శుక్రవారం ఉక్కు పరిశ్రమ కోసం అఖిలపక్షం ఇచ్చిన బంద్ వల్ల బోసిపోయి ఉన్న కడపలోని ఏడు రోడ్ల కూడలి సెంటర్
సాక్షి, కడప/కడప వైఎస్సార్ సర్కిల్/కోటిరెడ్డి సర్కిల్: వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జిల్లా బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. విద్యా సంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతబడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితయ్యాయి. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డెక్కి ఉక్కు పరిశ్రమ ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. అఖిలపక్షం నేతల పిలుపు మేరకు గత పది రోజులుగా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం, సంతకాల సేకరణ, ర్యాలీలు, ముఖాముఖి, రిలే నిరాహార దీక్షలు, మానవహారాలతో వరుసగా పది రోజులపాటు ఆందోళన చేసిన నేతలు శుక్రవారం బంద్‌ను విజయవంతం చేశారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో..
ఇదిలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉక్కు పరిశ్రమ కోసం ఆందోళనలు మిన్నంటాయి. పులివెందులలో కడప తాజా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో తెల్లవారుజామున 4 గంటలకే పులివెందుల ఆర్టీసీ డిపోకు చేరుకుని బంద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కడపలో ఎమ్మెల్యే అంజద్‌బాషా, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటలకే ఆర్టీసీ బస్టాండు వద్ద ఆందోళన చేశారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేటలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేటలో జరుగుతున్న బంద్‌లో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. అలాగే, రైల్వేకోడూరు పరిధిలోని కుక్కలదొడ్డి వద్ద ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. జమ్మలమడుగు, బద్వేలులో పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ వెంకటసుబ్బయ్య బంద్‌ను పర్యవేక్షించారు.
కడప ఉక్కు బంద్‌లో వామపక్ష నేతలు
వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చేపట్టిన బంద్ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్యతోపాటు పలువురు ఆమ్ ఆద్మీ, జనసేన పార్టీల నేతలు పాల్గొని ర్యాలీలు నిర్వహించారు. సీపీఐ, సీపీఎం కార్యాలయాల నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేడ్కర్ సర్కిల్ వద్ద మానవహారంలో పాల్గొన్నారు.
బంద్‌కు దూరంగా టీడీపీ
జిల్లాలో ఉక్కు పేరుతో దీక్షలు చేస్తున్నా బంద్‌కు మాత్రం తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండడం చర్చకు దారితీసింది. ఉక్కు పరిశ్రమ కోసమే దీక్ష చేస్తున్నట్లయితే అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చిన బంద్‌లో పాల్గొనకపోవడం విస్మయానికి గురిచేస్తోందని అఖిలపక్షం నేతలు వ్యాఖ్యానించారు. జిల్లాలో ఎక్కడా కూడా ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొనలేదు.
ఉక్కు పరిశ్రమ ఏర్పాటయ్యే వరకు ఉద్యమం
కాగా, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేసేందుకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ మెడలు వంచి తీరుతామని అఖిలపక్ష నేతలు స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేసే వరకూ ఉద్యమం నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా బంద్‌లో పాల్గొన్న సీపీఎం జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, మాజీమంత్రి సీ రామచంద్రయ్య వేర్వేరుగా మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమపై వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఫీజుబిలిటీ లేదని కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంటే చంద్రబాబు నాలుగేళ్లు మాట్లాడకుండా నేడు దీక్షలు చేయించడం హాస్యాస్పదమన్నారు.
బంద్ సందర్భంగా కడపలో ర్యాలీ చేస్తున్నవైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్ బాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర అఖిల పక్ష, ప్రజాసంఘాల నేతలు
Comments
Please login to add a commentAdd a comment