సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీకి సమయం ఆసన్నమైంది. రెండేళ్ల కోసం గతేడాది సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసినా.. కమిటీల ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు. జిల్లాల పునర్విభజన తర్వాత టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు జిల్లా కమిటీలు వేశాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇదివరకటి పూర్వ జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యుంజయంను కొనసాగిస్తోంది. సీపీఐ, సీపీఎం రెండు పర్యాయాలు కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి కమిటీలను వేసుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఈద శంకర్‌రెడ్డి వ్యవహరించగా, జిల్లాల విభజన తర్వాత 20 నెలల క్రితం కొత్త కమిటీల ఏర్పాటు పేరిట ఉన్న కమిటీలను రద్దు చేశారు. పాత పద్ధతిలోనే జిల్లా కమిటీలు వేస్తారన్న చర్చ ఒకవైపు జరిగితే.. ఎమ్మెల్యేలు కన్వీనర్లుగా నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలతో సరిపెడతారన్న ప్రచారం కూడా జరిగింది.
రెండు పద్ధతుల్లో ఏదీ కూడా అమల్లోకి రాకపోగా, మొక్కుబడిగా గ్రామ, కమిటీలతో సరిపెట్టారన్న చర్చ ఉంది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, జగిత్యాల, మెట్‌పల్లి, సిరిసిల్ల, కోరుట్ల తదితర మున్సిపాలిటీల్లో చాలా వరకు వార్డు కమిటీలకు కూడా మోక్షం కలగలేదు. కాగా.. ఈనెల 27న టీఆర్‌ఎస్ 17వ ప్లీనరీని హైదరాబాద్‌లో జరపబోతున్నారన్న సమాచారం కార్యకర్తలకు చేరింది. అయితే.. ప్లీనరీలోపే అన్ని స్థాయిల్లో కమిటీలు వేయాలన్న ఆదేశాలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అసలు కమిటీలు వేస్తారా? పాత పద్ధతిలోనే జిల్లా కమిటీలు వేస్తారా? మధ్యలో ప్రకటించిన విధంగా నియోజకవర్గం కమిటీలతో సరిపెడతారా? ఇవేమీ చేయకుండానే ప్లీనరీకి వెళ్తారా? అన్న అంశాలు పార్టీ కేడర్‌లో చర్చనీయాంశాలుగా మారాయి.
కేసీఆర్ వరకు వెళ్లి.. నిలిచిపోయిన జిల్లా కమిటీల ప్రకటన..
జిల్లా కమిటీలపై అన్ని రకాలుగా కసరత్తు చేసి ప్రకటనే తరువాయిగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి జిల్లాల వారీగా కమిటీలను రూపొందించారు. పార్టీ జిల్లా కమిటీలకు అధ్యక్షునితో కలిపి 25 మంది, అనుబంధ సంఘాలకు 15 మంది చొప్పున ఉండేలా పార్టీ మార్గదర్శకాలు, సామాజిక వర్గాల సమతూకం ఆధారంగా కమిటీలను రూపొందించి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అప్పగించారు. ఈ మేరకు మంత్రులు రాజేందర్, కేటీఆర్‌లు పలు దఫాలు ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల ద్వారా సేకరించిన విషయం తెలిసిందే.
కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏడుగురి పేర్లు వినిపించినా.. సీనియర్ టీఆర్‌ఎస్ నేత, మానకొండూరుకు చెందిన జీవీ రామకష్ణారావు (ఇటీవలే ‘సుడా’ చైర్మన్‌గా నియమితులయ్యారు) పేరు ఖరారు చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన కోరుకంటి చందర్, రఘువీర్‌సింగ్, వెంకటరమణారెడ్డి, మనోహర్‌రెడ్డి పేర్లు వినిపించినా.. వెంకటరమణారెడ్డి పేరు ఓకే చేశారని అప్పట్లో ప్రచారం. రాజన్న సిరిసిల్ల నుంచి కల్వకుంట్ల గోపాల్‌రావు, మోహన్‌రెడ్డి, ప్రవీణ్, ఆగయ్యల పేర్లు వినిపించినా..
మాజీ జెడ్పీటీసీ తోట ఆగయ్య పేరు ఫైనల్ అయినట్లు వెల్లడించారు కూడా. జగిత్యాల నుంచి డాక్టర్ ఎం.సంజయ్‌కుమార్, జువ్వాడి నర్సింగరావు, రాజేశం గౌడ్, బాదినేని రాజేందర్ పేర్లు ప్రతిపాదనకు రాగా.. ధర్మపురి జెడ్పీటీసీ భర్త, మాజీ ఎంపీపీ బాదినేని రాజేందర్ పేరును అధినేతకు కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీలపై ఇక సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటనే తరువాయి అనుకున్న తరుణంలో వాయిదా పడటం.. అప్పటి నుంచి ఆ కమిటీల ఊసెత్తకపోవడం పార్టీ కేడర్‌లో సాగుతున్న సస్పెన్స్‌కు తెరపడటం లేదు. ఇదే సమయంలో అటు జిల్లా కమిటీలు వేయకుండా, ఇటు నియోజకవర్గం కమిటీల ఊసులేక కేడర్‌లో అసంతృప్తి నెలకొంది.
ప్రయోజనం లేని ‘పరిశీలకుల’ ప్రక్రియ.. నియోజకవర్గాల్లో అడుగుపెట్టని వైనం..గతంలో ఒక్కో జిల్లా కమిటీలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతోపాటు 60 నుంచి 80 మందికి ప్రాతినిధ్యం ఉండేది. అదేవిధంగా మండల కమిటీలలోనూ పార్టీ కేడర్‌కు సంస్థాగత పదవులు దక్కేవి. కొత్తగా ఈసారి పార్టీ అధినేత కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన నియోజకవర్గం కమిటీలను కూడా వేయనున్నట్లు ప్రకటించగా, అందులోనూ చాలా మందికి పదవులు దక్కుతాయని అందరూ భావించారు. అయితే.. ఇవేమీ చేయకుండా 2017 అక్టోబర్ 26న పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి హోదాలలో ఉన్న పలువురు సీనియర్‌లు ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. పాత జిల్లాలను లెక్కలోకి తీసుకుని ఈ జిల్లాకు చెందిన వారిని పొరుగు జిల్లాకు, పొరుగు జిల్లా నేతలను ఈ జిల్లాకు నియమించారు.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్యను పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. అదేవిధంగా హుజూరాబాద్‌తోపాటు హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలను పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తకు అప్పగించారు. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావుకు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్లలు, సిరిసిల్ల అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్‌కు కరీంనగర్, చొప్పదండి, ధర్మపురి, కర్ర శ్రీహరిని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా నియమించారు.
అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులను సిద్దిపేట, నిజామాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో మూడు, నాలుగు నియోజకవర్గాలకు ఒక్కరిని నియమించారు. కాగా.. జిల్లా ఇన్‌చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించాక కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ‘వి–కన్వెన్షన్’లో ఓ సమావేశం ఏర్పాటు చేయడం మినహా ఇప్పటికీ జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు ఆ స్థాయిలో జరిగిన సందర్భాలు లేవు. ఇదే సమయంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నియోజకవర్గాల పరిశీలకులుగా నియమితులైన నేతలు ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment