నువ్వా.. నేనా..?
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలోని 57 జెడ్పీటీసీ స్థానాలకు 366 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు మొత్తం 57 స్థానాలకు పోటీ చేస్తుండగా, పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీ సగం స్థానాలకే పరిమితమయ్యాయి. తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి దింపింది. టీడీపీ 28 స్థానాల్లో, బీజేపీ 22 స్థానాల్లో పొత్తులో భాగంగా పోటీచేస్తుండగా, మరో ఏడు స్థానాల్లో స్నేహపూర్వకంగా తలపడుతున్నాయి.
సీపీఐ 11 స్థానాల్లో పోటీలో ఉండగా, సీపీఎం ఐదు స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటోంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు అన్ని స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జెడ్పీ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో, మహిళల స్థానాలపై రెండు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. చైర్‌పర్సన్ హోదాకు తగిన విధంగా ఆయా స్థానాల నుంచి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. జెడ్పీ పీఠం దక్కాలంటే కనీసం 29 స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జెడ్పీ పీఠాన్ని దక్కించుకొనేంతగా కాకున్నా, చైర్‌పర్సన్ ఎన్నికల్లో కీలకం కావాల్సిన సీట్లైనా సొంతం చేసుకోవాలని ఇతర పార్టీలు ఆరాటపడుతున్నాయి.
వైదొలిగిన శారద
జెడ్పీ చైర్‌పర్సన్ రేసులో ఉంటున్నట్టు ప్రచారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ కార్యదర్శి నేరెళ్ల శారద రామడుగు నుంచి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పార్టీ టికెట్ కోసం ఢిల్లీ వరకు ప్రయత్నాలు చేసినప్పటికి ఆమెకు ఫలితం లేకపోయింది. కోల మంజులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో, ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఖరారు కాని పోలింగ్ తేదీలు : గందరగోళంలో అభ్యర్థులు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై ఎన్నికల సంఘం ఎటూ తేల్చకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. ముందుగా ఎన్నికలను ఏప్రిల్ 6వ తేదీన నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం, ఆ తరువాత 6, 8 తేదీల్లో రెండు విడుతలుగా నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. మొదటి, రెండవ విడతల వివరాలను వెల్లడిస్తామని చెప్పినప్పటికి, ఇప్పటివరకు ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు ప్రచారపత్రాల్లో ఏ పోలింగ్ తేదీ వేయాలో తెలియక తికమకపడుతున్నారు.