'కారు'కు కలిసొచ్చిన కాలం | Time Boom to the TRS | Sakshi
Sakshi News home page

'కారు'కు కలిసొచ్చిన కాలం

Published Sat, Dec 31 2016 2:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'కారు'కు కలిసొచ్చిన కాలం - Sakshi

ఈ ఏడాదంతా అధికార పార్టీ చుట్టూ తిరిగిన రాష్ట్ర రాజకీయం

- బంగారు తెలంగాణ పేరుతో టీఆర్‌ఎస్‌ ‘ఆకర్ష్‌’
- వలసలతో ఉక్కిరిబిక్కిరైన విపక్షాలు
- తారుమారైన పార్టీల బలాబలాలు

ఏడాది కాలం గిర్రున తిరిగిపోయింది. కొత్త రాష్ట్రం తెలంగాణలో రాజకీయం సరికొత్త రూపును సంతరించుకుంది. పాలనా పగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్‌ దూకుడు ముందు ప్రతిపక్షాలు డీలా పడ్డాయి. అధికార పార్టీ విసిరిన ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌ ’లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు చిక్కుకున్నాయి. బంగారు తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ మంత్రాన్ని జపించిన అధికార పార్టీ.. బీజేపీ, సీపీఎం మినహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను లాగేసుకుంది. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనవంటూ ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. ఏడాది పొడవునా అటు అసెంబ్లీ వేదికగా, ఇటు ప్రజా బాహుళ్యంలో విపక్షాలు తమ గొంతును వినిపించాయి. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు, భూసేకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. 2016లో రాజకీయ యవనికపై పార్టీలు, వాటి పనితీరును విశ్లేషిస్తే..        
– సాక్షి, తెలంగాణ బ్యూరో


వలసలతో పెరిగిన బలం
టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌ శాసన సభా పక్షంలో విలీనం చేశారు. దీంతో 15 మంది ఎమ్మెల్యేలున్న టీడీపీ బలం ఒక్కసారిగా 3కు పడిపోయింది. ముగ్గురు ఎమ్మెల్యేలున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సైతం టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం కాగా.. సీపీఐకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ పంచన చేరారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వలసలు ఈ ఏడాదీ కొనసాగాయి. వలసలతో కలిసి వచ్చిన సభ్యులతో అటు శాసన సభ, ఇటు లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ బలం పెరిగింది.

దూకుడు తగ్గని టీఆర్‌ఎస్‌
2016 అధికార టీఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయిలో కలిసొచ్చింది. ఈ ఏడాది రెండు శాసన సభా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయ దుందుబి మోగించింది. నారాయణఖేడ్, పాలేరు స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌లకు జరిగిన ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు కొత్త ఊపునిచ్చాయి. స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరిగిన ఎన్నికల్లోనూ ఆ పార్టీ హవా కొనసాగింది. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ రెండు చోట్ల ఓటమి పాలైనా మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. ఒక రాజ్యసభ సీటూ టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే చేరింది. తుమ్మల నాగేశ్వర్‌రావు రాజీనామా చేసి పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌తో భర్తీ చేసింది.

ఏప్రిల్‌ నెలలో ఖమ్మం గుమ్మంలో టీఆర్‌ఎస్‌ 15వ ప్లీనరీ నిర్వహించి విజయవంతం చేసుకుంది. ఇక పార్టీని నమ్ముకుని మొదట్నుంచీ పనిచేస్తున్న సీనియర్‌ నేతలకు అధికారిక నామినేట్‌ పదవులను కట్టబెట్టింది. రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు సహా వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పాలక వర్గాలను నియమించి కేడర్‌లో ఉత్సాహం నింపింది. శాసన సభ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అసెంబ్లీ వేదికగా సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ పవర్‌పాయింట్‌ ప్రజేంటేషన్‌ ఇచ్చారు. అధికార పార్టీ హోదాతో.. సీనియర్లకు, ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారికి గుర్తింపు ఇవ్వడం ద్వారా మరింత మందిని ఆకర్షించే పనిపెట్టుకుంది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌..సంస్థాగత నిర్మాణం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఈ ఏడాది పూర్తిగా సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి పెటింది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో జిల్లాల వారీగా పార్టీని పట్టాలెక్కించే పనిలో పార్టీ నాయకత్వం నిమగ్నమైంది.

బీజేపీ..సూచనలకే పరిమితం
బీజేపీ ఈ ఏడాది చెప్పుకోదగిన కార్యక్రమాలు ఏమి చేపట్టలేకపోయింది. అధికార టీఆర్‌ఎస్‌కు సలహాలు, సూచనలు ఇచ్చే పార్టీగానే అది మిగిలిపోయింది. అధికార టీఆర్‌ఎస్‌పై అ పార్టీ నేతలు అడపాదడపా విమర్శలకే సరిపెట్టారు.

అతీగతీ లేని ఓటుకు కోట్లు కేసు
శాసన మండలి ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ద్వారా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ కేసులో ఇసుమంతైనా పురోగతి లేదు. ‘చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు...’అని చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ కేసు విషయంలో పూర్తిగా మౌనం దాల్చారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ రాష్ట్ర ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది. చంద్రబాబు పాత్రకు సంబంధించి విచారణ జరపాలన్న ఏసీబీ కోర్టు తీర్పు విషయంలోనూ కేసీఆర్‌ ప్రభుత్వ వైఖరి న్యాయనిపుణులకే ఆశ్చర్యం కలిగించింది.

కాంగ్రెస్‌.. సర్కారుపై ఎదురుదాడి
ప్రధాన ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్‌ అసెంబ్లీ వేదికగా ప్రజావాణిని వినిపించే ప్రయత్నం చేసింది. మల్లన్నసాగర్‌ అంశంలో ప్రభుత్వంపై ఎదురుదాడి చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, పంట రుణాల మాఫీ తదితరాలపై ఆందోళనలు చేపట్టింది. ఆదిలాబాద్‌లో సదస్సు నిర్వహించింది. పార్టీ ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డిల ఆకస్మిక మరణాలతో ఉప ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్‌ సానుభూతి పవనాలను ఉపయోగించుకోలేక పోయింది. ఫలితంగా నారాయణఖేడ్, పాలేరు స్థానాలను కోల్పోయింది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను బహిష్కరించిన కాంగ్రెస్‌... వాస్తవలు ఇవీ అంటూ ప్రత్యేకంగా అసెంబ్లీ బయట పవర్‌పాయింట్‌ ప్రజేంటేషన్‌ ఇచ్చింది. పార్టీ వలసలపై సుప్రీంకోర్టు తలుపుతట్టింది.

పోరుబాటలో లెఫ్ట్‌..
అధికార పక్షంపై విరుచుకుపడే పాత్రను సీపీఎం సమర్థంగా పోషించింది. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితుల పక్షాన జరిగిన పోరాటంలో సీపీఎందే ముఖ్య భూమిక. సీపీఐ వివిధ రాజకీయ పక్షాలతో కలసి పాల్గొన్నవే ఎక్కువ. రెండున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలన, ఎన్నికల మేనిఫోస్టోలో హామీల అమలుపై సీపీఎం పోరుబాట పట్టింది. అంతకు ముందు మున్సిపల్‌ కార్మికుల సమ్మె, అంగన్‌వాడిల ఆందోళనలు వంటి కార్యక్రమాలు చేపట్టినా...‘మహాజన పాదయాత్ర’పేరిట ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మొదలు పెట్టిన కార్యక్రమమే పెద్దది. సీపీఎం పాదయాత్ర అంశాన్ని ప్రకటించగానే... కేసీఆర్‌ సైతం ఆ పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్‌ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల విస్మరణపై పాదయాత్రలో సీపీఎం ఎండగడుతోంది.

టీడీపీ చిక్కిశల్యం
సార్వత్రిక ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న తెలంగాణ టీడీపీ వారిని కాపాడుకోలేకపోయింది. టీఆర్‌ఎస్‌ ప్రయోగించిన ఆపరేషన్‌ ఆకర్ష్ కు బాగా నష్టపోయింది. టీడీఎల్పీ నేతగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం అవుతున్నామంటూ స్పీకర్‌కు లేఖ ఇవ్వడం, ఆయన ఆమోదించడం చకాచకా జరిగిపోయాయి. దీంతో తమకు న్యాయం చేయాలని ఆ పార్టీ కోర్టును ఆశ్రయించింది. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలతో నెట్టుకొస్తుంది. పార్టీ కేడర్‌ను కాపాడుకునే క్రమంలో వివిధ అంశాలపై ఆందోళనలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మధ్య ప్రచ్చన్నపోరు కొనసాగుతోంది. దీంతో పార్టీలో సీనియర్లు, రేవంత్‌ వేర్వేరు శిబిరాలుగా విడిపోయారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల పక్షాన దీక్ష చేసిన రేవంత్‌ సీనియర్లను విస్మరించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. వరుస వలసలతో బలహీనమైన పార్టీని పట్టాలెక్కించేందుకు నాయకత్వం వివిధ ఆందోళనలు కార్యక్రమాలు చేపట్టింది. విద్యార్థుల పక్షాన ఫీజు పోరు, రైతు సమస్యలపై రైతుపోరు పేర పాదయాత్రలు, దీక్షలు చేసి ప్రభుత్వ విధానాలను తప్పుపట్టింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement