
ప్రతీకాత్మక చిత్రం
విశాఖపట్నం: మద్యం ఇవ్వలేదని వైన్ షాప్‌ను తగలబెట్టిన ఘటన విశాఖపట్నం మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.
పోతినమల్లయ్య పాలెం పోలీసుల కథనం ప్రకారం.. మధు అనే ఓ వ్యక్తి మద్యం కోసం మధురవాడ ప్రాంతంలోని ఓ వైన్ షాప్ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే షాప్ మూతపడే సమయంలో కావడంతో సిబ్బంది అతనికి మద్యం ఇవ్వలేదు.దీంతో వారితో వాగ్వాదానికి దిగిన అతను అక్కడి నుంచి వెళ్లిపోయి ఆదివారం సాయంత్రం పెట్రోల్ డబ్బాతో వచ్చిన అతను వైన్‌షాప్ లోపల, సిబ్బందిపైనా పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
దీంతో సిబ్బంది వెంటనే షాప్ బయటకు పరుగులు తీశారు. కానీ వైన్‌షాప్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. లోపల ఉన్న కంప్యూటర్, ప్రింటర్ ఇతర సామగ్రి కాలిపోయి రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.