
సరుకు నిండుకుంటోంది..
- ఎన్నికల వేళ నో స్టాక్
- ఎలక్షన్ కమిషన్ ఆంక్షలతోమద్యం వ్యాపారుల కుదేలు
- మందుబాబులు డీలా
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఎన్నికల సీజన్‌లో మద్యం పరవళ్లు తొక్కుతుంది. ఏ పార్టీ నేతల వెనక తిరిగినా సాయంత్రమయ్యే సరికి ఓ క్వార్టర్ మద్యం దొరుకుతుందన్న గ్యారంటీ ఉన్న కాలం ఇది. కానీ తాజాగా ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షలు మద్యం కొరతను సృష్టిస్తున్నాయి. మద్యం బాటిళ్లను ఎడా పెడా అమ్ముకోమంటూ మొన్నటి వరకూ మద్యం దుకాణాల యజమానుల చుట్టూ తిరిగే ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు ప్రతి చుక్కనీ లెక్క కట్టి కొత్త సరుకు ఇచ్చేది లేదంటున్నారు.
రెండు మూడు మాసాలుగా ఇచ్చిన స్టాక్ అమ్మకాల వివరాలు తెలియజేయకుండా కొత్త స్టాక్‌కు వస్తే ఊరుకోమని మద్యం లెసైన్స్ హోల్డర్లను హెచ్చరిస్తున్నారు. జిల్లాలో పలు మద్యం దుకాణాల్లో కొరత ఏర్పడింది. ఎన్నికల వేళ ఫుల్లుగా బేరాలున్న ఈ సీజన్‌లో సరుకు లేదంటూ మందుబాబులకు చెప్పడంతో మద్యం వ్యాపారులు తెగ బాధపడిపోతున్నారు.
కళ్లెదుటే రూ. లక్షల వ్యాపారం సరుకు లేని కారణంగా నిలిచిపోతుండడంతో మద్యం వ్యాపారులు తట్టుకోలేకపోతున్నారు. ఒక పక్క మద్యం ప్రియులు కూడా నిరాశ చెందుతున్నారు. ఇప్పటి వరకూ మద్యం సిండికేట్‌లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఎక్సైజ్ అధికారులు ప్రస్తుత పరిస్థితిల్లో తామేమీ చేయలేమంటూ ఎన్నికల కోడ్‌ను చూపించి తప్పించుకుంటున్నారు.
అధికారులు ససేమిరా
అనకాపల్లి ఎక్సైజ్ యూనిట్ పరిధిలో 166 మద్యం దుకాణాలుంటే అందులో 13 దుకాణాల్లో లిక్కర్ బ్యాలెన్స్ జీరోకొచ్చేసింది. వారంతా గత వారం రోజులుగా ఎక్సైజ్ శాఖ కార్యాలయం చుట్టూ తిరిగి కొత్త సరుకు ఇవ్వాలంటూ ప్రాథేయపడ్డా అందుకు అధికారులు ససేమిరా అంటున్నారు.
పలువురు దుకాణాలను దాదాపుగా మూసుకున్నారని ఎక్సైజ్ శాఖ నిర్థారించింది. -మరో 22 దుకాణాలకు కొత్తగా స్టాక్ ఇవ్వలేమని ప్రకటించేశారు.
ఒక్క రోజుకే స్టాక్ ఉన్న మద్యం దుకాణాలు 14 ఉండగా, రెండు రోజులకు సరిపడే మద్యం ఉన్న దుకాణాలు 13 ఉన్నాయి. మూడు రోజులకు సరిపడే మద్యం ఉన్న దుకాణాలు 25 వరకూ ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో 5 రోజుల వరకూ స్టాక్ వుండొచ్చు యలమంచిలి, చోడవరం, పాడేరు, అనకాపల్లి, మాడుగుల వంటి ప్రాంతాల్లో వున్న మద్యం దుకాణాల్లో సరుకు నిండుకుంది.