సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య శక్తుల పునరేకీకరణకు యత్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను సీపీఐ, సీపీఎం లోతుగా పరిశీలిస్తున్నాయి. ఈ నెల 22న టీజేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరుద్యోగ ర్యాలీకి ఈ రెండు పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ పార్టీల అనుబంధ విద్యార్థి, యువజన సంఘాలు సంఘీభావం ప్రకటించడమే కాకుండా ర్యాలీని విజయవంతం చేసేందుకు కార్యాచరణను ప్రారంభించాయి. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయశక్తుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని వామపక్షాలు గట్టిగా భావిస్తున్నాయి. భావసారూప్య వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య, సామాజిక శక్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఫ్రంట్ ఏర్పాటు దిశలో ఈ పార్టీలు ముందుకు సాగుతున్నాయి.
కలిసొచ్చే శక్తులను కలుపుకొని పోయేందుకు ఆయా సంఘాలు, వ్యక్తులు, సంస్థలు, మేధావులతో ప్రాథమిక చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో 93 శాతంమేర ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అభివృద్ధి ఫలాలు అందే విధంగా, సామాజిక న్యాయం అమలయ్యేలా అన్ని శక్తులను ఒకటి చేయాలనే ఆలోచనతో ఈ పార్టీలున్నాయి. మరో పక్క సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర వచ్చేనెల 19న హైదరాబాద్‌లో బహిరంగసభ ద్వారా ముగియనుంది. సీపీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్, మేనెలలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రను చేపట్టి మే చివర్లో హైదరాబాద్‌లో బహిరంగసభను నిర్వహించనున్నారు.
సమస్యలపై పోరాటం.. కాంగ్రెస్, టీడీపీ, తదితర పార్టీల ముద్ర లేకుండా ఒక ఉమ్మడి శక్తిగా ఎదిగేందుకు దోహదపడే రాజకీయ, సామాజిక శక్తులపై వామపక్షాలు దృష్టిని కేంద్రీకరించాయి. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల అమలు విషయంలో అధికార టీఆర్‌ఎస్ తీరును ఎండగట్టేందుకు ఇప్పటికే ఈ పార్టీలు కార్యాచరణను రూపొందించుకున్నాయి. ›ప్రధానంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, తదితర సమస్యలపై ఆందోళనలను మరింత తీవ్రతరం చేయడం ద్వారా ఈ ప్రయోజనాలను ఆశిస్తున్న వర్గాలను కలుపుకుని పోవాలనే ఆలోచనతో ఉన్నాయి.
నిరుద్యోగ ర్యాలీకి లెఫ్ట్ మద్దతు
Published Mon, Feb 20 2017 1:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement