టీ అంటే రాజ్యాంగం దృష్టిలో కొందరు వ్యక్తుల సమూహం మాత్రమే. ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైనా సరే కొందరు కలిసి పార్టీ పెట్టవచ్చు. అది ప్రాథమిక హక్కు. తానొక్కడే అయినా వెంట ఎవరూ లేకపోయినా సరే అది వ్యక్తుల సంఘం అయితే చాలు. ఇంతమంది సభ్యులు ఉండాలన్న నియమం కూడా లేదు. రాజకీయ పార్టీ పెట్టడం చాలా సులభం. కొన్ని షరతులు ఉన్నమాట వాస్తవమే. భారతదేశ సమగ్రతకు సమైక్యతకు కట్టుబడి ఉండాలి. అయితే ప్రతి పార్టీ తప్పనిసరిగా ఏర్పడిన నెలరోజుల్లోగా రిజిస్టర్ చేయడం కోసం దరఖాస్తు సమర్పించి తీరాలని ప్రజాప్రాతినిధ్య చట్టం ఆర్టికల్ 29ఎ(5) నిర్దేశిస్తున్నది. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండాలని కూడా ఈ సెక్షన్ షరతు విధిస్తోంది. రిజస్టర్ చేయాలంటే ఆ పార్టీ ఒక మెమొరాండం ఆఫ్రూల్స్ అండ్ రెగ్యలేషన్స్ ఇవ్వాలి. ఇదివరకు పార్టీల మెమొరాండం తీసుకుని పేరు మార్చి ఇచ్చేవారు. సొంతంగా ఆలోచించి సొంత నియమావళి రాసుకునే తీరిక, ఓపిక చాలా తక్కువ. ఈ మెమొరాండం ఇచ్చి రాజ్యాంగానికి విధేయత ప్రకటించిన తరువాత ఈసీ రిజిస్ట్రేషన్‌కు అంగీకరిచవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ సెక్షన్ ప్రకారం ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం. పబ్లిక్ ఇంటరెస్ట్ ఫౌండేషన్ అనే సంస్థ ఆర్టీఐ కింద రాజకీయ పార్టీలు ఎన్ని నియమాలను పాటించాయో తెలుసుకుందామని ప్రశ్నలు వేసింది. మనకు 1196 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలున్నాయి. వీటిలో కేవలం 98మాత్రం 20వేల రూపాయలకు మించిన విరాళాల వివరాలతో నివేదికలు ఇచ్చాయి. అంటే కేవలం 8శాతం పార్టీలు నియమం పాటించాయి. అందుకు వాటికి లభించే కితాబు ఏమీ ఉండదు. ఆ నివేదికలో లోపాలు, అవాస్తవాలపైన విచారణలు ఉండకపోవచ్చు. నివేదిక ఇవ్వని పార్టీలకు పన్ను రాయితీలు ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ ఆదాయపు పన్ను శాఖకు చెప్పలేదని ఈ ఆర్టీఐ ప్రశ్నలకు సమాధానంలో తేలింది. మిగతా మార్గదర్శక సూత్రాల్లోని ఆర్టికల్ 8 రూల్ 3(1),(19) ప్రకారం ఆడిట్ జరిపించిన వార్షిక ఆర్థిక నివేదికలు ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆరు నెలలలోగా ఇవ్వాలి. ఎన్ని పార్టీలు ఇచ్చాయని ఆర్టీఐ కింద పీఐఎఫ్ సంస్థ అడిగింది. 2011-12లో కేవలం 175 పార్టీలు నివేదికలు ఇచ్చాయి. అంటే 85శాతం పార్టీలు నివేదికలు ఇవ్వలేదు. డీ రిజిస్ట్రేషన్ అధికారాలు ఉన్నా... రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసే సందర్భంలో ఎన్నికల సంఘం అర్థ న్యాయసంస్థలా వ్యవహరిస్తోంది. కానీ ఒకసారి రిజిస్టర్ చేసిన తర్వాత దానికి ఏ అధికారాలూ లేవు. డీరిజిస్టర్ చేయడానికి ఎన్నికల సంఘానికి అధికారం ఉంది. కానీ ఆర్టికల్ 29ఎ కింద నాలుగు సందర్భాల్లో మాత్రమే డీరిజిస్టర్ చేయవచ్చు. (1) మోసపు మార్గాల ద్వారా పార్టీ రిజిస్ట్రేషన్ సాధించిందని తెలిస్తే, (2) ప్రభుత్వం ఆ పార్టీని చట్ట వ్యతిరేకం అని ప్రకటిస్తే (3) పార్టీ స్వయంగా తమ పార్టీ రద్దయిందని ఇక పనిచేయలేదని లేదా పార్టీ నియమావళిని మార్చుకున్నదని ప్రకటించినా లేదా (4) చట్టం ప్రకారం పనిచేయడం లేదని తేలిన సందర్భాల్లో డీరిజిస్టర్ చేయవచ్చు. నిజానికి డీరిజిస్టర్ చేసే అధికారాన్ని ఈ సెక్షన్ విభజించింది. కొన్ని అధికారాలు ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి ఇచ్చి, మరికొంత అధికారాన్ని స్వయంగా రద్దు చేసుకునేందుకు పార్టీలకే ఇచ్చింది. నాలుగో నియమం పరిశీలిస్తే ఈసీ ఫలానా అంశంలో చట్టం ప్రకారం పనిచేయలేదని తేల్చి రిజిస్ట్రేషన్ రద్దు చేయవచ్చు. షరతుల ప్రకారం రాజ్యాంగం పట్ల అవిధేయత కనిపించినా, చట్టాలను ఉల్లంఘించినా, పార్టీ అభ్యర్థి కానీ కార్యవర్గ నాయకులు గానీ నేరాలకు పాల్పడినా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే భావించి వారి పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయవచ్చు. దానికి దమ్మున్న నాయకుడు రావాలి. టీఎన్ శేషన్ వంటి ప్రధాన ఎన్నికల కమిషనర్లు వస్తే ఈ రద్దు అధికారాలు అంతర్లీనంగా ఉన్నాయనీ, వాటిని వినియోగించి చట్టవ్యతిరేక పార్టీలను రద్దుచేసే అధికారాలను ప్రయోగించవచ్చని తేలుతుంది. సెక్యులరిజం పాటించని పార్టీలు, మత కలహాలు సృష్టించేవారు, ఇతర మతాల వారిని చంపించిన వారు ఉన్న పార్టీలను ఎందుకు రద్దు చేయలేదు? సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీలు ఉల్లంఘించిన వారు, ప్రమాణాలు చేసి భంగం చేసినవారు, అబద్ధపు ప్రమాణ పత్రాలు రాసినవారు, వరకట్న నేరాలు చేసినవారు, ఫిరాయించిన వారు, రాజ్యాంగం ప్రతులు చింపేసేవారు, అసెంబ్లీ, లోక్‌సభల్లో చట్టాల ప్రతులను చింపి మైకులు విరిచి, కళ్లలో మిరియాల నీరు చల్లి, కత్తులు ఝళింపించే వారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొంటూ ఒక్కపార్టీ కైనా ఎన్నికల కమిషనర్ నోటీసు కూడా పంపే స్థితిలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రూల్ ఆఫ్ లా అంటే సమపాలన, ఇవే పనులు కంపెనీలు, బ్యాంకులు, చిట్ ఫండ్ కంపెనీలు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? కేసులు పెట్టరా? మొక్కుబడిగా వార్షిక నివేదికలు ఆర్టికల్ 29సి కింద రాజకీయ పార్టీ ఏటేటా ఎన్నికల సంఘానికి తమకు 20వేల రూపాయలకు మించిన విరాళాలు ఎన్ని వచ్చాయో, ఎవరిచ్చారో వివరిస్తూ ఒక వార్షిక నివేదిక ఇస్తానని వాగ్దానం చేయాలి. ఒకవేళ వార్షిక నివేదిక ఇవ్వకపోతే ఆ రాజకీయ పార్టీకి విరాళాలు వసూలు చేసే అధికారం గానీ పన్ను రాయితీలుగానీ రావు. కనుక ఏదో ఒక నివేదిక ఇస్తారు. ఈ మొక్కుబడి నివేదికలో అబద్దాలున్నా రిజిస్ట్రేషన్ రద్దుచేసే అధికారం ఎన్నికల సంఘానికి లేకపోవడం మనదేశపు వింత. తరువాత 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం 29ఎ ఆర్టికల్ కింద రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ మార్గదర్శకాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో ఆర్టికల్ 8 రూల్3(1) రూల్ 3(19) ప్రకారం తప్పనిసరిగా ప్రతి రాజకీయ పార్టీ ఆడిట్ చేసిన వార్షిక ఆర్థిక నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించాలి. 29ఎ(6) కింద ఎన్నికల సంఘం ఇంకే వివరాలైనా అడగవచ్చు. ఆ తరువాత రిజిస్ట్రేషన్ నిర్ణయం తీసుకోవచ్చు. -
ప్రచార సభలకు మైదానాలు కరువు
సాక్షి, ముంైబె : నగరంలో ఈసారి బహిరంగ సభల సంఖ్య గతంలో కంటే మరింత తగ్గే అవకాశముంది. 2009 ఎన్నికల సమయంలో శివాజీ పార్కు మైదానంలో బహిరంగ సభలకు అనుమతి ఉంది. దీంతో అనేక పార్టీలు అక్కడ సభలు నిర్వహించుకున్నాయి. అయితే ఈసారి ఆ అవకాశమే లేకుండాపోయింది. దీంతో ఈసారిసభలు ఎక్కడ నిర్వహించాలనే విషయంపై ప్రధాన పార్టీలన్నీ తలలు పట్టుకుంటున్నాయి. ఎన్నికల కమిషన్ నిషేధం, నిశ్శబ్ద ప్రాంతం (సెలైన్స్ జోన్) పరిధిలోకి రావడమే ఈ సమస్యకు అసలు కారణం. సెలైన్స్ జోన్ ఆంక్షల కారణంగా నగరంలోని దాదాపు 1,300 ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదు. నగర పరిధిలోబహిరంగ సభలకు మైదానాలు కరువయ్యాయి. సెలైన్స్ జోన్ ఆంక్షల కారణంగా ఎమ్మెమ్మార్డీఏ, సోమయ్య కళాశాల ప్రాంగణాలే దిక్కయ్యాయి. దీంతో ఈ రెండింటిపైనే ప్రధానపార్టీలు దృష్టి సారించాయి. ఇవి ఎవరికి లభించనున్నాయనేది వేచిచూడాల్సిందే. సభల కోసం స్థలాల అన్వేషణ.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచార సభలను నిర్వహించేందుకు స్థలాలకోసం అన్వేషిస్తున్నాయి. నగరంలో ఎక్కడెక్కడ సభ లను నిర్వహించవచ్చనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఎన్నికల ప్రచార సభలను నిర్వహించేందుకు స్థలాలు లభించకపోవడంతో రాజకీయపార్టీలన్నీ నగరంలోని ప్రైవేట్ మైదానాలు, మిల్లుల స్థలాలపై దృష్టి కేంద్రీకరించాయి. చిన్న సభలు నిర్వహించుకునేందుకు మాత్రం ఇవి అనుకూలంగా ఉన్నాయి. కాగా సెలైన్స్ జోన్ ఆంక్షల కారణంగా భారీ బహిరంగ సభలకు అవకాశాలు సన్నగిల్లడంతో ప్రధాన పార్టీలతోపాటు అన్ని పార్టీలు రోడ్ షోలు, పాదయాత్రలు, వీధి సభలకు ప్రాధాన్యమిస్తున్నాయి. అనేకమంది నాయకులు రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. -
ఇక సార్వత్రిక సమరం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: వరుస ఎన్నికల పరంపరలో భాగంగా తుది ఎన్నికలకు నేడు తెరలేవనుంది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికలపై దృష్టిసారించాయి. ఈ మేరకు తుది యుద్ధానికి సన్నద్ధమవుతున్నా యి. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది. జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి సంబంధించి కలెక్టర్ కాంతిలాల్ దండే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మే 7న జరిగే ఎన్నికలకు సంబంధించి విడుదల కానున్న నోటిఫికేషన్లో అభ్యర్థులకు కావలసిన సమాచారంతో పాటు, వారు అనుసరించాల్సిన నియమ నిబంధనలు పొందుపరుస్తూ ఎన్నికల కమిషన్ పుస్తకాలను పంపిణీ చేసింది. జిల్లాలోని తమ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్లను దాఖలు చేసేందుకు నామినేషన్ల స్వీకరణ చివరి రోజున కూడా అందజేసేందుకు అవకాశం కల్పించింది. ఆ రోజు ఆన్లైన్లో మాత్రమే పొందుపరచాలి. ఎన్నికల సమాచారం కోసం కలెక్టరేట్లో 1070 టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. జిల్లాలో 16,86,020 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 8,31,743 మంది, మహిళలు 8,54,170 మంది, ఇతరులు 107 మంది ఉన్నారు. ఐదు రోజులు మాత్రమే నామినేషన్ల స్వీకరణ ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు కాల పరిధి తగ్గింది. నామినేషన్లకు ఎనిమిది రోజుల సమయం ఉన్నట్టుగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నప్పటికీ కేవలం ఐదు రోజులు మాత్రమే నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. 13,14,18 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో ఆ రోజుల్లో నామినేషన్లు స్వీకరించబోమని కలెక్టర్ ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్ 23. మే 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఎంపీ నియోజకవర్గానికి కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థులు తమ నియోజకవర్గ కేంద్రాలలో గల తహశీల్దార్ కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు సమర్పించాలి. ఎంపీ అభ్యర్థి డిపాజిట్ రూ.25 వేలు, ఎమ్మెల్యే రూ.10 వేలు కలెక్టరేట్లో ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. ఎంపీ అభ్యర్థి డిపాజిట్‌గా రూ.25 వేల ధరావత్తు చెల్లించాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.12,500 ధరావత్తుగా నిర్ణయించారు. ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.10 వేలు డిపాజిట్ కాగా, అందులో సగం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించాల్సి ఉంది. ఎంపీ అభ్యర్థి వ్యయపరిమితి రూ.70 లక్షలు కాగా, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.28 లక్షల వరకూ ఖర్చు చేయవచ్చు. ఎంపీ అభ్యర్థి ఫారం -2(ఎ), ఎమ్మెల్యే అభ్యర్థి ఫారం-2(బి)ను సమర్పించాలి. అభ్యర్థులు తమ పిల్లల పేరున ఉన్న ఆస్తులను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. అఫిడవిట్‌లోని ప్రతి కాలమ్‌నూ తప్పని సరిగా పూరించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. మే 5వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా ప్రచారాన్ని ముగించాల్సి ఉంది. అభ్యర్థులు తమ వ్యయ రిజిస్టర్లను ఆర్వోలకు కనీసం మూడుసార్లు చూపించాలి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 24,25 నుంచి నెలాఖరు వరకూ ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేస్తారు. ఓటరు గుర్తింపునకు 21 రకాల గుర్తింపు కార్డులు ఎన్నికల సంఘం ఈ సారి ఓటరు గుర్తింపునకు 21 రకాల ఐడెంటిటీలను ఆమోదించనుంది. తమ పరిధిలోని ఏవేని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులు సైతం తీసుకుని పోలింగ్ బూత్‌కు వెళ్లే అవకాశాన్ని కల్పించింది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకూ ఉంటుంది. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఈనెల 17 నుంచి అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. -
కాంగ్రెస్ నేతలపై పోలీస్ దాడులు
చీపురుపల్లి(మెరకముడిదాం),న్యూస్‌లైన్: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలపై పోలీసులు ఎట్టకేలకు ఉక్కుపాదం మోపారు. ఇప్పటివరకు తమకు అడ్డూ అదుపు లేదని ఇష్టానుసారం వ్యవహరించిన ఆ పార్టీ నేతలకు మొట్టమొదటి సారిగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తాము చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్న తీరులో అందర్నీ శాసిస్తూ, అడ్డు చెప్పిన అధికారులకు జిల్లాలో స్థానంలేకుండా చేసిన కాంగ్రెస్‌నేతలకు ఇప్పటి తమ పరిస్థితి అర్థమయింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల ముందు ఎంతటి వారైనా ఎక్కువ కాదని పోలీసులు నిరూపించారు.కోడ్ ఉల్లంఘించి, డబ్బులు పంచుతున్నారన్న సమాచారం రావడంతో దాడి చేసిన పోలీసులు, ఆ నేతలను పరుగులు పెట్టించారు. బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిదాం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ గురువారం సమావేశం నిర్వహించడమే కాకుండా డబ్బులు పంపిణీ చేస్తుండగా ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్, కాంగ్రెస్ నేత శిరువూరు వెంకటర మణరాజు, మెరకముడిదాం ఎంపీటీసీ అభ్యర్థి కెఎస్‌ఆర్‌కె ప్రసాద్,గుర్రాజు, లెంక భాస్కరరావుతో పాటు 14 మంది కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) అక్కడి నుంచి పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న 14 మంది కాంగ్రెస్ నేతలను బుదరాయవలస పోలీస్‌స్టేషన్‌కు తరలించి, వారి నుంచి రూ. 76,300 నగదు, సెల్ఫోన్లు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మెరకముడిదాంలో ఎన్నికల సమావేశం జరుగుతోందని తెలిసి దాడి చేశామని, కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయడమే కాకుండా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తుండగా పట్టుకున్నామని ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్ గురువారం రాత్రి మెరకముడిదాం మండలం బుదరాయవలస పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలోతెలిపారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బంధువు, జిల్లా కాంగ్రెస్ నేత మజ్జి శ్రీనివాసరావు కూడా అక్కడే ఉన్నారని, తమను చూసి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయినట్టు తెలిసిందన్నారు. ఆయన కోసం గాలిస్తున్నామని , ఆయన దొరక్కగానే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. -
ముస్లిం సైనికుల వల్లే గెలిచాం
కార్గిల్ యుద్ధంపై ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు నోటీసు జారీచేసిన ఎన్నికల కమిషన్ తన వ్యాఖ్యల్లో తప్పు ఏముందని ప్రశ్నించిన ఖాన్ న్యూఢిల్లీ/ఘజియాబాద్: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ ‘కార్గిల్’ వ్యాఖ్యలపై బుధవారం పెను దుమారం రేగింది. ఎన్నికల సంఘం ఆయనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత గెలుపునకు ముస్లిం సైనికులే కారణమని మంగళవారం ఆజంఖాన్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కాంగ్రెస్, బీజేపీ, జేడీ(యు) సహా పలు పార్టీలు విరుచుకుపడ్డాయి. ఆజం వ్యాఖ్యలు సైనికుల సాహసాలను కించపరిచేలా ఉన్నాయని బీజేపీ విమర్శించింది. ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. మతపరమైన రాజకీయాలకు నిదర్శనమని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మండిపడ్డారు. సైన్యాన్ని మతపరంగా విభజించడం తగదని, ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవడం ఈసీ పరిధిలోని అంశమని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. సమాజ్‌వాదీ మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందించింది. సమాజంలో ఓ వర్గాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వారు అనుభవించే బాధను ఖాన్ చెప్పాలనుకున్నారని పేర్కొంది. మరోవైపు తన వ్యాఖ్యలపై ఇంత దుమారం రేగినప్పటికీ, ఖాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన వ్యాఖ్యల్లో తప్పు ఏముందని, వాటిపై ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఆజంఖాన్‌కు ఈసీ నోటీసు... ఆజంఖాన్ ‘కార్గిల్’ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఎన్నికల కమిషన్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసింది. నిబంధనలు అతిక్రమించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో 11వ తేదీ సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. -
పెద్దల కనుసన్నల్లో ఖాకీ దాష్టీకం
అనకాపల్లి, న్యూస్‌లైన్: ఆ పోలీసు అధికారి తీరు ఎన్నికల కమిషన్ నిష్పాక్షిక నిర్ణయాలకే మాయనిమచ్చగా మా రుతోంది. పదవి ద్వారా సంక్రమించిన బలంతో, అధికార జులుంతో నచ్చనివారిని వేధిం చుకుతింటున్న ఆయన వైఖరి సర్వత్రా విమర్శలకు గురవుతోంది. పైవారి కనుసన్నల్లో నడుస్తూ ఇప్పటికే బోలెడంత అపఖ్యాతిని మూటగట్టుకున్న ఆయన తీరు ఉన్నత పదవికే చెడ్డపేరు తెస్తోంది. పెద్దవారి కనుసన్నల్లో నడుస్తూ, వారి రాజకీయ ప్రత్యర్థులపై అధికార దండాన్ని ప్రయోగిస్తూ పదవిని దుర్వినియోగం చేయడం ప్రజల్లో నిరసనకు పాత్రమవుతోంది. వలసవాదిగా గుర్తింపు తెచ్చుకున్న నేత తాను ఏరికోరి ఓ పోలీస్ అధికారిని బదిలీ కాకుండా అడ్డుకోవడం గతంలోనే చర్చనీయాంశమైంది. క్రమశిక్షణ చర్యలు లేకుండా అడ్డుపడి, ఎన్నికల వేళ తనకు అనుకూలంగా పని చేయించుకోవడానికి తురుపు ముక్కగా వాడుకోవాలన్న ఎత్తుగడ బాగానే పని చేస్తోందని సర్వత్రా వినవస్తోంది. పోలీస్ సాక్షిగా మీడియాపై దాడి ఎంపీటిసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యలమంచిలి నియోజకవర్గంలోని ఒక మండలంలో దేశం పార్టీకి చెం దిన నేతలు బియ్యాన్ని తరలిస్తున్నారనే ఫిర్యా దు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. దీనిని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై పోలీసుల సాక్షిగా భౌతిక దాడి జరిగింది. పోలీసులు పక్కనే ఉన్నా ఈ దారుణం అడ్డూఅదుపూ లేకుండా సాగింది. బియ్యం బస్తాలను ఏవో కాగితాలు చూసి వదిలేయడం వెనుక ఈ అధికారి హస్తం ఉందన్న ప్రచారం సాగుతోంది. అనకాపల్లి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నప్పుడు మార్క్‌ఫెడ్ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్ సీపీ నేతపైనే కావాలని పోలిసులు దురుసుగా ప్రవర్తించారు. అదే విధంగా అనకాపల్లి మండలంలోని బీఆర్టీ కాలనీలో పోలిం గ్ సిబ్బంది నిర్వాకం వల్ల వ్యవహారం చినికిచినికి గాలి వానలా మారంది. అనకాపల్లి నియోజవర్గ పరిధిలో నమోదైన బైండోవర్ కేసులు సైతం ఏకపక్షంగా జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా బాస్ ఆగ్రహం అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలకు తోడు అదుపులోకి తీసుకున్న బియ్యాన్ని వదిలేయడం, మీడియాపై దాడులు, వైఎస్ఆర్ సీపీ నేతలపై కవ్వింపు చర్యలు వంటి పరిణామాలపై ఎస్పీ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే అనకాపల్లి పరిధిలోని ఒక పోలీస్ అధికారికి జిల్లా బాస్ అక్షింతలు వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనైనా ఆ అధికారి తీరు మారుతుందో లేదోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
కొత్త ఓటర్లకు ఉచితంగా పీవీసీ కార్డులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల సంఘం నూ తనంగా ప్రవేశపెట్టిన పీవీసీ ఓటరు గుర్తింపు కార్డు జిల్లాలోని కొత్త ఓటర్లందరూ పొందవచ్చు. అయితే ప్రతి ఓటరు రూ. 25 చెల్లించి మీ సేవ కేంద్రాల ద్వారా కార్డును పొందేం దుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. జిల్లాలో 15-01-2013 నుంచి 31-01-2014 మధ్య కాలంలో ఓటరుగా నమోదు చేసుకున్న వారిని కొత్త ఓటర్లుగా గుర్తించి వారందరికీ పీవీసీ కార్డులు ఉచితంగా అందజేయనున్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా మొ త్తం కొత్త ఓటర్లు 2,07,407 మంది ఉన్నారు. అయితే జిల్లా ఎన్నికల కార్యాలయానికి వచ్చిన పీవీసీ కార్డులను త్వరలో ఆయా నియోజకవర్గాలకు చేరవేసి బీఎల్ఓల ద్వారా పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, 15-01-2014 కన్నా ముందు ఓటర్ల జాబితాలో నమోదైన వారు కొత్తగా పీవీసీ గుర్తింపు కార్డును మీసేవ కేం ద్రాల నుంచి పొందాల్సి ఉంటుంది. ఇం దు కు సంబంధించి ప్రభుత్వం హెచ్‌సీఎల్, సీఎంఎస్, ఏపీ ఆన్లైన్ సంస్థలతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, పీవీసీ కార్డుల ప్రింటింగ్ కోసం రూ. 47500 లు వె చ్చించి కొందరు మీసేవ నిర్వాహకులు ప్రిం టర్ కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నా రు. ఇదిలా ఉండగా, పీవీసీ కార్డుపై ఫొటో, ఇతర సమాచారం ఉంచకుండా కేవలం ఎన్నికల సంఘం గుర్తింపును కల్పిస్తుండడం గమనార్హం. కాగా, పీవీసీ కార్డుల జారీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు గురువారం హన్మకొండ నక్కలగుట్టలోని ఈ సేవ కేం ద్రంలో లాంఛనంగా ప్రారంభించారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలీసు శాఖ సిద్ధమైంది. తొలి విడత ఈ నెల 6న విజయవాడ రూరల్ మండలం, ఇబ్రహీంపట్నం, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు మండలాల్లోని 149 ఎంపీటీసీ, ఐదు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.ఇందుకోసం 161 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా వాటిలో 67 సమస్యాత్మక, 84 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ జరిగే మండలాల్లో సెక్షన్ 144 విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1,100మందితో బందోబస్తు తొలి విడత ఎన్నికలకు ఇద్దరు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, ఎనిమిది మంది డీఎస్పీలు/ఏసీపీలు, 30 మంది ఇన్స్పెక్టర్లు, 79 మంది ఎస్ఐలు, 61 మంది ఏఎస్ఐ/హెడ్‌కానిస్టేబుళ్లు, 608 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 265మంది హోంగార్డులు, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్‌డ్‌కు చెందిన సాయుధ బలగాల సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారు. ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని గస్తీ కోసం 42 మొబైల్ పార్టీలు, 8 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 15 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను కేటాయించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ(స్టాటిక్ సర్వలెన్స్), ఎంసీసీ(మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్) టీములను ఏర్పాటు చేశారు. 2,167 మందిపై బైండోవర్ కేసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 2,167మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. 276 లెసైన్స్డు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనావళి ఉల్లంఘన కింద 66 కేసులు, మద్యం విక్రయూలకు సంబంధించి 85 కేసులు నమోదు చేశారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర సామగ్రి పంపిణీ కట్టడి చేసేం దుకు కమిషనరేట్ పరిధిలో 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తగిన లెక్కలు చూపని రూ.1.37 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
నేటితో తొలి విడత ప్రచారానికి తెర
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ఈ నెల 6వ తేదీన జరగనున్న తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో తెర పడనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి గత నెల 17న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. 24వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ పూర్తయింది. 25వ తేదీ నుంచే స్థానిక సంస్థల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ప్రచారపర్వం హోరెత్తించారు. జిల్లాలో రెండు విడతలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 6న జరగనున్న తొలి విడత ఎన్నికలకు సంబంధించి కర్నూలు, నంద్యాల డివిజన్లలోని అభ్యర్థులంతా ఈ నెల 4న సాయంత్రం 5 గంటల్లోపు ప్రచారం ముగించాల్సి ఉంది. మలి విడత పోలింగ్ 11వ తేదీన జరగనున్న దృష్ట్యా ఆదోని డివిజన్లోని అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకునే వీలుంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: జెడ్పీ సీఈఓ ఎన్నికల కమిషన్ నిబంధనలను అభ్యర్థులందరు పాటించాలని, ధిక్కరిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అదనపు అధికారి, జెడ్పీ సీఈఓ ఎ.సూర్యప్రకాష్ తెలిపారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో 4వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారాలు జరగరాదన్నారు. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలు, కల్యాణమండపాలు, ఇతరత్రా బహిరంగ ప్రదేశాల్లో ఎన్నికలకు సంబంధించిన సభలు, సమావేశాలు నిర్వహించినా, చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. -
మందు చూపు!
వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : మూకుమ్మడిగా ముంచుకొచ్చిన ఎన్నికల వేళ... జిల్లావ్యాప్తంగా మద్యాన్ని ప్రవహింపజేసేందుకు రాజకీయ నేతలు రంగం సిద్ధం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మద్యం సరఫరాపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది. నిర్దేశించిన మేరకు మించి ఒక్క బాటిల్ ఎక్కువ అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఈ మేరకు నిర్దేశించిన కోటా పూర్తి కావడంతో నగరంతోపాటు డివిజన్ల పరిధిలోని పలు వైన్ షాపులు మూసి ఉంటున్నారుు. అరుుతే... ఇటువంటి పరిస్థితి వస్తుందని ఇదివరకే గ్రహించిన తలపండిన రాజకీయ నాయకులు ముందుచూపుతో వ్యవహరించారు. ప్రొహిబిషన్ అమలు సమయంలో పలువురు ఎక్సైజ్ అధికారుల అండతో విచ్చలవిడిగా మద్యం విక్రయూలు చేస్తూ... లిక్కర్‌డాన్‌గా పేరు గడించిన ఓ వ్యక్తి సహాయంతో దొంగచాటు మందు చూపు! తతంగానికి తెరతీశారు. పక్కా ప్రణాళికతో నగరం, శివారు ప్రాంతాల్లోకి భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ (ఎన్డీపీ) మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేశారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే... జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో 20 లారీల ఎన్డీపీ మద్యం నగరానికి చేరుకున్నట్లు తెలిసింది. లిక్కర్‌డాన్‌గా పేరొందిన ఓ వ్యక్తి సాయంతో దొంగచాటున తీసుకొచ్చి... అత్యంత రహస్య ప్రదేశంలో ఈ సరుకును నిల్వ చేసినట్లు సమాచారం. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఓ కేంద్ర స్థాయి నాయకుడి కనుసన్నల్లో లోడ్ల కొద్దీ చీప్ లిక్కర్‌ను డంప్ చేసినట్లు వినికిడి. సదరు నాయకుడికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగం నడిపిస్తున్నట్లు వినికిడి. చూసీచూడనట్లుగా ఎక్సైజ్ అధికారులు ఓ గోడౌన్లో ఎన్డీపీ మద్యాన్ని నిల్వ ఉంచినట్లు ఎక్సైజ్ అధికారులకు తెలి సినా... చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడికి త లొగ్గి వారు అటువైపుగా వెళ్లడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. అంతేకాదు... పలువురు ఎక్సైజ్ అధికారుల అండదండలతోనే రాజకీయ నాయకులు ఎన్డీపీ మద్యాన్ని దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారుు. ధరలకు రెక్కలు ఎన్నికల సమయం కావడంతో జిల్లావ్యాప్తంగా మద్యానికి డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్నంటారుు. ఏసీబీ దాడులు జరిగిన నాటి నుంచి వ్యాపారులు ఎంఆర్పీ రేట్లకే మద్యం అమ్ముతున్నారు. తాజాగా... ఎన్నికల సాకుతో రేట్లను పెంచారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా రేట్లను పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. భలే గిరాకీ.. జిల్లావ్యాప్తంగా సుమారు 230 వరకు వైన్స్, బార్ షాపులు ఉన్నాయి. వైన్స్ దుకాణాలకు సంబంధించి లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్లు, బార్లకు ఆరు రెట్ల మద్యం (ప్రివిలేజ్) కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రివిలేజ్ మద్యంపై యజమానులకు 20 శాతం లాభం సమకూరుతుంది. ఈ మొత్తం దాటిన తర్వాత వైన్స్, బార్ యజమానులు కొనుగోలు చేసి.. విక్రరుుంచే మద్యంపై ఆరు శాతం మాత్రమే లాభం ఉంటుంది. అరుుతే గత ఏడాది చాలా ప్రాంతాల్లో గిరాకీ లేకపోవడంతో ప్రివిలేజ్ మద్యం సరుకు విక్రరుుంచడమే గగనమైంది. దీంతో ఆ సరుకును పెద్ద షాపులకు తక్కువ పర్సెంటేజీకి అమ్ముకున్నారు. కానీ... ఇప్పుడు పరిస్థితి మారింది. ఎన్నికల రావడంతో మద్యానికి భలే గిరాకీ ఏర్పడింది. -
నేడే పురపోరు
సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది....కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిరలలో ఆదివారం పోలింగ్ జరగనుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 97 వార్డుల్లో 143 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలు జరిగే రెండుమున్సిపాలిటీలు, రెండు నగరపంచాయతీలలో మొత్తం 97 వార్డుల్లో 523 మంది బరిలో నిలవడంతో అన్నిచోట్ల పోటీ తీవ్రంగానే ఉంది. నాలుగు చోట్ల 1,35,235 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 66,176 మంది, మహిళలు 69,053 మంది ఉన్నారు. కొత్తగూడెంలో అధికంగా 61,266 మంది, మధిరలో తక్కువగా 20,367 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగూడెంలో 33 వార్డులకు 190 మంది, ఇల్లెందులో 24 వార్డులకు 173 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఇక్కడ గెలుపును అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి 166 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తరలించిన ఈవీఎంలు మొరాయిస్తే ప్రత్యామ్నాయంగా మరికొన్ని ఈవీఎంలను అందుబాటులో ఉంచుతూ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిఘా నీడలో.. పోలీస్ భారీ బందోబస్తు నడుమ ఈ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు గతంలో కన్నా ఈసారి భద్రతను పెంచారు. నాలుగు కేంద్రాల్లో మొత్తం 108 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు పోలీస్, రెవెన్యూ అధికారులు గుర్తించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో అన్నీ సమస్యాత్మక ప్రాంతాలే. వీటిలో 34 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అలాగే ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో 17 పోలింగ్ కేంద్రాలు, మధిర నగర పంచాయతీ పరిధిలో 8, సత్తుపల్లి నగర పంచాయతీలో 17 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి కట్టుదిట్టంగా భద్రతను నిర్వహిస్తున్నారు. 53 కేంద్రాల్లో వెబ్, వీడియోగ్రఫీ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. 41 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఎన్నికలు జరగనున్నాయి. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. పోలింగ్ ప్రక్రియలో 796 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా శనివారమే ఆయా మున్సిపాలిటీల పరిధిలో రిపోర్టు చేశారు. అలాగే పోలీస్ సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఓటరు తీర్పుపైనే ఆశలు.. వరుస ఎన్నికల నేపథ్యంలో ముందుగా జరుగుతున్న మున్సిపల్ తీర్పుపై రాజకీయపార్టీలన్నీ ఆశలుపెట్టుకున్నాయి. అభ్యర్థులు సైతం విజయం కోసం చివరి క్షణం వరకూ అన్ని యత్నాలూ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గీత దాటకుండా.. పోలింగ్ కేంద్రానికి దూరంలో అభ్యర్థుల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ‘గుర్తు.. గుర్తుంచుకోండి..’ అంటూ చివరి అస్త్రాన్ని ఉపయోగించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఈ ఎన్నికల రణ రంగంలో ఓటరన్న చివరకు ఎవరికి పట్టం కడతారో ఫలితాల తర్వాతే తేలనుంది. -
రెండు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ తేదీలు దాదాపు ఖరారయ్యాయి. జిల్లాలో రెండు విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించాలని యంత్రాంగం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తేదీలు ఖరారుచేసి నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం ఆకస్మికంగా 22 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. దీంతో ఈ రెండు ఎన్నికలు సజావుగా నిర్వహించాలనే ఉద్దేశంతో యంత్రాంగం కొన్ని మార్పులు చేపట్టింది. ఏప్రిల్ 6న తొలివిడత ఎన్నికల్లో భాగంగా వికారాబాద్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్లలోని 15 మండలాలు, అదేవిధంగా ఏప్రిల్ 11న రెండో విడతలో సరూర్‌నగర్, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని 17 మండలాల్లోని ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. ఈ వివరాలను ఎన్నికల సంఘానికి నివేదించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఫలితాలు మాత్రం సార్వత్రిక ఎన్నికల తర్వాతే ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో ప్రాదేశిక ఎన్నికలు పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులను సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లో భద్రపర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఈసీకి హైకోర్టు నోటీసు
టీనగర్, న్యూస్‌లైన్: ఎన్నికల చిహ్నం కోరుతూ మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం దాఖలు చేసిన కేసుకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు పంపింది. మద్రాసు హైకోర్టులో మనిదనేయ మక్కల్ కట్చి అధ్యక్షుడు జేఎస్ రిపాయి దాఖలు చేసిన పిటిషన్లో ఈ విధంగా తెలిపారు. భారత ఎన్నికల కమిషన్‌లో తమ పార్టీ 2009లో నమోదైందని ఆనాటి నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్ 24న జరగనున్నాయని ఈ ఎన్నికలలో డీఎంకే, వీసీకే పార్టీలతో తమ పార్టీ కూటమి ఏర్పాటు చేసుకుని మైలాడుదురై పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తోందన్నారు. ఈ నియోజకవర్గంలో తమ పార్టీ తరపున సీనియర్ నేత ఎస్ హైదర్ అలీ పోటీ చేస్తున్నట్టు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి కొవ్వొత్తి చిహ్నం కేటాయించారన్నారు. అందువల్ల జరగనున్న పార్లమెంటు ఎన్నికలల్లోనూ అదే చిహ్నాన్ని కేటాయించాలంటూ భారత ఎన్నికల కమిషన్‌కు గత 17వ తేదీ విజ్ఞప్తి చేసింది. ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందువల్ల తమ పార్టీకి కొవ్వొత్తి చిహ్నం కేటాయించాలని ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు ఎన్.పాల్ వసంతకుమార్, ఎం.సత్యనారాయణన్ ఎదుట శుక్రవారం విచారణకు వచ్చింది. విచారణ జరిపిన న్యాయమూర్తులు ఈ పిటిషన్‌కు వచ్చే ఏప్రిల్ 1వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలంటూ భారత ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే తెన్కాశి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పుదియ తమిళగం పార్టీకి టెలివిజన్ చిహ్నం కేటాయించాలంటూ ఆ పార్టీ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు పాల్ వసంతకుమార్, సత్యనారాయణన్, ఏప్రిల్ 1వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలంటూ భారత ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు ఇచ్చారు. -
కరెంటు ‘షాక్’
న్యూఢిల్లీ: కరెంటు చార్జీలు పెంచడానికి అనుమతించాలని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) ఎన్నికల సంఘానికి (ఈసీ) విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. టారిఫ్ ఖరారు చేసే ముందు బహిరంగ నోటీసులు జారీ చేసే ప్రక్రియకు దాదాపు నెల రోజులు పడుతుంది కాబట్టే ముందస్తుగా అనుమతి కోరుతున్నట్టు వివరణ ఇచ్చింది. భారీ నష్టాల కారణంగా జాతీయ గ్రిడ్, ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు కొనుగోలు సాధ్యం కావడం లేదని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సి ల్ (ఎన్డీఎంసీ), విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) డీఈఆర్సీకి మొరపెట్టుకున్నాయి. కాబట్టి చార్జీలను పెంచాలని కోరాయి. డిస్కమ్‌లు ఖాతాలను తారుమారు చేసి కృత్రిమ నష్టాలను చూపిస్తున్నట్టు ఆరోపణలు ఉండడంతో, వాటి ఖాతాలకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిటింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చార్జీలను 60 శాతం దాకా పెంచాలని అవి ప్రభుత్వాన్ని కోరుతుండడం విశేషం. ఒక్కో యూనిట్‌కు సగటున రూ.నాలుగు చొప్పున పెంచాలని ఇవి డీఈఆర్సీకి విజ్ఞప్తి చేశాయి. కొత్త టారిఫ్ ఖరారైతే ఇది జూన్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది. నిబంధనల ప్రకారం చార్జీల పెంపుపై అభ్యంతరాలు/సలహాలు/అభిప్రాయాలు కోరుతూ సంబంధిత సంస్థలు, వ్యక్తులు, ప్రజలను డీఈఆర్సీ సంప్రదిం చాల్సి ఉంటుంది. ఇందుకు నోటీసులు జారీ చేయడంతోపాటు బహిరంగ సమావేశాలూ నిర్వహిస్తుంది. వీటిలో ప్రజలు సగటు రాబడి అవసరాల (ఏఆర్ఆర్) దరఖాస్తులపై అభిప్రాయాలు, సలహా లు, సూచనలు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగానూ తెలియజేయవచ్చు. వీటన్నింటినీ పరిశీలించాక డీఈఆర్సీ 2014-2015 ఆర్థిక సంవత్సరానికి కరెంటు టారిఫ్‌ను ఖరారు చేస్తుందని సంస్థ ఎన్నికల సంఘానికి పంపిన లేఖలో వివరించింది. మే 16న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాకే కొత్త టారిఫ్‌ను అమలు చేస్తామని సంస్థ ప్రధాన నోడల్ అధికారి అంకుర్ గార్గ్ ఈసీకి వివరణ ఇచ్చారు. భారీగా పెంపు కోరుతున్న డిస్కమ్‌లు రాబోయే ఆర్థిక సంవత్సరంలో తనకు రూ.9,361 కోట్ల ఆదాయం (ఏఆర్ఆర్) అవసరమని రిలయ న్స్ అధీనంలో డిస్కమ్ బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ (బీఆర్‌పీఎల్) డీఈఆర్సీకి సమర్పించిన పిటిషన్లో పేర్కొంది. తనకు రూ.5,527 కోట్ల ఆదాయం కావాలని బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ (బీవైపీల్) కోరింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి తనకు రూ.6,079 కోట్ల నిధులు కావాలని టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్) డీఈఆర్సీకి విన్నవించింది. డిస్కమ్‌లు చూపిస్తున్న ఈ నష్టాలను డీఈఆర్సీ అంగీకరించి టారిఫ్ ఖరారు చేస్తే చార్జీలు ఆకాశాన్నంటే అవకాశాలున్నాయి. వినియోగాన్ని బట్టి ఫిక్స్డ్ చార్జీలను 60 శాతం వరకు పెంచాలని, ఇంధన చార్జీలను గరిష్టంగా 18 శాతం దాకా పెంచాలని ఎన్డీఎమ్సీ కోరింది. ప్రతి నెలా 200 యూనిట్ల దాకా వాడుకునే వాళ్లకు యూనిట్‌కు రూ.3.90 చొప్పున, 2001- 400 యూనిట్ల వరకు రూ.ఐదు చొప్పున, 401-800 యూనిట్ల వరకు రూ.6.20 చొప్పున, 800 యూనిట్లు దాటితే రూ.తొమ్మిది చొప్పున పెంచాలని ఎన్డీఎమ్సీ డీఈఆర్సీని కోరిం ది. ఇదిలా ఉంటే ఆదాయాల పెంపులో భాగంగా టైం ఆఫ్ ద డే (టీఓడీ) ప్రతిపాదనను కూడా డిస్కమ్‌లు ముందుకు తెచ్చాయి. ఈ ప్రతిపాదనల ప్రకా రం... విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే సమయంలో కరెంటు చార్జీలను ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తారు. అదే వినియోగం తక్కువగా ఉండే సమయంలో బిల్లులను కాస్త తగ్గిస్తారు. ఇక వినియోగం సాధారణంగా ఉండే సమయంలో అప్పటి వాతావరణానికి అనుకూలంగా రేట్లను నిర్ణయిస్తారు. దీని వల్ల అంతిమంగాా వినియోగదారుడే నష్టపోతాడనే వాదనలు ఉన్నాయి. -
పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెల 10న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భద్రత కోసం ఎన్నికల కమిషన్ గట్టి చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాల్లో భద్రత కోసం ఈ సంస్థ అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీలు, వెబ్ కెమెరాలను అమర్చడంతోపాటు పారామిలిటరీ బలగాలను అదనంగా మోహరిస్తారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సంఖ్య తగ్గిందని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. ఇవి ఎక్కువగా గ్రామీణ, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, అనధికార కాలనీలు, ముస్లిం ప్రాబల్య ప్రాంతా ల్లో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల కోసం ఢిల్లీలో 2,527 పోలింగ్ కేంద్రాల్లో 11,763 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ చెప్పారు. పోలీసులు, ఎన్నికల అధికారులు అందించిన సూచనల మేరకు ఢిల్లీలో 317 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా, 90 పోలింగ్ కేంద్రామని అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించామని ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా భద్రత కోసం 31 వేల మంది ఢిల్లీ పోలీసులను, నాలుగు వేల మంది హోంగార్డులను, 40 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరిస్తారు. వీరిలో ఎక్కువమందిని సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మోహరిస్తారు. భద్రతా సిబ్బందితోపాటు 93 వేల మంది ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల విధుల్లో మోహరిస్తారు. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీల కోసం 88 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఢిల్లీలోకి అక్రమంగా మద్యం, ఆయుధాలు, నల్లధనం ప్రవేశాన్ని నిలువరించడానికి ఈ చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ఇవిగాక ఢిల్లీలో 491 చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు జరుగుతున్నాయి. ప్రతి పోలీసు స్టేషన్లో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను సిద్ధంగా ఉంచారు. ఢిల్లీలో మొత్తం 161 ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహిస్తాయి. -
ఎన్నికల వేళ.. ఏరులై పారుతోంది!
విజయనగరం రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో వరుస ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వారం రోజులకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కోడ్ అమల్లోకి వచ్చింది. మద్యం అనధికార అమ్మకాలు జోరు.. ఏ ఎన్నికలు వచ్చినా.. మందుబాబులకు పండగే. అలాంటిది మూడు ప్రధాన ఎన్నికలు ఒకేసారి వస్తే... వారి జీవితం మూడు ఫుళ్లు.. ఆరు క్వార్టర్ల లెక్కన సాగిపోయినట్లే. ప్రస్తుతం మందుబాబుల పరిస్థితి అలానే ఉంది. ఎన్నికల పుణ్యమాని జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. ఇదే సందర్భంలో బెల్టుషాపుల ద్వారా అనధికార అమ్మకాలు పెరిగాయి. నాటుసారా కూడా విరివిగా లభిస్తోంది. అబ్కారీశాఖ అధికారులు, పోలీసులు నిత్యం దాడులు చేస్తున్నా.. అక్రమ మద్య ప్రవాహం మాత్రం ఆగడం లేదు. దాబాల్లోనూ, రెస్టారెంట్లలోనూ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. లెసైన్స్ దుకాణాల్లో సైతం చిల్లర అమ్మకాలు సాగిపోతున్నాయి. ఇక కల్తీ సారా ప్రవాహానికి అడ్డుకట్టే లేకపోతోంది. ఈ నెల మూడో తేదీన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు 516 కేసులు నమోదు చేశారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 237 మందిని అరెస్టు చేసి, రెండు వాహనాలను సీజ్ చేశారు.జిల్లా వ్యాప్తంగా సారా నిల్వలు ఉంచిన 149 మందిపై ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేశారు. 56 మందిని అరెస్టు చేశారు. 1,470 లీటర్ల సారాయిని సీజ్ చేశారు. 56,050 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారాయిని సరఫరా చేస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. నల్లబెల్లం కేసు ఒకటి నమోదు చేశారు. 1,460 కేజీల నల్లబెల్లాన్ని సీజ్ చేశారు.94 కల్లు నమూనాలను సేకరించి, ల్యాబ్‌లకు పంపారు.అనధికార బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్న 160 మందిని అరెస్టు చేశారు. బెల్టు దుకాణాల నుంచి 532.67 లీటర్ల మద్యాన్ని, 129.53 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు.నిబంధనలు పాటించని 14 లెసైన్సు రెస్టారెంట్లు, మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేశారు. 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎంఆర్పీ ఉల్లంఘన కేసులు ఎనిమిది, నిర్ణీత సమయం కంటే అదనంగా అమ్మకాలు చేస్తున్న ఐదు దుకాణాలపై కేసులు నమోదు చేశారు.గంజాయి అక్రమ రవాణా కేసులు మూడు నమోదు చేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. 34.900 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.102 మందిపై మండల తహశీల్దార్ల సమక్షంలో బైండోవర్ కేసులు నమోదు చేశారు. -
‘గుర్తింపు’ లేకున్నా ఓటు వేయవచ్చు
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: ఓటు ఉన్న వారిందరూ ఓటు హక్కును సక్రమంగా ఉపయోగించుకునేలా ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ, ఏప్రిల్ లో జరగనున్న పరిషత్ ఎన్నికలు, మే నెల ఏడో తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల సంఘం మంజూరు చేసిన ఓటు గుర్తింపు కార్డు లేక పోయినా ఓటరు జాబితాలో పేరు ఉంటే వారందరూ ఓటు వేసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా 13 గుర్తింపు కార్డులను ఎంపిక చేసి ఏ ఒక్కటి ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని.. ఈ మేరకు ఓటర్లకు చైతన్యం కల్గించమని ఆదేశించింది. దీంతో ఓటు ఉండీ గుర్తింపు కార్డు లేకపోతే ఓటర్లు ఆందోళన చెందనవసరం లేదు. ఈ కారణంతో ఓటు హక్కు వినియోగించుకోలేమని నిరాశ పడాల్సిన అవసరం లేదు. జాబితాలో ఓటు హక్కు ఉంటే చాలు. ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ప్రకటించిన 13 కార్డుల్లో ఏ ఒకటి ఉన్నా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవచ్చు. -
సరుకు నిండుకుంటోంది..
ఎన్నికల వేళ నో స్టాక్ ఎలక్షన్ కమిషన్ ఆంక్షలతోమద్యం వ్యాపారుల కుదేలు మందుబాబులు డీలా విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఎన్నికల సీజన్లో మద్యం పరవళ్లు తొక్కుతుంది. ఏ పార్టీ నేతల వెనక తిరిగినా సాయంత్రమయ్యే సరికి ఓ క్వార్టర్ మద్యం దొరుకుతుందన్న గ్యారంటీ ఉన్న కాలం ఇది. కానీ తాజాగా ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షలు మద్యం కొరతను సృష్టిస్తున్నాయి. మద్యం బాటిళ్లను ఎడా పెడా అమ్ముకోమంటూ మొన్నటి వరకూ మద్యం దుకాణాల యజమానుల చుట్టూ తిరిగే ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు ప్రతి చుక్కనీ లెక్క కట్టి కొత్త సరుకు ఇచ్చేది లేదంటున్నారు. రెండు మూడు మాసాలుగా ఇచ్చిన స్టాక్ అమ్మకాల వివరాలు తెలియజేయకుండా కొత్త స్టాక్‌కు వస్తే ఊరుకోమని మద్యం లెసైన్స్ హోల్డర్లను హెచ్చరిస్తున్నారు. జిల్లాలో పలు మద్యం దుకాణాల్లో కొరత ఏర్పడింది. ఎన్నికల వేళ ఫుల్లుగా బేరాలున్న ఈ సీజన్లో సరుకు లేదంటూ మందుబాబులకు చెప్పడంతో మద్యం వ్యాపారులు తెగ బాధపడిపోతున్నారు. కళ్లెదుటే రూ. లక్షల వ్యాపారం సరుకు లేని కారణంగా నిలిచిపోతుండడంతో మద్యం వ్యాపారులు తట్టుకోలేకపోతున్నారు. ఒక పక్క మద్యం ప్రియులు కూడా నిరాశ చెందుతున్నారు. ఇప్పటి వరకూ మద్యం సిండికేట్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఎక్సైజ్ అధికారులు ప్రస్తుత పరిస్థితిల్లో తామేమీ చేయలేమంటూ ఎన్నికల కోడ్‌ను చూపించి తప్పించుకుంటున్నారు. అధికారులు ససేమిరా అనకాపల్లి ఎక్సైజ్ యూనిట్ పరిధిలో 166 మద్యం దుకాణాలుంటే అందులో 13 దుకాణాల్లో లిక్కర్ బ్యాలెన్స్ జీరోకొచ్చేసింది. వారంతా గత వారం రోజులుగా ఎక్సైజ్ శాఖ కార్యాలయం చుట్టూ తిరిగి కొత్త సరుకు ఇవ్వాలంటూ ప్రాథేయపడ్డా అందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. పలువురు దుకాణాలను దాదాపుగా మూసుకున్నారని ఎక్సైజ్ శాఖ నిర్థారించింది. -మరో 22 దుకాణాలకు కొత్తగా స్టాక్ ఇవ్వలేమని ప్రకటించేశారు. ఒక్క రోజుకే స్టాక్ ఉన్న మద్యం దుకాణాలు 14 ఉండగా, రెండు రోజులకు సరిపడే మద్యం ఉన్న దుకాణాలు 13 ఉన్నాయి. మూడు రోజులకు సరిపడే మద్యం ఉన్న దుకాణాలు 25 వరకూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 5 రోజుల వరకూ స్టాక్ వుండొచ్చు యలమంచిలి, చోడవరం, పాడేరు, అనకాపల్లి, మాడుగుల వంటి ప్రాంతాల్లో వున్న మద్యం దుకాణాల్లో సరుకు నిండుకుంది. -
నువ్వా.. నేనా..?
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలోని 57 జెడ్పీటీసీ స్థానాలకు 366 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మొత్తం 57 స్థానాలకు పోటీ చేస్తుండగా, పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీ సగం స్థానాలకే పరిమితమయ్యాయి. తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి దింపింది. టీడీపీ 28 స్థానాల్లో, బీజేపీ 22 స్థానాల్లో పొత్తులో భాగంగా పోటీచేస్తుండగా, మరో ఏడు స్థానాల్లో స్నేహపూర్వకంగా తలపడుతున్నాయి. సీపీఐ 11 స్థానాల్లో పోటీలో ఉండగా, సీపీఎం ఐదు స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటోంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అన్ని స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో, మహిళల స్థానాలపై రెండు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. చైర్పర్సన్ హోదాకు తగిన విధంగా ఆయా స్థానాల నుంచి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. జెడ్పీ పీఠం దక్కాలంటే కనీసం 29 స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా కాంగ్రెస్, టీఆర్ఎస్లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జెడ్పీ పీఠాన్ని దక్కించుకొనేంతగా కాకున్నా, చైర్పర్సన్ ఎన్నికల్లో కీలకం కావాల్సిన సీట్లైనా సొంతం చేసుకోవాలని ఇతర పార్టీలు ఆరాటపడుతున్నాయి. వైదొలిగిన శారద జెడ్పీ చైర్పర్సన్ రేసులో ఉంటున్నట్టు ప్రచారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ కార్యదర్శి నేరెళ్ల శారద రామడుగు నుంచి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పార్టీ టికెట్ కోసం ఢిల్లీ వరకు ప్రయత్నాలు చేసినప్పటికి ఆమెకు ఫలితం లేకపోయింది. కోల మంజులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో, ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఖరారు కాని పోలింగ్ తేదీలు : గందరగోళంలో అభ్యర్థులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై ఎన్నికల సంఘం ఎటూ తేల్చకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. ముందుగా ఎన్నికలను ఏప్రిల్ 6వ తేదీన నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం, ఆ తరువాత 6, 8 తేదీల్లో రెండు విడుతలుగా నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. మొదటి, రెండవ విడతల వివరాలను వెల్లడిస్తామని చెప్పినప్పటికి, ఇప్పటివరకు ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు ప్రచారపత్రాల్లో ఏ పోలింగ్ తేదీ వేయాలో తెలియక తికమకపడుతున్నారు. -
సంయమనం కోల్పోవద్దు
సాక్షి, కాకినాడ : రాష్ట్రంలో 40 రోజుల వ్యవధిలో వరుస ఎన్నికలు వచ్చాయని, విధుల్లో పాల్గొనే ఉద్యోగులు సంయమనం కోల్పోకుండా ఈ యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లాకు ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన బి.రామాంజనేయులు, సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కోర్టుహాలులో ఎన్నికలకు నియమితులైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. ఒకే లొకేషన్లో రెండు పోలింగ్స్టేషన్లు ఉంటే, ఓటర్లు ఇబ్బంది పడకుండా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని అంశాలు శిక్షణల్లో తెలుసుకున్నందున ఎవరి పనుల్లో వారు నిమగ్నమవ్వాలన్నారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో పోలీసు శాఖ చేపట్టిన కార్యాచరణ ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. రాజమండ్రి అర్బన్ ఎస్పీ మూర్తి మాట్లాడుతూ నగరంలో 30 లొకేషన్లు హైపర్సెన్సిటివ్గాను, 35 లొకేషన్లు సెన్సిటివ్గాను గుర్తించామన్నారు. ఎక్కడికక్కడ నిబంధనల మేరకు సాయుధ సిబ్బందిని నియమించామన్నారు. నగరంలో తొమ్మిడి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, 600 మందిని బైండోవర్ చేశామన్నారు. 139 ఆయుధ లెసైన్సులకు గాను 93 ఉపసంహరించుకున్నామని, 46 రక్షణ కార్యకలాపాల్లో ఉండగా, రెండు కమిషన్ అనుమతిలో ఉన్నాయన్నారు. మిగిలిన వాటి ఉపసంహరణకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ వివిధ మున్సిపాలిటీలో 290 పోలింగ్ కేంద్రాల్లో 12 హైపర్ సెన్సిటివ్ ఉన్నాయన్నారు. 23 స్ట్రైకింగ్ టీమ్‌లు, 10 స్పెషల్ స్ట్రైకింగ్ టీమ్‌లు నియమించి, 30 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వివరించారు. అంతర్గత శాఖల సమన్వయంతో 13, తొమ్మిది ఎక్సైజ్ చెక్‌పోస్టులు ఉండగా, 402 ఆయుధాలను సరెండర్ చేసుకున్నామన్నారు. 3,700 మందిని బైండోవర్ చేశామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ ఓటర్ స్లిప్‌ల ముద్రణ కొనసాగుతోందన్నారు. ఈ నెల 22 నుంచి ఓటర్ స్లిప్‌లో మున్సిపల్ స్థాయిలో బూత్‌లెవెల్ అధికారులతో పంపిణీ చేయిస్తామన్నారు. 26వ తేదీకల్లా ఈవీఎంలు సిద్ధం చేస్తామన్నారు. ఇంతవరకు చెక్‌పోస్టుల తనిఖీ ద్వారా రూ.91 లక్షల విలువైన నగదు, ఇతర సామగ్రి సీజ్ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు చర్యలు చేపడుతున్నామన్నారు. వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు వచ్చినప్పుడు క్యూలైన్లో ఉంచకుండా లోపలికి వెంటనే అనుమతించాలని ఆర్ఓలను ఆదేశించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు అందాయని వివరించారు. ర్యాంపులు లేని చోట్ల తాత్కాలికంగానైనా ఏర్పాటు చేసి వికలాంగులకు సహకరించాలన్నారు. ఈవీఎంల తనిఖీ రానున్న మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లాకు చేరుకున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కలెక్టర్ నీతూ ప్రసాద్ పరిశీలించారు. నడకుదురు మార్కెటింగ్ గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంలను శుక్రవారం రాత్రి మొదటిస్థాయి చెకింగ్‌లో భాగంగా కలెక్టర్ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలను భద్రపరిచే అంశంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. ఏజేసీ డి.మార్కండేయులు, సహాయ కలెక్టర్ ఆర్వీ కన్నన్, ఆర్డీఓ బీఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. -
శతశాతం పోలింగ్‌కు కృషి
విజయనగరం కలెక్టరేట్,న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్యంలోవిలువైన ఓటు హక్కును ప్రతి పౌరుడూ వినియోగించుకునే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. రాజకీయాలపై విసుగు చెంది కొందరు..మనకెందుకు లే అని నిర్లిప్తతతో మరికొందరు ఎన్నికల సమయంలో ఓటుహక్కు వినియోగించుకోని విషయం విదితమే. అయితే ప్రతి సారీ ఓటుహక్కు వినియోగించుకోని వారి శాతం పెరుగుతుండడంతో అటువంటి వారికి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించాలని ఎన్నికల కమిషన్ దృష్టిసారించింది. దీనిలోభాగంగా ఓటుహక్కు కలిగిన ప్రతి పౌరుడు ఆ హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు రూపొందిం చాలని అధికారులను ఆదేశించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి జిల్లా, డివిజన్, మండలస్థాయిల్లో ప్ర త్యేక కమిటీలు రూపొందించారు. ఈ కమిటీలకు పలు శాఖలకు చెందిన అధికారులను భాగస్వాములను చేశారు. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్... శతశాతం ఓటింగ్ కోసం ఏర్పాటైన(స్వీప్) కమిటీ చైర్మన్‌గా కలెక్టర్ కాంతిలాల్ దండే వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్బి.రామారావు,నోడల్ అదికారిగా స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్ ఎస్.వి.లక్ష్మణమూర్తి నియామకమయ్యారు. మొత్తం పర్యవేక్షణ బాధ్యతలను ఈయన చూస్తారు. అలాగే విజయనగరం డివిజన్లో ఆర్డీఓ జె.వెంకటరావు,పార్వతీపురం డివిజన్‌కు సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి నియమితులయ్యారు. గిరిజన ప్రాంతా ల్లో కమిటీల పర్యవేక్షణ బాధ్యతలను ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్ సైనీ చూస్తారు. నియోజకవర్గస్థాయిలో రిట ర్నింగ్ అధికారులు, మండలస్థాయిలో తహశీల్దార్లు, ఎంపీడీఓలు బాధ్యతలు స్వీకరిస్తారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 34 మండలాల పరిధిలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఉన్న 16,86,017 మందిఓటర్లు ఓటు హక్కు ను వినియోగించుకునే విధంగా ప్రచారకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం గ్రామాల్లో, విద్యాసంస్థల్లో, కర్మాగారాలు ఉన్న ప్రదేశాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. కమిటీలు గురు వారం నుంచే తమ కార్యక్రమాలను అమలు చేశాయి. -
వ్యయంపై నిఘా నేత్రం
ఇదే తొలిసారి.. పెద్ద ఎత్తున పర్యవేక్షకులు ప్రత్యేక కమిటీలు.. విస్తృత స్థాయిలో వీడియో రికార్డింగ్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ఇదే తొలిసారిగా అభ్యర్థుల వ్యయంపై ఎన్నికల కమిషన్ అపూర్వ స్థాయిలో పర్యవేక్షణ చేస్తోంది. అడుగడుగునా నిఘా పెట్టి, అభ్యర్థులు చేపట్టే ప్రతి ఖర్చును లెక్కించి, వారు ఉల్లంఘనలకు పాల్పడ్డారేమో నిర్ణయించనుంది. తొలిసారిగా అభ్యర్థుల ఖర్చులను పర్యవేక్షించడానికి అధికారులు పర్యవేక్షకులను రంగంలోకి దించుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ రెండు, మూడు సెగ్మెంట్లకు ఒక ఎన్నికల వ్యయ పర్యవేక్షకుడిని వేయనున్నారు. అలాగే ప్రతీ ఒక్క నియోజకవర్గానికి సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకుడిని నియమించనున్నారు. వీరితో పాటు వీడియో సర్వైలెన్స్ టీమ్‌ను పెట్టనున్నారు. ఇందులో ఒక అధికారి, వీడియోగ్రాఫర్ ఉంటారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఈ నెల 12న నోటిఫికేషన్ వచ్చే వరకు అభ్యర్థులు చేసే ప్రతీ ఖర్చును పార్టీల ఖర్చుగా పరిగణిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి వారు చేసే ఖర్చులను అభ్యర్థులకు సంబంధించినవిగా గుర్తిస్తారు. అభ్యర్థులు నిర్వహించే సమావేశాలు, ర్యాలీలు, ఇతరత్రా కార్యక్రమాలను ఈ టీమ్‌లు రికార్డ్ చేస్తాయి. ముందుగా ఆయా రాజకీయ కార్యక్రమాలను రికార్డు చేస్తున్నట్లు మైక్‌లో ప్రకటించి అనంతరం ర్యాలీ లేదా సమావేశాల్లో ఏయే సామాగ్రి ఉపయోగించారు, ఎన్ని వాహనాలు, క్యాప్‌లు, జెండాలు, మైక్‌లు ఇలా ప్రతీ అంశాన్ని రికార్డు చేయనున్నాయి. రికార్డు చేసిన విషయాలను వీడియో వ్యూయింగ్ బృందం పరిశీలిస్తుంది. ప్రచార సామాగ్రికి సంబంధించి ప్రతీ దానికి ఒక ధరను ముందుగానే నిర్ధారించే రేటు చార్టును రూపొందించారు. దాని ప్రకారం అభ్యర్థులు వినియోగించే వాటికి లెక్కలు కడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉన్న ‘క్యూ’ షీట్ అనే ఒక ఫార్మాట్‌ను తయారు చేశారు. ఒక్కో అభ్యర్థికి సంబంధించిన ఖర్చులను, ప్రచారాల్లో వినియోగించే సామాగ్రి వివరాలను ఈ క్యూషీట్లో పొందుపరుస్తారు. ఆ క్యూ షీట్ పరిశీలనకు అకౌంటింగ్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీమ్ ఒక్కో అభ్యర్థికి సంబంధించి షాడో ఎక్స్పెండిచర్ రిజిస్టర్‌ను నిర్వహిస్తుంది. అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలను అధికారులకు తప్పుగా సమర్పిస్తే.. ఈ క్యూ షీట్ ద్వారా ఎంత ఖర్చు చేశారో అధికారులు గుర్తించి వారిపై ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమిస్తారు. -
ఇక.. డబుల్ ఓట్లకు చెక్
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: ఒక వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉంటే ఎన్నికల అధికారులు వాటిని తొలగిస్తున్నారు. డబుల్ ఓట్ల తొలగింపును ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేసి ఎన్నికల కమిషన్‌కు వాస్తవ నివేదికను పంపేందుకు ఎన్నికల విభాగం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉన్న అభ్యర్థులకు ఎక్కడ ఓటు ఉండాలో, ఎక్కడ తొల గించాలో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తున్నారు. కొందరు బూత్‌స్థాయి అధికారులు నోటీసులు జారీ చేయకుండానే రెండు ఓట్లనూ తొలగిస్తున్నారు. తొలగింపు ఇలా... ఒక వ్యక్తి ఏ జిల్లాలోనైనా రెండు ఓట్లు ఉండి.. ఎన్నికల అధికారులు ఇంటింటి సర్వేకు వెళ్లినప్పుడు ఆ అభ్యర్థి ఇంటివద్ద లేకుంటే ఆ ప్రాంతంలో ఉన్న ఓటు తొలగిస్తారు. మరోప్రాంతంలో ఉన్న ఓటు కూడా ఇంటి పక్కవారిని విచారించి తొలగిస్తారు. దీనితో రెండు ప్రాంతాల్లో కూడా ఓటు రద్దయ్యే అవకాశముంది. ఒకరికి రెండుచోట్ల ఓట్లు ఉన్నట్లు కంప్యూటర్లో స్పష్టంగా కనిపిస్తుంది. రెండు ఓట్లు ఉన్న అభ్యర్థుల జాబితా కంప్యూటర్లో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జాబితాను ప్రింట్‌తీసి అందులో అడ్రస్ ప్రకారం బీఎల్ఓలు విచారించి ఓటు తొల గిస్తారు. ఇతర నియోజకవర్గం, జిల్లాలో డబుల్ ఓటు ఉంటే స్పష్టంగా తెలియడంతో డబుల్ ఓట్ల తొల గింపు సులభంగా ఉంది. గతంలో కంప్యూటరీకరణ లేనప్పుడు ఒక వ్యక్తికి ఇతర ప్రాంతాల్లో ఎన్నో ఓట్లు ఉన్నా తెలిసేవి కావు. జనవరి నాటికి జిల్లాలో డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయో తెలిసే అవకాశముంది.